Monday, 27 July, 2009

చేజారిన చందమామ?

ఔను, నిజంగానే! దశాబ్దాలుగా ఆబాలగోపాలాన్నీ అలరిస్తూ వచ్చిన చందమామే, అచ్చ తెలుగుదనానికి ప్రతీకలుగా మనం చెప్పుకునేవాటిలో ముందుండే చందమామే తెలుగువాడి చేతిలోనుంచి జారిపోయి పరాధీన అయిపోయింది. ఈ మార్పు చాపకింది నీరులా జరిగిపోయింది. ఆరేడు నెలలకిందటనుకుంటా పాత చందమామ కథను వెండితెర మీద చూడబోతున్నామన్న వార్త తెలిసి ఆనందంతో గంతులు వేసినప్పుడే చందమామ ప్రధాన సంపాదకుడు, ప్రచురణకర్త ఐన విశ్వం చిన్నప్పటినుంచి పెనవేసుకున్న అనుబంధాన్ని తెంచుకుని బాధాతప్త హృదయంతో చందమామ నుంచి తొలగిపోతున్నట్లు చందమామలో సంపాదకీయానికి అదనంగా ఇంకో పేజీలో రాశారు. అది చదివి నాకు గుండె ఆగిపోయినంత పనైంది. అసలు ఆయన చందమామనుంచి తొలగిపోయే పరిస్థితి ఎందుకు వచ్చింది?

1990లలో చందమామ ప్రచురణ తాత్కాలికంగా ఆగిపోయి, పునఃప్రారంభమైన తర్వాత మోర్గాన్ స్టాన్లీకి చెందిన వినోద్ సేథీ తదితరులు ప్రదర్శించిన "సృజనాత్మక ఔదార్యం" గురించి విశ్వం తరచూ ప్రస్తావించి ప్రశంసించేవారు. ఔదార్యం మాట అటుంచి దాంట్లో సృజనాత్మకత ఏముందో నాకు అప్పట్లో అర్థం కాలేదు. ఇప్పుడర్థమౌతోంది ఆ "సృజనాత్మకత" ఫలితమే చందమామలో వ్యవస్థాపకుల వారసులకు, చందమామను ఇన్నేళ్లూ చందమామగా నిలిపినవారికి చందమామలో స్థానం లేకపోవడం. చందమామ మీద "అంతులేని అభిమానం"తో 60% శాతం పెట్టుబడులతో ముందుకొచ్చిన పెద్దమనుషులు వాటాలు పెంచుకుని, విశ్వం మాటకు విలువ లేకుండా చేసి ఇప్పుడు తరతరాల వారసత్వసంపదను ఇంకెవరో అనామకుల చేతుల్లో పెట్టి చేతులు దులుపుకున్నారు (కాదు సొమ్ముచేసుకున్నారు అనడం సరైనది). చందమామ ప్రస్థానంలో ఇప్పుడు నడుస్తున్నది అతి కీలక ఘట్టం. అసలు చక్రపాణి మరణానంతరం (అప్పటికి ఇరవయేళ్లకు పైగా చందమామలో పేరులేని ఎడిటర్ గా కొ.కు. పనిచేస్తున్నప్పటికీ) అంతకు చాలా కాలం క్రితమే చక్కన్న చందమామ ప్రధాన సంపాదకుడిగా తన వారసుడిగా ఎంపికచేసి ఉంచిన విశ్వం గారు, చందమామ సంపాదకుడిగా, ప్రచురణకర్తగా, ముద్రాపకుడిగా సుదీర్ఘకాలం కొనసాగిన విశ్వం గారు ఇప్పుడు చందమామలో లేరు!

విశ్వం చందమామ నుంచి నిష్క్రమించడంతో చందమామలో మరో శకం ముగిసింది. నా చిన్నప్పుడు చందమామలో అప్పుడప్పుడూ కనిపించే Statement about ownership of CHANDAMAMA(Telugu Rule 8 (Form VI), Newspapers (Central) Rules, 1956 లో చందమామ వాటాదారులుగా ప్రచురణకర్త Shri B. VENKATRAMA REDDY (ఆయనే నాగిరెడ్డి కుమారుడు 'విశ్వం') పేరుకు అదనంగా అన్నీ తెలుగు పేర్లే (నాగిరెడ్డి కుటుంబసభ్యులవే) కనిపించేవి:
Shri B. VENKATRAMA REDDY
Shri B. NARESH REDDY
Shri B. SANJAY REDDY
Shri B. V. SHARATH REDDY
Smt. B. PADMAVATHI
Shri B. N. RAJESH REDDY
Smt. B. VASUNDHARA
Kum. B.L. ARCHANA
Kum. B.L. ARADHANA

అర్చన, ఆరాధన మైనర్లుగా ఉన్నప్పటి నుంచే ఇందులో ఉన్నారు (Minors admitted to the benefits of Partnership).

ఇప్పుడో? సంపాదకీయం పేజీలోనే చక్రపాణి-నాగిరెడ్డి, విశ్వం లాంటి అచ్చ తెలుగు పేర్లకు బదులుగా ఒక అరవపేరును చూడాల్సి రావడం దుస్సహంగా ఉంది. మార్పు అదొక్కటే కాదు. చందమామ చాలా మారింది. విశ్వం చందమామ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన తర్వాత ఒకటి రెండు నెలలు సూర్యోదయాల్లో, చంద్రోదయాల్లో ఎటువంటి మార్పూలేదు. అది అబద్ధమేమో, విశ్వం గారు చందమామను వదిలేసి ఎక్కడికి పోతారు? అనుకుని స్థిమితపడుతున్నంతలో మార్పులు ఒకదాని వెనుకొకటి శరాఘాతాలుగా వచ్చి తగిలాయి.

అసలు చందమామలో జరగరానిదేదో జరుగుతోందని చాన్నాళ్ల కిందటే చందమామ వెబ్సైటు chandamama.org నుంచి chandamama.com కి మారినప్పుడే గ్రహించాల్సింది. వెబ్సైటు చిరునామాలో మారింది టాప్ లెవెల్ డొమెయిను ఒక్కటే కాదు - చందమామను చేజిక్కించుకున్నవారి దృక్కోణమే వాణిజ్యమయమైపోయింది. chandamama.org ఉన్నప్పుడు కథలు, తాజా చందమామ సంచికలు Treasure chest అనే విభాగంలో ఉండేవి. (తర్వాత కొంతకాలానికి ఈనాడు చిన్నపిల్లల పేజీ (హాయ్ బుజ్జీ!)లో కథలను ఒక శీర్షికగా "కథల ఖజానా" అనే పేరు కింద వెయ్యడం మొదలుపెట్టడం కాకతాళీయమని నేను అనుకోను :)!!) chandamama.org లో తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు విడివిడిగా చర్చావేదికలు (Fora for parents and teachers) ఉండేవి. పిల్లల పెంపకం, వారిని మంచి పౌరులుగా తీర్చిదిద్దడం లాంటి విషయాల గురించి చర్చించుకునే అవకాశముండేది. వాటి స్థానంలో ఇప్పుడు షాపింగులు, అడ్వర్టైజుమెంట్లు.

నాకు ఆందోళన కలిగిస్తున్న విషయం ఇంకొకటుంది: పోయిన నెల చందమామలో వికీపీడియా లోని ఒక ఫోటో వేశారు. అది వింత కాకపోవచ్చు. ఐతే వికీపీడియాలోని ఆ ఫోటోను GFDL కింద వాడుకున్నట్లు వివరంగా రాసిన నోట్ దాదాపు ఆ ఫోటో అంత స్థలాన్ని ఆక్రమించింది. ఇక్కడ ఆలోచించవలసిన విషయమేమిటంటే ఇతరుల కాపీహక్కులకు ఇంత ప్రాధాన్యత ఇచ్చినవాళ్ళు తమ కాపీహక్కుల విషయంలో ఇంకెంత కఠినంగా ఉండబోతారో అని! 'వాళ్ల హక్కులు, వాళ్ళిష్టం - పైగా బోలెడు డబ్బు పొసి కొనుక్కున్నారు కదా' అనెయ్యకండి. ఇప్పటివరకూ మీరెప్పుడూ చందమామలో కాపీహక్కుల నోటీసు చూసి ఉండకపోతే ఒకసారి చూడండి - విషయసూచిక పేజీలో అట్టడుగున "The stories, articles, designs contained herein are the exclusive property of the publishers. Copying or adapting them in any manner/medium will be dealt with according to law." అని ఉంటుంది.

ఇప్పుడు ఆలోచించండి: chandamama.org వెబ్సైటు ప్రారంభించిన కొత్తల్లో కోరినవారికి ఈమెయిల్ ద్వారా చక్కటి చందమామ కథలను ఇంగ్లీషులో పంపేవాళ్ళు. అవే కాకుండా మనం ఎక్కడైనా వినగా మనకు బాగా నచ్చిన కథలు కూడా చందమామ కథలే అయి ఉండే అవకాశం చాలా ఎక్కువ. ఆ కథలను ముచ్చటపడి మీరు (నేరకపోయి) మీ బ్లాగుల్లో/సొంత వెబ్సైట్లలో పెట్టుకున్నారనుకోండి. చందమామ యాజమాన్యం మీ నుంచి పరిహారం కోరవచ్చు. ఇప్పటివరకూ మాచిరాజు కామేశ్వరరావు, దాసరి వెంకటరమణ, డా, గంగిశెట్టి శివకుమార్ లాంటి రచయితలు తమ కథాసంపుటాల్లో చందమామ కథలు చేర్చుకున్నారు. ఇకమీదట చందమామ కథల రచయితలు కూడా వాటిని తమ కథాసంపుటాల్లో చేర్చడానికి చందమామ యజమానుల అనుమతి కోరవలసిరావచ్చు. చందమామ యాజమాన్యం అనుమతి నిరాకరించనూవచ్చు. లేదా అనుమతికి ఖరీదు కట్టనూవచ్చు. అందుకే చందమామ నిర్వహణ ఎలాంటివారి చేతుల్లో ఉంది అనేది అతి ముఖ్యమైన అంశం.

కొత్త యాజమాన్యం చందమామలో తీసుకువచ్చిన మార్పులు దాదాపు అన్ని అంశాల్లోనూ ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి:

ముఖచిత్రాలు: ఏ పత్రికకైనా ముఖచిత్రం ఆ పత్రిక స్వభావాన్ని, లోపలి కంటెంటును ప్రతిబింబించేటట్లుగా ఉంటుంది. చందమామలో ఎన్ని రకాల శీర్షికలున్నా ప్రధానంగా అది భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే కథల పత్రిక. కథల పత్రికగా ప్రసిద్ధి పొంది మూడుతరాలపాటు అవిచ్ఛిన్నంగా ఆబాలగోపాలాన్ని అలరించిన చందమామ ఇప్పుడు కాలానుగుణామైన మార్పులంటూ ముఖచిత్రాలుగా వపా బొమ్మలకు బదులు క్రికెటర్లు, సినీతారల బొమ్మలు చూపి అమ్మకాలు పెంచుకోవాలనుకునే హీనస్థితికి దిగజారినందుకు బాధగా ఉంది. చందమామ రాగానే ముఖపత్రం మీద వపా సంతకం కోసం అప్రయత్నంగానే వెదకడం, ఈసారి ఆయన సంతకం అడ్డంగా ఉందా, నిలువుగానా? తెలుగులో ఉందా, ఆంగ్లంలోనా లేక చిత్రలిపిలోనా? అని చూసేవాణ్ణి. ఇప్పుడది గతకాలపు జ్ఞాపకం. "55 సంవత్సరాలుగా చందమామ చదువుతున్నా. ఇప్పుడందులో వస్తున్న మార్పులు హర్షణీయమేనా? అమెరికాలో ఉన్న నా మనవరాలు తెలుగు రాకపోయినా తల్లిచేత చందమామ చదివించుకుంటుంది. ఏప్రిల్ సంచిక ముఖచిత్రం చూసి 'ఇది చందమామ కాదు' అందిట." అంటున్నారు ఒక చందమామ అభిమాని. చంపి లందరి గోడు కూడా అదే.

లోపలి బొమ్మలు: చందమామ కథల్లో బొమ్మలకున్న విశిష్టత గురించి ఎంత చెప్పినా తక్కువే. అవే బొమ్మలు ఇప్పుడు చుట్టూ చెదలు తినిపోగా మిగిలిన పాత పుస్తకాల్లోని బొమ్మల్లా ఉన్నాయి. దశాబ్దాల కిందట తాను ప్రారంభించిన ఒరవడినే అన్ని పత్రికలూ పాటిస్తూండగా వీళ్ళకు కొత్తగా ఏం పుట్టిందో నాకు అర్థం కావడం లేదు. కథల పేర్లు ఇంతకుముందు చిత్రకారుల చేత రాయించేవారు. ఆ పద్ధతికి (చందమామ ఇండియా లిమిటెడ్ ఏర్పడిన తర్వాత) చాన్నాళ్ల కిందటే మంగళం పాడేశారు. ఇప్పుడు రచనల వరుస కూడా ఎట్లా పడితే అట్లా మార్చి పారేస్తున్నారు. ఏ పేజీలో ఏ శీర్షిక/సీరియల్ ఉందో వెతుక్కోవలసిన అవసరం ఇంతకుముందుండేది కాదు. ఉదాహరణకు బంగారులోయ సీరియల్ పేజీలు బైండు చేసుకోవడనికి పుస్తకం నుంచి విడదీస్తే దాంతోబాటే కృష్ణావతారం సీరియల్ చక్కగా చేతిలోకి వచ్చేసేది. ఇప్పుడైతే పీజీల అమరిక మొత్తం అయోమయం, గందరగోళం అయిపోయింది. ఉదాహరణకు, ఇప్పుడు నాలుగేసి పేజీల బొమ్మల సీరియల్స్ రెండు వస్తున్నాయి. అవైనా ఒకటిగా ఇవ్వొచ్చు కదా? ఆమాత్రం శ్రద్ధ కూడా తీసుకోవడం లేదు. కళ్ళు మూసుకుని గుడ్డిగా ఎక్కడేది పడితే అక్కడ అది వేసేస్తున్నారు. ఆఖరుకు ఫోటో వ్యాఖ్యల పోటీ కోసం కూడా పత్రికంతా వెదుక్కోవలసిన పరిస్థితి ఉందంటే అర్థం చేసుకోవచ్చు. పైగా ఎప్పుడూ లేని విధంగా కథల మధ్యలో కూడా వాణిజ్య ప్రకటనలు! చక్రపాణైతే ఒక్ఖ పేజీ కూడా తేడా రాకుండా చూసుకునేవారు.

మరో మార్పు: ఇప్పుడు కొత్తగా ప్రతి పేజీలో హెడర్, ఫుటర్ ఇస్తున్నారు. మొదట్లో కథ పేరు బొమ్మలో అంతర్భాగంగా చిత్రకారులే రాసేవారు. ఆ రాయడంలో ఆయా చిత్రకారుల శైలి ప్రతిబింబించేది - ఉదాహరణకు చిత్రా గారు రాసే అక్షరాలు ప్రధానంగా రెండు రకాలుగా ఉండేవి. వాటిని చూడగానే ఇవి చిత్రా గారి అక్షరాలు అని తెలిసే విధంగా. తర్వాత కథ పేరును ప్రింట్ చెయ్యడం మొదలుపెట్టారు. ఇప్పుడు కథ పేరు హెడర్లో ఇస్తుంటే - కొత్తగా ఉంది. కథ మొదటి పేజీలో (అది సింగిల్ పేజీ కథైతే తప్ప) బొమ్మ తప్పనిసరిగా పేజీ పైభాగాన్నే ఉండేది. ఇప్పుడా పద్ధతికీ మంగళం పాడేశారు. ఇక ఫుటర్లోనైతే రచయిత పేరు ఉండవలసినచోట ఎస్సెమ్మెస్ విజ్ఞాపనలు! ఎంత చిరాగ్గా ఉంటుందో చూడండి. ఐతే కొత్త అమరికలో అనుకూలమైన మార్పు - నాకు బాగా నచ్చింది - ఏమిటంటే హెడర్ మొదట్లో ఆ పేజీలోని రచనకు సంబంధించిన ఒక చూడముచ్చటైన ఐకన్ ఉంటోంది.

కంప్యూటర్ గ్రాఫిక్స్: బొమ్మలను అందంగా, ఆకర్షణీయంగా చూపడానికి కంప్యూటర్ గ్రాఫిక్స్ ను అద్భుతంగా వాడుకోవచ్చు. ఏడెనిమిదేళ్ళ కిందట ఇంగ్లిష్ చందమామలో ఒకానొక బొమ్మలో అద్దిన hues and shades చూసి పరవశించిపోయాను. ఇప్పుడు చందమామలో వస్తున్న బొమ్మలు (శంకర్ వేసినవి తప్ప) నాకు అసలేం నచ్చడం లేదు. ఇంతకు ముందు మాదిరే బొమ్మలు మంచి చిత్రకారుల చేత వేయించి వాటికి రంగులద్దడానికి కంప్యూటర్ ను వాడుకుంటే బాగుంటుంది.

కథలు: చందమామలో సీరియల్ కథలను మినహాయిస్తే మిగిలిన కథలన్నీ ఒక ఎత్తు, తానొక్కటీ ఒక ఎత్తుగా ఉండేది 25-ఏళ్ళనాటి చందమామ కథ. ఇప్పుడదీ ఎత్తేశారు.

ఇలాంటి అవకతవక మార్పుల వల్ల ఇంతకాలం ఆబాలగోపాలాన్ని అలరించిన చందమామ చరిత్రలో కలిసిపోనుందా? అని భయమేస్తోంది. కాలానుగుణంగా మార్పులు అనివార్యమే. కానీ కొన్ని మార్పులను అసలు సహించలేం. మరికొన్ని అనివార్యమైన మార్పులను తట్టుకోవడానికి సమయం పడుతుంది. (హిందూ పత్రిక డిజైన్ మార్చినప్పుడు మొదట చాలా చిరాకనిపించింది. కానీ నిదానంగా దానికి అలవాటు పడ్డాను.) చందమామ రూపంలో చోటుచేసుకున్న మార్పులు నాకు ఇంకా జీర్ణం కాలేదు. టైం పడుతుంది. ఇవి చందమామ కొత్త యాజమాన్యం అంటున్నట్లు రూపంలో మాత్రమే అని కూడా సరిపెట్టుకోలేకపోతున్నాను. ఎందుకంటే చందమామ విశిష్టత రూపంలో, బొమ్మల్లో కూడా ఉంది. ఆ రూపమే మారిపోయాక అది చందమామ ఎలా ఔతుంది? సుజాత గారు అన్నారు - అబ్దుల్ కలామ్ గారికి తెలుగు అర్థం కాదుగా అని. కానీ గతంలో చందమామ చదివినవారెవరినైనా మళ్ళీ ఆ లోకంలోకి తీసుకుపోవడానికి బొమ్మలు చాలు.

ఐతే చందమామ ప్రస్తుత యాజమాన్యం తన చర్యలను సమర్థించుకోజూస్తోంది: SMS పోల్ లో కొత్త తరహా ముఖచిత్రాలు గొప్పగా ఉన్నాయి అని 56%, బాగున్నాయి అని 28%, పాతవే నయం అని 16% అన్నారట! ఐనా ఆశ (hope) చావలేదు. "ఏ పత్రికైనా పాఠకుల కోసమే కాబట్టి వారు హర్షించని మార్పులు పత్రికలో మనగలవనుకోం" అంటున్నారు వసుంధర. చందమామకు గ్రహణం పట్టి చీకట్లు కమ్మిన ప్రస్తుత దశను త్వరలోనే దాటి చల్లని వెన్నెల కురుస్తుందని ఆశిద్దాం.

పూర్తిగా చందమామకు సంబంధించింది కాకపోయినా ఇక్కడ అప్రస్తుతం కాని ఒక చిన్న ప్రశ్న: చక్రపాణి చక్కన్న ఎలా అయ్యాడు?

కొసరు: మీ చిన్నప్పుడు చివరి పేజీలో వస్తూ ఉండిన పార్లే పాపిన్స్ ప్రకటనలు కూడా మీ చందమామ జ్ఞాపకాల్లో ఒక భాగమేనా? ఐతే ఇక్కడ చూడండి.