Monday 2 February, 2009

దేవుని కడపనొక కంట చూడు దేవా!

దేవుని కడప శ్రీలక్ష్మీవేంకటేశ్వరాలయ ప్రధాన గోపురం

తిరుమలేశుని తొలిగడపగా ప్రఖ్యాతి పొందిన దేవాలయం దేవుని కడప శ్రీలక్ష్మీవేంకటేశ్వరాలయం. అంతేకాదు, దక్షిణ ప్రాంత యాత్రికులు కాశీ వెళ్లడానికీ ఉత్తర భారతదేశ యాత్రికులు రామేశ్వరం వెళ్లడానికీ తిరుమల వేంకటేశ్వరుని వద్దకు కాలిబాటన వెళ్లడానికీ కడపే ప్రధాన మార్గం. ఈ కారణంగా మూడుచోట్లకూ వెళ్లే భక్తులు కచ్చితంగా ఇక్కడ మొదటిగా శ్రీ లక్ష్మీప్రసన్న వేంకటేశ్వరుణ్ణి, సోమేశ్వరస్వామిని దర్శించుకుని అనంతరం మూడు క్షేత్రాలకు వెళ్లేవారు. ఈ కారణంతోనే మూడు పుణ్యక్షేత్రాల తొలి గడపగా దేవునికడపను పేర్కొంటారు. ఇక్కడి దైవం ఏడుకొండల వేంకటేశ్వరునికి ముమ్మూర్తులా ప్రతిబింబంలా కనిపించే శ్రీ లక్ష్మీప్రసన్న వేంకటేశ్వరుడు. తిరుమల శ్రీవారి మాదిరిగానే ఇక్కడ కూడా స్వామివారి వక్షస్థలంపై కుడివైపు మహాలక్ష్మి కొలువై ఉంది.

తిరుమలలోని శ్రీవారి దర్శనార్థం వెళ్ళే భక్తులు ముందు దేవుని కడపలో స్వామివారి దర్శనం చేసుకుని ఆ తర్వాతే తిరుమలకు వెళ్ళడం ఆచారం. రవాణా సౌకర్యాలు ఇప్పుడున్నంతగా అభివృద్ధి చెందని రోజుల్లో భక్తులు తిరుమల మొక్కులు కూడా ఇక్కడే చెల్లించుకునేవారు. ఇక్కడ చెల్లించే మొక్కులు, కానుకలు సాక్షాత్తూ తిరుమలలోని స్వామివారి సన్నిధిలో చెల్లించినట్లుగా స్వామివారు ప్రీతి చెందుతారు. అంతటి ముఖ్యమైన దేవస్థానాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోకి తీసుకువచ్చినప్పుడు భక్తులంతా ఎంతగానో సంతోషించారు. ఈ దేవస్థానం కూడా బాగా అభివృద్ధి చెందుతుందని ఆశించారు. ఐతే గత ఆగస్టులో అక్కడికి వెళ్ళిన మేము అక్కడి వాస్తవ పరిస్థితులను, దేవస్థానం వారి నిర్లక్ష్యాన్ని, సాక్షాత్తూ దేవాలయంలో నెలకొన్న దుర్భరమైన అపరిశుభ్ర వాతావరణాన్ని చూసి దిగ్భ్రాంతి చెందవలసి వచ్చింది. ఇంతటి ప్రాశస్త్యం గల దేవాలయం, అందునా ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధతో అభివృద్ధి చేస్తున్న సొంత జిల్లా కేంద్రంలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం అంతటి దయనీయమైన స్థితిలో ఉన్నందుకు ఆవేదన కలిగింది.

"Cleanliness is next to Godliness" అంటారు. మన సంప్రదాయాలు, మడీ-దడీ-ఆచారాలు కూడా శుభ్రతకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి ఏర్పాటు చేసుకున్నవే. శుచి-శుభ్రత లేనిచోట దరిద్రం తాండవిస్తుందని మన నమ్మకం. కానీ మేం వెళ్ళినప్పుడు ఇక్కడ అడుగడుగునా అపరిశుభ్రతే కనిపించింది. గర్భగుడి చుట్టూ భక్తులు ప్రదక్షిణం చేసే అంతరాళంలో గర్భగుడి గోడల వెలువలివైపున, నేల మీద ఎంగిళ్ళు, వక్కాకు చారికలు, బీడీ ముక్కలు, ...అది చూసి తట్టుకోలేక ప్రదక్షిణాలు గబగబా ముగించుకుని ఇవతలికి వచ్చేశాం.

పేరుకు ఇక్కడ ఒక అద్దాల మండపం కూడా ఏర్పాటు చేశారు కానీ దాని అతీ గతీ పట్టించుకునే నాథుడే లేడు. ప్రవేశద్వారం దగ్గర "ప్రవేశరుసుము 2 రూపాయలు" అని ఉంది. కానీ లోపలికి వెళ్ళాలనుకునేవారికి టిక్కెట్లు అమ్మేవాళ్ళుగానీ, టిక్కెట్లను తనిఖీ చెయ్యడానికి గానీ దరిదాపుల్లో ఎవరూ లేరు. చివరికి లోపలికివెళ్ళినవాళ్ళు అద్దాలన్నిటినీ పగలగొట్టి వచ్చినా పట్టించుకునే దిక్కులేదనడానికి ప్రత్యక్ష తార్కాణం అక్కడే మా కళ్ళబడింది. ఆ అద్దాల మండపం ద్వారం దగ్గర పాలరాతితో ఏర్పాటుచేసిన మెట్లను (సోపానాలను) ఎవరో రాళ్లతో తుక్కుతుక్కుగా నలగ్గొట్టిపెట్టారు. మరీ ఒక మెట్టు మీదైతే పాలరాయి ఒకవైపు అడుగు వ్యాసంలో పూర్తిగా పొడిపొడిగా మారిపోయి ఉంది. అక్కడి నుంచి అన్ని వైపులకూ చివరి దాకా నెర్రెలు చీలి ఉన్నాయి. నలగ్గొట్టడానికి వాడిన రాయి కూడా ఫుట్ బాల్ సైజులో ఆ మెట్టుమీదే ఉంది! ఆలయ నిర్వాహకులు ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉండగలుగుతారసలు?

ఇవన్నీ చూశాక "సీతారామస్వామీ! నువు చేసిన నేరంబేమి" అనిపించకమానదు. ఆ దేవుడే మొరబెట్టుకున్నా మన ఏలినవారి చెవులకెక్కవుగదా? ఇక మన (ఆ)వేదనలు వినిపిస్తాయా? సొంతజిల్లాలో కోట్లు ఖర్చుబెట్టి వారు చేస్తున్న అభివృద్ధి ఫలాలు అస్మదీయులకేనా? అనిపించి అక్కడ లభించే తిరుపతి లడ్డు తిన్న తర్వాత కూడా నోరంతా చేదుగా అనిపించింది.

ఈ ఆలయానికి సంబంధించి కొన్ని విశేషాలు:

    తిరుమల వరాహక్షేత్రం కాగా ఇది హనుమక్షేత్రం. ఆంజనేయస్వామి ఇక్కడి క్షేత్రపాలకుడు.

    ఇక్కడ స్వామివారి విగ్రహాన్ని మహాభారతంలో కౌరవుల కులగురువైన కృపాచార్యులు ప్రతిష్ఠించారని అంటారు.కాబట్టే ఈ ప్రాంతానికి కృపాపురం అనే పేరు వచ్చిందంటారు. కాలక్రమంలో అది కురుప, కరిపె, కరిగె గా రూపాంతరం చెందిందనీ అదే కడపగా మారి ఉండొచ్చనీ చరిత్రకారుల అంచనా. (క్రీ.శ. రెండవ శతాబ్దంలో టాలెమీ కడపను కరిపె, కరిగె అని పేర్కొన్నాడు. పేరులో కరి అని ఉంది కాబట్టి ఇక్కడ ఆ కాలంలో ఏనుగులు ఎక్కువగా ఉండేవంటారు.)

    ఐతే ఇక్కడ అంతకుముందునుంచే ఆంజనేయస్వామి క్షేత్రం, హనుమత్ పుష్కరిణి ఉండేవని, స్వామివారి స్వప్నసందేశాన్ననుసరించి స్వామివారిని ప్రతిష్ఠింపజేయడానికి ఈ స్థలం అనువైనదిగా నిర్ణయించినది జనమేజయ మహారాజు అని, శ్రీవారి విగ్రహానికి వెనుక వైపున గోడలో ఆంజనేయుడి ప్రతిమ రాతిలో కనిపిస్తుందని "మనకు తెలియని కడప" గ్రంథంలో శశిశ్రీ రాశారు.

    ఆలయ ప్రాంగణంలో ఆండాళమ్మ, విష్వక్సేన, పద్మావతి అమ్మవారు, శంకచక్ర ధ్వజగరుడ అళ్వారు, హన్మత్‌పెరుమాళ్లు, నృత్యగణపతి... తదితర దేవీదేవతలు కొలువై ఉన్నారు.

    దేవుని కడప ఆలయ కోనేటిని హరిహర సరోవరమని, హనుమత్‌ పుష్కరిణి అని పిలుస్తారు. కొలనులో నిరయ మంటపం, తీర్థవాశి మంటపం ఉన్నాయి. పాతకడప చెరువు నుంచి ఇక్కడికి నీటి మార్గం ఉంది. పుష్కరిణిలో స్వామి తెప్పోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు.

    ఏటా ధనుర్మాసంలో ప్రత్యేకపూజలు నిర్వహిస్తారు. ఇక ప్రతి ఏడాదీ మాఘశుద్ధ పాడ్యమి(ఈ ఏడాది జనవరి 27) నుంచి ఏడురోజుల పాటు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. అన్ని మతాలకు చెందిన భక్తులు పాల్గొంటారు.

    మరో విశేషమేమిటంటే ఈ ఆలయ ఆవరణలో ఉన్న వినాయకుడికి నిలువునామాలుంటాయి.

ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే గాక కేంద్ర ప్రభుత్వం కూడా కడపజిల్లాలోని పర్యాటక కేంద్రాల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయించింది. పర్యాటకులను విశేషంగా ఆకర్షించగల ఇంత గొప్ప పుణ్యక్షేత్రంలో ఆలయప్రాంగణం ఎల్లవేళలా శుభ్రంగా ఉంచడం నిర్వాహకుల కనీస ధర్మం.
-శ్రీదేవి & త్రివిక్రమ్


ఈరోజు దేవుని కడప బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవం జరుగుతుంది. ఏటా రథసప్తమి నాడు జరిగే రథోత్సవం, కల్యాణోత్సవం, గరుడవాహన సేవలో పాల్గొనడానికి భక్తులు వేలాదిగా తరలివస్తారు. దేవుని కడప రథోత్సవం గురించి
"కన్నుల పండుగ లాయే కడప రాయని తేరు
మిన్ను నేల శృంగారము మితిమీరినట్లు"
అన్నాడు అన్నమయ్య.