Friday, 29 December, 2006

మహారచయితకు నివాళి

ఆ కలం సృష్టించిన మాటలు, పాటలు కోట్లాది మంది సినీ ప్రేక్షకుల మీద మత్తు మందు చల్లి తమ వశం చేసుకున్నాయి. పుట్టబోయేవారిని కూడా చేసుకుంటాయి.
ఏదైనా మ్యాజిక్కో, మంత్రమో చేసినట్లు అభినయించాలంటే చిన్న పిల్లలు సైతం అసంకల్పితంగా అనే మాట "హాం ఫట్". ఆ మాటను మనకు పరిచయం చేసింది పాతాళభైరవిలో మాంతికుడు (ఎస్వీరంగారావు). మరి పుట్టించిన అపరబ్రహ్మ ఎవరు?
"డింగరీ", "గురూ", "ఘాటుప్రేమ", "ధైర్యే సాహసే లక్ష్మీ", "నరుడా ఏమి నీ కోరిక?"
అసమదీయులు - తసమదీయులు
వీరతాళ్ళు (ఈనాటి పతకాల లాంటివి)

"ఇవేం మాటలు? ఇంతకు ముందెక్కడా లేవే?" అన్నవారిని "ఎవరూ పుట్టించకుండా మాటలెలా పుడతాయి?" అని ఎదురు ప్రశ్నించిన మాటల మరాఠీ ఎవరు?
"జనం కోరేది మనం సేయడమా? మనం సేసేది జనం సూడడమా?" ఈ మాటలు పలికింది నేపాళమాంత్రికుడు. ఈ సందిగ్ధం మాత్రం సినిమాలు తీసేవారందరిదీ.
"సాహసం శాయరా డింభకా! రాకుమారి లభించును రా!"
"మహాజనానికి మరదలు పిల్లా! గలగలలాడవే గజ్జెలకోడీ"
"రసపట్టులో తర్కం కూడదు"
"మాకు తల్పం వద్దు గిల్పం కావాలి....కంబళి వద్దు గింబళి కావాలి"
"శాకాంభరీదేవి వరప్రసాదం - ఆంధ్రుల అభిమాన శాకం.....గోంగూర!"

ఈ జాబితాలో వందలు వందల మాటలున్నాయి. చెప్పుకుంటే తనివితీరదు. ఆ మాటలు నెమరేసుకున్నా చాలు. ఐనా ఆ మహనీయుడిని గురించి "మాటల్లో" చెప్పడానికి మనమెంతవారం? 75 యేళ్ళ తెలుగుసినీచరిత్రలో ఎవరెస్టు శిఖరం లాంటి మాటల-పాటల రచయిత పింగళి నాగేంద్రరావు గారి నూట ఆరవ జయంతి ఈరోజు (29 డిసెంబరు).

Sunday, 24 December, 2006

కల నిజమాయెగా!

"కల నిజమాయెగా! కోరిక తీరెగా!!"

అని చందమామ అభిమానులు పరవశించి పాడుకునే రోజు ఎంతో దూరంలో లేదు. తి.తి.దే. వాళ్ళు పాత చందమామలను అమూల్య భారతీయ వారసత్వ సంపదగా గుర్తించి డిజిటలైజ్ చేస్తున్నరని తెలిసినప్పటినుంచి అవి మనకందుబాటులోకి వచ్చేది ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నా లాంటివారికిది శుభవార్త. వీటిని జనవరి 23వ తేదీ తిరుపతిలో ఆవిష్కరించి, చందమామ సంపాదకులు విశ్వనాథరెడ్డికి అందజేస్తామని తి.తి.దే. వాళ్ళు తెలిపారు. ఇవి మార్కెట్లోకి వస్తే పాత చందమామలకోసం హైదరాబాదులోని పాతపుస్తకాల షాపుల్లో వెదకడం; హిందూ లో, ఇంటర్నెట్లో ప్రకటనలివ్వడం లాంటి అవస్థలు తప్పుతాయి. :) ఇది నిజంగానే మొన్న ౧౬వ తేదీ హిందూలో వచ్చిన ఒక ప్రకటన:
Chandamama

Interested in old/very old Chandamama (Telugu) magazines. If any body interested to gift/sell at reasonable price, contact K.S.Kumar, Ph.98666-96564.


(పాత చందమామలు ఒక అగ్నిప్రమాదంలో కాలిపోయాయట. వాళ్ళ ఆఫీసులో ప్రతి సంచికా ఒకటో రెండో ప్రతులు మాత్రమే ఉన్నట్లున్నాయి. అందుకే అవి కావాలనుకున్నవాళ్ళకు ఇన్ని తిప్పలు.)

ఈరోజు ఈనాడులో వచ్చిన వార్త:సీడీల్లో 'చందమామ'
ముందుకొచ్చిన తితిదే
ఇప్పటికే లక్ష పేజీల నిక్షిప్తం
(60 యేళ్ల కాలంలో వచ్చిన తెలుగు చందమామలు దాదాపు 45 వేల పేజీలు ఉండవచ్చు)
చెన్నై - న్యూస్‌టుడే

తెలుగు వారి అభిమాన పుస్తకం.. ఆ కథల మాధుర్యానికి మురిసిపోని తెలుగు వారంటూ ఉండరు.. కేవలం ఒక్క తెలుగు వారినే కాకుండా 13 భాషల్లో అందరినీ ఆకట్టుకున్న గొప్ప పత్రిక చందమామ. ఇప్పుడు ఆ పుస్తకాలను డిజిటలైజ్‌ చేసి కంప్యూటర్లు, సీడీల్లో నిక్షిప్తం చేయడానికి తిరుమల-తిరుపతి దేవస్థానం ముందుకొచ్చింది. తిరుపతిలోని ఎస్వీ డిజిటల్‌ గ్రంథాలయంలో ఈ పనులు జోరుగా సాగుతున్నాయి. 13 భాషల్లో ఉన్న మూడు లక్షల పుస్తకాలను పూర్తిగా సీడీల్లోకి నిక్షిప్తం చేస్తామని ఆ గ్రంథాలయ డైరక్టర్‌ భూమన్‌ చెప్పారు. చెన్నైలో శనివారం ఆయన 'న్యూస్‌టుడే'తో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. ఇప్పటికే లక్ష పేజీలను సీడీల్లో నిక్షిప్తం చేశామన్నారు. వీటిని జనవరి 23వ తేదీ తిరుపతిలో ఆవిష్కరించి, చందమామ సంపాదకులు విశ్వనాథరెడ్డికి అందజేస్తామన్నారు. చందమామ పత్రికలో వచ్చే కథలు ఎంతో విలువైనవని చెప్పారు. ఈ కథల కోసం అంతర్జాతీయంగా ఎన్నో ప్రముఖ ఛానెళ్లు డిమాండ్‌ చేస్తున్నాయని పేర్కొన్నారు. ఇందులో హనుమాన్‌ కథను సీడీల్లో నిక్షిప్తం చేయడానికి అనుమతిస్తే రూ. ఏడు కోట్లు చెల్లిస్తామని డిస్నీ ఛానెల్‌ చందమామ యాజమాన్యాన్ని కోరిందని.. వారు అందుకు తిరస్కరించి తమ విశిష్టతను చాటారని తెలిపారు.

కలలు నిజమాయె(నా?)

సాధారణంగా మనం వింటూ ఉంటాం: మన ఇతిహాసాల్లో - ముఖ్యంగా మహాభారతంలో - రాసినవి "నిజంగా జరిగి ఉంటే అద్భుతం. జరగనట్లైతే వాటిని ఊహించగలిగిన కవుల కల్పన మహాద్భుతం." అని.

ఈ రోజు ఈనాడు ఆదివారంలో వచ్చిన ఒక వ్యాసంలోని కొన్ని అంశాలు:
రామాయణంలో రావణాసురుడికి పుష్పక విమానం ఉండేది. అది ఏవియేషన్‌... అనగా ఆకాశయానం! తన కంటే ముందు కుంతికి కొడుకు పుట్టాడనే ఆక్రోశంతో గర్భవిచ్ఛిత్తికి పాల్పడింది గాంధారి. ఛిద్రమైన పిండాన్ని వ్యాసుడి సూచనతో కుండల్లో పెట్టి జాగ్రత్తచేశారు. అలా పుట్టినవారే కౌరవులు. వాళ్లని టెస్ట్‌ట్యూబ్‌ బేబీలనొచ్చా?

అనకూడదు. టెస్ట్ ట్యూబ్ బేబీలనేది పూర్తిగా వేరే వ్యవహారం. ఇక్కడ కౌరవుల పిండం ఏర్పడడంలో సాంకేతికత ప్రమేయమేమీ లేదు. గాంధారి గర్భధారణ మామూలుగానే జరిగింది. ఐతే కౌరవులు పూర్తిస్థాయిలో పిండం ఎదగకుండానే పుట్టినవాళ్ళు. అంటే ప్రీ మెచ్యూర్ బేబీలన్నమాట. వాళ్లను నేతికుండల్లో పెట్టి పెంచారు. ఆ నేతి కుండలను నేటి ఇన్‌క్యుబేటర్లతో పోల్చవచ్చు.

ఐతే మహాభారతంలోనే అంతకు రెండు తరాల ముందు పుట్టిన టెస్ట్ ట్యూబ్ బేబీ ఒకరున్నారున్నారండోయ్! ఆయనే ద్రోణుడు. ఆ ద్రోణుణ్ణే దానవీరశూరకర్ణ సినిమాలో "నీచమైన మట్టికుండలో పుట్టితివికదా?" అని ఈసడిస్తాడు దుర్యోధనుడు. ద్రోణుడికంటే ముందు అదే పద్ధతిలో పుట్టినవాళ్ళు అగస్త్యుడు, వసిష్ఠుడు. ఇద్దరికిద్దరూ గొప్ప ఋషులు. ఈ వసిష్ఠుడు రఘువంశానికి కులగురువు. అగస్త్యుని గురించి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి.వినాయకుడికి ఏనుగు తల అతికించాడు శివుడు... ఇది ప్లాస్టిక్‌సర్జరీ. ప్రస్తుతానికి తలలు మార్చలేం కానీ తెగినవేళ్లూ కాళ్లూ అతికించే దశలో ఉన్నాం. మంచి అభివృద్ధే!

అబ్బా...? అలాగా?!

మన పురాణాలన్నిట్లో కనిపించే మాయమవడం, ప్రత్యక్షమవడం, అణిమాది అష్టసిద్ధులూ... అన్నీ కథలూ, కల్పితాలేనంటారా. మరీ అంత తొందరపడి కొట్టిపారేయకండి.

చిత్తం!

Thursday, 21 December, 2006

ఎట్టకేలకు జెస్సికాకు న్యాయం

మను శర్మకు జీవిత ఖైదు: ఢిల్లీ హైకోర్టు తీర్పు
వికాస్ యాదవ్, టోనీలకు నాలుగేళ్ల జైలు, ఎదురు తిరిగిన సాక్షులకు నోటీసులు


మోడల్ జెస్సికాలాల్ హత్య కేసులో ఎట్టకేలకు న్యాయం గెలిచింది. ప్రజాస్వామ్య సౌధానికి గల నాలుగు మూలస్థంభాల్లో (Executive, Judiciary, Legislature and The Media) రెండు - మీడియా, న్యాయవ్యవస్థ - సమర్థవంతంగా, బాధ్యతాయుతంగా పనిచేసి కాస్త ఆలస్యంగానైనా న్యాయాన్ని నిలిపిన ఘట్టమిది.

ఒక రెస్టారెంట్లో పని చేస్తున్న జెస్సికా లాల్ ను తుపాకితో కాల్చిచంపిన మను శర్మకు ఢిల్లీ హైకోర్టు బుధవారం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 1999 ఏప్రిల్ 29వ తేదీ రాత్రి తానడిగిన మద్యపానీయం రెస్టారెంట్లో లేదని అన్నందుకు అతడు జెస్సికా లాల్‌ను కాల్చిచంపాడని అభియోగం. ''ఇది సమాజపు అంతరాత్మను కదిలించిన కేసే. అయినప్పటికీ మను శర్మకు గరిష్ఠ శిక్ష (ఉరి) విధించలేం. దీనిని అత్యంత అరుదైన కేసుగా భావించలేం'' అని జస్టిస్ ఆర్.ఎస్.సోధీ, జస్టిస్ పి.కె.భాసిన్లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఈ కేసులో సాక్ష్యాలను నాశనం చేసేందుకు ప్రయత్నించిన వికాస్ యాదవ్, అమర్‌దీప్‌సింగ్ గిల్ (టోనీ)లకు నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.2,000 చొప్పున జరిమానా విధించింది.

నటుడు శ్యాన్ మున్షీ, వ్యాపారవేత్త ఆండ్లీబ్ సెహగల్ సహా ఎదురు తిరిగిన 32 మంది సాక్షులకు నోటీసులు జారీ చేసింది. మొదట ఇచ్చిన సాక్ష్యాన్ని మార్చడంపై వారు కోర్టుకు సరైన వివరణ ఇవ్వలేని పక్షంలో వారిని కూడా ప్రాసిక్యూట్ చేసే అవకాశాలున్నాయి. మను శర్మ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వినోద్ శర్మ కుమారుడు కాగా వికాస్ యాదవ్ ఉత్తరప్రదేశ్‌కు చెందిన వివాదాస్పద నేత డి.పి.యాదవ్ కుమారుడు. కింది కోర్టు ఈ కేసులో అతణ్ని నిర్దోషిగా ప్రకటించడంపై గతంలో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. జెస్సికాకు న్యాయం జరగాలంటూ ఒక టీవీ ఛానల్‌కు లక్షలాది ఎస్ఎంఎస్‌లు వచ్చిపడ్డాయి.

మను శర్మ ఇంతకుముందెప్పుడూ ఎలాంటి నేరాలూ చేయనందువల్ల అతడికి తక్కువ శిక్ష విధించాలని అంతకుముందు ఆయన కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అయితే కోర్టు ఈ అభ్యర్థనను తోసిపుచ్చింది. టోనీ ఒక బహుళ జాతి సంస్థలో పని చేస్తున్నందున అతడిపై కరుణ చూపాలని న్యాయవాది కోరగా బెంచ్ ఆగ్రహంగా స్పందించింది. ''ఇలాంటి వాదన చేయడం నీకు వ్యతిరేకంగా పరిణమిస్తుంది'' అని వ్యాఖ్యానించింది.

ఈ కేసులో దోషులకు శిక్ష పడడం సంతోషంగా ఉందని జెస్సికా సోదరి సబ్రినా లాల్ చెప్పారు. మను శర్మకు మరణ శిక్ష పడాలని తానెప్పుడూ కోరుకోలేదన్నారు. ''మరణ శిక్ష పట్ల నాకు నమ్మకం లేదు. నా సోదరిని చంపినందుకు శిక్ష అనుభవించాల్సింది మను శర్మే. అంతేగానీ అతడి మరణం ద్వారా అతడి కుటుంబ సభ్యులు బాధపడాలని నేను కోరుకోవడం లేదు'' అని చెప్పారు. హైకోర్టు తీర్పు పటిష్ఠంగా ఉందని, సుప్రీంకోర్టు కూడా దానిని సమర్థిస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ఒకరికి శిక్ష పడడం తనకెప్పుడూ సంతోషం కాదని ఈ కేసులో సాక్షి అయిన బినా రమణి అన్నారు. ఈ కేసులో శిక్ష పడిన వికాస్ యాదవ్... నితీశ్ కతారా హత్య కేసులో కూడా నిందితుడిగా ఉన్నాడు. కోర్టు తీర్పుపై కతారా తల్లి నీలం హర్షం వ్యక్తం చేశారు. జెస్సికా కుటుంబం న్యాయం కోసం చాలాకాలం ఎదురుచూడాల్సి వచ్చిందని ఆమె అన్నారు. ఈ తీర్పు వల్ల న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వాసం బలపడిందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి వి.ఎన్.ఖరే వ్యాఖ్యానించారు. ఎదురు తిరిగిన సాక్షులకు నోటీసులివ్వడమనే కొత్త సంప్రదాయాన్ని ఆయన స్వాగతించారు.

(ఈనాడులో వచ్చిన వార్త ఆధారంగా)

Thursday, 14 December, 2006

!?


RIDING IN STYLE? A young woman gets adventurous riding a two-wheeler sitting cross-legged at Jummerat Bazar Road in Hydearabad on Tuesday. - Photo G. Krishnaswamy
(From yesterday's The Hindu)

Tuesday, 12 December, 2006

నువ్వసలు...

(చిట్టికథ)
అయ్యేయెస్ ఆఫీసర్ అభయాకర్ కు తానో జీనియస్ నని ప్రగాఢవిశ్వాసం. అతడి నమ్మకం అతడికుంటే ఏ నష్టమూ లేకపోయేది. కానీ తన సంతానాన్ని కూడా మేథాశక్తిలో తనంతవాళ్ళను చేయాలనీ, తన వంశాన్ని మేథావుల వంశంగా తీర్చిదిద్దిన ఘనత తనకే దక్కాలనీ ఆరాటపడ్డాడు. చాలాకాలం సంతానం లేకపోవడం వల్ల ఆ అవకాశం కూడా అతడికి ఆలస్యంగానే చిక్కింది. అందుకే కొడుకు పుట్టినప్పటి నుంచే వాడి మేథస్సుకు మెరుగుపెట్టేవిధంగా ట్రెయినింగ్ మొదలుపెట్టాడు.

తన కొడుకుకు మూడేళ్ళు వచ్చేవరకూ ఆగి మొదటిసారిగా వాడి తెలివితేటలకో చిన్న పరీక్ష పెట్టాడు.

రెండు పరీక్షనాళికలు - ఒకటి సన్నది, ఇంకొకటి వెడల్పుది - తీసుకుని రెండింటిలోనూ అతిజాగ్రత్తగా రెండేసి స్పూన్ల నీళ్ళు పోసి దేంట్లో ఎక్కువ నీళ్ళున్నదీ చెప్పమన్నాడు. ఆ పిల్లవాడు అమాయకంగా సన్నటి నాళిక చూపెట్టాడు - దాంట్లో నీళ్ళు ఎక్కువ లోతుగా ఉండడం చూసి.

దాంతో ఆ మేథావి హతాశుడయ్యాడు. "నాలాంటి జీనియస్ కు ఇలాంటి మందబుద్ధా కొడుకుగా పుట్టడం? వాటే షేమ్? వీడసలు నా కొడుకేనా? ఎందుకైనా మంచిది. డి.ఎన్.ఏ. టెస్ట్ చేయిస్తే అసలు విషయం తేలిపోతుంది కదా?" అనుకున్నాడు.

డి.ఎన్.ఏ. టెస్టు చేయించడమా, మానడమా అన్న డైలమాతోనే ఏడేళ్ళు గడిచిపోయాయి. ఆ ఏడేళ్ళూ ఆ కొడుకు ఆలనా పాలనా వాళ్ళమ్మే చూసుకుంది. ఆ తండ్రి ఆ డైలమాలోనే మునకలేస్తూ వుండిపోయాడు.

"ఏమైనా సరే, చివరిసారిగా ఇంకోసారి ప్రయత్నిస్తాను. ఫలితం అలాగే వస్తే డి.ఎన్.ఏ. టెస్టు తప్పనిసరి" అని దృఢంగా నిశ్చయించుకుని ఆ అయ్యేయెస్ ఆఫీసర్ కొడుకును పిలిచి మళ్ళీ అవే పరీక్షనాళికలతో అదే ప్రశ్న మళ్ళీ అడిగాడు.

ఆ పిల్లాడు "నాలాంటి ప్రాడిజీని ఇంత పిచ్చి ప్రశ్న అడుగుతున్నాడు. ఈయనసలు నా తండ్రేనా? వాటేషేమ్?" అనుకున్నాడు.

(స్వీయరచన: ఫిబ్రవరి 2004 చతురకతల్లో ప్రచురితం)

Thursday, 7 December, 2006

చందమామ జ్ఞాపకాలు-2

క్రింది టపాలో ప్రస్తావించిన పద్మపాదుడు-పింగళుల కథ:

ముగ్గురు మాంత్రికులు - నేను చిన్నప్పుడు చందమామ చదవడం మొదలుపెట్టినరోజుల్లో చందమామలో వస్తూండిన జానపద ధారావాహిక. దీనికి సమాంతరంగా నడిచిన పౌరాణిక ధారావాహిక వడ్డాది పాపయ్య రాసిన "విష్ణుకథ" (పోతన భాగవతానికి సంక్షిప్తరూపం). ఆరోజుల్లో బాలమిత్రలో గండభేరుండదీవి వస్తూ ఉండేది. ముగ్గురు మాంత్రికుల్లో కథానాయకుడైన పింగళుడు మాంత్రికుడు కాదు. అతడొక మామూలు జాలరి యువకుడు. అన్నదమ్ములైన ముగ్గురు మాంత్రికులు మహామాంత్రికుడైన మహామాయుడి సమాధిలోని అపూర్వ వస్తువులు - మంత్రదండం, మహిమగల ఉంగరం, బంగారుపిడిగల ఖడ్గం - సాధించుకుని రావడానికి ఒకరి తర్వాతొకరు బయలుదేరుతారు. వారిలో ఆఖరివాడైన పద్మపాదుడొక్కడే పింగళుడి సాయంతో అర్హతపరీక్షలో నెగ్గి ప్రాణాలతో బయటపడి చాణక్యుడి వలె తాను వెంట ఉండి ప్రణాళికలు వేసి సమయానికి తగిన సలహాలిస్తూ చంద్రగుప్తుడిలాంటి పింగళుణ్ణి మహామాయుడి సమాధిలోకి పంపుతాడు. ఆ సమాధి ఒక మహాసౌధం. మొదట అది నీళ్ళలో మునిగి ఉంటుంది. పద్మపాదుడు ఆ నీటిని ఇంకిపోయేలా చేసి దాన్ని బయటపడేస్తాడు. దానికి ఏడు ద్వారాలుంటాయి. ఒక్కో ద్వారం దగ్గరా తన మంత్రశక్తులతో మహామాయుడు సృష్టించుకున్న మాయలను పింగళుడు తన ధైర్యసాహసాలతో ఛేదించి సమాధిలోనికి ప్రవేశించి అపూర్వ వస్తువులను సంగ్రహించడం ప్రధాన కథ. మహామాయుడి శిష్యులు వీళ్ళను మహామాయుడి సమాధి వరకూ వెళ్ళనివ్వకుండా దారిలో తమ మాయలతో ఆటంకాలు కల్పించబోవడం, వీళ్ళు వాటిని ఛేదించుకుంటూ ముందుకు పోవడం, పనిలో పనిగా భల్లూకపర్వతాల్లో మహామాయుడిచేత బందీగా మారిన ఒక మాయావియైన రాక్షసుడొకణ్ణి (పేరు గుర్తురావడం లేదు...భల్లూకకేతుడా?) రక్షించడం, వాడు వారికిి నమ్మకస్థుడుగా మారడం, ఇంటిదగ్గర దుర్మార్గులైన పింగళుడి అన్నలకు, అహంకారియైన సేనానికి బుద్ధిచెప్పడం (ఈ సన్నివేశం బాగా నవ్వు తెప్పిస్తుంది),...అలా సాగిపోతుంది కథ.

మామూలుగా మాంత్రికులంటే జడలు, గడ్డాలు, మీసాలు పెంచి, మంత్రదండం చేతబూని విచిత్ర వేషధారణతో ఉంటారని ఊహిస్తాం. (వాళ్ళ మంత్రశక్తి అంతా ఆ జడల్లోనో, మంత్రదండంలోనో ఉంటుందని ఒక నమ్మకం.) కానీ ఇందులో పద్మపాదుడు ఏ రకమైన జడలు, జులపాలు గానీ, కనీసం గడ్డం, మీసాలు కూడా లేకుండా, ఒంటిమీద కూడా కేవలం డ్రాయరూ, బనీనుతో తలమీదుండే ఆ కొద్ది జుట్టు కూడా కనిపించకుండా అంటుకుపోయే టోపీ పెట్టుకుని ఉంటాడు. ఆ ఆలోచన బొమ్మలేసిన చిత్రాదో, సంపాదకులదో లేక రచయితదో మరి?

Thursday, 30 November, 2006

"చందమామ" జ్ఞాపకాలు-1

అప్పుడు నాకు ఏడెనిమిదేళ్ళుంటాయేమో! అది చలికాలం కావడంతో చిరుచలిగా ఉంది. ఆ రోజు సెలవు కావడం వల్ల మా నాన్న ఇంటి దగ్గరే ఉన్నాడు. పొద్దున్నే లేచి వంటింట్లో పొయ్యి దగ్గర వెచ్చగా చలి కాగుతున్నాం మా నాన్నా నేనూ. మా అమ్మ కొంచెం దూరంలో మజ్జిగ చిలుకుతోంది. చందమామ మా నాన్న చేతిలో ఉంది. (తొందరపడి మా నాన్నను అపార్థం చేసుకోకండి. అంతకు ముందురోజే అరడజనుసార్లు చందమామ పారాయణం పూర్తిచేశాను నేను.) మా నాన్నేమో చందమామ చాలా దీక్షగా చదివేస్తున్నాడు. మజ్జిగ చిలకడమయ్యాక వెన్నతీస్తూ మా అమ్మ మా నాన్నతో ఏదో చెప్పింది. మా నాన్న అప్పటికి పద్మపాదుడు, పింగళుల వెంట పిశాచగార్ధభాలెక్కి ఆకాశమార్గాన శరవేగంగా ప్రయాణం చేస్తున్నాడు. ఆ హోరులో ఈ మాటలు ఎవరికి మాత్రం వినిపిస్తాయి చెప్పండి? ఐతే మా అమ్మ ఆ మాత్రమైనా అర్థం చేసుకోకుండా మళ్ళీ ఏదో చెప్పింది. అప్పటికీ మా నాన్న కిందికి చూడలేదు.

వెన్న తీసిన తర్వాత కవ్వం వంటింట్లో పెట్టడానికొచ్చిన మా అమ్మ మా నాన్న "ఆకాశయానాన్ని" గమనించింది. గమనించి, అంతసేపూ మా నాన్న తన మాటలు విననందుకు ఉక్రోషం వచ్చి మూడోసారి అదేమాట ఇంకాస్త గట్టిగా చెప్పింది. అంత చలిలో కూడా వాతావరణం వేడెక్కుతోందని నాకర్థమైంది కానీ పరిస్థితి తీవ్రత తెలియలేదు. మా నాన్నకు అసలు ఆ మాత్రం కూడా తెలియదు! అప్పుడు ఏం జరుగుతోందో మా ఇద్దరికీ అర్థమయ్యే లోపలే మా అమ్మ మా నాన్న చేతుల్లో నుంచి చందమామ లాక్కుని, నలిపి పొయ్యిలో పెట్టేసింది! అలా చెయ్యడం మా అమ్మకు చందమామ అంటే ఇష్టం లేక కాదు. అప్పట్లో మా అమ్మ కూడా ప్రతి నెలా చదివేది. (మా నాన్న, నేను ఇప్పుడు కూడా చదువుతూనే ఉన్నాం.) ఇక ఆ పొయ్యిలో మహామాయుడి సమాధిలోని అనంత ధనరాశులతో బాటు మహామాయుడి మంత్రదండం, బంగారుపిడి గల ఖడ్గం, అతడి కుడిచేతి చూపుడువేలికి ఉన్న మహిమ గల ఉంగరం లాంటి అమూల్యవస్తువులు కూడా అంటుకోవడం వల్ల వంటిల్లంతా వింతవెలుగుతో నిండిపోయింది.

ఇంకేముంది? హాహాకారాలతో వంటిల్లు అదిరిపోయింది! పెట్టింది మనమే:) దాంతో ఈ లోకంలోకొచ్చిన మా నాన్న వెంటనే చందమామను బయటికి లాగి నిప్పునార్పేశాడు. ఇక దాన్ని తీసుకుని నేనక్కడి నుంచి పరుగో పరుగు...ఇంకా అక్కడే ఉంటే ఏం మూడుతుందో అని! (ఇక వాతావరణమా? అది ఆ నిప్పుతోబాటే చల్లారిపోయిందిగా? మంటల్లో పడిన చందమామను చూసి మా నాన్న కంగారు పడితే అది చూసి మా అమ్మకు నవ్వొచ్చింది. నవ్వుతూనే అంది "లేకపోతే ఏమిటది? ఒక పక్క నుంచి చెప్తూంటే చెవినేసుకోకుండా అదే లోకమా?" అని.)

Wednesday, 29 November, 2006

Life with a Software Engineer

Husband - Hi dear, I am logged in.

Wife - Would you like to have some snacks?
Husband - Hard disk full.

Wife - Have you brought the saree?
Husband - Bad command or file name.

Wife - But I told you about it in the morning
Husband - Erroneous syntax: abort, retry, cancel.

Wife - Hae bhagwan! Forget it. Where's your salary.
Husband - File in use, read only. Try after some time.

Wife - At least give me your credit card. I can do some shopping.
Husband - Sharing violation, access denied.

Wife - I made a mistake in marrying you.
Husband - Data type mismatch.

Wife - You are useless.
Husband - By default.

Wife - Who was there with you in the car this morning?
Husband - System unstable. Press ctrl, alt, del to Reboot.

Wife - What is the relation between you & your Receptionist?
Husband - The only user with write permission.

Wife - What is my value in your life?
Husband - Unknown virus detected.

Wife - Do you love me or your computer?
Husband - Too many parameters.

Wife - I will go to my dad's house.
Husband - Program has performed an illegal operation. It will close.

Wife - I will leave you forever.
Husband - Close all programs and log out for another User.

Wife - It is worthless talking to you.
Husband - Shut down the computer.

Wife - I am going
Husband - It is now safe to turn off your computer.

(A forwarded mail)

Tuesday, 28 November, 2006

మన దేశంలో ప్రజాస్వామ్యం-2 (సెక్షన్ 49 ‘O’)

"నిర్ణీతశాతం కంటే ఎక్కువమంది ఓటర్లు తమ ఓట్లు రద్దు చేసుకున్నప్పుడు ఆ ఎన్నిక రద్దవుతుందని, ఆ అభ్యర్థులు మళ్లీ పోటీకి అనర్హులనీ ఈ అంశంగురించి ఎక్కడో చదివాను." - అభిరామ్ బ్లాగులో రానారె వ్యాఖ్య.

నెట్లో వెదికితే కొన్ని బ్లాగుల్లో ఆసక్తికరమైన విషయాలు కనబడ్డాయి. పోలైన ఓట్లలో 50% కంటే ఎక్కువ మంది తమ ఓటును రద్దు చేసుకుంటే అక్కడి ఎన్నిక రద్దవుతుందని, అక్కడ పోటీ చేసిన అభ్యర్థులందరూ మళ్ళీ పోటీ చెయ్యడానికి అనర్హులవుతారని; ఓట్ల లెక్కింపు తర్వాత గెలిచిన అభ్యర్థి ఎన్ని ఓట్ల తేడాతో గెలిచాడో అంతకంటే ఎక్కువ మంది తమ ఓట్లను రద్దు చేసుకుని ఉన్నట్లైతే ఆ ఎన్నిక చెల్లదని, ఇలా...

వీటి మాటెలా ఉన్నా ఎన్నికల సంఘం మాత్రం బాలట్ పత్రాల్లో (ఓటింగు యంత్రాల్లో) "None" అని చేర్చడానికి సుముఖమేనని తెలుస్తోంది. దీనికి సంబంధించిన ప్రజాప్రయోజనవ్యాజ్యమొకటి సుప్రీంకోర్టులో నడుస్తోందట. వాస్తవమేమిటంటే Election rules 1961 లోని Section 49 ‘O’ ప్రకారం ఓటరు పోలింగు బూత్ లో ఓటేసిన వాళ్ళ సంతకాలు/వేలిముద్రలు తీసుకునే ఓటర్ల రిజిస్టర్ లో తన పేరు నమోదయ్యాక సంతకం/వేలిముద్ర వేశాక ఆ ఓటరు పేరుకెదురుగా "ఓటు వెయ్యలేదు" అని రాసి ఆ ఓటరు సంతకం/వేలి ముద్ర తీసుకుని వదిలేస్తారు. ఐతే ఇలా తమ ఓటును రద్దు చేసుకున్న వారెవరన్నది అందరికీ తెలిసిపోతుంది. ఇది రహస్య ఓటింగ్ నియమాలకు విరుద్ధం. కాబట్టి బాలట్ పత్రం/ఓటింగ్ యంత్రంలో "None" చేర్చడమే సముచితం.

ఎన్నికల కమీషను ఈవీఎం లలో None of the above ను చేర్చాలని సిఫార్సు చేసింది. ఆ ప్రతిపాదన ప్రకారం 50% కంటే ఎక్కువ మంది తమ ఓటును రద్దు చేసుకుంటే అక్కడి ఎన్నిక రద్దవడమేగాక, అక్కడ పోటీ చేసిన అభ్యర్థులందరూ మళ్ళీ పోటీ చెయ్యడానికి అనర్హులవుతారు. ఫలితంగా జరిగే ఉప ఎన్నికలో మాత్రం None of the above అని ఉండదు. (ఓటర్ల గ్రహచారం బాగలేక మళ్ళీ None ముందు అభ్యర్థులందరూ ఓడిపోతే? అందుకన్నమాట!) ఐతే ఈ సెక్షన్ 49 ‘O’ గురించి ఓటర్లలోనూ, అంతకంటే ముందు పోలింగ్ ఆఫీసర్లలోనూ అవగాహన కలిగించడం అవసరం. చాలా మంది పోలింగ్ అధికారులకే ఈ సెక్షన్ గురించి తెలియదు. ఒకవేళ ఎవరైనా తమ ఓటును రద్దు చేసుకోవాలనుకున్నా దాని గురించి తెలియని ఆఫీసర్లు తిరస్కరించే ప్రమాదముంది. తమిళనాడులో గత ఎన్నికల్లో అలాగే జరింది కూడా! జనాలు దీన్ని వాడుతున్నట్లైతే ప్రసారమాధ్యమాలు దీని మీద దృష్టిపెడతాయి. ఎవరూ వాడకపోయినా దీనిలోని లోపాన్ని కోర్టు దృష్టికి ఎవరైనా తీసుకెళ్తే తప్పక ప్రయోజనముంటుంది. చూద్దాం - కోర్టు ఏమని తీర్పు ఇస్తుందో?

ఇక ప్రజాస్వామ్యంలో "నిరక్షరాస్యులనో, రాజకీయాలంటే అవగాహన లేదనో వున్న ఓటుహక్కును నిరాకరిస్తే" అది ప్రజాస్వామ్యమే కాదు. నియంత్రించాల్సింది ఓటర్లను కాదు. రాజకీయులనే. నాకు ఈ జ్ఞానోదయం కింది టపాపై చరసాల గారి వ్యాఖ్య చదివాక కలిగింది. :) నిజానికి ఓటుహక్కు మన రాజ్యాంగం భారత పౌరులందరికీ ఆర్టికల్ 19(1)(a) క్రింద ప్రసాదించిన భావప్రకటనా స్వాతంత్ర్యపుహక్కులో భాగం. ఎన్నికల విషయంలో మరీ తీవ్రమైన తప్పిదం చేస్తే తప్ప దీన్ని కాదనే హక్కు ఎవరికీ లేదు.

Thursday, 23 November, 2006

మనదేశంలో ప్రజాస్వామ్యం

మనది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం. ఇంతమంది ఓటర్లు మరే ప్రజాస్వామ్య దేశంలోనూ లేరు కాబట్టి మనదేశానికి ఆ గుర్తింపు వచ్చింది. మన పొరుగునే ఉన్న పాకిస్తాను, బంగ్లాదేశ్, మ్యాన్మార్ (బర్మా) లాంటి దేశాల్లో సైన్యాధిపతులు, జుంటాలు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన నేతలను చీటికి మాటికి పదవీచ్యుతులనో, బందీలుగానో చేసి అధికారం హస్తగతం చేసుకుంటూండగా మనదేశంలో అలాంటి పరిస్థితి కలలో కూడా ఎప్పటికీ ఎదురుకాదనీ, ఇక్కడ ప్రజాస్వామ్య పునాదులు చాలా గట్టివనీ గర్విస్తాం. ఐతే మనది నిజంగా గర్వించదగిన ప్రజాస్వామ్యమేనా? అసలు ప్రజాస్వామ్యం విజయవంతం కావడానికి ఎలాంటి పరిస్థితులు అనుకూలిస్తాయి?

ప్రజాస్వామ్యంలో వయోజనులందరికీ సమాన ప్రాతిపదికన ఓటుహక్కుంటుంది. అంటే తెలివున్నవాళ్ళు - తెలివిలేనివాళ్ళు; ఆలోచనాపరులు - ఆలోచించడానికి ఇష్టపడని/బద్ధకించేవాళ్ళు, తమకు ఏది మంచో ఏది చెడో బాగా తెలిసినవాళ్ళు, తెలిసినా పట్టించుకోనివాళ్ళు, అసలు తెలుసుకోలేనివాళ్ళు వీళ్ళందరి అభిప్రాయాలకూ సమాన విలువుంటుంది. మరి అలాంటప్పుడు ప్రజాస్వామ్యం అర్థవంతం కావాలంటే ఓటర్లందరికీ సరైన సామాజిక పరిజ్ఞానం; ఓటర్లుగా, పౌరులుగా తమ హక్కులు మరియు బాధ్యతల పట్ల అవగాహన కలిగించడం అవసరం. ముందుగా ఆ పని చెయ్యకుండా ప్రజాస్వామ్యాన్ని అమలు చేసేసి మనది ప్రపంచంలోనే అతిగొప్ప ప్రజాస్వామ్యమని గర్వించడం సమంజసమా? కనీసం ఇప్పుడైనా ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయా?

బ్రిటిష్ వారి కాలంలో "male, propertied citizens" కే, అంటే ఆస్థిపరులైన పురుషులకే (అంటే భూస్వాములకు మాత్రమే - అది కూడా కుటుంబానికి ఒకరికి చొప్పున) ఓటుహక్కుండేది. మనకు స్వాతంత్ర్యం వచ్చి, మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన వెంటనే వయోజనులందరికీ ఓటుహక్కు ఇచ్చేశారు. అప్పుడు దేశంలో నిరక్షరాస్యత 86%గా ఉండేది (అక్షరాస్యులు 14% మందే). ఇప్పుడది 35%(అక్షరాస్యులు 65% మంది). ఇప్పటికీ చదువుకున్నవారిలో సైతం చాలా మందికి ఓటు విలువ తెలియదు. వాళ్ళు వోటు వెయ్యరు. వేసినా ఆ పని అభ్యర్థుల గురించి, పార్టీల గురించి, ప్రభుత్వపాలన సాగే విధానం గురించి పూర్తి అవగాహనతో చెయ్యరు. ఇక తమ ఓటును గుప్పెడు మెతుకులకో, గుక్కెడు సారాకో అమ్ముకునేవారి సంగతి సరేసరి. ఇది చాలనట్లు ఓటు వేసేటప్పుడు మన ఓటర్లు తాత్కాలిక ఉద్వేగాలకు లోనుకావడం, ఏదో ఒక పార్టీని గుడ్డిగా నమ్మి ఓటెయ్యడం చేస్తూ ఉంటారు. ఒక పార్టీ నేత మరణించినప్పుడో, వంచనకు గురైనప్పుడో ఆ పార్టీని/నేతను/సదరు నేత కుటుంబీకులను ఓదార్చడానికి (!?) ఓటును వెచ్చించేవాళ్ళూ తక్కువేం లేరు. ఇంకోవైపు కుల, వర్గ రాజకీయాలు ఆందోళన కలిగించే విధంగా బలపడుతున్నాయి.

సాధారణ పరిస్థితుల్లో కూడా వోటేసేటప్పుడు ఎంతమంది బరిలో ఉన్న పార్టీల గురించి, అభ్యర్థుల గురించి సవ్యంగా ఆలోచించి వోటు వేస్తున్నారు? మనవాళ్ళు ఎక్కువగా పట్టించుకునేది ప్రస్తుత ప్రభుత్వం మీద తమకు కలిగిన అభిప్రాయాన్ని. ఐదేళ్ళ చివర ఆ ప్రభుత్వం మీద తమక్కలిగిన అభిమానాన్నో, కసినో ఓట్ల రూపంలో చూపించడమే తప్ప ఆ నిర్ణయం తమందరి తలరాతల్ని ఐదేళ్ళపాటు ప్రభావితం చేస్తుందని గుర్తించేవాళ్ళు తక్కువ మంది (ఈ అభిమానం లేదా కోపం తాత్కాలికావేశం కాకుండా ఐదేళ్ళ పొడవునా పేరుకున్నదైతే మంచిదే).

వోటు వేసే ముందు ఈ క్రింది విషయాలు ఆలోచించి నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది:
1. పార్టీ గురించి: ప్రతి పార్టీకి కొన్ని సిద్ధాంతాలుంటాయి. ప్రతి పార్టీ కొన్ని వాగ్దానాలతో ప్రజల ముందుకు వస్తుంది. ఆశయాలకు, ఆచరణకు మధ్యనుండే అంతరం అందరికీ తెలిసిందే ఐనా ఒక పార్టీ వల్లించే ఈ ఆశయాలు, చేసే వాగ్దానాలు ఆ పార్టీ ప్రాథమ్యాలను, ప్రజాసంక్షేమం పట్ల ఆ పార్టీ దృక్పథాన్ని తెలుపుతాయి. ఇవి తమకు మేలు చేస్తాయని నమ్మిన ఓటర్లు ఆ పార్టీకి ఓటు వేయాలనుకుంటారు.
2. అభ్యర్థి గురించి: అసలు మనం మన ప్రతినిధిగా ఎలాంటి అభ్యర్థిని ఎన్నుకోవాలి? ఎవరైతే తమ నియోజకవర్గ అభివృద్ధికి నిబద్ధతతో కృషి చెయ్యగలడో, ఎవరికైతే ప్రజాసంక్షేమం పట్ల సరైన అవగాహన ఉందో అలాంటి అభ్యర్థికి ఓటు వెయ్యాలి. కానీ ఆచరణలో జరిగేదేమిటి? కుల, మత, వర్గ ప్రాతిపదికనో, వ్యక్తిగత రాగద్వేషాల ఆధారంగానో, ఇతరత్రా స్వార్థప్రయోజనాలు ఆశించో (తమ "పనులు" జరిపించగలరనే నమ్మకమున్నవారినో) ఓటు వేసేవారే ఎక్కువ మంది. ఇలా ఎన్నికైన ప్రజాప్రతినిధులు చట్టసభల సమావేశాల్లో తమ ప్రాంత ప్రజల అవసరాల గురించి కానీ, విధానపరమైన అంశాల గురించి గానీ ఎప్పుడూ నోరెత్తిన పాపాన పోరు. ఐతే మనకు నచ్చిన పార్టీని, నచ్చిన అభ్యర్థిని వేరువేరుగా ఎన్నుకునే అవకాశం లేదు. ఇక్కడ మనం వేసే ఒకే ఓటు అటు పార్టీకి, ఇటు అభ్యర్థికి చెందుతుంది. అంటే ఒక పార్టీ ప్రకటిత ప్రాథమ్యాలు ఎంత బాగా నచ్చినా, తమ నియోజకవర్గంలో ఆ పార్టీ నిలిపిన అభ్యర్థి సరైనవాడు కానప్పుడు ఓటరు తనకు నచ్చని అభ్యర్థికో, పార్టీకో వోటు వెయ్యక తప్పదన్నమాట.
కాపురం చేసే కళ కాలుతొక్కేటప్పుడే తెలిసినట్లు ఒక్కో రాజకీయపార్టీ పాలన ఎలా ఉండబోతోందో ఆ పార్టీ అభ్యర్థుల ఎంపికలోనే తెలిసిపోతుంది. ఎంత గొప్ప ఆదర్శాలు వల్లించినా ఆ ఆదర్శాలను అమలు చేసే బాధ్యత ఎలాంటి అభ్యర్థుల చేతుల్లో పెడుతున్నారో చూస్తే ఆయా పార్టీల చిత్తశుద్ధి ఏపాటిదో తేటతెల్లమవుతుంది. అక్రమార్కులు, అవినీతిపరులు, నేరచరితులను అభ్యర్థులుగా నిలిపే పార్టీలు అధికారంలోకి రావడం దేశ పురోభివృద్ధికి ఆటంకమే కలిగిస్తుంది. అందుకే ఓటర్లు తమకు నచ్చని అభ్యర్థిని పోటీలో నిలిపిన పార్టీకి వ్యతిరేకంగా ఓటువేయడమే దేశానికి మంచిది - అది ఎంత గొప్ప పార్టీ అయినాసరే. గతంలో మనదేశంలో ఒకే నియోజకవర్గం నుంచి ఒకరికంటే ఎక్కువమంది సభ్యులు ఎన్నికయ్యే అవకాశముండేది. ఇప్పుడు పోటీ చేస్తున్న అభ్యర్థులను చూస్తే అందరు అభ్యర్థులనూ తిరస్కరించే (None of the above)అవకాశం లేకపోవడం అతిపెద్ద లోపంగా అనిపిస్తోంది.
ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేసేవాళ్ళు, పార్లమెంటులోగానీ, శాసనసభలోగానీ సభ్యులుగా ఉంటూ మళ్ళీ పోటీ చేసే వాళ్ళు (పార్లమెంటు సభ్యుడొకరు ముఖ్యమంత్రి పదవినో, మరో ప్రయోజనాన్నో ఆశించి శాసనసభ్యుడొకరిచేత రాజీనామా చేయించి ఆ స్థానంలో శాసనసభ్యుడయ్యాడనుకోండి, అక్కడ పార్లమెంటుకు మళ్ళీ ఉప ఎన్నిక జరపాల్సొస్తుంది. ఒక్కరి స్వార్థప్రయోజనాల కోసం శాసనసభకొకటి, పార్లమెంటుకొకటి - రెండు ఉప ఎన్నికలు!), సరైన కారణం లేకుండానో, లేక కేవలం వ్యక్తిగత కారణాలవల్లో చట్టసభల సభ్యత్వాలకు రాజీనామా చేసేవాళ్ళు ప్రజాస్వామ్యస్ఫూర్తిని అవహేళన చేసినట్లుగా పరిగణించి వాళ్ళు మళ్ళీ ఎన్నికల్లో పాల్గొనే అవకాశం లేకుండా చెయ్యాలి (మొదటిసారైతే ఆరేళ్ళు, రెండవసారి అదేపనిచేస్తే శాశ్వతంగా). ఈ కారణాలవల్ల జరపవలసి వచ్చే ఉప ఎన్నికలకయ్యే ఖర్చును సదరు అభ్యర్థులనుంచే రాబట్టాలి. వాళ్ళ నామినేషను/రాజీనామా పత్రాలతోబాటే సదరు సొమ్మును సమర్పించేలా నిబంధనలను సవరించాలి. ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేసేవాళ్ళ డిపాజిట్టును కూడా తిరిగివ్వకూడదు.3. స్థానిక ప్రాథమ్యాల గురించి: అభివృద్ధి ఫలాలు దేశంలోని అన్ని ప్రాంతాలకూ సమానంగా అందలేదు. దీనికి కారణాలు అనేకం. ప్రకృతిసహజమైన కారణాలు కొన్ని (భూసారం, వర్షపాతం, జలవనరులు, ఖనిజసంపద, మొదలైనవి) కాగా ఉన్న పరిమిత వనరులను ఎక్కడ వినియోగిస్తే ఎక్కువమంది లబ్ది పొందుతారో, ఉత్పాదకత గణనీయంగా మెరుగుపడుతుందో అక్కడే వినియోగించడం,అదే కారణం వల్ల ప్రభుత్వం మొదట సారవంతమైన భూములు, ఆధారపడదగ్గ జలవనరులు ఉన్నచోట నీటిపారుదల సౌకర్యాలు ఏర్పాటుచేయడం సబబైనదే. ఐతే అదే పరిస్థితి దీర్ఘకాలం కొనసాగినప్పుడు, ఒకే ప్రాంతం అన్నిరంగాల్లోనూ అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు ఇతర ప్రాంతాలవారికి అసంతృప్తి కలుగుతుంది. ఈ వివక్ష దీర్ఘకాలం కొనసాగినప్పుడు ప్రాంతీయ అసమానతలు ప్రాంతీయ విభేదాలకు, విద్వేషాలకు దారి తీస్తాయి. పరిస్థితి అంతవరకు రాకుండా తమ ప్రాంతంలో అభివృద్ధికి గల అవకాశాలేమిటో, ప్రతిబంధకాలేమిటో పరిశీలించి తెలుసుకుని, తదనుగుణంగా ఆ ప్రాంత అభివృద్ధికి కృషిచేయవలసిన బాధ్యత స్థానిక ప్రజాప్రతినిధులది. ఆ బాధ్యతను మన రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులెంతమంది పట్టించుకుంటున్నారు?

తమను ఎన్నుకున్న ప్రజల వాణిని చట్టసభల్లో వినిపించడం , ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడం ప్రజాప్రతినిధుల బాధ్యత. ఈ బాధ్యతను సరిగా నిర్వర్తించని ప్రజాప్రతినిధుల ఎన్నికను ఎప్పుడైనా సరే రద్దుచేసే అవకాశం ప్రజలకుండాలి.

ఐతే ఒక ఎమ్మెల్యే లేదా ఎంపీ తన నియోజకవర్గస్థాయి అవసరాలను, సమస్యలను మాత్రమే గుర్తించగలరు. అంతకంటే కింది స్థాయి అవసరాలు - అంటే మండల/గ్రామస్థాయిలోని అవసరాలు - ఇంకొకవిధంగా ఉంటాయి. వాటికి పరిష్కారం కూడా స్థానికంగానే కనుగొనవలసి ఉంటుంది. ఇందుకోసమే మన రాజ్యాంగంలో స్థానికసంస్థలకు విశేష అధికారాలను ఇచ్చారు. ఇప్పుడు గ్రామాల్లోనూ, పట్టణాల్లోనూ ఈ పనులన్నీ చేయడం స్థానిక సంస్థలైన పంచాయతీలు, మునిసిపాలిటీల బాధ్యత. ఇది ఆచరణసాధ్యం కావాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీల ప్రమేయం ఉండరాదు. ఇది సమర్థవంతంగా అమలు జరగడానికి వీలుకలిగిస్తూ స్థానికసంస్థలకు అధికారాల బదలాయింపు పూర్తిస్థాయిలో జరిగితేనే ప్రజాస్వామ్యం అర్థవంతమూ, సమర్థవంతమూ అవుతుంది. దీన్నే Democracy at the grassroots level అని పేర్కొంటారు.

గ్రామపంచాయతీలకు అప్పగించవలసిన అధికారాలు/బాధ్యతలుగా మన రాజ్యాంగం లో వీటిని పేర్కొన్నారు:
1. వ్యవసాయం, వ్యవసాయ విస్తరణ.
2. భూసంస్కరణల అమలు, భూసారసంరక్షణ, తదితరాలు.
3. చిన్ననీటిపారుదల, నీటియాజమాన్యం, వాటర్షెడ్ ల అభివృద్ధి.
4. పశుపోషణ, పాడిపరిశ్రమ, కోళ్ళపెంపకం.
5. చేపలు/జలచరాల పెంపకం.
6. సామాజిక అడవులు, క్షేత్ర అడవులు.
7. అటవీ ఉత్పత్తులు.
8. ఫుడ్ ప్రాసెసింగ్ తో సహా అన్ని చిన్నతరహా పరిశ్రమలు
9. ఖాదీ, గ్రామీణ, కుటీర పరిశ్రమలు.
10. గ్రామంలో ఇళ్ళనిర్మాణం.
11. మంచినీటి సౌకర్యం.
12. ఇంధనం, పశుగ్రాసం.
13. రహదారులు, కల్వర్టులు, వంతెనలు, పడవలు, జలమార్గాలు, మొ.
14. గ్రామంలో విద్యుదీకరణ, విద్యుత్తు సరఫరా.
15. సంప్రదాయేతర ఇంధనవనరులు.
16. పేదరిక నిర్మూలనాకార్యక్రమాలు.
17. పాఠశాల స్థాయి విద్య.
18. సాంకేతిక, వృత్తివిద్య.
19. వయోజన, నాన్-ఫార్మల్ విద్య.
20. గ్రంథాలయాలు.
21. సాంస్కృతిక కార్యక్రమాలు.
22. సంతలు, తిరునాళ్ళు.
23. ఆరోగ్యం-పారిశుద్ధ్యం, ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, డిస్పెన్సరీలు.
24. కుటుంబసంక్షేమం.
25. స్త్రీ-శిశుసంక్షేమం.
26. వికలాంగులు, మానసికంగా ఎదగనివారితో సహా సాంఘికసంక్షేమం.
27. బలహీన వర్గాలవారి సంక్షేమం.
28. ప్రజాపంపిణీవ్యవస్థ.
29. ఊరుమ్మడి ఆస్థులను పరిరక్షించడం.
ఇలాగే పట్టణస్వపరిపాలనసంస్థలకు అప్పగించవలసిన అధికారాలు 18 ఉన్నాయి. ఈ పనుల్లో వేటిని చేయవలసి వచ్చినా నిర్ణయాలు గ్రామ/పట్టణ స్థాయిలోనే తీసుకోవడం సబబు. అనుమతి/నిధుల మంజూరు కోసం రాష్ట్ర/కేంద్ర ప్రభుత్వాలకేసి చూడవలసిరావడం అర్థరహితం. ఐతే స్థానికస్వపరిపాలనసంస్థలకు అధికారాలిస్తే సరిపోదు. వాటిని అమలుచేయడానికవసరమైన నిధులు కూడా ఇవ్వాలి. స్థానికసంస్థలకు అధికారాలు/నిధులను బదలాయించే విషయంలో ఏలినవారి దయ ఎంతవరకు ఉందో చూస్తూనేవున్నాం. ఇకమీదటైనా పరిస్థితి మారుతుందేమో చూడాలి.

ఒక్క ఓటు అభ్యర్థిని, ప్రభుత్వాన్ని రెండిట్నీ నిర్ణయించడం అన్యాయమైతే గెలిచిన పార్టీలు ఆ ఒక్క ఓటును తమ మేనిఫెస్టోలోని అసంఖ్యాక అంశాలమీదా ప్రజలు వేసిన ఆమోదముద్రగానూ, తాము అధికారంలోకొచ్చాక ఏకపక్షంగా తీసుకునే నిర్ణయాలన్నిటికీ ప్రజల అంగీకారంగానూ భాష్యాలు చెప్పడం మరీ అన్యాయం. ఒక్కో పార్టీ చేసిన ఎన్నికల వాగ్దానాల్లోని ఒక్కో అంశం మీదా ఓటర్లు విడివిడిగా తమ అభిప్రాయాలను తెలియజేసే అవకాశం లేకపోవడం దీనికి ఆస్కారమిస్తోంది.

స్వాతంత్ర్యం వచ్చి అరవయ్యేళ్ళైనా మన దేశంలో పేదరికం, అవిద్య, అనారోగ్యం, నిరుద్యోగాలు తాండవిస్తూనే ఉన్నాయి. దీనికి కారకులెవరు? అని ప్రశ్నించుకుంటే ఇన్నేళ్ళూ దేశాన్ని పాలించిన ప్రభుత్వాలే అని సమాధనమొస్తుంది. ప్రజాస్వామ్యంలో ప్రజల ప్రాథమికావసరాలే తీరకపోతే మరి మన ప్రజాస్వామ్యం విజయమైనట్లా?

జుడిషియల్ ఆక్టివిజం: ప్రస్తుతం మనమెన్నుకుంటున్న ప్రజాప్రభుత్వాల మీద మనకున్న నమ్మకమెలాంటిదంటే ప్రజారోగ్యం నుంచి ట్రాఫిక్ నిబంధనల వరకు ఏ విషయంలోనైనా కోర్టు కలగజేసుకుని ప్రభుత్వాన్ని తీవ్రంగా మందలించేంతవరకూ ప్రభుత్వం ఆ సమస్యల్ని పట్టించుకుంటుందనే (పట్టించుకున్నా సరైన రీతిలో స్పందిస్తుందనే) ఆశలు కూడా వదిలేసుకుంటున్నాం. అప్పుడప్పుడూ కోర్టులు అత్యుత్సాహంతో హద్దుమీరి మనమెన్నుకున్న చట్టసభల కార్యకలాపాలను నిర్దేశించే ప్రయత్నం చేస్తున్నా దాన్ని అనుచితజోక్యంగా భావించడం లేదు. వీటినిబట్టిచూస్తే అసలు మనది ప్రజాస్వామ్యమేనా అనే అనుమానం రాకమానదు.

Sunday, 5 November, 2006

కార్తీక పున్నమిఈ రోజు కార్తీకపున్నమి. మిగతా నెలలకంటే కార్తీకమాసంలో వెన్నెల ఎక్కువ ప్రకాశవంతంగా ఉంటుంది. ఇక కార్తీకపున్నమికి ఉన్న ప్రత్యేకత విడిగా చెప్పనక్ఖర్లేదు. ఐతే ఈరోజు ఇంకోరకమైన వెన్నెలను తనివితీరా అస్వాదించాం తెలుగువికీపీడియనులందరం. ఈరోజు ఈనాడులో వికీపీడియా గురించి ముఖపత్రకథనం రావడంతో ఒక్కదెబ్బతో తెవికీ గురించి లక్షలాదిమందికి తెలియడమేగాక ఒక్కరోజులోనే వందమందికి పైగా కొత్త వికీపీడియనులు చేరారు. వీళ్ళలో ఎంతమంది స్థిరంగా తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడతారో చూడాలి. నిన్నంటే నిన్న చింతుగారు తన బ్లాగులో తెలుగువికీ వీరవిహారం గురించి రాయడం, కొన్ని గంటల తేడాలో ఈనాడులో ఈ కథనం రావడం ఆశ్చర్యానందాలు కలిగిస్తోంది.

Tuesday, 31 October, 2006

సాహిత్య నేత్రం-మరో మంచి పత్రిక

అనిల్ చీమలమఱ్ఱి తన బ్లాగులో పేర్కొనని మరో మంచి పత్రిక సాహిత్య నేత్రం.


సాహిత్య నేత్రం త్రైమాస పత్రిక. ఇది పదేళ్ళ కిందట మొదలైంది. దీంట్లో ప్రతి సంచికలోనూ అద్భుతమైన కథలు, కవితలు , సాహితీ వ్యాసాలు, విశ్లేషణలు వచ్చేవి. ఉత్తమాభిరుచిగల వారందరి ఆదరణా పొందినా ఆర్థికంగా నిలదొక్కుకోలేక రెండేళ్ళ కాలంలో 9 సంచికలు వెలువడి ఆగిపోయింది. అయితే పట్టు వదలని విక్రమార్కుడు శశిశ్రీ పదేళ్ళ తర్వాత ఇపుడు దాన్ని డిసెంబరు 2005 నుంచి తిరిగి నడిపిస్తున్నాడు.

ఈ పత్రిక ప్రత్యేకతలు: ఇప్పుడు సరికొత్త ఆకర్షణ ప్రతి సంచికలోనూ ఒక మంచి తెలుగు కథను ఇంగ్లీషులోకి అనువదించి ప్రచురించడం. (మన దురదృష్టమేమిటంటే ప్రపంచ, దేశ భాషల్లోని ఉత్తమసాహిత్యాన్ని తెలుగువాళ్ళకు పరిచయం చేసేవాళ్ళు, తేటతెలుగులోకి అనువదించేవాళ్ళు, ప్రచురించేవాళ్ళు ఉన్నారు గానీ మన సాహిత్యాన్ని ఇతరభాషలవారికి పరిచయం చేసే ప్రయత్నాలెవరూ సీరియస్ గా చెయ్యడం లేదు. ఒక తెలుగుకవి గుంటూరు శేషేంద్రశర్మ నోబెల్ పురస్కారానికి నామినేట్ అవడానికి కారణం తన రచనలన్నిటినీ ఆయన ఆంగ్లంలో రాయడం లేదా తెలుగులో రాసినా వెంటనే ఆంగ్లంలోకి తనే స్వయంగా అనువదించుకోవడం. నోబెల్ దాకా ఎందుకు? మనకు దక్కిన జ్ఞానపీఠాలెన్ని? రెండు (అవి కూడా జ్ఞానపీఠ్ అవార్డుల కమిటీ అధ్యక్షుడుగా పి.వి.నరసింహారావు ఉన్నప్పుడు ఒకటి, బెజవాడ గోపాలరెడ్డి ఉన్నప్పుడు ఇంకొకటి) కాగా కన్నడానికి ఏడు. తేడా ఎక్కడుందో తెలియడం లేదూ??)

ఈ పత్రికను మార్కెట్లోకి విడుదల చెయ్యడం లేదు. ప్రతులు కావలసినవారు శశిశ్రీ (సంపాదకుడు), సాహిత్య నేత్రం త్రైమాస పత్రిక, డోర్నెంబరు 21-107, ఏడురోడ్లకూడలి, కడప - 516001 ఆం.ప్ర., ఫోన్: 93474 10689 ను సంప్రదించవచ్చు. విడిప్రతి 12/-.

పత్రిక సలహామండలి:

కాళీపట్నం రామారావు
డా||వై. బాలశౌరిరెడ్డి (సుప్రసిద్ధ హిందీ రచయిత, అనువాదకుడు. ఈయన హిందీ చందమామకు నలభయ్యేళ్ళపాటు సంపాదకుడుగా పనిచేశాడు.)
డా||జానమద్ది హనుమచ్ఛాస్త్రి (ప్రసిద్ధ సాహితీవేత్త, బహుగ్రంథకర్త)
డా||కేతు విశ్వనాథరెడ్డి
డా||పాపినేని శివశంకర్
వల్లంపాటి వెంకటసుబ్బయ్య
సింగమనేని నారాయణ
షేక్ హుసేన్ సత్యాగ్ని
మాకం అశోక కుమార్
బి.కె.ఆర్. మూర్తి

Monday, 30 October, 2006

Confessions of a kid

Little Bobby came into the kitchen where his mother was making dinner. His birthday was coming up and he thought this was a good time to tell his mother what he wanted.


"Mom, I want a bike for my birthday." Little Bobby was a bit of a troublemaker. He had gotten into trouble at school and at home. Bobby's mother asked him if he thought he deserved to get a bike for his birthday. Little Bobby, of course, thought he did.

Bobby's mother wanted Bobby to reflect on his behavior over the last year. "Go to your room, Bobby, and think about how you have behaved this year. Then write a letter to God and tell him why you deserve a bike for your birthday." Little Bobby stomped up the steps to his room and sat down to write God a letter.


Letter 1Dear God,
I have been a very good boy this year and I would like a bike for my birthday. I want a red one.
Your friend,
Bobby


Bobby knew that this wasn't true. He had not been a very good boy this year, so he tore up the letter and started over.


Letter 2


Dear God,
This is your friend Bobby. I have been a good boy this year and I would like a red bike for my birthday.
Thank you.
Your friend Bobby


Bobby knew that this wasn't true either. So, he tore up the letter and started again.


Letter 3


Dear God,
I have been an "OK" boy this year. I still would really like a bike for my birthday.
Bobby


Bobby knew he could not send this letter to God either. So, Bobby wrote a fourth letter.


Letter 4


Dear God,
I know I haven't been a good boy this year. I am very sorry. I will be a good boy if you just send me a bike for my birthday. Please!
Thank you,
Bobby

Bobby knew, even if it was true, this letter was not going to get him a bike.

Now, Bobby was very upset. He went downstairs and told his mom that he wanted to go to church. Bobby's mother thought her plan had worked, as Bobby looked very sad. "Just be home in time for dinner," Bobby's mother told him.

Bobby walked down the street to the church on the corner. Little Bobby went into the church and up to the altar. He looked around to see if anyone was there. Bobby bent down and picked up a statue of the Mary. He slipped the statue under his shirt and ran out of the church, down the street, into the house, and up to his room. He shut the door to his room and sat down with a piece of paper and a pen. Bobby began to write his letter to God.

Letter 5


DEAR GOD,
I'VE KIDNAPPED YOUR MAMA. IF YOU WANT TO SEE HER AGAIN,

SEND THE BIKE!

(A forwarded mail)

Sunday, 29 October, 2006

లైంగికవేధింపులు

ఇటీవల వెలువడిన ఒక సర్వేక్షణలో విస్మయం కలిగించే విషయాలు బయటపడ్డాయి. దీన్ని బట్టి చూస్తే అజ్ఞానంలో ఉండడాన్ని తమ జన్మహక్కుగా భావించే గృహిణులే కాదు ఉద్యోగాలు చేసే మహిళల్లో సైతం చాలా మందికి లైంగికవేధింపుల పట్ల సరైన అవగాహన లేదు. 1997లో విశాక కేసులో సుప్రీమ్‌కోర్టు లైంగిక వేధింపులంటే ఏమిటో కూలంకషంగా వివరించడమేగాక మహిళలు తాము పనిచేసేచోట లైంగిక వేధింపులకు గురికాకుండా చూడవలసిన బాధ్యత వారిచేత పనిచేయించుకుంటున్నవారిదే (employers)నని తేల్చిచెప్పింది.
ఈ నేపథ్యంలో :
అసలు దేన్ని లైంగికవేధింపు అనవచ్చు?
లైంగికవేధింపు మానవహక్కుల ఉల్లంఘనా? కాదా?
లైంగికవేధింపులకు పాల్పడే వాళ్ళకు శిక్ష లేదా?
వాళ్ళమీద ఎవరికి ఫిర్యాదు చెయ్యాలి?
మహిళలు పనిచేసేచోట లైంగికవేధింపులను అరికట్టడానికి ఎలాంటి ఏర్పాట్లుండాలి?
అది ఎవరి బాధ్యత?
లైంగిక వేధింపులు జరిగేచోట పై అధికారుల, సహోద్యోగుల బాధ్యతలేమిటి?
ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడానికి ఇక్కడ చూడండి.
ఏయే చర్యలు లైంగికవేధింపులుగా పరిగణించబడుతాయో ఇక్కడ కూడా చూడవచ్చు.

Monday, 23 October, 2006

భాషలో భేదాలు

రాష్ట్రం మొత్తం మీద భాష ఒకటే ఐనా ఒక్కోప్రాంతంలో ఒక్కో మాటకు ఒక్కో అర్థముంటుంది. ప్రతి ఐదు కిలోమీటర్లకూ భాష కాస్తైనా మారుతుందంటారు. మేం మాట్లాడేదే అన్నివిధాలా సరైన భాష అనే దురభిమానం నాకు లేదు. ఇవి కేవలం సరదాకోసం రాసినవి. "సరదా కోసం మా భాషను విమర్శిస్తావా?" అని ఎవరైనా కళ్ళెర్రజేస్తే నేనేం చెయ్యలేను.

రాయలసీమలో గమ్మున ఉండమని కసిరితే నోరుమూసుకొమ్మని అర్థం.
గోదావరి జిల్లాల్లో గమ్మున అంటే త్వరగా అని అర్థం.
"గమ్మునుండడం" ఏమిటో, ఎలాగో అర్థం కాక వాళ్ళు తెల్లమొహం వేస్తారు.

మేం మటిక్కాయలని పిలిచే ఒక కూరగాయను కొన్ని ప్రాంతాల్లో గోరుచిక్కుడు అని పిలిస్తే మాకు గందరగోళంగా అనిపిస్తుంది. చిక్కుడుతో ఎందులోనూ పోలికలేని దీనికి ఈపేరెట్లా పెట్టారా అని. "మొటిక్కాయలు తింటారా? అదేం సరదా మీకు?" అని మా మీద ఎవరైనా హాస్యమాడవచ్చు నిరభ్యంతరంగా.

అనపకాయ ఒకటి ఉండగా సొరకాయకు ఆనపకాయ అనే పేరెందుకో? అనవసరమైన కన్‌ఫ్యూజన్ కాదూ?

ఇక నాకు మరీ విడ్డూరంగా అనిపించేది "పదిహేను". "పదుగురాడుమాట"గా ఇది వ్యాప్తిలో ఉందేగానీ పది+ఐదు పదిహేను ఎలా అవుతుందని నేనడిగిన కొంటె ప్రశ్న*కు తెల్లమొహాలేశారు చాలామంది. 15 ను రాయలసీమలో పదహైదు అనే అంటారు. ఇదే నాకు అన్నివిధాలా సహజమైన, తార్కికమైన పదం అనిపిస్తుంది (పది+ఐదు = పదహైదు).

(*ఈ ప్రశ్నకు సమాధానం తెలిసినవాళ్ళు ఈ టపా వ్యాఖ్యల్లో రాయండి. రేపటిలోగా ఎవరూ రాయకపోతే దీన్ని బేతాళప్రశ్నగా భావించి విక్రమార్కుడే వివరిస్తాడు.)

Sunday, 22 October, 2006

కడప జిల్లా-మౌలిక సదుపాయాలు

రాష్ట్రంలో విమనయాన సౌకర్యాల అభివృద్ధి ఆవశ్యకతను నొక్కిచెప్పిన తెలుగు జాతీయవాది బ్లాగులో కడప, పుట్టపర్తి విమానాశ్రయాల ప్రస్తావనే లేదు. ఇక ఆంధ్రప్రగతి బ్లాగులోనేమో కడపలో ఏర్పాటు కానున్నది "క్రొత్త" విమానాశ్రయమని ఉంది. కానీ వాస్తవమేమిటంటే రాష్ట్రంలో దొనకొండ విమానాశ్రయం తర్వాత నిర్మించబడిన రెండో అతి ప్రాచీన విమానాశ్రయం కడపలో ఉండేది. దురదృష్టవశాత్తూ అది తెలుగువాడైన పి.వి.నరసింహారావు హయాంలోనే మూతపడింది. ఇప్పుడు దక్కన్ ఎయిర్‌లైన్స్ సహకారంతో అదే విమానాశ్రయాన్ని తెరిపించే ప్రయత్నాలు జరుగుతున్నాయే తప్ప అక్కడ ఏర్పాటు కానున్నది క్రొత్త విమానాశ్రయం కాదు.

విమానాలతో పోల్చుకుంటే ఆర్థికంగాను, భౌగోళికంగాను ఎక్కువమందికి అందుబాటులో ఉండేవి; ప్రయాణీకులను, భారీ వస్తుసామగ్రిని చౌకగా తరలించడానికి ఉపయోగపడేవి రైలు మార్గాలే. అభివృద్ధికి జీవనాడులు రైలు మార్గాలు. రాష్ట్రంలో మొట్టమొదట రైల్వే సౌకర్యం కల్పించబడిన జిల్లాకేంద్రం కడప. అది నాటికీ, నేటికీ దేశంలోని అతిప్రధానమైన రైల్వే మార్గాల్లో ఒకటైన ముంబై-చెన్నై మార్గంలో ఉండడమే దానికి కారణం. రైల్వే కోడూరు, రైల్వే కొండాపురం లాంటి పేర్లు గల ఊర్లు కడప జిల్లాలోనే ఆ మార్గం లోనే ఉన్నాయి. ఐతే అంత ముఖ్యమైన మార్గం కూడా నాటికీ, నేటికీ ఎదుగూబొదుగూ లేకుండా అలాగే ఉంది. ఇప్పటికీ ఒక ఎక్స్‌ప్రెస్ రైలు వస్తోందంటే ఆ మార్గంలో తిరిగే రైళ్ళన్నిటినీ ఎక్కడివక్కడ ఆపేసి దారి వదలాల్సిందే. ఇప్పటికీ ఆ మార్గంలో పొగబండ్లే తప్ప ఎలెక్ట్రిక్ రైళ్ళు నడవలేవు. ఆ ఒక్క మార్గం తప్ప జిల్లాలో మరో రైలుమార్గమే లేదు. బంగారు-వెండి నగలు, వస్త్రవ్యాపారంలో రెండో బొంబాయిగా ప్రసిద్ధిపొందిన ప్రొదుటూరుకు రైల్వే సౌకర్యం లేదు. ఎర్రగుంట్ల-నంద్యాల మార్గం నిర్మించాలనే శతాబ్దం నాటి ప్రతిపాదనలు ఇప్పుడిప్పుడే కార్యరూపం దాలుస్తున్నాయి.

(వీటన్నిటికీ మూలకారణం ఇక్కడి ప్రజాప్రతినిధుల అలవిమాలిన అలసత్వమే. వాళ్ళకు స్వప్రయోజనాలే తప్ప అభివృద్ధి పట్టలేదు. ఒక్కొక్కరూ నాలుగేసి సార్లు పార్లమెంటు సభ్యులుగా ఉండి, రైల్వే బడ్జెట్లో ప్రతిసారీ కడపజిల్లాలోని రైల్వే ప్రాజెక్టులకు కేటాయించబడిన నిధులు వేరే రాష్ట్రాలకు తరలిపోతుంటే మౌనప్రేక్షకుల్లా చూస్తూండిపోయారే తప్ప ఏనాడూ పార్లమెంటులోగానీ, ఇతర వేదికలపైగానీ నోరెత్తిన పాపానపోలేదు. వారిలో ఒకరు పార్లమెంటులో రైల్వే స్టాండింగ్ కమిటీ సభ్యులు కూడా!)

ఇంకో శుభపరిణామం(తెలుగువీరుడు ప్రస్తావించనిది) ఏమిటంటే రాష్ట్రంలో తొలిసారిగా ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో ఒక రైల్వేలైను నిర్మాణానికి నాంది పలికారు. 588 కోట్ల అంచనా వ్యయంతో కృష్ణపట్నం-ఓబులవారిపల్లె రైలు మార్గం నిర్మించడానికి రైల్ వికాస్ నిగం లిమిటెడ్, రాష్ట్రప్రభుత్వం, కృష్ణపట్నం పోర్టు కంపెనీ, ఎన్.ఎం.డీ.సీ. ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ లైనుతో కృష్ణపట్నం నుంచి ముంబై వరకు నేరుగా రైళ్ళు నడుస్తాయి. హోస్పేట్-బళ్ళారి ప్రాంత ఖనిజాలు కృష్ణపట్నం రేవుకు, ముడి ఇనుము చెన్నై రేవుకు నేరుగా చేరడానికి అవకాశముంటుంది.


అన్నట్లు నవంబర్ 14 నాటికల్లా కడప జిల్లాలో ఒక్క బాలకార్మికుడు కూడా ఉండరట. ఆ ఘనత సాధించిన మొట్టమొదటి జిల్లా ఇదే కాబోతోంది. అందుకోసం జిల్లాలో అధికారుల లెక్కల ప్రకారమే ఉన్న ఐదువేల పైచిలుకు బాలకార్మికులను ఈలోపల "హాంఫట్" చెయ్యడానికి అధికారులు ఎన్ని తిప్పలు పడాలో మరి :(

Sunday, 8 October, 2006

తెలుగు పౌరాణికాలు

భారతదేశంలో చిత్రపరిశ్రమ పౌరాణికాలతో మొదలై సాంఘిక, చారిత్రక, జానపద, అభ్యుదయ, వినోదప్రధాన చిత్రాలతో బహుముఖాలుగా విస్తరిల్లింది. భాషల పరంగా చూస్తే కలకత్తాలో బెంగాలీ చిత్రాలు , ముంబై (బొంబాయి)లో హిందీ చిత్రాలు , చెన్నై (మద్రాసు)లో తెలుగు/తమిళ చిత్రాలు ...ఇలా ఒక్కోచోట ఒక్కోభాషాచిత్రాలు అభివృద్ధి చెందాయి.

సత్యజిత్ రే, తదితర దిగ్గజాలు తీసిన బెంగాలీ సాంఘిక చిత్రాలు ప్రపంచప్రఖ్యాతి పొందినవి.

ఇక చారిత్రకాలు అన్ని భాషల్లోనూ మంచివి వచ్చాయి.

కానీ...తెలుగు పౌరాణికాలతో సాటిరాగల చిత్రాలు మరే భాషలోనూ లేవు, లేవు, లేవు.

Saturday, 7 October, 2006

రామాయణం-మహాభారతం

"మన ప్రవర్తన ఎలా ఉండాలి?" అనే ప్రశ్నకు సమాధానం రామాయణమైతే "లోకం పోకడ ఎలా ఉంది?" అనే ప్రశ్నకు సమాధానం మహాభారతం.

మన ప్రవర్తన ఎలా ఉండాలో రామాయణంలోని పాత్రలు చెబుతాయి:

అన్నదమ్ముల అనుబంధం: రామ-లక్ష్మణులు
స్నేహం: సుగ్రీవమైత్రి
తండ్రీకొడుకుల అనుబంధం: దశరథ-రాములు
యజమాని-సేవకులు: రామ-హనుమ
పాలకుడు-ప్రజలు: రాముడు-అయోధ్య ప్రజలు

ఐతే భార్యాభర్తల అనుబంధమెలా ఉండాలో తెలుసుకోవడానికి మాత్రం రామాయణంలో వెదక్కండి. ఒక ఆదర్శవంతుడైన పాలకుడిగా ఉండాలో, లేక ఒక మంచి భర్తగా ఉండాలో నిర్ణయించుకోవలసిన పరిస్థితి ఎదురైనప్పుడు రాముడు ఒక మంచి పాలకుడిగా ఉండడానికే నిశ్చయించుకున్నాడు. ఎటుతిరిగీ తన తప్పేమీ లేకుండా ఆ నిర్ణయానికి బలైపోయింది మాత్రం సీత. (సీత-ద్రౌపదుల గురించి వివరంగా ఇంకొకసారి)

ఇక మహాభారతం విషయానికొస్తే అది అన్నదమ్ముల బిడ్డల (దాయాదుల) మధ్య ఆస్థి (రాజ్యం) కోసం జరిగిన గొడవ. ఇలాంటి గొడవ రామాయణంలో వాలి-సుగ్రీవుల మధ్య జరిగినట్లనిపించినా అక్కడి పరిస్థితులు వేరు. సుగ్రీవుడు తనను చంపడానికి కుట్ర పన్నాడని వాలి బలంగా నమ్మాడు. సుగ్రీవుడి సదుద్దేశాన్ని ఋజువుచేసే ఆధారాలేమీ లేవు. పైగా వాలి తిరిగొచ్చేటప్పటికి సుగ్రీవుడు వాలి భార్యతో ఉంటూ, వాలి రాజ్యాన్ని పాలిస్తున్నాడు. అందుకే వాలి సుగ్రీవుడి మీద ద్వేషం పెంచుకున్నాడు. ఇక తను చెప్పేది ఏ మాత్రమూ నమ్మక వాలి నేరుగా తనను చంపవస్తే పారిపోవడమో ఎదురు తిరగడమో తప్ప సుగ్రీవుడికి గత్యంతరం లేదు.

మహాభారతంలో నాకు కౌరవులు-పాండవుల మధ్య మౌలికంగా ఎటువంటి తేడా కనబడలేదు. వాళ్ళు చేసింది అధర్మమైతే వీళ్ళూ తక్కువేమీ చెయ్యలేదు. వీళ్ళు వీరులైతే వాళ్ళ వైపు అంతకంటే గొప్ప వీరులున్నారు. ధర్మరాజుగా పిలవబడే యుధిష్ఠిరుడు జూదం ఆడేటప్పుడు ఎంతటి హీనస్థితికైనా దిగజారుతాడని ఒకసారి కాదు రెండుసార్లు ఋజువైంది. ఇతర విషయాల్లో కూడా అతడి ప్రవర్తన నాకేమీ ఉదాత్తంగా అనిపించలేదు. అతడికి ధర్మం తెలుసు. కానీ తనకు తెలిసిన ధర్మాన్ని అతడు పాటించడంలోనే వచ్చింది తేడా.

జూదం సప్తవ్యసనాల్లో ఒకటి. తప్పుడుపని అన్న తర్వాత ఎవరుచేసినా తప్పే. జూదం యుధిష్ఠిరుడి అతిపెద్ద బలహీనత - తనతోబాటు తోడబుట్టినవాళ్ళను, కట్టుకున్న పెళ్ళాన్ని సైతం తాకట్టు పెట్టేంత. (అందులోనూ అతడు పందెంగా ఒడ్డిన ద్రౌపది అతడొక్కడికే భార్య కాదు! ఆమెను ఒడ్డేముందు ఆమె ఆమోదం, ఆమె ఇతర భర్తల అంగీకారం తీసుకోవాలనే కనీస బాధ్యత కూడా మరిచిపోయేటంతగా ఆ వ్యసనానికి బానిసైనాడు). దీన్ని ఎవరైనా ఏ రకంగా సమర్థిస్తారో నాకర్థం కాదు. అందులోనూ ఇవే పందాలు ఒడ్డి ఓడిపోవడం వెంటవెంటనే రెండుసార్లు జరిగింది. మొదటిసారి ఓడిపోయినప్పుడు ద్రౌపదికి ధృతరాష్ట్రుడు ఇచ్చిన వరాలతో దాస్యవిముక్తి పొందిన వాడు, మళ్ళీ వెంటనే గుడ్డిగా జూదానికి సిద్ధపడ్డమేమిటో! బలహీనతలున్నవాళ్ళు బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉండతగరు. కేవలం దృష్టి లోపం వల్ల ధృతరాష్ట్రుడు రాజ్యపాలనకు అనర్హుడైతే, వ్యసనపరుడు కాబట్టి యుధిష్ఠిరుడూ అనర్హుడే కావాలి.

ఇక అందరికీ తెలిసినా గుర్తించడానికి ఇష్టపడని, కుంటిసాకులు చెప్పే విషయాలు(చారిత్రక దృక్పథంతో చూసినప్పుడు కృష్ణుడు భగవదవతారమనే విషయాన్ని కాసేపు మరిచిపోదాం):

భీష్ముడి చావు: యుద్ధభూమిలో రాత్రిపూట శతృశిబిరానికి వెళ్ళి "బాబ్బాబు! నువ్వు చచ్చిపో! లేదా కనీసం నిన్నెలా చంపాలో నువ్వే చెప్పు." అని దేబిరించినవాడు యుధిష్ఠిరుడు.

ద్రోణుడి చావు: 'మిన్ను విరిగి మీదపడినా సరే వీడు అబద్ధమాడడు' అని నమ్మించి అతిఘోరమైన అబద్ధంతో గురువు ప్రాణాలనే బలిగొన్నవాడు యుధిష్ఠిరుడు. (యుద్ధంలో గెలవాలంటే గురువును చంపక తప్పదని ముందే తెలుసు. కానీ చంపించడానికి అవలంబించిన పద్ధతే అనైతికం.)

అది అనైతికం కాదనే వాళ్ళు ఒక్కసారి నిష్పాక్షికంగా ఆలోచించండి: ద్రోణుడికి వినబడేలా చెప్పదలచుకున్నదేమో పచ్చి అబద్ధం. ఆ అబద్ధాన్ని కూడా ధైర్యంగా చెప్పలేని పిరికివాడు, అబద్ధాన్ని నిజంలా భ్రమింపజేయడానికి మరింత కుటిలత్వానికి పాల్పడినవాడు యుధిష్ఠిరుడు.

ఇక కర్ణుడి చావులోనూ, దుర్యోధనుడి చావులోనూ జరిగింది అధర్మమే. "నిరాయుధుల మీద ఆయుధాన్ని ప్రయోగించరాదు." ఇది యుద్ధనీతి. భీష్ముణ్ణీ, ద్రోణుణ్ణీ ఆయుధం ప్రయోగించలేని స్థితిలోకి నెట్టీ, కర్ణుణ్ణి నిరాయుధుడుగా ఉన్నప్పుడూ చంపడం జరిగింది. వాళ్ళలో ఏ ఒక్కరు చనిపోకపోయినా యుద్ధఫలితం తారుమారై ఉండేది.

ఇక గదాయుద్ధంలో ప్రథమ నియమం: గదను నాభి క్రిందిభాగంలో ప్రయోగించరాదు. దుర్యోధనుణ్ణి చంపిందేమో గదతో తొడలు విరగ్గొట్టి. చిన్నప్పుడు భీముణ్ణీ, పెద్దయ్యాక లక్క ఇంట్లో పాండవులందరినీ చంపబూనడం, మాయాజూదం కౌరవులు చేసిన నేరాలైతే, వాటిని సాకులుగా చూపి పాండవులు చేసిన తప్పుడు పనులు అంతకంటే ఎక్కువే. యుద్ధం ధర్మబద్ధంగా జరిగి ఉన్నట్లైతే పాండవులు తుక్కుతుక్కుగా ఓడిపోయుండేవాళ్ళు.

మహాభారతయుద్ధం చరిత్రే. అందులో అనుమానం లేదు. ఐతే స్వర్గారోహణపర్వం లాంటివి కేవలం కవుల కల్పన. "ఒక్క విజయం వంద తప్పుల్ని కప్పేస్తుంది." అన్నట్లు కురుక్షేత్ర సంగ్రామంలో పాండవులు పొందిన అంతిమ విజయం వారిలోని లోటుపాట్లను కప్పేసి వారిని హీరోలను చేసింది.

Sunday, 1 October, 2006

చిన్నకథ

తెలుగుపీపుల్.కామ్‌లో సౌమ్య గారు "చిన్నకథ నిడివి ఇంత ఉండాలి అనేం రూలు లేదు కావొచ్చు గానీ...ఎలా చూసినా ఇది చాలా చిన్నదండీ చిన్నకథ కేటగిరీకి." అన్నారు. అంటే రూలు లేకపోయినా తనకొక అభిప్రాయముంది: కథ కనీసం ఇన్ని లైన్లుండాలని. కథ గురించి నా అభిప్రాయాలు వేరు. కథ చిన్నదా పెద్దదా అని కాక అది నాలో కలిగించిన అనుభూతి చిన్నదా పెద్దదా అనే చూస్తాను నేను. ఒక కథ చెత్తకథా, మామూలు కథా, మంచి కథా లేక గొప్ప కథా అనేది తేల్చుకోవడానికి నాకదే గీటురాయి. (ఐతే కథకు క్లుప్తతే ప్రాణం అని చాలామంది నమ్ముతారు.) అనవసరమైన సోదంతా మానేసి సూటిగా విషయం చెప్పేవాళ్ళు నాకు బాగా నచ్చుతారు.

కథంటూ మొదలయ్యాక దిక్కులు చూడ్డం మానేసి సూటిగా లక్ష్యం వైపు పరుగెత్తాలి. నవలారచన విశాలమైన మైదానంలో గుర్రపుస్వారీ లాంటిదైతే కథారచన తాడుమీదనడక లాంటిదంటారు. రచయిత దృష్టి చెప్పదలచుకున్న పాయింటు నుంచి ఏ మాత్రం పక్కకు తప్పినా కథ కుప్పకూలిపోతుంది. అందుకే కథారచయితకు కథ రాసేటప్పుడు తన మీద తనకు గొప్ప అదుపు ఉండాలి. ఈ విషయంలో స్వర్గీయ సొదుం జయరాం చాలా గొప్పవాడని, ఆయన కథల్లో అనవసరమైన సన్నివేశం గానీ, అనవసరమైన వాక్యం గానీ, అనవసరమైన మాటగానీ ఉండవని రచయితలు, విమర్శకులు, సాహితీపత్రికల సంపాదకులు గొప్పగా చెబుతారు. ఆయన రాసిన కథలు చాలా మటుకు రెండుపేజీల్లోపలే ముగుస్తాయి. అయితేనేం? అవి నిస్సందేహంగా చాలాగొప్ప కథలు. కొడవటిగంటి కుటుంబరావు ప్రశంసలు పొందిన కథకుడాయన. రెండేళ్ళ కిందట ఆయన కథలకు రాచకొండ రచనాపురస్కారం వచ్చింది. (సొదుం జయరాం కథలు: ప్రచురణ బండ్ల పబ్లికేషన్స్, విజేత కాంపిటీషన్స్ జనరల్ బుక్స్ సీరీస్).

కేతు విశ్వనాథరెడ్డి ముప్ఫయ్యేళ్ళ కిందట కడప నుంచి వెలువడిన లిఖిత మాసపత్రిక మనోరంజనిలో (సాహిత్యనేత్రం సంపాదకుడు శశిశ్రీ ఈ పత్రికను నడిపారు) "మారుచీరె" అనే కార్డుకథ రాశారు. అది తెలుగుపీపుల్ లోని దాట్ల గారి కథ కంటే చిన్నది. ఐనా ఆ కథ గొప్పదనానికొచ్చిన లోటేమీ లేదు. పాత్రల పేర్లు నాకు గుర్తుండవు. ఈ కథలోని పాత్రల పేర్లు అచ్చమ్మ, బుచ్చమ్మ అనుకుందాం.
ఒకే కాలేజీలో చదివే అచ్చమ్మ ధనవంతుల పిల్ల, బుచ్చమ్మ పేదరాలు. కాలేజీ వార్షికోత్సవమప్పుడు వేసిన నాటికలో అచ్చమ్మ పేదరాలి వేషం, బుచ్చమ్మ ఒక మగవాడి వేషం వేశారు (పేద హీరోయిన్, ధనిక హీరో వేషాలనుకుంటా). స్టేజీ మీద కట్టుకోవడానికి అచ్చమ్మ దగ్గర పాతచీరె లేదు. బుచ్చమ్మ ఎలాగూ మగవాడి వేషం వేస్తోంది కాబట్టి ఆమె చీరె అచ్చమ్మ తీసుకుంది. నాటిక పూర్తయ్యాక బుచ్చమ్మ తన చీరివ్వమని అచ్చమ్మను అడిగింది. దానికి అచ్చమ్మ "ఆ చీరె మళ్ళీ కట్టుకుంటావటే? సహజత్వం కోసం దానికున్న చిరుగులను పెద్దవి చేశానే." అంది. సమాధానంగా "నాకున్న మారుచీరె అదొక్కటేనే." అంటున్న బుచ్చమ్మ గొంతు వణికింది.
కథంతా ఇంతే.

ఇటీవలి సంవత్సరాల్లో రచనలో ఛాయామల్లిక్ మైక్రోకథలు కొన్ని రాశారు. వాటిలో ఒకటి చాక్లెట్-రేపర్: పెళ్ళైన కొత్తలో ఒకనాటి రాత్రి భర్త తన పట్టుచీరను లుంగలు చుట్టిపారేస్తూంటే భార్య "అయ్యో!" అని బాధపడుతుంది. దానికి భర్త "నాకు రేపర్ కంటే చాక్లెట్టే ముఖ్యం." అంటాడు. ముప్ఫయ్యేళ్ళ తర్వాత: భార్య "మీ చాక్లెట్ పాడైపోయిందండీ" అని బాధపడుతుంది. దానికి భర్త "ఇంతకాలం నేను చాక్లెట్ అనుకొన్నదీ రేపరేనని ఇప్పుడు తెలుసుకున్నాను. అసలైన చాక్లెట్ నీ వ్యక్తిత్వమే." అంటాడు.

కొడవటిగంటి కుటుంబరావు రాసిన అనేక గల్పికలు - గొప్ప ఎడ్యుకేటివ్ వాల్యూస్ ఉన్నవి - సగం పేజీలోనే ముగుస్తాయి. చందమామలో సింగిల్ పేజీ కథలు ప్రత్యేక ఆకర్షణ. కాదంటారా?

"వసుంధర"

"ఒక అందమైన సాయంత్రం" టపాలో కిరణ్ అడిగారు - ధర్మనిధి పురస్కారం పొందిన వసుంధర, చందమామ కథల రచయిత వసుంధర ఒకరేనా అని. అవును, ఒకరే. వారి గురించి నాకు తెలిసిన కొన్ని వివరాలు:

జొన్నలగడ్డ రాజగోపాలరావు-రామలక్ష్మి దంపతులు వసుంధర కలం పేరుతో రాస్తున్న జంటరచయితలు. రాజగోపాలరావు గారు రసాయనశాస్త్రవేత్తగా పనిచేసి రిటైరయ్యారు. భువనేశ్వర్లో చాలాకాలం పనిచేశారు. ప్రస్తుతం హైదరాబాదులోనే మకాం. వారుంటున్న ఇంటిపేరు శ్రీవాణీగిరిజానిలయం. (శ్రీ అంటే లక్ష్మిదేవి, వాణి అంటే సరస్వతి, గిరిజ అంటే పార్వతి అని అందరికీ తెలిసిన విషయమే. ముగ్గురమ్మల నిలయమన్నమాట వారి ఇల్లు). వసుంధరతో బాటు బాబి, కమల, సైరంధ్రి, రాజా, రాజకుమారి, శ్రీరామకమల్, యశస్వి, కైవల్య, మనోహర్ వారి కలం పేర్లు.

వీరు ఒక్క చందమామలోనే వెయ్యికి పైగా కథలు రాశారు. వాటిలో కథల ప్రయోజనం, అపకారికి ఉపకారం, మొదలైనవి సుప్రసిద్ధం. వీరి కథల్లో పిల్లలకు విలువైన సందేశం గానీ, అద్వితీయమైన చమత్కారం గానీ తప్పనిసరిగా ఉంటాయి. బొమ్మరిల్లులో నూరుకట్ల పిశాచం కథలు, మరికొన్ని ఇతర కథలు రాయడంతోబాటు లోకజ్ఞానానికి సంబంధించిన ప్రశ్నలు-జవాబులు, ఈ శతాబ్దపు చివరి దశాబ్దం, లాంటి ఇతర శీర్షికలు కూడా చాలాకాలం నిర్వహించారు. రామలక్ష్మి గారు ఆ పత్రికకు పేరులేని సంపాదకురాలిగా పనిచేశారని చదివాను. ఆమె వసుంధరలో భాగస్వామిగానే కాకుండా విడిగా కూడా చాలా కథలు, నవలలు రాశారు.

ఇక పెద్దలకోసం వారు రాసిన కథలను, నవలలను ప్రచురించని పత్రికలు తెలుగులో దాదాపుగా లేవనే చెప్పవచ్చు. ఈ కథలు ఇంకో వెయ్యిదాకా ఉంటాయి. వాటిలో "ఒక్క అపనలోనే రెండొందలుంటాయి." (అపన: అపరాధపరిశోధన అనే పేరుగల పత్రిక) ఈ కథల్లోనుంచి ఎంపికచేసిన కొన్ని కథలు రెండు సంపుటాలుగా వచ్చాయి: రసికరాజతగువారముకామా?, చిరునవ్వు వెల ఎంత?(హాస్యకథల సంపుటి) వీటిలోని కొన్ని కథలు చదివితే 'ఇలాంటి విశేషాలు అందరి జీవితాల్లోనూ ఉంటాయి. వాటిని కథలుగా మలచగల దృష్టి ఉండాలేగానీ ఎవరైనా కథలు రాయొచ్చు' ననే ధైర్యమొస్తుంది. (నిజంగా వీరు చాలామందిని కథలు రాయమని ప్రోత్సహించారు, కొందరిని వేధించారు కూడా: తీరుబాటు అనే కథలో ఆ విషయం వివరిస్తారు.) కానీ అధిక శాతం కథలు అద్భుతమనిపిస్తాయి. అలాంటి కథలు రాయడం మాత్రం నిజంగా అనితరసాధ్యం.

మనకు ఎప్పుడైనా ఎవరైనా వ్యక్తులమీద గానీ , పరిస్థితుల మీద గానీ కోపమో, చిరాకో, అసహ్యమో, అభిమానమో, అబ్బురపాటో, అవేశమో, ఆక్రోశమో, నవ్వో, ఇలా ఎలాంటి భావమైనా కలిగితే దాన్ని మాటల్లోనో, చేతల్లోనో చూపిస్తాం. వీరు మాత్రం దాని మీద కథ రాసేస్తారు అని కూడా అనిపిస్తుంది వీరి కథలు చదివితే. తాము చెప్పదలచుకున్న ఏ విషయాన్ని గురించైనా కథో, నవలో రాయగల ప్రతిభ వీరికి ఉంది.

అలాగని వీరు కథలు మాత్రమే రాసి ఊరుకోలేదు. రచన మాసపత్రికలో సాహితీవైద్యం(సా.వై.), కథాపీఠం, కథాప్రహేళిక, నిషిద్ధాక్షరి, దొరకునా ఇటువంటిసేవ, లాంటి శీర్షికలు నిర్వహించారు. సా.వై. శీర్షిక కొన్ని వందలమంది రచయితలను తయారుచేసింది, ఇంకా చేస్తోంది. ఇలాంటి శీర్షికానిర్వహణ ఏ భాషలోనైనా అపూర్వం కాగా ఆ శీర్షికను దశాబ్దం పైగా ఏకధాటిగా నిర్వహిస్తున్నారు. ఇన్ని పనులు చేయడానికి వీరికి సమయమెలా సరిపోతుంది? ప్రతిరోజూ ఒక నిర్ణీతసమయంలో ఏదో ఒకటి రాయాలి అని నిశ్చయించుకుంటే ఎన్నైనా రాయవచ్చు అనేది వీరి అనుభవం.

వీరు రాసిన నవలలు నేను ఎక్కువ చదవలేదు. నేను చదివిన నవలల్లో నాకు అద్భుతంగా అనిపించినవి అద్దం ముందు పిచికలు, ఆడపడుచు, సూర్యనమస్కారం, శ్రీరామునిదయచేతను, మొక్కలు పిలుస్తున్నాయి, మొదలైనవి. వీరి నవలలు కొన్ని సినిమాలుగా కూడా వచ్చాయి.

వీటితోబాటు వీరు అప్పుడప్పుడూ కవితలు కూడా రాస్తారు.

Friday, 15 September, 2006

నట్టింటి భూతం

నట్టింటి భూతం పట్ల తస్మాత్ జాగ్రత్త! ఈ భూతం బారిన పడినవాళ్ళకు చిన్నాపెద్దా తేడా లేకుండా శారీరక, మానసిక చురుకుదనం తగ్గిపోవడం, రకరకాల వికారాలు కలగడం ప్రత్యక్షంగా కనిపిస్తూనే ఉంది.

ఇప్పుడు అది మీ బుర్రలు చెడగొట్టడమే గాక మీ పిల్లల ప్రాణాలను బలితీసుకునే ప్రమాదం కూడా ఉంది.
ఈ వార్త గత గురువారం హిందూ హైదరాబాదు ఎడిషన్లో వచ్చింది. కానీ ఎందుకనో ఆన్‌లైన్ ఎడిషన్లో కనబడలేదు.

Wednesday, 13 September, 2006

ఒక అందమైన సాయంత్రం:

ఈ సాయంత్రం నాకు చాలా ఉత్సాహాన్నిచ్చింది. దానికి కారణం ఇంటర్నెట్లో తెలుగు గురించి తెలిస్తే ప్రజల్లో ఎంతటి ఆసక్తి కలుగుతుందో ప్రత్యక్షంగా తెలియడం; పుట్టపర్తివారికి జరిగిన అపచారానికి హైదరాబాదులోని సాహిత్యాభిమానులు, ప్రముఖులు ఒకేలా స్పందించడం. ఐతే మనం వాడే భాష విషయంలో పాటించవలసిన జాగ్రత్తలతో తయారు చేసిన ప్రతిజ్ఞ గురించి మాత్రం తక్షణ స్పందన తెలియలేదు. దానికి ఇంకా సమయం పడుతుంది. అసలేం జరిగిందంటే:

నిన్న ఉదయం నాకొక ఈమెయిల్ వచ్చింది. సాహిత్య, కళారంగాల్లోని ప్రముఖులకు ఈ సాయంత్రం తెలుగు విశ్వవిద్యాలయంలో జరగనున్న సన్మాన కార్యక్రమానికి రావలసిందని. పంపినవారు బహుమతిగ్రహీతల్లో ఒకరైన ప్రముఖ రచయిత 'వసుంధర '.

దాంతో నాకొక ఆలోచన వచ్చింది: పుట్టపర్తివారికి జరిగిన అపచారాన్ని నిరసిస్తూ తెలుగుబ్లాగరుల తరపున చదువరిగారు తయారుచేసిన పిటీషను గురించి, తెలుగుబ్లాగులు, తెవికీల గురించి నలుగురికీ తెలియజెప్పడానికి ఈ సమావేశాన్ని ఒక వేదికగా వాడుకుంటే ఎలా ఉంటుందని. నేనీ విషయం ప్రస్తావించిందే తడవుగా చదువరిగారు ఆఘమేఘాల మీద 300 కరపత్రాలు తీసి నాకు అందజేశారు. (పిటీషను 100 ప్రతులు, తెలుగుబ్లాగులు, తెవికీల పరిచయవాక్యాలు 100 ప్రతులు, భాష విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించిన ప్రతిజ్ఞ 100 ప్రతులు). నేను వాటినందుకుని సమావేశస్థలికి చేరుకుని వచ్చినవారందరికీ పంచడం మొదలుపెట్టాను.

"ఇంటర్నెట్లో తెలుగు..." అని వాసన తగలగానే అక్కడున్న విద్యార్థులంతా ఆసక్తిగా వివరాలడగడం ప్రారంభించారు. నేను చెబుతూండగా అటుగా వచ్చిన విలేకరి ఒకరు నా గురించి వివరాలడిగారు. నేనీ పని తెలుగుబ్లాగరుల తరపున చేస్తున్నాని తెలుపగా, ఆయన తెలుగు బ్లాగరులు తయారు చేసిన వివరాలకు, ప్రతిజ్ఞకు తనకున్న పరిచయాల ద్వారా విస్తృతప్రచారం చేయిస్తానని అడక్కుండానే ముందుకు రావడమేగాక రాష్ట్రవ్యాప్తంగా తెలుగు భాష పట్ల స్పృహ ఒక ఉద్యమ స్థాయిలో రావాలని, ఏబీకేప్రసాద్ లాంటివాళ్ళ సహకారంతో అందుకు తగిన కార్యక్రమాలు రూపొందించుకుని అమలు చేయాలని అనడమేగాక బ్లాగరుల సమావేశాలకు వస్తాననీ, పత్రికల్లో (కనీసం తమ పత్రిక ఆంధ్రప్రభలో) బ్లాగుల గురించి, ఇంటర్నెట్లో తెలుగు వ్యాప్తి గురించి మనం రాసినవి ప్రచురింపజేస్తానని అన్నారు. ప్రసారమాధ్యమాల్లో తెలుగు దీనస్థితి గురించి కూడా నా అభిప్రాయంతో ఆయన ఏకీభవించారు.

విద్యార్థులు కానివాళ్ళు పుట్టపర్తి వారికి జరిగిన అపచారానికి ఆగ్రహం వ్యక్తం చేయడమేగాక మనం చేస్తున్న పనిని అభినందించారు. విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుల ఛాంబర్లో కరపత్రాలు అందజేసి విశ్వవిద్యాలయంలోని అన్ని విభాగాలకు వాటి ప్రతులను పంపించమని అక్కడివారిని కోరాను. వారు విషయం తెలుసుకుని సంతోషించి సభకు వచ్చినవారందరికీ వెంటనే పంచెయ్యమని ప్రోత్సహించారు. త్వరలోనే కరపత్రాలన్నీ అయిపోయాయి. ఇంకో వందేసి ప్రతులు తీసుకువచ్చి ఉంటే బాగుండేదనిపించింది.

ఇక సభలో ముందుగా మాట్లాడిన వేటూరి సుందరరామమూర్తి మాట్లాడిన తీరు చూస్తే ఆయన పుట్టపర్తివారికి జరిగిన అపచారాన్ని మంత్రిగారి సమక్షంలో అందరికీ ఎత్తిచూపడానికే సభకు వచ్చినట్లు నాకు అనిపించింది. ఆయన ప్రొద్దుటూరు గురించి చెబుతూ "ఇద్దరు మహాకవుల విగ్రహాలు గల ఊరు ప్రొద్దుటూరు." అని చెప్పారు. ఆ ఇద్దరూ శివతాండవకర్త పుట్టపర్తి, శివభారతకర్త గడియారం వెంకటశేషశాస్త్రి. తర్వాత మాట్లాడిన మంత్రి రోశయ్య కూడా "ఇంతటి అపచారానికి పాల్పడినవారెవరో నాకు తెలియదు గానీ (తెలియకపోతే తెలుసుకోండి సార్! పూర్తిపేరు నంద్యాల వరదరాజుల రెడ్డి. వరుసగా నాలుగోసారి శాసనసభ్యత్వం వెలగబెడుతున్నాడు.) ఎవరు చేసినా ఇది చాలా నీచమైన పని." అని కాసేపు తిట్టి తప్పనిసరిగా దీన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్ళి, అక్కడ పుట్టపర్తివారి ఒక్క విగ్రహమే ఉండేలా చూస్తానన్నారు. తమ పిల్లల చేత మమ్మీ, డాడీ అని పిలిపించుకోవాలని ఉబలాటపడేవాళ్ళను రోశయ్య సున్నితంగా విమర్శించారు.

అది విన్న నాకు ఈ మధ్యే ఒకసారి FM రేడియోలో నేను విన్న సంభాషణ గుర్తొచ్చింది:

లంగరమ్మ (అక్కినేని నాగేశ్వరరావుతో): మీ పిల్లలు, మనవలు మిమ్మల్ని ఏమని పిలుస్తారు?
అక్కినేని: అమ్మ-నాన్న, అమ్మమ్మ-తాతయ్య.
లంగరమ్మ: ఒకవేళ ఎవరైనా మమ్మీ-డాడీ అనో, గ్రాండ్మా-గ్రాండ్పా అనో పిలిస్తే?
అక్కినేని (తీవ్రంగా): దవడ పగిలిపోతుంది.

పుట్టపర్తి సర్కిల్ లో పుట్టపర్తివారి ఒక్క విగ్రహమే ఉండేలా చూస్తానని కడప కలెక్టరు కూడా ఏబీకేప్రసాద్ తదితరులకు హామీ ఇచ్చినట్లు సభ పూర్తయ్యాక రచన సంపాదకులు శాయి ద్వారా నాకు తెలిసింది.

ఈ సమావేశానికి కారా మాస్టారు రావడం ఇంకొక విశేషం.

Tuesday, 12 September, 2006

అరాచకాన్ని ఎదిరిద్దాం!

పుట్టపర్తి వారి విగ్రహానికి ఓ అరాచకీయుడు చేసిన అపచారంపై ఈ పిటిషన్ను

(http://www.petitiononline.com/Puttapar/petition.html)

చూశారా? చూసి, మీ వోటు వెయ్యండి. మీ స్నేహితులకు చెప్పండి.(చదువరి గారి బ్లాగు నుంచి)

Sunday, 10 September, 2006

ఏది శాశ్వతం?

ఏది శాశ్వతం? మనుషుల జీవితాలు శాశ్వతమా? చనిపోయినవారి జ్ఞాపకాలు శాశ్వతమా? భవిష్యత్తరాలవారికి గతించిన మహానుభావులను గుర్తుచేసే విగ్రహాలు శాశ్వతమా? ఏదీ శాశ్వతం కాదు. మీమీ ఊళ్ళలో ఉన్న ప్రముఖుల విగ్రహాలు కూడా పరమపదించే ప్రమాదముంది తెలుసా? అదీ సహజమరణం కాదు. బలవన్మరణం. అందుకే మీరు ఈసారి ఏ ట్యాంక్‌బండు వైపో వెళ్ళినప్పుడు అక్కడున్న తెలుగుతేజాల విగ్రహాలనొకసారి కనులారా దర్శించుకోండి. బహుశా అవే చివరి చూపులు కావచ్చు. రేపటినుంచి మీకు ఆ అవకాశం కూడా దక్కకపోవచ్చు. పట్టణాలలో గతంలో ప్రతిష్టించిన విగ్రహాలను తొలగించి వాటి స్థానంలోనే ఇందిర, రాజీవ్ ల విగ్రహాలను ప్రతిష్టింపజేసే విగ్రహయజ్ఞం ప్రారంభమైంది. వయ్యెస్సార్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినవెంటనే అదే వేదిక మీదనుంచి గొంతు బొంగురుపోయేలా, దిక్కులు పిక్కటిల్లేలా అరిచి అరిచి చెప్పాడు: "రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం తెస్తాం. రాష్ట్రం యొక్క రూపూరేఖా స్వరూపాలు మారుస్తాం!" అని. దాని అర్థం మీకింకా బోధపడలేదా? రేప్పొద్దున మీరు అద్దంలో చూసుకున్నా రాజీవ్, ఇందిరల రూపాలే కనిపిస్తే కంగారుపడకండి.

నిన్న, మొన్న ప్రొద్దుటూరులో జరిగిన పరిణామాలివి:
నిన్న:

మొన్న:

Friday, 8 September, 2006

కాళిదాసు కంచుబొమ్మ

గత సంవత్సరం (2005) చైనా ప్రభుత్వం నుంచి మన విదేశాంగశాఖవారికి వచ్చిన ఒక అభ్యర్థన వారిని తెల్లబోయేలా చేసింది. గందరగోళంలోకి నెట్టింది. చైనీయులు కోరింది క్రీ.శ. ఆరవ శతాబ్దానికి చెందిన ఒక మహనీయుడి కాంస్యవిగ్రహం కావాలని. ఆయనెలా ఉంటాడో ఎవరికీ తెలియదు. కనీసం రేఖాచిత్రాలు కూడా లేవు. అలాంటివాడి ప్రతిమ చేసివ్వమని అడిగితే ఏం చెయ్యడం? ఎలా ఇవ్వడం? అసలు చైనీయులకు ఆ విగ్రహంతో ఏం పనిబడింది?

చైనా ప్రభుత్వం తమ దేశప్రజల్లో సాంస్కృతిక అవగాహనను పెంచడానికిగాను షాంఘై థియేటర్ స్ట్రీట్ లో కాళిదాసు విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని నిర్ణయించింది. ఐతే సమస్యేమిటంటే కాళిదాసు బొమ్మలు కాదుగదా కనీసం ఆయన రూపురేఖావిలాసాదులెలాంటివో తెలిపే వర్ణనలైనా ఎక్కడా లేవు. చైనీయుల అభ్యర్థనను మన విదేశాంగశాఖ వారు భారతదేశ సాంస్కృతిక సంబంధాల మండలి (ICCR)కి, ఆ మండలి మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి, ఆ ప్రభుత్వమేమో ఉజ్జయినిలో ఉండే కాళిదాసు అకాడెమీకి పంపించారు. ఆ మహాకవి, నాటకకర్త క్రీ.శ. ఆరవ శతాబ్దంలో ఉజ్జయినిలోనే నివసించాడని నమ్ముతున్నారు.

కాళిదాసు రచనలను మనోవిశ్లేషణాత్మక దృక్పథంతో అధ్యయనం చేసిన నిపుణులు ఆయన చాలా అందగాడని తేల్చారు. (ఆయన పేరు మీద ప్రచారంలో ఉన్న అనేక కథలు; సాహిత్య, చారిత్రక గాథలు దీనికి అనుగుణంగానే ఉన్నాయి.) ఈ అంచనాల ఆధారంతో చివరికి తల నుంచి రొమ్ము వరకు గల ఒక 30 అంగుళాల కంచుబొమ్మను తయారుచేయించారు. ఇలాంటి ప్రయత్నం జరగడం మనదేశంలో ఇదే మొదటిసారి. ఈ విగ్రహాన్ని సాంస్కృతిక సంబంధాల మండలికి చెందిన విగ్రహ తయారీ నిపుణుల సంఘం ఆమోదించాక విదేశాంగశాఖ గత జూన్ నెల చివరి వారంలో చైనాకు పంపింది. ఆ విగ్రహాన్ని నిన్ననే షాంఘై థియేటర్ స్ట్రీట్ లో ఆవిష్కరించారు.

అక్కడ కొలువుదీరనున్న 19 మంది జగత్ప్రసిద్ధుల్లో ఆసియా ఖండానికి చెందిన ఒకేఒక వ్యక్తి మహాకవి కాళిదాసు.

మొదటివార్త ట్రిబ్యూన్ లో

తాజావార్త ఈరోజు హిందూ (ప్రింట్ ఎడిషన్)లో

Saturday, 2 September, 2006

ఆసక్తికరమైన వార్తలు:

ఈరోజు హిందూలో వచ్చిన కొన్ని ఆసక్తికరమైన వార్తలు:

బలవంతమైన సర్పము నాలుగెలుకలచేత చిక్కి చావదె?(విశాఖపట్నంలో)
Rats kill cobra

VISAKHAPATNAM: Rodents are easy prey for snakes but a cobra that felt it could feast on a handful of rats kept in a tray faced stiff resistance and was killed by the rodents. This rare incident occurred in the Animal House of Andhra University College of Pharmaceutical Sciences on Friday. The research scholars fed the rats, on which an experiment was being carried out, around 11 a.m. and left . Meanwhile, the snake slithered into the Animal House and attacked the rats and killed two of them. But the remaining four rats attacked the cobra and killed it. - Special Correspondent

ముప్ఫయ్యేళ్ళుగా కూడబెట్టిన మూడున్నర లక్షల రూపాయలను దేవాలయానికి విరాళంగా ఇచ్చిన బిచ్చగత్తె!(కడపలో)

రాబందుల పరిరక్షణలో నెహ్రూ జూ పార్కు(హైదరాబాదు)

"ప్రమాదాల్లో గాయపడి గానీ, పురిటినొప్పులతో గానీ, మరేవిధంగానైనా అత్యవసర వైద్యసహాయం అవసరమైనవారికి తక్షణ వైద్యసహాయం అందించడం వైద్యుల, ఆసుపత్రుల తప్పనిసరి బాధ్యత" అని చట్టాలు చేయమని రాష్ట్రప్రభుత్వాలకు సూచించిన 17వ లా కమిషన్.(ఢిల్లీ)

Thursday, 31 August, 2006

ఎయిడ్సు-ఎచ్.ఐ.వీ.

ఎయిడ్సు, దాని కారకమైన ఎచ్.ఐ.వీ.ల గురించి ఘనత వహించిన మన పార్లమెంటు సభ్యుల పరిజ్ఞానమెంతో ఈ మధ్యే బయటపడింది. అది చూసి మన ప్రధాని తన మొహం ఎక్కడ దాచుకోవాలో తెలియక "ఇబ్బంది" పడ్డారు. ఎయిడ్సు గురించి ప్రజల్లో అవగాహన కలిగించడానికి ప్రభుత్వాలు కోట్లు ఖర్చు చేసి ఎంత విస్తృతంగా ప్రచారం చేస్తున్నా ఇంకా చాలా మందికి వాటి గురించి స్పష్టమైన అవగాహన లేదనే చెప్పాలి. ఎచ్.ఐ.వి. ఎలా వ్యాపిస్తుందనే విషయం గురించి ప్రజలకు ఎలాంటి అపోహలు ఉన్నాయో తెలిపే ఈమెయిలొకటి నాకు రెండు వారాల కిందట వచ్చింది. దాన్ని గురించి నా బ్లాగులో రాయాలని అప్పుడే నిర్ణయించుకున్నాను. అయితే అందులో ఉన్న వైద్యసంబంధ సమాచారం పూర్తిగా నిజమో కాదో నాకు తెలియదు. అందుకే సాధికారంగా నిర్ధారించుకోవడానికి ఆ విషయంపైనే పరిశోధనలు చేస్తున్న తెలుగు బ్లాగరి ఇస్మాయిల్(చింతు) గారిని అభ్యర్థించాను. ఆయనకు తీరిక లేకపోయినా నా అభ్యర్థనను మన్నించి ఆధారిత డాక్యుమెంట్లతో సహా వివరంగా సమాధానమిచ్చారు. మొదటి మెయిల్ సారాంశాన్ని, దానికి అంశాల వారీగా ఇస్మాయిల్ గారి ప్రతిస్పందనను క్లుప్తంగా నా ఇంగ్లీషు బ్లాగులో పోస్టు చేశాను. తెలుసుకోగోరిన వాళ్ళు అక్కడ చూడవచ్చు.

Monday, 28 August, 2006

పుస్తక సమీక్షలు-బ్లాగు సమీక్షలు


ప్రస్తుతం పుస్తక సమీక్షలెలా ఉంటున్నాయో ఈ ఒక్క కార్టూను చూస్తే తెలుస్తుంది. రాబోయే కాలంలో పత్రికల్లోని పుస్తకసమీక్షలు ఈ కార్టూనులో చూపినట్లే ఉంటాయేమో? (ఒక పుస్తకం అట్ట మీద ఆ పుస్తకం గురించి 300 పదాల పరిచయవాక్యాలుంటే దాని మీదొచ్చిన సమీక్షను 200 పదాలతో సరిపెట్టేశారట!!)

పుస్తక సమీక్షల పరిస్థితే అలా ఉండగా ఇంకొక వైపు బ్లాగుల గురించి సవివరమైన సమీక్షలు రాస్తున్న భాస్కర రావు గారి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆయన ఇప్పటి వరకు తెలుగు మహిళా బ్లాగరులందరి బ్లాగుల గురించి సమీక్షలు రాశారు. తాను చదివిన మంచి పుస్తకాల గురించి తన బ్లాగులో చర్చించే వి.బి.సౌమ్య గారి బ్లాగును ఈరోజు ఆయన సమీక్షించారు. ఆయన సమీక్షలు మహిళా బ్లాగరుల బ్లాగులకే పరిమితం కాలేదు. చరసాల, చావా కిరణ్, త్రివిక్రమ్ లాంటి వారి బ్లాగుల మీద కూడా సుదీర్ఘమైన సమీక్షలు రాశారు. ఆయన చేస్తున్న కృషికి నా హృదయపూర్వక అభినందనలు.

అపహాస్యం పాలౌతున్న సెన్సార్ సర్టిఫికెట్లు

ఈ మధ్య మన సెన్సారు బోర్డు వారు ఎడాపెడా A సర్టిఫికేట్లు, U/A సర్టిఫికేట్లు ఇచ్చి పారేస్తున్నారు. మన ఎగ్జిబిటర్లు, దర్శకనిర్మాతలు, టీవీ ఛానెళ్ళవారు ఆచరణలో ఆ సర్టిఫికెట్లను అంతే ఉత్సాహంగా "పారేస్తున్నారని" నాకు ఈ మధ్యే తెలిసివచ్చింది. అసలు విషయం చెప్పబోయే ముందు ఈ సెన్సార్ సర్టిఫికేట్ల గురించి కొన్ని వివరాలు:

ఎవరైనా నిరభ్యంతరంగా చూడదగ్గ సినిమాలకు U సర్టిఫికెటు,
మితిమీరిన శృంగారం, అశ్లీలత, అసభ్యత, బూతులు, లేదా హింసాత్మక సన్నివేశాలు ఉండడం వల్ల పిల్లలు చూడకూడని సినిమాలకు A సర్టిఫికెటు,
పెద్దవారి తోడు లేకుండా చూస్తున్నప్పుడు పిల్లలు భయపడే అవకాశముందనిపించిన హార్రర్ సినిమాలకు, చిన్నపిల్లలు పెద్దవాళ్ళతో కలిసి మాత్రమే చూడదగ్గ సినిమాలకు U/A సర్టిఫికెటు ఇస్తారు.

హాస్యం పేరుతో పచ్చిబూతుమాటల్ని విరివిగా వాడిన ఒక సినిమా U/A సర్టిఫికెటుతో విడుదలైంది కొన్ని నెలల కిందట. అంటే చిన్న పిల్లలు ఆ బూతు మాటల్ని పెద్దల పర్యవేక్షణలో మాత్రమే నేర్చుకోవాలని అ సర్టిఫికెటు ఇచ్చినవారి ఘనమైన అభిప్రాయమనుకోవాలా? సెన్సారైన సినిమాలకు కూడా ప్రచారం చేసుకోవడానికి వాడుకునే స్టిల్స్, క్లిప్పింగులకు ఫిల్మ్ ఛాంబర్ నుంచి అనుమతి పొందాలి. కానీ సదరు సినిమావారిచ్చిన టీవీ ప్రకటనల్లో కూడా బూతు మాటలే ఉన్నాయి. :(

దీని తలదన్నే సంఘటనొకటి రెండు మూడు వారాల కిందట జరిగింది. (దీని గురించి అప్పుడే బ్లాగకపోవడానికి కారణం "విక్రమార్కుడు" సినిమాకు U/A సర్టిఫికెటు వచ్చిందని ఇన్నిరోజులూ నేను అపోహ పడ్డమే.)
వాస్తవమేమిటంటే "విక్రమార్కుడు" సినిమాకు వచ్చింది A సర్టిఫికెటు. అంటే అది పిల్లలెవరూ చూడగూడని సినిమా. A సర్టిఫికెటు ఎందుకొచ్చిందో నాకు తెలియదు. నేనా సినిమా చూడలేదు. ఐతే రెండు మూడు వారాల కిందట ఆ సినిమా "చూసి వచ్చిన" చిన్నపిల్లలతో ఆ సినిమా హీరో రవితేజ, దర్శకుడు ? చాలా సేపు ఆ సినిమా గురించే మాట్లాడారు. ఒక ఆదివారం మధ్యాహ్నం ఆ సన్నివేశం మొత్తం ఒక టీవీ ఛానెల్ వారు (మా టీవీ?) చక్కగా ప్రసారం చేశారు. చాలా మంది చూసే ఉంటారు. కానీ ఎవరూ అభ్యంతరపెట్టినట్లు దాఖలాల్లేవు.

ఇంతకూ సెన్సార్ బోర్డ్ వారి బాధ్యత తమకు తోచిన సర్టిఫికెట్ ఇవ్వడంతో తీరిపోతుందా? U/A, A సర్టిఫైడ్ సినిమాలు ప్రదర్శించే థియేటర్ల వాళ్ళు టికెట్లిచ్చేతప్పుడు, హాల్లోనూ చిన్న పిల్లలను గమనించి తగిన చర్య తీసుకోవలసిన బాధ్యత ఆ థియేటర్ల యాజమాన్యానికి లేదా? ఇంత బాధ్యతారహితంగా, ఇంత బహిరంగంగా చట్టాన్ని ఉల్లంఘించి తాము చూడగూడని ఆ సినిమాను చూసిన పిల్లలతో కలిసి ఇద్దరు బాధ్యత గల పెద్దమనుషులు నిర్లజ్జగా పాల్గొన్న ఆ కార్యక్రమాన్ని టీవీ ఛానెళ్ళ వాళ్ళు ఇంత బాహాటంగా ప్రదర్శించినా పట్టించుకున్నవాళ్ళే లేరు!
ఇంతకూ సెన్సార్ బోర్డ్ ఎందుకున్నట్లు? ఆ సర్టిఫికెట్లు ఎందుకిస్తున్నట్లు?

Saturday, 26 August, 2006

రాబందుల రెక్కల చప్పుడు...


రాబందుల రెక్కల చప్పుడు ఇక వినిపించదా? ఆకాశవిహంగాల్లో రారాజు..రాబందు. ఇది వేటాడే పక్షి. దీన్ని మరే జీవీ వేటాడదు. మరి అలాంటప్పుడు వీటి జాతి దినదినం అభివృద్ధి చెందాలి. కానీ అలా జరగడం లేదు. పైగా ఆందోళన కలిగించేటంత వేగంగా తగ్గిపోతోంది. ఇంకొన్నాళ్ళు పోతే ఈ పక్షి పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది. భూమిపై వాటి మనుగడ ప్రశ్నార్థకమైంది. ఇందుకు కారణం డైక్లోఫెనాక్ అనే సూదిమందు. అదేమిటి? ఆకాశంలో ఎవరికీ అందనంత ఎత్తులో ఎగిరే ఆ పక్షులకు సూదులెవరేస్తారు? ఎలా వేస్తారు? అని ఆశ్చర్యపోకండి. సాధారణంగా రోగాల బారినపడిన గేదెలు, కుక్కలు ఇతర జంతువులకు చికిత్స చేసేందుకు ఎక్కువగా డైక్లోఫెనాక్ అనే సూదిమందును వాడుతారు. చికిత్స చేసినా అవి బతకకపోతే వాటి కళేబరాలను బయట పడేస్తారు. అలా చనిపోయిన జంతువుల కళేబరాలను రాబందులు తింటాయి. (రాబందులే గనక లేకపోయినట్లైతే ఈ శవాల మూలంగా వ్యాధులు ప్రబలకుండా ఉండడానికి చనిపోయిన వాటన్నిటినీీ పూడ్చిపెట్టడమో, లేక కాల్చివేయడమో చేయవలసి వచ్చేది.) ఆ మాంసంలోని డైక్లోఫెనాక్ ప్రభావం వల్ల రాబందుల మూత్రపిండాలు దెబ్బతింటున్నాయి. అందువల్లే అవి త్వరగా చనిపోయి వాటి జాతి అంతరించిపోతోందని గుర్తించారు. ముఖ్యంగా భారత్, నేపాల్, పాకిస్తాన్ దేశాల్లో వేల సంఖ్యలో చనిపోయాయి. ప్రస్తుతం ఈ సూదిమందు మీద మన దేశంలో నిషేధం ఉన్నప్పటికీ అది నామమాత్రంగానే అమలవుతోంది.

రాబందులు అంతరించిపొయే ప్రమాదాన్ని గుర్తించిన కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలోని సెంట్రల్ జూ అథారిటీ వాటి సంరక్షణ చర్యల్లో భాగంగా రాబందుల సంతానాభివృద్ధికి సహజ వాతావరణాన్ని కల్పించేందుకు హైదరాబాదులోని నెహ్రూ జంతుప్రదర్శనశాలతోబాటు రాజస్థాన్ రాష్ట్రంలో కూడా ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇక నగరంలో వన్యప్రాణుల కృత్రిమ గర్భధారనకు కృషి చేస్తోన్న సీసీఎంబీ పావురాలు, జింకలు, దుప్పులు, కుందేళ్ళతో బాటు రాబందుల వీర్యాన్ని కూడా సేకరించింది.(ఆధారం: 23-8-2006 నాటి ఈనాడు హైదరాబాదు జిల్లా పత్రికలో వచ్చిన వార్తాకథనం)

మీకు తెలుసా?
మీరొక వింత గమనించారా? రాబందులకు తలమీదగానీ, మెడమీదగానీ అసలు బొచ్చే ఉండదు. ఎందుకో ఊహించండి:
ఎందుకంటే శవాలే రాబందుల ప్రధాన ఆహారం కాబట్టి. జంతువుల కళేబరాలను తింటున్నపుడు అవి తమ తలలను ఆ శవాల లోపలికి -ముఖ్యంగా పక్కటెముకల మధ్యలోకి- బాగా లోతుగా చొప్పించ వలసివస్తుంది. అలా తరచుగా చెయ్యడం వల్ల వాటికి బొచ్చు గనక ఉన్నట్లైతే ఆ బొచ్చులో శవాల మాంసఖండాలు చిక్కుకుపోయి, వాటిని తొలగించేవాళ్ళు లేక అక్కడే కుళ్ళిపోయి, రాబందుల అనారోగ్యానికి, తద్వారా చావుకు దారితీసేవి. అంటే రాబందుల తల మీద, మెడ మీద బొచ్చు లేకపోవడం డార్విన్ చెప్పిన నాచురల్ సెలక్షన్ అన్నమాట!

Saturday, 19 August, 2006

జానపదం-2

జనుల కోరిక మేరకు మళ్ళీ జానపదం: :)


**************************************
బృందగేయం - కలుపు పాట - హాస్యప్రధానం
తోడిస్వరాలు - దేశాది తాళం
**************************************

ఓరి మగడా! వయ్యారి మగడా
నా ఏలుపడే పాటుసూడు ఓరి మగడా
గొట్లూరు సెరువు కింద ఓరి మగడా
నేను వరిమడి నాటబోతి ఓరి మగడా

వరిమడి నాటబోతి ఓరి మగడా
నేను గెనుం వార మునుం పడితి ఓరి మగడా
గెనుం వార మునుం పడితె ఓరి మగడా
నన్నెండ్రకాయ తేలు గుట్టె ఓరి మగడా ||ఓరి||

ఎండ్రకాయ తేలు గుట్టె ఓరి మగడా
నాకు ఒళ్ళు సర్తుబోసినాది ఓరి మగడా
నాకు ఉలవపిండి పట్టెయ్ ర ఓరి మగడా
నువ్వు రాత్రంత మేలుకోర ఓరి మగడా ||ఓరి||

నాకు వరికూడు వండిపెట్టర ఓరి మగడా
నువ్వు రాగిసంగటి పాంకోర ఓరి మగడా
నాకు గోదుం రొట్టెలు కాల్సి పెట్ర ఓరి మగడా
నువ్వు జొన్నరొట్టెల్ పాంకోర ఓరి మగడా ||ఓరి||

నేను ఉంటానొ పోతానొ ఓరి మగడా
నన్ను ఉయ్యాలలూపించు ఓరి మగడా
నేను సస్చానొ బతుకుతానొ ఓరి మగడా
నాకు సంది బిందె జేయించు ఓరి మగడా ||ఓరి||

నన్నిష్టం జూసే మగనివైతె ఓరి మగడా
నన్నిసనకర్ర తిసర్రాద ఓరి మగడా
నువ్వు కోరుకున్న మగనివైతె ఓరి మగడా
నాకు కోన్నిగోసి పెట్టరాద ఓరి మగడా ||ఓరి||

నువ్వు సేసుకున్న మగనివైతె ఓరి మగడా
నాకు శాపలొండి పెట్టరాద ఓరి మగడా
నువ్వు అక్కరగల్ల మగనివైతె ఓరి మగడా
నన్ను ఆసపట్ల కంపరాద ఓరి మగడా ||ఓరి||


ఈ పాటలోని కొన్ని పదాలకు అర్థాలు-వివరణలు:
ఏలు = వేలు
పాటు = కష్టం
గొట్లూరు = అనంతపురం జిల్లాలోని ఒక గ్రామం
గెనుం/గెనెం/గనిమ = గట్టు; చేలలో వేసే చిన్నకట్ట
మునుం = వరుస; పైరు కోతకు, కలుపుతీతకు ఏర్పరచుకునే వరస
సర్తు = చెమట
పాముకోవడం = (ఆత్రంగా) తినడం
సందిబిందె = ఒక ఆభరణం (అదేమిటో నాకూ తెలీదు )
'అక్కర' అనే మాటకుండే నానార్థాల్లో "శ్రద్ధ", "చెలిమి" ఇక్కడ ధ్వనిస్తున్నాయి.

Tuesday, 15 August, 2006

స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలుబాలగంగాధర తిలక్ గురించి క్లుప్తంగా:


బాలగంగాధర తిలక్ ని భారతజాతీయోద్యమ పిత గా పేర్కొంటారు. ఆయనకు ముందు జాతీయోద్యమం లేదని కాదు. కానీ ఆయన జాతీయోద్యమాన్ని కొత్తదారులు పట్టించాడు. దేశవ్యాప్తంగా సామాన్యప్రజల్ని ఆ ఉద్యమంలో పాల్గొనేటట్లు చేయడంలో ఆయన పాత్ర అద్వితీయమైనది. అందుకే ఆయన్ను భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రేగిన అశాంతికి మూలకారకుడు (Father of India's unrest)గా భావిస్తారు. అప్పటివరకు కాంగ్రెస్ ప్రతి సంవత్సరం డిసెంబర్ చివరివారంలో మూడు రోజులపాటు సమావేశమై బ్రిటిష్ ప్రభుత్వాన్ని, ప్రభుత్వ విధానాలను "pray, pitition, protest" చెయ్యడానికే పరిమితమైంది. తిలక్ దాని గురించి చాలా ఘాటైన విమర్శలు చేశాడు: "మీరు సంవత్సరానికొకసారి మూడు రోజులపాటు సమావేశమై కప్పల మాదిరి బెకబెకలాడడం వల్ల ప్రయోజనం లేదు." అని, "అసలు కాంగ్రెస్ సంస్థ అడుక్కునేవాళ్ళ సంఘం (beggars' institution)" అన్నాడు. కాంగ్రెస్ సమావేశాలను 3-day tamaashaa గా అభివర్ణించాడు. "స్వరాజ్యం నా జన్మహక్కు. దాన్ని నేను పొంది తీరుతాను." అని గర్జించాడు.
ఆయన పాశ్చాత్యవిద్యావిధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిచాడు - అది భారతీయ సాంస్కృతికవారసత్వాన్ని అగౌరవపరచి భారతీయ విద్యార్థులను చిన్నబుచ్చేవిధంగా ఉందని. ప్రజలకు మంచి విద్యను అందించడం ద్వారానే వాళ్ళను మంచి పౌరులుగా మార్చవచ్చనే ఉద్దేశం ఆయనది. ప్రతి భారతీయుడికి/రాలికి భారతీయ సంస్కృతి గురించి, భారతదేశపు ఔన్నతాన్ని గురించి బోధించాలని ఆయన ఆశయం. అందుకే అగార్కర్, విష్ణుశాస్త్రి చిప్లుంకర్ లతో కలిసి "దక్కన్ ఎడ్యుకేషనల్ సొసైటీ" ని స్థాపించాడు.

ఆ తర్వాత తాను నడిపిన పత్రికలు "మరాఠా", "కేసరి" లలో మొద్దు నిద్రపోతున్న భారతీయులను మేల్కొల్పడానికి పదునైన భాషలో బ్రిటిష్ పాలనలోని వాస్తవ పరిస్థితులను గురించి వివరంగా రాశాడు. బాల్యవివాహాలను నిరసించి వితంతు వివాహాలను స్వాగతించాడు. జాతీయస్ఫూర్తిని రగల్చడానికి వీలున్న ఏ అవకాశాన్నీ ఆయన వదిలిపెట్టలేదు. మొట్టమొదటిసారిగా శివాజీ ఉత్సవాలను, గణపతి ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించడం ద్వారా ప్రజలను సమీకరించడం, వారిని జాతీయోద్యమం వైపు నడిపించడం ఆయనే మొదలుపెట్టాడు. తన పత్రికల్లో ప్రజలను రెచ్చగొట్టే రాతలు రాసినందుకు 1897లో ఆయనకు ఒకటిన్నరేళ్ళు కారాగారశిక్ష పడింది. విడుదలయ్యాక ఆయన స్వదేశీ ఉద్యమాన్ని ప్రారంభించాడు. ఈ లోపల కాంగ్రెస్ పార్టీ మితవాదులు - అతివాదుల విభేదాల వల్ల రెండుగా చీలిపోయింది.
1906లో దేశద్రోహం నేరం క్రింద ఆయనకు ఆరేళ్ళు ప్రవాసశిక్ష విధించారు. కారాగారంలో ఉన్నప్పుడే ఆయన "గీతారహస్యం" అనే పుస్తకం రాశాడు. ఆయన చరిత్రకారుడు కూడా. ఆర్యులు ఆర్కిటిక్ ప్రాంతం నుంచి వచ్చారని ఆయన అభిప్రాయం. 1916 ఏప్రిల్ లో హొమ్రూల్ లీగ్ ను స్థాపించి దాని లక్ష్యాలను వివరిస్తూ మధ్యభారతదేశంలో గ్రామగ్రామానా తిరిగాడు. అనీబిసెంటు అదే సంవత్సరం సెప్టెంబర్ లో మొదలుపెట్టి హోమ్రూల్ ఉద్యమాన్ని దేశవ్యాప్తం చేసింది. ఆ ఉద్యమం ఉధృతంగా కొనసాగుతున్న సమయంలో ఒక కోర్టుకేసులో ఆయన లండనుకు వెళ్ళవలసి వచ్చింది. అప్పుడే, అంటే 1917 ఆగస్టులో అప్పటి సెక్రటరీ ఆఫ్ స్టేట్ మాంటేగు "బ్రిటిష్ సామ్రాజ్యంలో భాగమైన భారతదేశంలో బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి వీలుగా అన్ని పాలనాంశాల్లో భారతీయులకు అధిక ప్రాధాన్యాన్నివ్వడమే ప్రభుత్వ విధానమని" బ్రిటిష్ ప్రభుత్వం తరపున ప్రకటించాడు. బాధ్యతాయుత ప్రభుత్వమంటే ఎవరికి బాధ్యత వహించే ప్రభుత్వమో, అధిక ప్రాధాన్యమంటే ఎంత ప్రాధాన్యమో, అసలు అది ఎప్పుడిస్తారో ఏదీ స్పష్టంగా లేదు. కానీ బ్రిటిష్ ప్రభుత్వ నిజాయితీని నమ్మిన అనీబిసెంటు ఆ ప్రకటనతో ఉద్యమాన్ని అపేసి ప్రభుత్వానికి తన మద్దతు ప్రకటించింది. అలా ఇద్దరు నాయకులదీ చెరొకదారీ కావడంతో హోమ్రూల్ ఉద్యమం చల్లబడిపోయింది. కానీ ప్రజల్లో తిలక్ రగిలించిన స్ఫూర్తి మాత్రం కొనసాగింది. అందుకే 1920లో తిలక్ చనిపోయినప్పుడు జాతీయోద్యమం చుక్కాని లేని నావ అవుతుందని చాలా మంది భయపడ్డారు.
"గాంధీ అని ఇంకొకాయన ఉన్నాడు గానీ....అబ్బే! తిలక్ ముందర ఏపాటి?" అనుకున్నారు. కానీ "నాయకులు చరిత్రను సృష్టించరు. చరిత్రే నాయకులను సృష్టిస్తుంది." అనే మాటను నిజం చేస్తూ అతి సామాన్యుడిగా జీవితం ప్రారంభించిన గాంధీ తిలక్ మరణంతో ఏర్పడ్డ శూన్యాన్ని అసామాన్యంగా భర్తీ చెయ్యడమే గాక మహాత్ముడి స్థాయికి ఎదిగాడు.

జై హింద్!

Sunday, 13 August, 2006

మనం మాట్లాడే ఇంగ్లీషు

చదువరిగారి బ్లాగులో ఎన్నోవాడు?, భావ దారిద్ర్యం, భావ దాస్యం అనే పోస్టులు చదివాక:

తెలుగు బ్లాగరులందరం "ఎన్నవ" అనే మాటను ఇంగ్లీషులో how manieth అనడం మొదలుపెడదాం. ఎవరికైనా అభ్యంతరమా? (దీన్ని యర్రపురెడ్డి రామనాథ రెడ్డి సూచించారు.)

ఆంగ్లభాషలోని కొన్ని పదబంధాలను గుడ్డిగా అరువు తెచ్చుకుని యథాతథంగా వాడెయ్యడం వల్ల మనం భారతీయుల్లా కాకుండా ప్రపంచమంటే ఒక్క ఐరోపా మాత్రమే అని నమ్మేవాళ్ళలా మాట్లాడుతున్నామా అనిపిస్తుంది.. ఉదాహరణకు "Rome was not built in a day." అనే మాటను పదేపదే వినడం, వాడ్డం వల్ల "అబ్బో! రోం నగరం ఎంత పాతదో! దాన్ని ఎన్నాళ్ళు కట్టారో?" అనుకుంటాం. రోం నగరం గురించి ప్రచారంలో ఉన్న పుక్కిటి పురాణాలను నమ్మినా ఆ నగరాన్ని 2,300 సంవత్సరాల క్రితం నిర్మించినట్లు తెలుస్తుంది. అదే రోం నగరం కంటే నాలుగింతలు పెద్దదీ, చారిత్రక ఆధారాల ప్రకారమే పాతరాతియుగం నుంచి జనావాసాలున్నదీ, పురాణాల ప్రకారం 5,000 సంవత్సరాల క్రితమే నిర్మించబడిందీ, గత వెయ్యేళ్ళ కాలంలో కనీసం పది సార్లు దశలవారీగా నగర నిర్మాణం, విస్తరణ జరిగిందీ అయిన మహానగరం గురించి "Delhi was not built in a day." అని సగర్వంగా చెప్పుకోవచ్చన్న విషయమే మనకు తెలీదు!

ఆంగ్ల భాష ప్రభావం వల్ల ఇప్పటి మన రచయితలకు, పాత్రికేయులకు; వాళ్ళ పుణ్యమా అని సామాన్య జనానికి చాణక్యుడి పేరు కంటే మాకియవెల్లి పేరే బాగా తెలుసు. కాళిదాసును షేక్స్పియర్ ఆఫ్ ఇండియా అంటారు. ఇలాంటి "షేక్స్పియర్ ఆఫ్ "అనే "బిరుదు" ప్రతి దేశంలో ఒక కవికి ఉంటుంది. అంటే షేక్స్పియర్ ప్రపంచస్థాయి కవి అని, వీళ్ళంతా వారి వారి దేశాల స్థాయిలోనే కవులు అని చెప్పకనే చెప్తున్నారన్నమాట. కనీసం "కాళిదాసు ఏ కాలం వాడు? షేక్స్పియర్ ఏ కాలం వాడు? షేక్స్పియర్ కంటే కొన్ని శతాబ్దాల ముందే అంత గొప్ప సాహిత్యాన్ని సృష్టించిన మన దేశపు మహాకవికి షేక్స్పియర్ తో పోల్చిచెబితే తప్ప మనదేశంలో గుర్తింపు ఉండదా?" అనే ఆలోచనలు లేకుండా మనం గుడ్డిగా సముద్రగుప్తుడిని "Nepolian of India" అని, ఇలా ప్రతి రంగంలోనూ భారతీయ ప్రముఖులను యూరోపియన్ ప్రముఖులకు డమ్మీలుగా మనమే చిత్రించడానికి అలవాటు పడిపోయాం. చాణక్యుడి ఎత్తుల్ని సైతం Machiavellian Tactics అనే అనువదిస్తారు. ఏం? Chanakya's Tactics అని ఎందుకనకూడదు?

నా అభిప్రాయం ఎప్పుడూ ఒక్కటే: మనం వాడే భాష మన భావాలను స్పష్టంగా ప్రతిబింబించాలి. అలా చెయ్యలేనప్పుడు అది ఎంత గొప్ప భాషైనా మనకు పనికిరాదు. అందుకే మనం వాడే భాషను మన అవసరాలకు తగినట్లు మార్చాలి. ఆంగ్లభాష ప్రపంచంలోని వివిధ దేశాల్లో అనేక మార్పులకు లోనయింది. మనం కూడా అవసరమైన మార్పులు చేయాలి.

అవసరమైన మార్పులు కొన్ని:

బంధుత్వాల్లో పెద్ద-చిన్న తేడాలను తెలిపే పదాలు:
అన్న-తమ్ముడు (elder brother-younger brother సరిపోవు. పెద్దన్న-చిన్నన్న-పెద్దతమ్ముడు-చిన్నతమ్ముడు తేడాలను తెలిపే విధంగా ఉండాలి.)
అక్క-చెల్లెలు
cousin, uncle-aunt ల దశావతార విన్యాసాలు ఇక చాలు. విడివిడిపదాలు కావాలి.
బియ్యానికి, అన్నానికి మధ్య గల తేడా స్పష్టంగా తెలియాలి.

ఇలాంటి మార్పులు జరిగేవరకూ ఆ భాష అసంపూర్ణమే.

Thursday, 10 August, 2006

హిందీ భాష

మనదేశంలో ప్రాచీనకాలంలో ప్రజలు ఒకరితొ ఒకరు మాట్లాడుకోవడం మొదలుపెట్టినప్పుడు సహజంగా ఏర్పడిన భాష ప్రాకృతం. అంటే "ప్రకృతి" సహజంగా రూపొందిందని అర్థం. ఆ భాషకు పదాల ఉచ్చారణకు, వాక్యనిర్మాణానికి సంబంధించి కొన్ని సూత్రాలు, నియమాలు ఏర్పరిచి "సంస్కరిస్తే" అది సంస్కృతమైంది. సంస్కరించబడింది సంస్కృతం. (క్రీస్తు పుట్టడానికి 500 ఏళ్ళక్రితం పాణిని రాసిన సంస్కృత వ్యాకరణగ్రంథం అష్టాధ్యాయి ఇప్పటికీ ప్రపంచంలోనే అత్యంత ప్రామాణిక వ్యాకరణగ్రంథం). ప్రజల భాష ఐన ప్రాకృతానికి మరో రూపమే పాళీ భాష. బుద్ధుడి కాలం నుంచి మధ్యయుగంలో విదేశీ దండయాత్రలు మొదలయ్యేవరకు ఉత్తరభారతదేశమంతటా అదే ప్రజల భాష. తురుష్క సుల్తానుల కాలంలోనూ, మొఘలు చక్రవర్తుల కాలంలోనూ తురుష్క, పర్షియన్, తదితర పశ్చిమాసియా, ఐరోపా దేశాలవారి సాంగత్యంతో ప్రజల భాష పూర్తిగా మారిపోయింది. అనేక పరభాషాపదాలు వచ్చి చేరాయి. కొన్ని సంస్కృత పదాలు, కొన్ని ప్రాకృతపదాలు, కొన్ని విదేశీ పదాల కలయికతో ఒక కొత్త భాష పుట్టింది. అదే హిందీ! మొదట్లో హిందీ భాషకు ఒక లిపి అంటూ లేదు. అందుకే మన రాజ్యాంగంలో 343వ ఆర్టికల్లో "Official language of the Union.—(1) The official language of the Union shall be Hindi in Devanagari script." అని ప్రత్యేకంగా పేర్కొన్నారు.

348. Language to be used in the Supreme Court and in the High Courts and for Acts, Bills, etc.—(1) Notwithstanding anything in the foregoing provisions of this Part, until Parliament by law otherwise provides—

(a) all proceedings in the Supreme Court and in every High Court,

(b) the authoritative texts—

(i) of all Bills to be introduced or amendments thereto to be moved in either House of Parliament or in the House or either House of the Legislature of a State,

(ii) of all Acts passed by Parliament or the Legislature of a State and of all Ordinances promulgated by the President or the Governor of a State, and

(iii) of all orders, rules, regulations and bye-laws issued under this Constitution or under any law made by Parliament or the Legislature of a State,
.
.
.
.
.
.
.
shall be in the English language.

ఇలా హిందీని నామమాత్రపు అధికారభాషగా ప్రకటించాక ఆ భాషతో పెద్దగా పరిచయం లేని దక్షిణాది రాష్ట్రాలవాళ్ళు - మరీ ముఖ్యంగా తమిళులు - అభ్యంతరం తెలిపారు. దాని ఫలితమే త్రిభాషాసూత్రం: ఎవరి మాతృభాషను వాళ్ళు నేర్చుకుంటారు. మనదేశం బహుభాషాసమాజం కాబట్టి ఆంగ్లభాష అనుసంధానభాషగా ఉంటుంది. ప్రతి రాష్ట్రంలోనూ బళ్ళలో పిల్లలకు వారి మాతృభాష, ఆంగ్లభాషకు తోడు ఇంకొక భాష నేర్పాలి. దక్షిణాది రాష్ట్రాల్లో ఆ ఇంకొక భాష హిందీ కాగా హిందీ అధికారభాషగా ఉండే రాష్ట్రాల్లో ఏదైనా ఒక దక్షిణాది భాష ఉంటుంది. ఐతే ఈ త్రిభాషాసూత్రాన్ని అమలు చేస్తున్న ఏకైక ఉత్తరాది రాష్ట్రం హర్యానా కాగా వాళ్ళు నేర్చుకుంటున్న దక్షిణాది భాష తెలుగు. ఇక్కడ మనం మొక్కుబడిగా హిందీ నేర్చుకున్నట్లే అక్కడ వాళ్ళు తెలుగు నేర్చుకుంటారు.

దీన్ని బట్టి తెలిసేదేమిటి? పేరుకు హిందీ అధికారభాషే గానీ ఆచరణలో హిందీతో సహా అన్ని భారతీయ భాషల పరిస్థితీ ఒకటేనని.

Tuesday, 1 August, 2006

జట్టిజాం పాటలు

కె. మునయ్య రాసిన "రాయలసీమ రాగాలు" (తెలుగు అకాడెమీ ప్రచురణ) నుంచి:


వెన్నెలరేలలో స్త్రీలు మండలాకారంలో నిలబడి ఉభయపార్శ్వాలలో ఉద్దికత్తెలతో ఒద్దికలు చెడకుండా ఒకసారి కుడితట్టునకు, ఇంకొకసారి ఎడమతట్టునకు తిరిగి ఆయా వైపులనుండే వారి అరచేతులను తమ అరచేతులతో తట్టుతూ గుండ్రంగా అడుగులు వేసి తిరుగుతూ పాడుతూ ఆడే ఆటనే "జట్టిజాము" అంటారు. జానపద స్త్రీలు వెన్నెలరాత్రుల్లో ఆడే ఆట కాబట్టి జట్టిజాముగా మారిందని నా ఊహ (జట్టి అనే మాట యక్ష శబ్దభవమైన జక్కిణి రూపాంతరం కావచ్చు). ఈ క్రీడకు ఎలాంటి వాయిద్యాలుండవు. చేతి చరుపులు, కరకంకణ నిక్వాణాలే వారి పాటలకు వాయిద్యాలు. పెన్నుద్దికత్తె పాట పాడగా మిగతా ఉద్దులు ఆ పాట అందుకుని పాడతారు. యుగళగీతాలు ఉద్దులు ఉద్దులుగా పాడుకుంటారు. జట్టిజాంలో భక్తిరసప్రధానమైన గేయాలే కాక హాస్య, శృంగార, పురాణ వీరరస గేయాలు కూడా చోటు చేసుకున్నాయి.

"జట్టిజాం" రూప నిష్పత్తిని గురించి ఆచార్య తూమాటి దోణప్పగారు కూడా ఒక వివరణ ఇచ్చియున్నారు. "సంస్కృతంలో చేతికోల అనే అర్థమిచ్చే యష్టి శబ్దం ప్రాకృతంలో జట్టిగా మారింది. అట్లే ప్రహారమనే అర్థం గల యమ శబ్దం ప్రాకృతంలో జామ అయింది. రెంటిని జోడింపగా జట్టిజామ, దాన్నుంచి తెలుగులో జట్టిజాం - మొదట కోలాటంలో వలె చేతికోలలతో ఆడే ఆట కాలక్రమంలో ఉత్తచేతులతో ఆడడం మిగిలిందేమో? వెన్నెలవెలుగులో మండలాకారంలో నిలబడి ఇరువైపులా ఉండే ఉద్దికత్తెలతో ఒద్దికలు చెడకుండా ఒకసారి కుడివైపుకు, ఇంకొకసారి ఎడమవైపుకు పార్శ్వం నాలుగు భంగిమల్లో ఓరగా తిరిగి ఆయా వైపులనుండే వారి అరచేతులను తన అరచేతులతో తట్టుతూ పాటలు పాడుట ఇది."

కడప జిల్లా ప్రాంతాల్లో వలయాకారంగా అడుగులు వేసి తిరుగుతూ తరుణులు జట్టిజాము వేయడం కూడా వాడుకలో ఉంది.

ఒక జట్టిజాం పాట:


కొత్తగా పెళ్ళైన పడుచు జంట. కొత్తపెళ్ళాం పరువంలోని ఒంపుసొంపులకు, ఒయ్యారాలకు, నయగారాలకు మురిసిపోయినాడు ఆ మగడు. వళ్ళు మరచిపోయినాడు. తన సంతోషాన్ని మనసులో దాచుకోలేకపోయినాడు. అందుకే తన ముద్దులభార్య అందాన్ని హద్దు తెలియనంతగా అందంగా, మధురంగా తన మాటల్లో వర్ణించినాడు. తన అందానికి వివశుడై, తన వశమై పోయినాడని తెలుసుకున్న ఆ వగలాడి వాడిని ఎలాంటి కోరికలు కోరిందో, వాడిని చెవులు పట్టి ఎలా ఆడిస్తుందో సున్నితమైన ప్రణయ భావాల హాస్యపు విరిజల్లులు కురిపించే ఈ పాట చూడండి:
*****************************
బృందగేయం - జట్టిజాం పాట - ప్రణయప్రధానం
దాంపత్యప్రణయం
ఖరహరప్రియ స్వరాలు - ఆదితాళం

*****************************


అతడు: తుమ్మేదలున్నాయేమిరా - దాని కురులు
కుంచెరగులపైన - సామంచాలాడేవేమిరా

ఆమె: ఏటికిపోరా - శాపల్ తేరా
బాయికి పోరా - నీల్లూ తేరా
బండకేసి తోమర మగడా
సట్టీ*కేసి వండర మగడా
శాపల్ నాకూ - శారూ నీకూ రా
ఒల్లోరే మగడా! బల్లారం మగడా
బంగారం మగడా... అహ
శాపల్ నాకూ - శారూ నీకూ రా
అహ తుమ్మేద...

ఆమె: కూలికిపోరా - కుంచెడు తేరా
నాలికి పోరా - నల్దుం** తేరా
వత్తా పోతా - కట్టెల్ తేరా
కట్టం నీకు కమ్మల్ నాకూ రా
ఒల్లోరే మగడా! బల్లారం మగడా
బంగారం మగడా...
కట్టం నీకు కమ్మల్ నాకూ రా
తుమ్మేద...

ఆమె: రోలూ తేరా - రోకలి తేరా
రోటి కాడికి నన్నెత్తుకపోరా
కులికి కులికిదంచర మగడా
శాటలకేసి సెరగర మగడా
శాటలకేసి సెరగర మగడా
బియ్యం నాకు - తవుడు నీకూ రా
ఒల్లోరే మగడా! బల్లారం మగడా
బంగారం మగడా...
బియ్యం నాకు - తవుడు నీకూ రా
తుమ్మేద...

ఆమె: రెడ్డీయేమో దున్నను పాయ
రెడ్డీసాని ఇత్తను పాయ
నాల్గుకాల్ల కుందేల్ పిల్లా
నగతా నగతా సంగటి తెచ్చె
సంగటి నాకు - సూపుల్ నీకూ రా
ఒల్లోరే మగడా! బల్లారం మగడా
బంగారం మగడా...
సంగటి నాకు - సూపుల్ నీకూ రా
తుమ్మేద...

*సట్టి(చట్టి) = కుండ
**నల్దుం = నాలుగు తూములు (8 శేర్లు)

Tuesday, 18 July, 2006

WE PROTEST

Thousands of blogs are blocked in India.
Last week, CERT-IN* (Indian Computer Emergency Response Team ) sent a list of 22 websties and blogs to be blocked to all ISPs following apprehensions by the country's intelligence agencies that these were likely being used by terrorists to communicate with one another. The move may be related to the bomb blasts in trains in Mumbai earlier this month which killed about 190 people and injured around 700. There are about 150 ISPs in India. Although the communication from the DOT to ISPs lists specific pages and Web sites, several ISPs have blocked some key blogs altogether because they were not equipped to filter specific pages.

Access to all blogs and websites hosted on the following servers is currently blocked:
xxx.blogspot.com/
xxx.typepad.com/
xxx.blogs.com/
www.geocities.com/xxx
Spectranet, Mahanagar Telephone Nigam Limited (MTNL), Reliance Powersurfer, Airtel Broadband and Sify have blocked Blogger.

Whoever has done that for any reason, its effect is that thousands of blogs have been blocked. Clearly this is violation of Right to Freedom of Expression guaranteed by the Constitution of India as a Fundamental Right under Article 19(1)(a) which says

19. Protection of certain rights regarding freedom of speech, etc.—(1) All citizens shall have the right—
(a) to freedom of speech and expression;

(b) to assemble peaceably and without arms;
(c) to form associations or unions;
(d) to move freely throughout the territory of India;
(e) to reside and settle in any part of the territory of India; and
* * * * *
(g) to practise any profession, or to carry on any occupation, trade or business.

This right is subject only to reasonable restrictions imposed by the Govt. in the interests of the sovereignty and integrity of India, the security of the State, friendly relations with foreign States, public order, decency or morality, or in relation to contempt of court, defamation or incitement to an offence.

The ISPs are clearly violating this provision of the constitution by arbitrarily blocking all the blogs.

Tricks to access blocked sites:


1. http://www.proxify.com
2. http://censorship.wikia.com/wiki/Bypassing_The_Ban


--
*CERT-IN: Under the Information Technology Act, 2000, the Indian government set up the Indian Computer Emergency Response Team (CERT-IN) in 2003 with the authority to block Web sites. Any government department seeking a block on any web site has to approach CERT-IN, which then instructs the DoT to block the site after confirming the authenticity of the complaint. On receiving instructions from CERT-IN, DOT - which has regulatory control over the ISPs - has to ensure that the Web sites are blocked, and inform CERT-IN accordingly.

Monday, 17 July, 2006

ఆమె ఎవరు?

ఆమె ఒక శాస్త్రవేత్త.
ఆమె వెండితెర వేలుపు.
ఆమె ఒక సాహసి.
ఆమె ఒక సౌందర్యరాశి.


శాస్త్రవేత్తగా ఆమె ఘనత: frequency hopping: మొదట ఆమె మరొక శాస్త్రవేత్తతో కలిసి రహస్య కమ్యూనికేషన్ వ్యవస్థ (Secret Communication System)ను కనిపెట్టారు. తర్వాత అదే వ్యవస్థను మరొక అడుగు ముందుకు తీసుకెళ్ళి వాళ్ళు కనిపెట్టిన ఫ్రీక్వెన్సీ-హాపింగ్ ప్రస్తుతం మనం విరివిగా వాడుతున్న ఉపకరణాలు -వైర్లతో పనిలేని ఫోన్లు, విఫి ఇంటర్నెట్ కనెక్షన్ లాంటివాటికి ఆధారభూతమైంది. (frequency hopping రేడియో సంకేతాలు జామ్ అయ్యే అవకాశాన్ని కనిష్ట స్థాయికి తగ్గిస్తుంది.)
వెండితెర మీద: ఆమె 33 ఐరోపా మరియు హాలీవుడ్ సినిమాలలో నటించి ప్రేక్షకుల మతులు పోగొట్టింది.
ఆమె సాహసం: హాలీవుడ్ చరిత్రలో పూర్తి నగ్నంగా వెండితెర మీద కనిపించిన మొట్టమొదటి నటి ఆమే! చిత్రం: ఎక్స్టసీ (1933)
ఆమె అందం: The Heavenly Body (1944)చిత్రంలో
ఆమె పేరు: హెడీ లమర్

మన అంకెలు-అ ఆ లు

మనం రోజూ రాసే అంకెలు ఎలా ఏర్పడ్డాయో చూడండి:

ఒక గీత గీస్తే ఒకటి.
రెండు అడ్డగీతలు రాసే తొందరలో కలిసిపోగా ఏర్పడిందే 2.
మూడు అడ్డగీతలే 3.
రెండు నిలువు, రెండు అడ్డ గీతలు కలిసి 4.
ఐదు మన అరచేతి ఔట్ లైన్. బొటనవేలు విడిగానూ, మిగిలిన నాలుగు వేళ్ళనూ కప్పుతూ ఒక చంద్రవంక. మొత్తం 5 వేళ్ళు.
ఇక తెలుగు అంకెలు:

ఒకటిని సూచించడానికి మన వాళ్ళు నిలువు గీత ఎందుకు గీయలేదో తెలియదు గానీ అడ్డగీత సూటిగా ఎందుకు గీయలేదో మాత్రం తెలుసు. ఏమిటంటే పూర్వకాలంలో కాగితం లేదు కదా? తాటాకులే కదా గతి? ఆ తాటాకుల్లో పోగులు అడ్డగీతల్లాగ పైకి బాగా కనబడేవి. ఒకటికి గుర్తుగా గీసే గీత ఆ గీతల్లో కలిసిపోకుండా స్పష్టంగా కనబడ్డానికి రవంత వంపు తిప్పే వాళ్ళు. 5ను చూడండి. 4 పక్కన ఒక నిలువు గీత. అంతే మన అంకెల మర్మం.
అ ఆ లు:

మనం అ అని పలికినప్పుడు తెరుచుకునే దవడకు గుర్తుగా అర్ధచంద్రాకారాన్ని మొదట అ అనే శబ్దానికి గుర్తుగా వాడడం మొదలు పెట్టారు. అదే శబ్దాన్ని కాస్త పొడిగిస్తే అదే "ఆ". అందుకే ఆ అర్ధచంద్రాకారాన్ని పొడిగిస్తున్నట్లు తోకలాంటిది తగిలించారు.

(తిరుమల రామచంద్ర రాసిన "మన లిపి పుట్టుపూర్వోత్తరాలు" నుంచి నాకు గుర్తున్నంత వరకు)

6 నుంచి 9వరకు (నా ఊహ):
1 ని దిగ్గొడితే 6
2 కు తోక తెగ్గోస్తే 7
3 ను మూసేస్తే 8
4 ను సవరిస్తే 9
ఈ పోలికలు కాకతాళీయమేనా?

Sunday, 16 July, 2006

భవిష్యదర్శనం

"ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు?" అని అందరికీ తెలిసినా తమ భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే ఆరాటం చాలా మందికి ఉంటుంది. అలాంటి వారు భవిష్యదర్శనం కోసం జ్యోతిశ్శాస్త్రానో(రాశిఫలాలు), సంఖ్యాశాస్త్రాన్నో, హస్తసాముద్రికాన్నో, ప్రశ్న చెప్పేవారినో, సోది చెప్పేవారినో, చిలక జోస్యాన్నో నమ్ముతూ ఉంటారు.

చివరి మూడింటినీ వదిలేస్తే మొదటి మూడింటి మీద మార్కెట్లో బోలెడన్ని పుస్తకాలున్నాయి. అంటే వీటిని నమ్మేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారన్నమాట. వీటిలో ఖగోళశాస్త్రం మీద ఆధారపడింది జ్యోతిశ్శాస్త్రం. మనిషి మీద గ్రహాలు, నక్షత్రాల ప్రభావాన్ని అంచనా వేసి చెబుతుంది. మనిషి మీద గ్రహాల ప్రభావం ఉందన్నది సుస్పష్టం. అయితే ఇది మనిషికీ, మనిషికీ మారుతూ ఉంటుంది. ప్రతి అమావాస్య, పున్నమి రోజుల్లో 'వాయి ' (వాయువు) సోకేవాళ్ళు అంటే 'ఫిట్స్ ' వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు - గతంలోనూ, ఇప్పుడూ కూడా! మిగతా రోజుల్లో వాళ్ళు ఆరోగ్యంగానే ఉంటారు. అంటే వాళ్ళ ఆరోగ్యం మీద సూర్యచంద్రుల -కనీసం చంద్రకళల- ప్రభావం ఉన్నట్లే కదా?

ఇంకో ఆసక్తికరమైన విశేషమేమిటంటే రష్యా రాజధాని మాస్కోలోని ఒక ప్రాంతంలో భూమి ప్రతి పౌర్ణమి, అమావాస్య రోజుల్లో ఉబ్బి, కొన్ని గంటల తర్వాత మామూలైపోతుందట. ఇది తెలుగుతో బాటు అనేక భాషల్లోకి అనువదించబడిన "ఖగోళశాస్త్రం-విజ్ఞానం-వినోదం" అనే రష్యన్ పుస్తకంలో ఉంది. రాసింది జ్యోతిష్కులు కాదు. రష్యన్ శాస్త్రవేత్తలు. గ్రహస్థితుల ప్రభావం గట్టినేల మీదే అంత బలంగా కనబడుతున్నప్పుడు సుతి మెత్తని మనిషి మెదడు మీద ఎందుకుండకూడదు?

ఈ గ్రహచారం అప్పుడే పుట్టిన శిశువు మెదడు మీద కలిగించే ప్రభావం ఆ శిశువు భవిష్యజ్జీవితాన్ని శాసిస్తుందని ఒక నమ్మకం. కాదనడమెందుకు? కానీ...
ఆ ప్రభావం ఎలా ఉంటుంది?
ఉన్నా అది పన్నెండు రకాలుగానే ఉంటుందా?
అట్లైతే ప్రపంచంలో పన్నెండు రకాల మనుషులే ఉండాలి కదా?
సాధారణంగా ఎవరి జాతకమైనా సౌరమానంలో ఒకరకంగాను, చాంద్రమానంలో ఇంకొక రకంగాను ఎందుకుంటుంది?

ఇవి సమాధానం లేని ప్రశ్నలు.

ఇంకో చమత్కారమేమిటంటే జాతకాల మీద ఉన్న ఏ పుస్తకమైనా తీసుకోండి. దాంట్లో మీకు తోచిన రాశి (మీ స్వంత రాశే కానక్ఖర్లేదు, ఏ రాశైనా ఫర్వాలేదు)ని ఎంచుకుని ఏముందో పూర్తిగా చదవండి. దాంట్లో కనీసం ఒకటి రెండు అంశాలైనా అచ్చం మీ గురిచే చెబుతున్నట్లనిపిస్తాయి. మీ రాశిలో మీకు వర్తించని అంశాలు కూడా చాలానే ఉంటాయి. ఈ రాశిఫలాలన్నీ తొలితరం జ్యోతిష్కులు తమ కంటికి కనిపించే వాస్తవాలకు, కనబడని గ్రహగతులకు తర్కరహితంగా ముడిపెట్టి రాసినవి. పై పెదవి చీలి ఉండే జన్యుపరమైన లోపాన్ని గ్రహణ దర్శనంతో ముడిపెట్టి గ్రహణం మొర్రి అనడం లాంటివే ఇవి కూడా. అందుకే ఆధారపడదగ్గవి కాదు. (జాతకాల మీదున్న మంచి పుస్తకాల్లో ఒక్కో రాశి కిందా ఒకటి రెండైనా "వ్యక్తిత్వ వికాస" సలహాలుంటాయి. అదొక ప్రయోజనం.)

పూర్వకాలం నుంచి మనవాళ్ళకో నమ్మకముంది. ఉత్తరం వైపు తలపెట్టి ఎప్పుడూ పడుకోవద్దని. దాని వెనకుండే వినాయకుడి కథ ఎలా ఉన్నా ఆధునిక విజ్ఞాన శాస్త్రం ఆ నమ్మకాన్నే సమర్థిస్తుంది: భూమికి ఉత్తరధృవం, దక్షిణధృవం ఉన్నాయి కదా? ఆ రెండు దిక్కుల్లోనే భూగోళం యొక్క విద్యుదయస్కాంత ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దాని మూలంగా మనం ఉత్తరం వైపు గానీ, దక్షిణం వైపు గానీ తలపెట్టుకుని ఎక్కువసేపు పడుకుంటే భూ-అయస్కాంతక్షేత్ర ప్రభావం వల్ల మనకు నిద్ర లేచిన తర్వాత నీరసంగా, తలదిమ్ముగా ఉండడం, ఉత్సాహం లేకపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయట. ఈ విషయం ఒకసారి నేను THE HINDU Science & Technology విభాగంలో చదివాను.

ఇక ఇతర శాస్త్రాలకొస్తే సంఖ్యాశాస్త్రం బొత్తిగా ఆధారపడదగ్గది కాదు. మనం దశాంశమానం కాకుండా అష్టాంశమానాన్ని పాటిస్తే ఏడురకాల మనుషులే ఉండేవాళ్ళు-సంఖ్యాశాస్త్రాన్ని బట్టి చూస్తే. అలాగే షోడశమానాన్ని పాటిస్తే పదహైదు రకాల మనుషులుండేవాళ్ళు. ఇలాంటి శాస్త్రాన్నెలా నమ్మడం? పైన పేర్కొన్న మిగతా పద్ధతులూ అంతే!