Thursday 16 June, 2011

పదిరోజుల్లో కన్నడం - ఒకటో రోజు

రెండేండ్ల కిందట నేను "పదిరోజుల్లో కన్నడం" పుస్తకం రాస్తానని చెప్పి ముందస్తు ఆర్డర్ల కోసం ప్రకటన ఇస్తే ఔత్సాహికులు పొలోమని ఆర్డర్లిచ్చేశారు. వాళ్ళ ఉత్సాహాన్ని జోకొట్టి పడుకోబెట్టింది ఇన్నాళ్ళూ నాలో సహజసిద్ధంగా ఉన్న బద్ధకం. ఐతే ఈమధ్యకాలంలో నా కన్నడ పరిజ్ఞానం విపరీతంగా పెరిగిపోయి నాకు నిజంగానే కన్నడం కొద్దికొద్దిగా అర్థమైపోతోందేమోనని చాలా రొంబ తుంబ డౌటనుమానం కూడా వచ్చేస్తోంది. దాన్ని నిర్ధారించుకోవడానికే ఇదిగో ఇలా బ్రహ్మాండమైన విడుదల - స్వీయవిరచిత "పదిరోజుల్లో కన్నడం" పుస్తకం (in the making) లోని మొదటి చాప్టరు.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

మొదటి చాప్టరు

(philological outlook వుండవలె)

ఏం లేదండీ, మన భారతీయ భాషలన్నీ కొద్దో గొప్పో సంస్కృత భాష యొక్క ప్రభావానికి లోనైనవే. ఆమాటకొస్తే ఒక్క భారతీయ భాషలే కాదు, మన దేశం బయట కూడా లాటిన్, గ్రీకు లాంటి భాషల్లోని కొన్ని పదాలను గమనిస్తే సంస్కృత భాషలోని అదే అర్థం గల పదాలతో సారూప్యం కొట్టొచ్చినట్లు కనబడుతుంది. "జనని సంస్కృతము ఎల్ల భాషలకు" అని ఊరికే అనలేదు. పుట్టపర్తి వారు ఒక ఇంటర్వ్యూలో ఇలా అన్నారు:

"నాకు తెలిసినంతలో అన్ని భాషల తత్త్వం ఒక్కటే. సంస్కృతం ఒకటి బాగా వచ్చినట్లయితే, ఇండో యూరోపియన్ లాంగ్వేజెస్‌లో ఏ భాషైనప్పటికిన్నీ కూడా సులభంగా మనిషికి అర్థమవుతుంది. మనిషి నేర్చుకోవచ్చును. French, Latin, Greek, German మొదలైన ఈ భాషలన్నీకూడా,  సంస్కృతంతో సంబంధం ఉండేటటువంటి భాషలే. ఉత్తర హిందుస్థానంలో అనేకమైన భాషలు సంస్కృతంతో సంబంధం ఉండేవే. సంస్కృతాన్ని బాగా చదువుకోవాలి. అయితే వాడికి philological outlook వుండవలె. అది లేకపోతే కష్టం. భాషా శాస్త్రానికి సంబంధించిన అవుట్‌లుక్ ఉండినట్లైతే సంస్కృతమును పరినిష్ణాతంగా నేర్చుకున్నవాడు ఏ భాషనైనప్పటికినీ సులభంగా నేర్చుకోవచ్చును."

ఇండో యూరోపియన్ కుటుంబానికి చెందిన ఉత్తర భారతదేశ భాషలతో బాటే ద్రవిడభాషల మీద కూడా సంస్కృత ప్రభావం గణనీయంగానే ఉంది. తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో 30-35 శాతం పదాలు సంస్కృతం నుంచి వచ్చినవే. సంస్కృత పదాలను తెలుగులో చేర్చుకునేటప్పుడు వాటి మీద తెలుగు ముద్దరేసి మరీ కలుపుకోవడం ఆచారం (ఇంగ్లీషు మ్లేచ్ఛభాష గదా? అందుకే దానికి మన ఆచారాలు, పద్దేశాలు పట్టవు. ఇంగ్లీషు పదాలు కాళ్ళైనా కడుక్కోకుండా నేరుగా వచ్చి పంక్తిలో కూర్చుంటాయి). ఆ తెలుగు ముద్రకు నాలుగు రూపాలున్నాయి. అవి - డు, ము, వు, లు. నాకు తెలిసి మిగతా ఏ భాషలూ ఇంత స్పష్టమైన ముద్రికలను తయారుచేసుకోలేదు. ఈ ముద్రాక్షరాలు సంస్కృతపదాల చివర ఎత్తిన తెలుగు జెండాలు. మనం తెలుగు పదాలుగా భావించి వాడేసుకుంటున్న వాటిలో సంస్కృత పదాలేవో తెలుసుకోవడానికి రెండు మూడు కొండగుర్తులున్నాయి:

1. పదం చివరున్న తెలుగు జెండాలను తొలగించినా అర్థం మారకుండా సమాసాల్లో చక్కగా ఇమిడిపోయేవి సంస్కృత పదాలు.

ఉదా: 'వీరుడు' లో 'డు' తీసేసినాక మిగిలే పదం వీర (డు మోపిన బరువుకు పదం చివర వంగింది. కొమ్ము కొట్టేయండి). దీన్ని విడిగా కూడా వాడుకోవచ్చు. అంతకంటే ముఖ్యంగా గమనించవలసిందేమిటంటే అలా విడదీశాక కూడా అర్థం మారలేదు. కాబట్టి వీర అనే సంస్కృత పదాన్ని చివర 'డు' చేర్చి తెలుగులో వాడేసుకుంటున్నామన్నమాట. పాడు, కోడు, చెడు వీడు, రేడు - వీటి చివర డు ఉన్నా ఇవి అచ్చ తెలుగు పదాలు. అన్నట్లు రేడు లో ఉన్నది బండిరా (అంటే శకటరేఫం ఱ). దీన్నెలా పలకాలో నిజ్జంగా నాకు తెలియదు కానీ ఇది ఉన్న పదాలన్నీ అచ్చ తెలుగు పదాలే అని మాత్రం తెలుసు. అలాగే 'ము'తో అంతమయ్యే పదాలలో పాము, చీము లాంటివి అచ్చతెలుగు పదాలు కాగా సంస్కృతం నించొచ్చిన ధర్మము లాంటి పదాల చివరన ఉండే ము కాస్తా ఆధునిక వ్యవహారంలో అనుస్వారంగా (అనగా గుండుసున్నా అని అర్థం) మారిపోయింది.

2. మనం చిన్నప్పుడు సంస్కృత సంధులు అని సవర్ణదీర్ఘసంధి, గుణసంధి మొదలైనవి నేర్చుకున్నాం. గుర్తుందా? ఆ సంధి సూత్రాలను పాటించేవి సంస్కృత పదాలు (మొదట్లో ఇది కొండగుర్తూ, బండ గుర్తూ కాదు. లిట్మస్ టెస్టుగానే ఉండేది. ఐతే ఈమధ్య పాలాభిషేకం, తెలుగేతర, తెప్పోత్సవం లాంటి దుష్టసమాసాల విషయంలో తప్పు ఫలితాన్నిస్తోంది). వాటితోబాటే అకార, ఇకార, ఉకార మొదలైన కారపు సంధులు తెలుగు సంధులని నేర్చుకున్నాం. ఈ తెలుగు సంధి సూత్రాలను పాటించేవి అచ్చ తెలుగు పదాలు. ఎంతైనా కారం తెలుగువాళ్ళ(కు నచ్చే) రుచి. ఈ అచ్చు కారాలన్నీ తెలుగుభాషకు ప్రాణాలు.

3. i. మహాప్రాణాలు, సంయుక్తాక్షరాలు ఉన్నవి ఏ భాషైనా కావచ్చు కానీ అచ్చ తెలుగు పదాలు మాత్రం కావు అని ఎవరో చెప్పగా విన్నాను కానీ బ్రౌను ఒప్పుకోవడం లేదు.

అచ్చ తెలుగు పదాల్లో మహాప్రాణాలకు ఉదాహరణలు: ఖద్ది (p. 0343) [ khaddi ] khaddi [Tel.] n. Strength, might. బలము.

ఖాణము (p. 0344) [ khāṇamu ] khāṇamu. [Tel.] n. Food for horses. దాణా. Provender, fodder. Grass. గ్రాసము, కసువు.

సంయుక్తాక్షరాలకు ఉదాహరణలు: ౛ాపత్రి (p. 0480) [ zāpatri ] or ౛ాపత్తిరి ḍzāpatri. [Tel.] n. The spice called Mace. See under ౛ాజి.

పత్రి (p. 0707) [ patri ] or పత్రిరి patri. [Tel.] n. Leaves used in worship. "భక్తిలేని పూజ పత్రిచేటు." Vēma.

ii. అరసున్నా లేక అర్ధానుస్వారం ఉన్నవన్నీ కూడా అచ్చతెలుగు పదాలేనట.ఇది నిజం కాకపోవచ్చు. బ్రౌను నిఘంటువులో చూద్దామంటే ఆయన అసలు అరసున్నాలు వాడినట్లే లేదు.

4. చివరగా - తెలుగు అజంత భాష. అంటే అచ్చుతో అంతమయ్యే పదాలు గలది. దీనికి విరుద్ధంగా ప్రాణం లేని హల్లుతో గానీ, దీర్ఘాలు తీస్తూ గానీ తుదిశ్వాస వదిలేవి పరదేశీలు.

కన్నడం నేర్పుతానని పిలిచి తెలుగు పాఠాల్లోకి దిగాడేమిటని ఆగ్రహించకండి. కన్నడ బాగిట్లోకి వచ్చేశాం. కుడికాలు సిద్ధం చేసుకోండి.

తెలుగులో చెల్లుబాటయ్యే సంస్కృత/పరభాషా పదాలు దేశంలో ఏ భాషలో ఐనా చెల్లుబాటవుతాయని నా నమ్మకం. ఈ నమ్మకానికి, పైన చెప్పిన కొండగుర్తులకు ప్రత్యుదాహరణలు ఉండొచ్చు, కానీ వాటిని ప్రస్తుతానికి పక్కన పెడదాం. (ఇక్కడ మనం చేస్తున్న పని వేగంగా కన్నడం నేర్పడం. తప్పుల్లేకుండా కన్నడం నేర్పడం కాదు ;-) ) సంస్కృత పదాలు, విదేశీ పదాలేవేవో సరిగ్గా తెలిస్తే మనకు ఏ భారతీయ భాషలో ఐనా సరే ఎడాపెడా వాడెయ్యడానికి వీలయ్యే పదాలు వచ్చేసినట్లే. ఇవి ఏ భాషలోనైనా సుమారు 30-35% కి తగ్గకుండా ఉంటాయి. సంస్కృత పదాలను వాడడమెలాగంటే వాటి చివరన ఉండే డుమువులనే తెలుగు తోకలు కత్తిరించేస్తే సరి. అవి సుబ్బరంగా సర్వభాషామోదిత పదాలైపోతాయి.

ఇక పై తరగతులకు చెందిన పదాలు కాక ద్రవిడ భాషల్లో మాత్రమే కామన్ గా ఉండే పదాలు అర్థంలోను, రూపంలోను స్వల్ప తేడాలతో మూల ద్రావిడ భాష నుంచి వచ్చినవి. ఇవి కూడా అన్ని ద్రవిడభాషల్లోనూ 30-35% వరకు ఉంటాయి. ఐతే వీటికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఈ నియమాలు తెలిస్తే ద్రవిడ భాషలన్నీ కరతలామలకమే. వాటిలో మొదట తెలుసుకోవలసిన నియమమేమిటంటే -

మూల ద్రావిడంలో పదం మొదట్లో ఉండే 'ప'కారం కన్నడంలోకి వచ్చేసరికి 'హ'కారంగా మారుతుంది. ఈ నియమమే గుడ్డిగా ఫాలో ఐనందుకు బెంగళూరుకొచ్చిన కొత్తల్లో నాచేత హాహాకారాలు పెట్టించింది. అలా అని ఇదేదో నా సొంత పైత్యం అనుకునేరు. కానేకాదు, భాషాశాస్త్రవేత్తలు చెప్పిన శాస్త్రీయ నియమమే!

ఉదా: పాలు, పంది, పులి, పల్లి(పల్లె), పువ్వు, పండు, పో - ఈ పదాలు కన్నడంలో వరుసగా హాలు, హంది, హులి, హళ్ళి, హువ్వె, హణ్ణు, హో అవుతాయి.

కాబట్టి మీకు కన్నడంలో హ తో మొదలయ్యే పదం అర్థం కాకపోతే మొదట చేయవలసిన పని హ స్థానంలో ప పెట్టి చూడడం. మీకు హాసిని అనే కన్నడ అమ్మాయి పరిచయమైందనుకోండి, ఆమె పేరుకు అర్థం తెలుసుకోవడానికి ఈ సూత్రాన్ని వాడితే దెబ్బతింటారు. ఇందులోని నీతి ఏమనగా, ఆడవాళ్ళు అన్ని నియమాలకూ అతీతులు. [ఇక్కడ సంస్కృతపదానికి ద్రవిడభాషానియమం అన్వయించి నేను అనవసరంగా ఆడవాళ్ళ మీద అభాండాలు వేస్తున్నానని, అంతకంటే అనవసరంగా వాళ్ళను బద్‌నామ్ చేస్తున్నానని మీరు అనుకోవచ్చు (అన్నట్లు, బద్‌ నామ్ అనేది హిందీ పదం. దాన్నే ఇంగ్లీషులో బాడ్ నేమ్ అంటారు. చూశారా దేశ విదేశాల్లోని వేర్వేరు భాషల మధ్య ఎంత దగ్గరి పోలికలున్నాయో? :D) కానీ ఈ ద్రవిడభాషానియమాన్ని పాటించే సంస్కృత పదాలూ లేకపోలేదు. ఉదాహరణకు పండుగ - పబ్బం అనే జంట పదాల్లోని పబ్బం పర్వ(దిన)మనే సంస్కృత పదానికి వికృతి. (అలా కాక అది ద్రవిడ పదమే ఐతే పదం చివర ఇతర భాషల్లో లేని 'ము (లేక) అనుస్వారము' తెలుగులో ఉండకూడదు.) ఐతే ఈ పబ్బాన్నే కన్నడంలో హబ్బ అంటారు. పుట్టినరోజు పండుగను సింపుల్‌గా హుట్టుహబ్బ అంటారు.]

సరే, పందిని కాస్తా హందిని చేసిన ఈ సూత్రం ప్రకారమే పది కాస్తా కన్నడంలో హది కావాలి. కానీ కానంటోంది. ఎందుకంటే మూల ద్రావిడంలో దాని అసలు రూపం 'పత్తు' కాబట్టి. ఉన్న ద్రవిడ భాషలన్నిట్లోనూ తమిళమొక్కటే మూ.ద్రా. భాషకు దగ్గరగా ఉండి, ఆ లక్షణాలను చాలా వరకూ నిలబెట్టుకొన్నదని భాషాశాస్త్రవేత్తల ఉవాచ. తమిళంలో పదిని పత్తు అంటారు. ఇప్పుడు పదాది హకారం సూత్రం ప్రకారం ము.ద్ర.లోని పత్తు కన్నడంలోకొచ్చేసరికి హత్తు అవుతుంది.

నేను చదివిన రెండో సూత్రం "కచకారాల"కు సంబంధించినది. అంటే పైన చెప్పుకున్న పకార-హకారాల్లాగే ఇది కకారం-చకారాలకు వర్తిస్తుందన్నమాట. అంటే ము.ద్ర.లో క గుణింతంలోని అక్షరాలతో మొదలయ్యే పదాలు తెలుగు లాంటి కొన్ని భాషల్లోకి వచ్చాక మొదటక్షరాన్ని చకారంగా మార్చేసుకుంటాయి. ఉదా: కై-చెయ్యి, కివి-చెవి

ఇక మూడో సూత్రం. ఇది నేను చదివింది కాదు, అనుభవం మీద బోధపడింది: పదాది వకారం బకారమౌతుంది. వెన్న-బెణ్ణ, వాకిలి-బాగిలు, వా-బా, వల - బల (ఈ వల net కాదు. వలపలి చేత ఘంటం, వలపట-దాపట, బంతిలో వలపక్షం లలో ఉండే వల - అంటే కుడి అని అర్థం.)

కన్నడంలో బలి తిరువుసి అంటే కుడి వైపుకు తిరగండి అని.

అలాగే తమిళంలో వా అంటే రా అని అర్థం. అదే కన్నడంలో బా అవుతుంది. ఇక్కడో చిన్న కోతికొమ్మచ్చి: ఆవారాబావా అని ఒక తమాషా పదముంది. ఆ పదం ఐదు వేర్వేరు భాషల్లోని ఏకాక్షర పదాల సమ్మేళనం. పైగా ఆ పదాలన్నిటి అర్థమూ ఒకటే. అదీ అసలు తమాషా (ఆ-హిందీ, వా-తమిళం, రా-తెలుగు, బా-కన్నడం, వా-మలయాళం). అన్నట్లు తమాషా (దీర్ఘాంతం.. దీర్ఘాంతం..) అనేది పార్శీ పదం. మరాఠీలు రంగస్థలం మీద చేసే వినోదప్రదర్శన 'తమాషా' అనే పేరుతో ప్రసిద్ధి పొందింది. అక్కణ్ణించీ ఆ పదం ఇతర భారతీయ భాషల్లోకి పాకింది.

పైన హులి అంటే పులి అని చెప్పుకున్నాం. బెంగళూరులో హుళిమావు అని ఒక ప్రాంతముంది. ఐతే ఈ హుళి పుల్లదనానికి సంబంధించింది. హుళిమావు అంటే పుల్ల మామిడి. (అసలీ టపాను పోయిన్నెల్లోనే ప్రచురించవలసింది. కానీ అప్పటికే అలుపెరుగక ఆవకాయ - మాగాయ పోరాటాలు చేస్తోన్న జనాల మధ్యకు పుల్లమామిడిని వదలడానికి జంకి ఇన్నిరోజులూ ఆగానన్నమాట. :D) అలాగే ఆనేకల్ అని ఇంకొక ప్రాంతముంది. కన్నడంలో ఆనె అంటే ఏనుగు. (కాబట్టి ఆనేకల్లంటే ఏనుగు రాయి అనుకోవాలి. అదేం పేరు అనుకోకండి. మా కడప నగరంలో ఒక ప్రాంతం పేరు మట్టి పెద్దపులి. అక్కడ మట్టితో చేసిన పెద్దపులి విగ్రహముంది లెండి. అందుకే ఆ పేరు. మనం పులులను కడపలో, పులివెందుల్లో వదిలేసి మళ్ళీ ఏనుగు దగ్గరికొద్దాం.) వివిధ ద్రవిడ భాషల్లో ఇది ఆనె, ఆనై, యానై, ఏనిగ్, ఏనిగ అని పిలవబడుతోంది.

పత్తు/హత్తు/పది, వా/బా/రా, ఆనై/ఆనె/ఏనిగ(ఏనుగు) లాంటి పదాలను చూస్తే ఇవి ము.ద్ర. లేక తమిళంలో, కన్నడంలో ఒక విధంగాను, తెలుగులో మాత్రం కొంచెం తేడాగానూ ఉన్నట్లు తెలుస్తోంది కదా? ముద్ర నుంచి ఎక్కువ దూరం వచ్చేసింది తెలుగు భాషేనేమో అని కూడా దీన్ని బట్టి అనిపిస్తోంది.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ఇంతటితో కన్నడ స్వబోధినిలోని మొదటి చాప్టరు సమాప్తం. ఈ ఒక్క చాప్టర్లోనే మీరు కన్నడభాషలోని 40-50% పదాలు నేర్చేసుకున్నారు. రెండో చాప్టరు మూడువందల ముప్ఫైమూడూ పాయింట్ మూడు మీటర్లు అనగా తొమ్మిది వందల కిలోహెర్ట్జ్స్ పై తర్వాతెప్పుడో ప్రసారమౌతుంది. ఈలోగా మీరు వీటిని బాగా అధ్యయనం చేసి, అభ్యాసం చేసి మాట్లాడేటప్పుడు, రాసేటప్పుడు ధైర్యంగా, విశృంఖలంగా వాడడం మొదలుపెట్టండి. విజయోస్తు!

Appendix:

మీ సౌకర్యం కోసం RTS తో వెతుక్కోవడానికి వీలు కల్పించే కన్నడ కస్తూరి ఆన్లైన్ నిఘంటువుల లింకులు

ఆంగ్ల-కన్నడ నిఘంటువు

కన్నడాంగ్ల నిఘంటువు

హెచ్చరిక: కింది రెండు వాక్యాలూ స్వగతం. ఎవ్వరూ చదవకండి.
'హమ్మయ్య, నాకొచ్చిన నాలుగు కన్నడ పదాలూ చెప్పేశాను. ఇంకో నాలుగు పదాలు నేర్చుకున్నాక రెండో చాప్టరు రాస్తా!'

Monday 3 January, 2011

యువత మార్పుతోనే వ్యవస్థకు చికిత్స

 - ఎం. కేశవరెడ్డి, కడప

డిసెంబరు31 లోపు తెలంగాణా ఇవ్వాలి! ఇవ్వకుంటే రాష్ట్రం అగ్నిగుండం అవుతుంది అని తెలంగాణావాదులు, ఇస్తే మా తడాఖా చూపిస్తాం అని సమైక్యవాదుల పరస్పర ప్రేలాపనలు, ఏమౌతుందో ఏమో అన్న అపోహలు ప్రభుత్వానికి గుక్కతిప్పుకోనివ్వని వైనం. సాయుధ పోరాటానికి సిద్ధం కమ్మని నాయకుల రణఘోషలు, ఆపేందుకు ప్రభుత్వ దళాల మోహరింపు. (తేదీ జనవరి 6కు మారింది. కానీ పరిస్థితుల్లో మార్పు లేదు.) ఏమిటిది? ఒక సమస్యకు పరిష్కారం హింసా? ఇది గాంధీ పుట్టిన దేశమేనా? శాంతిని ప్రపంచానికి అందించిన నేల ఇదేనా? ఆధ్యాత్మిక సంపన్నులుగా ప్రపంచ గుర్తింపు పొందిన భారతీయులు, విభిన్న జాతి, కుల, మతాలకతీతులుగా సామరస్యంగా జీవించే భారతీయులు తన్నుకు చావడం ఏమిటి? మనమంతా పాఠశాలలో చదువుకొనేటప్పుడు ప్రతిజ్ఞ చేస్తుంటాం. భారతీయులందరూ నా సహోదరులు అని చెయ్యిచాపి ప్రతిజ్ఞచేసి ఎదిగినవాళ్ళం. నేడు కులం, మతం, ప్రాంతం విభేదాలతో విరోధులుగా తన్నుకుచావడం ఏమిటి? ఇది ఏ కులం, ఏ మతం చెబుతుంది?

సమస్య సమస్యకో ఉద్యమం. మా కులానికే ముఖ్యమంత్రి కావాలి. కాదు మా ప్రాంతానికే ఇవ్వాలి. అంటూ అజ్ఞానంతో చేసే ఉద్యమాలు అభివృద్ధికి అడ్డుగా మారడం భారతీయతకే మచ్చ. కాటన్, మన్రో, బ్రౌన్ లాంటి వారిదే మతం? ఏ కులం? ఏ జాతి? మేలు చేయాలనే తలంపు ఉండాలేగానీ మా కులం వాడో, మా మతం వాడో వీరుడు, శూరుడు కాడనే సత్యం గమనించాలి. సేవచేయగల్గిన సమర్థులు మనకు పాలకులుగా రావాలి. అలాంటివారిని మనం ఆహ్వానించాలి. సాయుధులను కమ్మంటున్నారు. పోరాటాలకు ఉరకండి అంటున్నారు. తన్నులు తిని చచ్చేదెవరు? మిమ్మల్ని ప్రేరేపించి ఎయిర్ కండిషన్డ్ గదుల్లో నాయకులు విశ్రాంతి తీసుకొంటుంటే మీ ప్రాణాలు పణంగా పెట్టి మనలో మనం తన్నుకుచావడం బాధ్యత గల పౌరుని లక్షణమేనా? ఆలోచించండి.

తెలంగాణా ఇస్తే ఏమౌతుంది? ఎవరో ఒకరు ముఖ్యమంత్రి. ఆ పదవి నాక్కావాలంటే నాక్కావాలంటూ పెనుగులాటలు, పోరాటాలు, పదవులు దక్కినవారికి సంతోషం, దక్కని వారికి ఆక్రోషం, మా కులంవారికి అన్యాయం, మా జిల్లాకు మొండిచేయి, సీనియర్ కు అన్యాయం, జూనియర్ కు అందలం, ఇదీ వరుస. పదవుల కోసం పైరవీలు, లాబీయింగ్ వీరులకే అధికారం. యధా మామూలే. రొటీన్ అసంతృప్తే. ఉద్యోగాలొస్తాయి, ఆ లాభమొస్తుంది, ఈ లాభమొస్తుంది, అని ఊదరగొట్టి ప్రజలను భ్రమల్లో తేల్చిన ఆ నాయకుల కుర్చీ కుస్తీలో మళ్ళీ మీరు సమిధలే. అప్పుడు మళ్ళీ సామాన్యులకు నిరాశే. బాగా ఆలోచించండి. నాయకుల పదవుల కోసం కుల, మత, ప్రాంతాల సంకుచితత్వంతో జరిగే పోరాటాల్లో మీకేంటి పని? ఉపాధి ఆశా? బాగా చదవండి ఉద్యోగాలొస్తాయి. సత్తా లేకుండా అవకాశాల కోసం ఎదురుచూడడం మూర్ఖుల పని. ఆలోచించండి. అలాంటివి మనకొద్దు. సమర్థులుగా ఎదగాలి. ఉద్యమంలో పాల్గొంటే మీకు చరిత్రలో కొన్ని పేజీలొస్తాయా? మీరు లేని పేజీలు దేనికి? ఈ స్వార్థపు పోరాటాలు వద్దు. పరిపాలనా సౌలభ్యం కోసం విభాగాలుగా చేయాల్సి వస్తే అది కేంద్రం చేస్తుంది. అవి విభజన రేఖలు కావు. పాలనా సౌలభ్యం కోసం మాత్రమే. మీ పోరాటాలు మానవ జాతి సమస్తానికి మేలు చేకూర్చేవై ఉండాలి. అవినీతి వల్ల, కాలుష్యం వల్ల మన సమాజం, భవిష్యత్తు నేడు తీవ్ర విపత్తునెదుర్కొంటున్నాయి. వాటి గురించి ఆలోచించండి. ఉద్యమించండి. కుల, మత, ప్రాంతాలకతీతంగా మానవ జాతి కళ్యాణానికి ప్రయత్నం చేయండి.ప్రగతితో బాటు చరిత్రలో నిలిచిపోతారు. ఎవరి కోసమో ఆత్మహత్యలు, లాఠీదెబ్బలు మీకెందుకు? మీ చదువు, విజ్ఞానం నవ సమాజానికి ఉపయోగపడాలి. ఎవరి కిందో, ఏ పదవి ఆశకో చేసేది ఉద్యమం కాదు. దాని వల్ల మార్పు రాదు. నిస్వార్థంగా ఆలోచించాలి. అలాంటి నాయకులు మన మధ్య ఉన్నారా? గమనించాలి. ప్రజలందరినీ సహజీవనులుగా గౌరవించడం నేర్చుకోవాలి. అలాంటప్పుడు సమస్త ప్రపంచం మీకు సలాం కొడుతుంది. మీ నిజాయితీ ప్రశ్నించలేనిదై దేదీప్యమానమౌతుంది. చదువుల కోసం వచ్చిన మీరు ఉద్యమాలకు బలయిపోతే కాయకష్టంతో చదువులకై పంపిన మీ తల్లిదండ్రులకు గుండెకోతను మిగిల్చినవారవుతారా?

ఓటుకు నోటో, సారా పాకెట్టో, క్రికెట్ కిట్టో మీరడిగితే అది సమకూర్చేందుకు మీ నాయకులకు డబ్బు కావాలి. అది కావాలంటే అవినీతి చేయాలి. ఆ అవినీతిలో బలయిపోయేదెవరో ఆలోచించారా? వచ్చే రూపాయి గురించి ఆలోచిస్తున్నారే తప్ప పోయే కోట్ల గురించి, భవిష్యత్ వినాశనం గురించి ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? అవినీతిలో భారతదేశం కూరుకుపోయిందనే సంగతి ప్రపంచ సంస్థలు కోడై కూస్తున్నాయి. ప్రజాసేవకుల ముసుగులో వేలకోట్లు సంపాదిస్తున్న వారిని మీరు సమర్థించడం ఏమిటి? తాత్కాలిక ప్రయోజనాలకు మనం తృప్తిపడితే భవిష్యత్తులో మరింత నష్టపోవాల్సి వస్తుంది. డబ్బు కక్కుర్తికో, శృంగార సంతృప్తికో, మద్యవిలాసాలకో దేశ పరువును తాకట్టు పెట్టిన ప్రబుద్ధులను మన చట్టం, న్యాయం శిక్షించలేని పరిస్థితులలో ఉన్నాయి. వారి అవినీతిని ప్రశ్నించలేని దౌర్బల్యంలో మనముంటే మనకు బాధలు కాక మరేముంటాయి?

ఒక పసిపాప బోరుబావిలో పడ్డప్పుడు, ఒక పాప బాయిలర్ లో కాల్చబడినప్పుడు యావత్ మానవ హృదయం ద్రవించింది. అదే మానవీయత. కుల, మత, ప్రాంతాలకతీతంగా మన కళ్ళలో కన్నీరు రాలాయే అదే మనలోని దైవత్వం. దానిని వెలికితీయాలి. అందుకు మనం సమర్థులను వెదకాలి. అందుకు ముందు మనం మారాలి. మన ఆలోచనలు మారాలి. మనం పీల్చే గాలి స్వచ్ఛంగా ఉండాలంటే బాహ్యంలో గాలి స్వచ్ఛంగా ఉండాలి. మన సమాజం బాగున్నప్పుడే మనం బాగుంటాం. సమాజాన్ని సంస్కరించాలంటే ముందు విద్యా వ్యవస్థను సంస్కరించాలి. సాంకేతిక ప్రగతిపై ఉన్న శ్రద్ధ విలువల పెంపుకు లేదు. మద్యంపై ఉన్న ఆసక్తి విద్యపైన లేదు. ఆధ్యాత్మిక జ్ఞానంతో సేదదీరాల్సిన జనం మత్తులో జోగడం వ్యవస్థ పతనానికి పరాకాష్ట కాదా? ఇంకా మార్పు కోసం చేయాల్సిన ప్రయత్నానికి వేళ కాలేదా? సమయం రాలేదా? ఆలోచించండి.

మన బిడ్డకు దెబ్బ తగిలితే ఎంత బాధపడతామో ఇతరులకు తగిలినా అలాగే స్పందించాలి. శరీరాలు, ఆస్థులు, మేడలు పెరిగినా బుద్ధులు పెరగడం లేదు. తప్పు చేసినవాడు మనవాడైతే ఒకలాగ, వేరొకరైతే ఒకలాగ స్పందించడం మానవునిలోని ద్వంద్వ ప్రవృత్తికి నిదర్శనం. ఇది వ్యవస్థ పతనానికో కారణం. ఒక తండ్రి కోట్లు కూడబెట్టి సంతానానికిచ్చి తృప్తి పడుతున్నాడు. మరి ఆ కోట్లు అతనికి బ్రతుకు భరోసా ఇస్తున్నాయా? అతని పతనానికో, కుట్రలతో అతని మరణానికో కారణం అవుతున్నాయి. అందుకే మంచి సమాజం కావాలి. ఒక డ్యాం నిర్మాణానికి ఎంతో మంది శ్రమ కావాలి. కూల్చాలంటే ఒకే ఒక బాంబు చాలు. వినాశనం మనకొద్దు. నిర్మాణాత్మకంగానే మనమూ మన ఆలోచనలూ ఉండాలి. మన సమాజంలోని రుగ్మతలకు టీకా వేయాలి. అదీ యువత చేతుల్లోనే ఉంది.

టీవీ ఛానల్స్, పత్రికలు సమాజంలో గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. స్వప్రయోజనాల లబ్దికై కృషి చేస్తున్నాయి. సమస్య సృష్టించడం, వ్యాపింపజేయడం, తద్వారా వ్యాపారలబ్ది పొందడం వాటి నైజమైంది. వ్యాపార లబ్ది వాటికి వంటబట్టి సమాజహితాన్ని గాలికొదిలాయి.

అపార మేధావులు సమాజ మార్పుకై సాయుధులై నక్సలైట్లుగా చాటుగా, మాటుగా చలికీ, వేడికీ పగలనక, రేయనక కొండల్లో, లోయల్లో సంచారం, ప్రభుత్వంపై పోరాటం. సమాజ వ్యతిరేకులంటూ ప్రభుత్వ పోలీసులు కూంబింగ్ లు, ఆపరేషన్లు. ఎందుకు? నక్సలైట్లు మనవాళ్ళే, పోలీసులు మనవాళ్ళే. ఒకరిని ఒకరు చంపుకుంటూ ఎంతో కాలంగా హింసను సృష్టిస్తూనే ఉన్నారు. మార్పు వచ్చిందా? రాదు. ఎందుకంటే వారి విజ్ఞానం హింసపై పెరుగుతున్నదే తప్ప సమాజ మరమ్మత్తు ప్రజా చైతన్యంలో ఉన్నదన్న సత్యాన్ని వారు గ్రహించలేకున్నారు. సహజ ఎరువులు వాడితే ప్రయోజనం. శరీరంలో రోగనిరోధక శక్తి పెంచుకుంటే ఆరోగ్యం అని మనకు తెలుసు. మరి వ్యవస్థలో అవినీతి వ్యతిరేక నిరోధక శక్తి పెంచేదానికి ప్రజాచైతన్యమే మందు అనే సత్యం వారిరువురూ ఎరగాలి. అహింసాయుతంగా ఆ మార్పు జరగాలి.

రిజర్వేషన్లు, కులమతాలు సమాజంలో వర్గ వైరుద్ధ్యానికి కారణాలవుతూ అభివృద్ధికి ఆటంకాలవుతున్నాయి. ఆర్థికంగా అభివృద్ధి చెందినా వాటిని ఉపయోగించుకుంటూ సంపన్నులో, అధికార బలం కలిగినవారో లబ్ది పొందుతున్నారు తప్ప సామాన్యుడికి ఉపయోగపడడం లేదు. అందరి రక్తం ఒక్కటే, అందరం మనుషులమే. మనమధ్య ఎందుకీ అంతరాలు? వాటిని రద్దుచేసి పేదలను గుర్తించి వారి స్థితిగతులను మెరుగుపరచి, జీవన ప్రమాణాలను అభివృద్ధిచేసే వ్యవస్థలను మనం పెంచుకోవాలి. అందుకు టెక్నాలజీని సక్రమంగా ఉపయోగించుకోవాలి.

భారీ ప్రాజెక్టులతో తలనొప్పులు, పర్యావరణ ఇబ్బందులు తెచ్చుకోక మైనర్ ఇర్రిగేషన్ కు ప్రాధాన్యత ఇవ్వాలి. వృధాను అరికట్టాలి. వేసిన రోడ్డు వేసుకొంటూ కట్టిన ఇల్లే కట్టుకుంటూ పోతే అభివృద్ధి జరగదు. నాయకులూ మీరూ ఆలోచించండి. పదవుల కోసం, పైరవీల కోసం డబ్బు కావాలి. అందుకు మీరు అవినీతి చేయాలి. అందుకు ప్రభుత్వ నిధులు వృథా అవుతున్నాయి. వాటిని సక్రమంగా నిర్వహిస్తే పదవులు అవే వస్తాయి. వాటి కోసం కాళ్ళు మొక్కడం, లంచమివ్వడం, లాబీయింగ్ చేయడం చేసి మీ వ్యక్తిత్వానికి మచ్చ తెచ్చుకోవద్దు. మీ ప్రజలకు తలవొంపులు తేవద్దు.

ఈనాటి సమాజాన్ని చూడండి. ఆత్మహత్యలు, మారణకాండలు, మానభంగాలు, అవినీతి, లంచగొండితనం ఇలాంటివెన్నో పీడించే సమస్యలు. వీటిని ఎదుర్కోలేక ప్రభుత్వాలు, చట్టాలు నిర్వేదంలో ఉన్నాయి. టెర్రరిజం, ఉగ్రవాదం, కాలుష్యం విపత్తులు మన వినాశనానికై ఎదురుచూస్తున్నాయి. మనం జాగ్రత్తగా లేకపోతే మానవ జాతికి ముప్పు తప్పదు.

కోటాను కోట్లు జనాభా పెరిగినా వారి మధ్య ప్రేమ లేదు, విశ్వాసం లేదు. నమ్మకం లేదు. నిత్యం ఒత్తిడిలో కోరికల సుడిలో రోగాలు ఆవహించి బ్రతుకును ఛిద్రం చేసుకుంటున్నారు. తల్లికి బిడ్డ, బిడ్డకు తల్లి లేని సంబంధాలు మన మధ్య పెరిగాయి. ప్రపంచంలో కోట్ల మంది జనాలున్నా నాకెవ్వరూ లేరనే ఒంటరితనం జనాల్లో ఉంది.

బిడ్డల భవిష్యత్తు ఆలోచించే తల్లిదండ్రులు మేము పోతే మా బిడ్డలు ఏమౌతారో. వారినెవరు చూస్తారో అన్న విశ్వాసం లేక తమకు ఆపద వచ్చినప్పుడు తమతో పాటు తమ బిడ్డలను పరలోకానికి తీసుకుపోవడం మనం వింటున్నాం. ఎంత దైన్యం? పొరుగువాడిని ప్రేమించలేకున్నాం. అనుమానాలు, భ్రమలు, అభద్రత మనలో ఉన్నాయి. అవి తొలగాలంటే మనం మారి, సమాజాన్ని మార్చాలి. అందుకు ప్రజలందరూ చైతన్యులవ్వాలి. మాకు ఉద్యోగాలు ఇప్పించండీ అని ఏ యువకుడూ ఏ నాయకుణ్ణీ అడుక్కొనే పరిస్థితి రాకూడదు. ఉద్యోగాలు సృష్టించుకొనే స్థితికి యువత ఎదగాలి. వారి ఆలోచనలు మారాలి. అప్పుడు ప్రభుత్వాలు, వ్యవస్థలు వాటంతట అవే మారుతాయి. అందుకు ప్రజాచైతన్యం అహింసాయుత విప్లవం రావాలి. అదే విశ్వాసంతో వదలని పట్టుదలతో యువత ఉద్యమిస్తే ప్రతి మనిషి సంతోషాన్ని ఆస్వాదిస్తారు. జీవితాన్ని ఆనందంగా అనుభవిస్తారు.

లేదంటే రాబోయే రోజుల్లో మానవ వికృత చేష్టల వల్ల పర్యావరణం, అవినీతి వ్యవస్థలు మన బిడ్డలను, వారి బిడ్డలను కబళించక మానవు. మనం పేర్చిన ఈ కోట్లూ, నోట్లూ ఆ ఉపద్రవాల నుంచి భవిష్యత్తు తరాలను కాపాడలేవు. ఆలోచించండి సంకుచిత పోరాటాల్లో సమిధలు కాకండి. శాంతికి కృషి చేయండి. వ్యవస్థ మార్పుకు ఉద్యమించండి. అణువులు విడిపోతే వెలువడే ఆటంబాంబు శక్తి కన్నా అణువుల సంలీనం వల్ల వెలువడే హైడ్రోజన్ బాంబు శక్తి అమోఘమనే సత్యం మీకు తెలుసు. ఉమ్మడి చైతన్యంతో ముందుకు ఉరకండి. వ్యవస్థ మార్పు మీ చేతుల్లోనే ఉంది. అహింసాయుత వైజ్ఞానిక విప్లవజ్యోతులై ప్రకాశించి ఈ జనవరి 6ను రక్త చరిత్ర కాకుండా కాపాడండి. యువకులారా ఆలోచించండి. మార్పుకు శ్రీకారం చుట్టండి.