Friday, 23 March, 2007

సర్దార్జీ జోకులపై అభ్యంతరాలు

నిజమే! ప్రసాదం బ్లాగులో చెప్పినట్లు కొంతమంది సర్దార్జీలు తమ మీద తామే జోకులేసుకుని అందరినీ నవ్విస్తూ తామూ వాళ్లతో కలిసి మనసారా నవ్వగలుగుతారు. కానీ దేనికైనా ఒక పరిమితంటూ ఉంటుంది కదా? అందుకే ఇప్పుడు శృతి మించి రాగాన పడిన సర్దార్జీ జోకులను నిషేధించాలంటూ కొందరు సర్దార్జీలు మైనారిటీస్ కమీషన్ ను కోరారు. ఇదే విషయంపై ఒక ప్రజాప్రయోజనవ్యాజ్యం కూడా నడుస్తున్నట్లు తెలుస్తోంది.

Sikhs ask cops to ban 'Sardar' jokes on Net

రాజ్యాంగం లోని ప్రాథమికహక్కుల్లో Protection of life and personal liberty అనేది అతి ముఖ్యమైన హక్కు. Right to live with dignity (గౌరవప్రదంగా జీవించడం) కూడా అందులో భాగమే. ఇది ప్రతివారికీ ఉండే హక్కు. ఇప్పుడు రానురాను మరీ అవమానకరంగా తయారౌతున్న ఈ జోకుల వల్ల తమ గౌరవం, ప్రతిష్ట దెబ్బతింటున్నాయని కొందరు సిక్కుల ఫిర్యాదు.

“I think these jokes can be very demeaning. And the line between what is healthy and what is humiliating has been crossed.” –Jeev Karan, a college student

“Unlimited jokes have an impact on the psyche of the community. Also, if one encounters a police officer who is a Sikh, he won’t be taken seriously. They’ll in stead take him to be a comedian.” –Tejdeep Kaur Meenon

ఇదిలా ఉండగా వాక్‌స్వాతంత్ర్యపు హక్కుకున్న పరిమితులెరుగని పాత్రికేయుడొకడు సర్దార్జీల మీద జోకులెయ్యొద్దనడం తమ వాక్‌స్వాతంత్ర్యపు హక్కును అడ్డుకోవడమేనని హిందూస్థాన్ టైమ్స్ లో రాశాడు. అది రాసినవాణ్ణీ, వేసిన సంపాదకులను, ప్రచురణకర్తను నోటికొచ్చినట్లు తిట్టి, 'ఇది నా వాక్‌స్వాతంత్ర్యపు హక్కు' అంటే ఏమంటారో?

ఇవి కూడా చూడండి:

http://www.dnaindia.com/report.asp?NewsID=1084154

http://o3.indiatimes.com/sardarji

http://www.panthic.org/news/129/ARTICLE/1332/2005-05-15.html

Wednesday, 21 March, 2007

శాసనవ్యవస్థ-న్యాయవ్యవస్థ

గత ఐదు రోజులుగా సభాకార్యక్రమాలు బొత్తిగా సాగకపోవడం వల్ల లోక్ సభ బడ్జెట్ సమావేశాలను ఒకరోజు ముందుగానే ముగిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. శుభం! ఘనత వహించిన మన పార్లమెంటు సభ్యులు -బాహాబాహీ, కచాకచి, ముష్టాముష్టి- అవసరమైతే ఎంతకైనా తగుదుమని ఈ సమావేశాల్లో మరోసారి నిరూపించారు. సరిగ్గా ఈ సమావేశాలు జరుగుతున్నప్పుడే శాసనమండలి ఎన్నికలు (చదువుకున్నోళ్ళ ఓట్లు) జరిగాయి. రాష్ట్రస్థాయిలో ఎగువసభ అవసరమా అన్న విషయం పక్కనపెట్టి ఈ ఎన్నికల్లో పోటీకి నిలిచిన అభ్యర్థులను బట్టి చూస్తే ఒక్కో నియోజకవర్గంలో అర్హులైన అభ్యర్థులు ఒకరికంటే ఎక్కువమందే నిలిచినట్లనిపించింది. ప్రథమప్రాధాన్యత ఓటును ఎవరికి వెయ్యాలన్నది నిర్ణయించుకోవడం కాస్త కష్టమనిపించింది...(దిగువసభ ఎన్నికల్లో ఎవరో ఒకరికి ఓటెయ్యాల్సిరావడం ఎంత కష్టమో అంత కష్టం కాదులెండి). దిగువసభలైన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో "None of the above " ఆప్షన్ ఎప్పటికి వస్తుందో ఏమో?

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశపు పౌరుడినైన నాకు రాజ్యాంగ, ప్రభుత్వ పాలనాపరమైన విషయాల్లో మన (ప్రజలెన్నుకున్న) చట్టసభల మీదకంటే ఉన్నత న్యాయస్థానాల మీదే నమ్మకం, గౌరవం ఎక్కువ. ఐతే సాధారణ కేసులను సైతం పరిష్కరించడంలో జరిగే అసాధారణ జాప్యం న్యాయవ్యవస్థపై ఉన్న నమ్మకాన్ని పోగొడుతోంది. మొత్తానికి ఎవరూ వాళ్ళు చెయ్యాల్సిన పనిని సక్రమంగా చెయ్యడం లేదన్నమాట. :( మచ్చుకు ఇటీవల కడపలో జరిగిన ఒక సంఘటన:

http://www.hindu.com/2007/03/04/stories/2007030411470400.htm

25 యేళ్ళ కిందట తమ సర్వస్వం కోల్పోయిన సోమశిల మునకప్రాంతాల వారికి నష్టపరిహారం ఇంకా అందలేదు. ఐనా నష్టపరిహారం కోసం వాళ్ళు ఏ మాత్రం ఆగ్రహించక, ఎంతో ఓపికతో ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నారు. వారికిచ్చే నష్టపరిహారం పాతికేళ్ళ కిందటి లెక్కలప్రకారం. పరిష్కరించిన కేసులు 700, మిగిలి ఉన్నవి 1907. విషయం తెలుసుకున్న హైకోర్టు న్యాయమూర్తి, రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ అధ్యక్షుడు బిలాల్ నజ్కీ "25 యేళ్ళ కిందట తమ సర్వస్వం కోల్పోయినవారికి నష్టపరిహారం ఇంకా అందించలేని వ్యవస్థలో తానూ ఒకడినైనందుకు సిగ్గుపడుతున్నా"నని అన్నారు. పరిహారం కోసం ఇంకా ఎంతో సహనంతో ఎదురుచూస్తున్న బాధితుల ఔదార్యానికి సెల్యూట్ చెయ్యాలని అనడమేకాదు, ఈ నెలాఖర్లోగా మిగిలిన కేసులు పరిష్కరించకపోతే ఇక ఇక్కడి బాధితులకు తన మొహం చూపించలేనని, జీవితంలో మళ్ళీ ఇక్కడికి రాబోనని అన్నారు. ఇక్కడ శాశ్వత లోక్ అదాలత్ ప్రారంభించడానికి వచ్చిన హైకోర్టు న్యాయమూర్తులకు బార్ అసోసియేషన్ సన్మానం చేయబోగా సన్మానాలకు తాము అర్హులం కామంటూ వారిని వారించి తమకు అందవలసిన పరిహారం ఇన్నేళ్ళుగా అందకపోయినా ఎంతో ఆదరాభిమానాలతో తమను ఆహ్వానించిన లబ్ధిదారులే అందుకు నిజంగా అర్హులని పేర్కొంటూ లబ్దిదారులను శాలువాలతో సన్మానించారు.


పెండింగ్ అప్పీళ్ళను పరిష్కరించడానికి దేశంలోనే ప్రప్రథమంగా ఒక జిల్లా కోర్టులో హైకోర్టు బెంచ్ లోక్ అదాలత్ నిర్వహించింది ఇక్కడే.

Friday, 16 March, 2007

క్లాసిక్ అనగా...

తెలుగులో నేను అదీ ఇదీ అని లేకుండా అన్ని రకాల పుస్తకాలూ చదువుతాను. ఇంగ్లీషులో ఒకప్పుడు షేక్స్‌పియర్ నాటకాల నుంచి లేటెస్ట్ బూతు నవలల దాకా అన్ని రకాలూ (రకానికి ఒకటి రెండు చొప్పున) చదివాను. ఇది పదేళ్ళ కిందటి సంగతి. తర్వాత నా స్నేహితుడు లక్కీ నాకు బహుమతిగా ఇచ్చిన Midnight's Children చదువుదామని మొదలుపెట్టి మధ్యలోనే మానేశాను. ఆ పుస్తకం గత ఐదేళ్ళుగా నా పుస్తకాల అరలో అలాగే పడి ఉంది. ఆ తర్వాత గత సంవత్సరం ప్రపంచంలో ఇంగ్లీషొచ్చిన ప్రతివారూ కలవరించిన పుస్తకం, ఇంగ్లీషు పుస్తకాల సమీక్షల్లో ప్రపంచప్రఖ్యాతి పొందిన TLS (Times Literary Suppliment) చేత "un-putdownable book" గా ప్రశంసించబడిన Da vinci code బలవంతాన వారం రోజులపాటు ప్రయత్నించి నలభై పేజీలు చదివి పక్కన పడేశాను. అది సంవత్సరం నుంచి పలకరించే నాథుడు లేక దుమ్ముకొట్టుకుపోయింది. ఇంగ్లీషు పుస్తకాలు చదివే అలవాటు తప్పిపోయిందా అంటే నాన్-ఫిక్షన్ ఇప్పటికీ అమితాసక్తితో చదువుతూనే ఉన్నాను. అంటే ఇంగ్లీషులో ఫిక్షన్ చదవడం నా వల్ల కావడం లేదా? ఇది నాకే ఆశ్చర్యంగా ఉంది. ఇటీవల ఒక ప్రముఖ రచయితతో మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు Da vinci code చదవలేక పక్కనపడేసిన విషయం ప్రస్తావించాను. దానికి ఆయన "చదవాలంటే ముందు మనకు దాని మీద ఆసక్తి పుట్టాలి. Da vinci code మనకు తెలిసిన జీవితాలకు గానీ, మన సంస్కృతికి గానీ సంబంధం లేని రచన కావడం కూడా ఆ ఆసక్తి కలగకపోవడానికి కారణం కావొచ్చు." అన్నారు. అదే నిజమేమో? నేను డావిన్సీ కోడ్ చదవనంత మాత్రాన కొంపలేం మునిగిపోవు. కానీ ఏ ఆర్కే నారాయణో, రస్కిన్ బాండో, మనోజ్ దాసో రాసిన పుస్తకాలు చదవడానికి ప్రయత్నించి విఫలమైతే అది నిజంగా ఆందోళన పడాల్సిన విషయమే! మరి Midnight's children సంగతేంటి? అది మన దేశాన్ని గురించి రాసిందే కదా? ఐనా నేను దాన్ని చదవలేకపోవడమేమిటి? దీనికి కారణం ఇటీవలే తెలిసింది: సాల్మన్ రష్దీ, బిల్ క్లింటన్ లాంటివాళ్ళ రచనలు చదవడం కష్టమేనట. ఇది నా ఒక్కడి సమస్య కాదట. చాలామంది చదవడం మొదలుపెట్టి పూర్తిచెయ్యకుండానే వదిలేస్తారట.

Midnight's children ఒక క్లాసిక్. ఈ వార్త చదవగానే "Classic is a book which everyone praises but noone reads." అన్న ఫన్నీ కోట్ గుర్తొచ్చింది.

Monday, 12 March, 2007

చుట్టూపక్కల చూడరా...

మీ కంప్యూటరులోని ఏ ఫైలు నుంచైనా సరే మీకు తోచిన (text) భాగాన్ని Ctrl c లేదా మూషిక సాయంతో కాపీ చేసి (at your own risk) ఈ సైటు చూడండి....

Thursday, 1 March, 2007

బావా!...చీ!!

నేను హైదరాబాదుకు వచ్చిన కొత్తల్లో జరిగిందిది. జవహర్‍నగర్‍లో ఉండడానికి రూమ్ దొరకగానే లగేజ్ మొత్తం అక్కడ పడేసి, అవసరమైనవన్నీ కొనుక్కుని "హమ్మయ్య!" అనుకునేసరికి సాయంత్రమైంది. స్నానం చేసి, పరిసరాల పరిజ్ఞానం పొందుదామని బయలుదేరాను. రోడ్డు దాటి అటూ ఇటూ దిక్కులు చూస్తూ మళ్ళీ ఇంకో రోడ్డు దాటి కొంత దూరం ముందుకెళ్ళి రోడ్డు పక్కన చోద్యం చూస్తూ నిలబడ్డాను. అటూ ఇటూ హడావిడిగా ఉరుకులు పరుగులతో వెళ్తున్నారు జనాలూ, వాహనాలూ. ఉండుండీ వాహనాలన్నీ ఒకదానివెనకొకటి ఆగిపోతున్నాయి. (ముందు ట్రాఫిక్ సిగ్నల్ ఉండడం వల్ల అని అప్పుడే ఊహించేశాను.) ఒక్కసారిగా జనాలు ఎక్కణ్ణించో గుంపులుగుంపులుగా వెళ్తున్నారు. (సినిమా థియేటర్ల నుంచి అని తర్వాత తెలిసింది.) అక్కడ కనుచూపు మేరలో నాలాగ దిక్కులు చూస్తూ నిలబడ్డ నరమానవుడెవడూ లేడు. ఇదీ వాతావరణం.

నేనా వాతావరణానికి అలవాటు పడుతున్న సమయంలోనే తూర్పు దిక్కు నుంచి ఉల్కాపాతంలాగ దూసుకొచ్చి సడన్ బ్రేకుతో సరిగ్గా నా ముందే ఆగిందొక ఆటో! ఆ ఆటోలో నుంచి జీన్స్ ప్యాంటూ టీషర్టులో సన్నగా, నాజూగ్గా కనిపిస్తున్న ఒక టీనేజీ అమ్మాయి కొంగలాగ మెడసాచి తల మాత్రం బయటపెట్టి "బావా...!" అని సన్నగొంతుతో పెద్దగా పిలిచింది. పిలిచి, అరక్షణం ఆగింది. ఆ గొంతు వినగానే చిన్నప్పుడు చదివిన ఫిజిక్స్ పాఠాలు తోసుకుంటూ వచ్చి "ఈ పిల్ల గొంతులో పిచ్చెక్కువ (pitch-a quality of sound-ఎక్కువ)." అని చెప్పాయి.
నేనా మాటలకు ఊకొడుతూనే "ఈ పిల్ల పిలుస్తున్నదెవరినబ్బా?" అని నా తలను శరవేగంతో వెనక్కి తిప్పి తేరిపారజూశాను. దరిదాపుల్లో ఎవరూ లేరు.........నేను తప్ప! 'ఆ పిల్ల రాకముందు నుంచే ఆ (పారజూసే)పనిలో ఉండడం వల్ల గదా నాకు కుడి ఎడమల ఎవరూ లేరని ఆ పిల్ల పిలిచిన వెంటనే నిర్ధారించుకోగలిగాను? పరిసరాల పరిజ్ఞానమంటే ఇదిగాక మరేది?' నేనా ఆలోచనతో బుడుంగున ఆనందసాగరం లోతు కొలవడానికి వెళ్ళిపోయాను. అందుకే ఆ తర్వాత ఆ పిల్ల పలికిన పలుకులు కాస్త ఆలస్యంగా, అస్పష్టంగా నా చెవిని సోకాయి: "చీ ఎక్కడా?" అని.

తత్తరపడ్డాను. ఆ మాటతో నేను ఓలలాడుతున్న ఆనందసాగరం అకస్మాత్తుగా మంత్రమేసినట్లు ఇంకిపోయింది. 'ముక్కూ మొహం ఎరుగని నన్ను పట్టుకుని ఒక ఆడపిల్ల 'బావా' అని పిలవడమేమిటి? పిలిచెనుపో మరుక్షణమే 'ఛీ ఎక్కడ?' అని అనడమేమిటి? కొంపదీసి 'ఛీ! ఇక్కడా?' అన్లేదుగద? ఆ మాట మాత్రం ఎందుకంటుంది? అందునా నన్ను (అనగా ఒక అపరిచితుణ్ణి అని భావము)?' ఆనందసాగరం నుంచి ఎగిరొచ్చి అయోమయాగాథంలో పడ్డ నేను ఒకవైపు పైకి రావడానికి గింజుకుంటూనే ఇంకోవైపు ఊపిరందక తల ఎలా ఆడిస్తున్నానో కూడా నాకే తెలియకుండా ఊపేశాను. ఆ ఊపుడు చూసిన ఆటోవాడు 'వీడెవడో వెర్రిబాగులవాడు. వీణ్ణడిగి లాభం లేదు.' అని తెలుసుకున్నాడేమో ఆటోను ముందుకు దూకించాడు. సర్రుమని దుమ్ములేపుకుంటూ ఆటో, ఆటోలోని పిల్లా వెళ్ళిపోయారు. నిదానంగా తేరుకున్న నేను 'అసలు నేక్కడున్నాను? ఆ పిల్ల నన్నేమడిగింది?' అని పరిశోధించే పనిలో పడ్డాను.

ఎదురుగా కొంచెం దూరంలో ఒక పెద్ద హీరో కటౌట్ ఉంది. అదొక సినిమా థియేటర్లా ఉంది. ఇక నా వెనకేముంది? అసలు నేను ఎక్కడ, దేని ముందు నిలబడ్డాను? అని వెనుదిరిగి చూస్తే 'Bawarchi' అని పెదపేద్ద అక్షరాలతో బోర్డు కనిపించింది. 'ఇదేం పేరు? విచిత్రంగా ఉందే? అసలిది ఏ భాష? దీన్నెలా పలకాలి? ఈ పేరుకర్థమేమిటి?' అని సందేహాలు కలిగాయి. ఆ పేరునెలా పలకాలో ప్రయత్నిస్తుండగా దాన్ని 'బావర్చి' లేక 'బావార్చి' అని పలకవచ్చనిపించింది. దాంతో మిష్టరీ విచ్చిపోయిందని నాలోని డిటెక్టివ్ కేయాస్ ఒక్క కేక పెట్టాడు. (ఘనత వహించిన నా ఈ అభిమాన డిటెక్టివ్ పేరుకు Chaos (అనగా గందరగోళం) అని భాష్యం చెప్పారు కీ.శే.వల్లంపాటి వారు.) ఇందాక ఆ పిల్ల నన్నడిగిన అడ్రసు ఇదే! ఆ పిల్ల నన్ను 'బావా' అని పిలవలేదు!! ఏ సంబోధనా లేకుండానే('ఇస్సీ! ఎంత అమర్యాద?' అనుకోరాదు. పాపం, ఆ పిల్ల తొందర ఆ పిల్లది) 'బావా...ర్చీ ఎక్కడ?' అని అడగబోయి నోరు తిరక్కనో ఏమో 'బావా...చ్చీ ఎక్కడ?' అని అడిగింది. దాన్ని మనం 'బావా...చీ ఎక్కడ?' అని అర్థం చేసుకున్నాం. సరే, 'బావా...చీ' ఆచూ...కీ తెలిసింది "మరదలా రమ్మని" కేకేద్దామని చూస్తే అప్పటికే ఆ మరదలు పిల్ల కనుచూపుమేరలో లేకుండాపోయింది. నేను ఆ ఆటో వదిలిన పొగమేఘం వైపే దీ...ర్ఘంగా ఆ పొగ గాలిలో కలిసిపోయేవరకు చూసి, ఒక నిట్టూర్పు విడిచి అక్కడి నుంచి బయలుదేరి మెల్లగా మా రూముకు వచ్చేశాను.

ఇంతేసంగతులు.

(ఇంతకూ బావార్చి లేక బావర్చి అనేది ఏభాషలోని పదమో, ఆ మాటకు అర్థమేమిటో నాకు ఇంతవరకు తెలియదు. మీకు తెలిస్తే చెప్పరూ?)