Friday 15 September, 2006

నట్టింటి భూతం

నట్టింటి భూతం పట్ల తస్మాత్ జాగ్రత్త! ఈ భూతం బారిన పడినవాళ్ళకు చిన్నాపెద్దా తేడా లేకుండా శారీరక, మానసిక చురుకుదనం తగ్గిపోవడం, రకరకాల వికారాలు కలగడం ప్రత్యక్షంగా కనిపిస్తూనే ఉంది.

ఇప్పుడు అది మీ బుర్రలు చెడగొట్టడమే గాక మీ పిల్లల ప్రాణాలను బలితీసుకునే ప్రమాదం కూడా ఉంది.
ఈ వార్త గత గురువారం హిందూ హైదరాబాదు ఎడిషన్లో వచ్చింది. కానీ ఎందుకనో ఆన్‌లైన్ ఎడిషన్లో కనబడలేదు.

Wednesday 13 September, 2006

ఒక అందమైన సాయంత్రం:

ఈ సాయంత్రం నాకు చాలా ఉత్సాహాన్నిచ్చింది. దానికి కారణం ఇంటర్నెట్లో తెలుగు గురించి తెలిస్తే ప్రజల్లో ఎంతటి ఆసక్తి కలుగుతుందో ప్రత్యక్షంగా తెలియడం; పుట్టపర్తివారికి జరిగిన అపచారానికి హైదరాబాదులోని సాహిత్యాభిమానులు, ప్రముఖులు ఒకేలా స్పందించడం. ఐతే మనం వాడే భాష విషయంలో పాటించవలసిన జాగ్రత్తలతో తయారు చేసిన ప్రతిజ్ఞ గురించి మాత్రం తక్షణ స్పందన తెలియలేదు. దానికి ఇంకా సమయం పడుతుంది. అసలేం జరిగిందంటే:

నిన్న ఉదయం నాకొక ఈమెయిల్ వచ్చింది. సాహిత్య, కళారంగాల్లోని ప్రముఖులకు ఈ సాయంత్రం తెలుగు విశ్వవిద్యాలయంలో జరగనున్న సన్మాన కార్యక్రమానికి రావలసిందని. పంపినవారు బహుమతిగ్రహీతల్లో ఒకరైన ప్రముఖ రచయిత 'వసుంధర '.

దాంతో నాకొక ఆలోచన వచ్చింది: పుట్టపర్తివారికి జరిగిన అపచారాన్ని నిరసిస్తూ తెలుగుబ్లాగరుల తరపున చదువరిగారు తయారుచేసిన పిటీషను గురించి, తెలుగుబ్లాగులు, తెవికీల గురించి నలుగురికీ తెలియజెప్పడానికి ఈ సమావేశాన్ని ఒక వేదికగా వాడుకుంటే ఎలా ఉంటుందని. నేనీ విషయం ప్రస్తావించిందే తడవుగా చదువరిగారు ఆఘమేఘాల మీద 300 కరపత్రాలు తీసి నాకు అందజేశారు. (పిటీషను 100 ప్రతులు, తెలుగుబ్లాగులు, తెవికీల పరిచయవాక్యాలు 100 ప్రతులు, భాష విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించిన ప్రతిజ్ఞ 100 ప్రతులు). నేను వాటినందుకుని సమావేశస్థలికి చేరుకుని వచ్చినవారందరికీ పంచడం మొదలుపెట్టాను.

"ఇంటర్నెట్లో తెలుగు..." అని వాసన తగలగానే అక్కడున్న విద్యార్థులంతా ఆసక్తిగా వివరాలడగడం ప్రారంభించారు. నేను చెబుతూండగా అటుగా వచ్చిన విలేకరి ఒకరు నా గురించి వివరాలడిగారు. నేనీ పని తెలుగుబ్లాగరుల తరపున చేస్తున్నాని తెలుపగా, ఆయన తెలుగు బ్లాగరులు తయారు చేసిన వివరాలకు, ప్రతిజ్ఞకు తనకున్న పరిచయాల ద్వారా విస్తృతప్రచారం చేయిస్తానని అడక్కుండానే ముందుకు రావడమేగాక రాష్ట్రవ్యాప్తంగా తెలుగు భాష పట్ల స్పృహ ఒక ఉద్యమ స్థాయిలో రావాలని, ఏబీకేప్రసాద్ లాంటివాళ్ళ సహకారంతో అందుకు తగిన కార్యక్రమాలు రూపొందించుకుని అమలు చేయాలని అనడమేగాక బ్లాగరుల సమావేశాలకు వస్తాననీ, పత్రికల్లో (కనీసం తమ పత్రిక ఆంధ్రప్రభలో) బ్లాగుల గురించి, ఇంటర్నెట్లో తెలుగు వ్యాప్తి గురించి మనం రాసినవి ప్రచురింపజేస్తానని అన్నారు. ప్రసారమాధ్యమాల్లో తెలుగు దీనస్థితి గురించి కూడా నా అభిప్రాయంతో ఆయన ఏకీభవించారు.

విద్యార్థులు కానివాళ్ళు పుట్టపర్తి వారికి జరిగిన అపచారానికి ఆగ్రహం వ్యక్తం చేయడమేగాక మనం చేస్తున్న పనిని అభినందించారు. విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుల ఛాంబర్లో కరపత్రాలు అందజేసి విశ్వవిద్యాలయంలోని అన్ని విభాగాలకు వాటి ప్రతులను పంపించమని అక్కడివారిని కోరాను. వారు విషయం తెలుసుకుని సంతోషించి సభకు వచ్చినవారందరికీ వెంటనే పంచెయ్యమని ప్రోత్సహించారు. త్వరలోనే కరపత్రాలన్నీ అయిపోయాయి. ఇంకో వందేసి ప్రతులు తీసుకువచ్చి ఉంటే బాగుండేదనిపించింది.

ఇక సభలో ముందుగా మాట్లాడిన వేటూరి సుందరరామమూర్తి మాట్లాడిన తీరు చూస్తే ఆయన పుట్టపర్తివారికి జరిగిన అపచారాన్ని మంత్రిగారి సమక్షంలో అందరికీ ఎత్తిచూపడానికే సభకు వచ్చినట్లు నాకు అనిపించింది. ఆయన ప్రొద్దుటూరు గురించి చెబుతూ "ఇద్దరు మహాకవుల విగ్రహాలు గల ఊరు ప్రొద్దుటూరు." అని చెప్పారు. ఆ ఇద్దరూ శివతాండవకర్త పుట్టపర్తి, శివభారతకర్త గడియారం వెంకటశేషశాస్త్రి. తర్వాత మాట్లాడిన మంత్రి రోశయ్య కూడా "ఇంతటి అపచారానికి పాల్పడినవారెవరో నాకు తెలియదు గానీ (తెలియకపోతే తెలుసుకోండి సార్! పూర్తిపేరు నంద్యాల వరదరాజుల రెడ్డి. వరుసగా నాలుగోసారి శాసనసభ్యత్వం వెలగబెడుతున్నాడు.) ఎవరు చేసినా ఇది చాలా నీచమైన పని." అని కాసేపు తిట్టి తప్పనిసరిగా దీన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్ళి, అక్కడ పుట్టపర్తివారి ఒక్క విగ్రహమే ఉండేలా చూస్తానన్నారు. తమ పిల్లల చేత మమ్మీ, డాడీ అని పిలిపించుకోవాలని ఉబలాటపడేవాళ్ళను రోశయ్య సున్నితంగా విమర్శించారు.

అది విన్న నాకు ఈ మధ్యే ఒకసారి FM రేడియోలో నేను విన్న సంభాషణ గుర్తొచ్చింది:

లంగరమ్మ (అక్కినేని నాగేశ్వరరావుతో): మీ పిల్లలు, మనవలు మిమ్మల్ని ఏమని పిలుస్తారు?
అక్కినేని: అమ్మ-నాన్న, అమ్మమ్మ-తాతయ్య.
లంగరమ్మ: ఒకవేళ ఎవరైనా మమ్మీ-డాడీ అనో, గ్రాండ్మా-గ్రాండ్పా అనో పిలిస్తే?
అక్కినేని (తీవ్రంగా): దవడ పగిలిపోతుంది.

పుట్టపర్తి సర్కిల్ లో పుట్టపర్తివారి ఒక్క విగ్రహమే ఉండేలా చూస్తానని కడప కలెక్టరు కూడా ఏబీకేప్రసాద్ తదితరులకు హామీ ఇచ్చినట్లు సభ పూర్తయ్యాక రచన సంపాదకులు శాయి ద్వారా నాకు తెలిసింది.

ఈ సమావేశానికి కారా మాస్టారు రావడం ఇంకొక విశేషం.

Tuesday 12 September, 2006

అరాచకాన్ని ఎదిరిద్దాం!

పుట్టపర్తి వారి విగ్రహానికి ఓ అరాచకీయుడు చేసిన అపచారంపై ఈ పిటిషన్ను

(http://www.petitiononline.com/Puttapar/petition.html)

చూశారా? చూసి, మీ వోటు వెయ్యండి. మీ స్నేహితులకు చెప్పండి.



(చదువరి గారి బ్లాగు నుంచి)

Sunday 10 September, 2006

ఏది శాశ్వతం?

ఏది శాశ్వతం? మనుషుల జీవితాలు శాశ్వతమా? చనిపోయినవారి జ్ఞాపకాలు శాశ్వతమా? భవిష్యత్తరాలవారికి గతించిన మహానుభావులను గుర్తుచేసే విగ్రహాలు శాశ్వతమా? ఏదీ శాశ్వతం కాదు. మీమీ ఊళ్ళలో ఉన్న ప్రముఖుల విగ్రహాలు కూడా పరమపదించే ప్రమాదముంది తెలుసా? అదీ సహజమరణం కాదు. బలవన్మరణం. అందుకే మీరు ఈసారి ఏ ట్యాంక్‌బండు వైపో వెళ్ళినప్పుడు అక్కడున్న తెలుగుతేజాల విగ్రహాలనొకసారి కనులారా దర్శించుకోండి. బహుశా అవే చివరి చూపులు కావచ్చు. రేపటినుంచి మీకు ఆ అవకాశం కూడా దక్కకపోవచ్చు. పట్టణాలలో గతంలో ప్రతిష్టించిన విగ్రహాలను తొలగించి వాటి స్థానంలోనే ఇందిర, రాజీవ్ ల విగ్రహాలను ప్రతిష్టింపజేసే విగ్రహయజ్ఞం ప్రారంభమైంది. వయ్యెస్సార్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినవెంటనే అదే వేదిక మీదనుంచి గొంతు బొంగురుపోయేలా, దిక్కులు పిక్కటిల్లేలా అరిచి అరిచి చెప్పాడు: "రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం తెస్తాం. రాష్ట్రం యొక్క రూపూరేఖా స్వరూపాలు మారుస్తాం!" అని. దాని అర్థం మీకింకా బోధపడలేదా? రేప్పొద్దున మీరు అద్దంలో చూసుకున్నా రాజీవ్, ఇందిరల రూపాలే కనిపిస్తే కంగారుపడకండి.

నిన్న, మొన్న ప్రొద్దుటూరులో జరిగిన పరిణామాలివి:
నిన్న:

మొన్న:

Friday 8 September, 2006

కాళిదాసు కంచుబొమ్మ

గత సంవత్సరం (2005) చైనా ప్రభుత్వం నుంచి మన విదేశాంగశాఖవారికి వచ్చిన ఒక అభ్యర్థన వారిని తెల్లబోయేలా చేసింది. గందరగోళంలోకి నెట్టింది. చైనీయులు కోరింది క్రీ.శ. ఆరవ శతాబ్దానికి చెందిన ఒక మహనీయుడి కాంస్యవిగ్రహం కావాలని. ఆయనెలా ఉంటాడో ఎవరికీ తెలియదు. కనీసం రేఖాచిత్రాలు కూడా లేవు. అలాంటివాడి ప్రతిమ చేసివ్వమని అడిగితే ఏం చెయ్యడం? ఎలా ఇవ్వడం? అసలు చైనీయులకు ఆ విగ్రహంతో ఏం పనిబడింది?

చైనా ప్రభుత్వం తమ దేశప్రజల్లో సాంస్కృతిక అవగాహనను పెంచడానికిగాను షాంఘై థియేటర్ స్ట్రీట్ లో కాళిదాసు విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని నిర్ణయించింది. ఐతే సమస్యేమిటంటే కాళిదాసు బొమ్మలు కాదుగదా కనీసం ఆయన రూపురేఖావిలాసాదులెలాంటివో తెలిపే వర్ణనలైనా ఎక్కడా లేవు. చైనీయుల అభ్యర్థనను మన విదేశాంగశాఖ వారు భారతదేశ సాంస్కృతిక సంబంధాల మండలి (ICCR)కి, ఆ మండలి మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి, ఆ ప్రభుత్వమేమో ఉజ్జయినిలో ఉండే కాళిదాసు అకాడెమీకి పంపించారు. ఆ మహాకవి, నాటకకర్త క్రీ.శ. ఆరవ శతాబ్దంలో ఉజ్జయినిలోనే నివసించాడని నమ్ముతున్నారు.

కాళిదాసు రచనలను మనోవిశ్లేషణాత్మక దృక్పథంతో అధ్యయనం చేసిన నిపుణులు ఆయన చాలా అందగాడని తేల్చారు. (ఆయన పేరు మీద ప్రచారంలో ఉన్న అనేక కథలు; సాహిత్య, చారిత్రక గాథలు దీనికి అనుగుణంగానే ఉన్నాయి.) ఈ అంచనాల ఆధారంతో చివరికి తల నుంచి రొమ్ము వరకు గల ఒక 30 అంగుళాల కంచుబొమ్మను తయారుచేయించారు. ఇలాంటి ప్రయత్నం జరగడం మనదేశంలో ఇదే మొదటిసారి. ఈ విగ్రహాన్ని సాంస్కృతిక సంబంధాల మండలికి చెందిన విగ్రహ తయారీ నిపుణుల సంఘం ఆమోదించాక విదేశాంగశాఖ గత జూన్ నెల చివరి వారంలో చైనాకు పంపింది. ఆ విగ్రహాన్ని నిన్ననే షాంఘై థియేటర్ స్ట్రీట్ లో ఆవిష్కరించారు.

అక్కడ కొలువుదీరనున్న 19 మంది జగత్ప్రసిద్ధుల్లో ఆసియా ఖండానికి చెందిన ఒకేఒక వ్యక్తి మహాకవి కాళిదాసు.

మొదటివార్త ట్రిబ్యూన్ లో

తాజావార్త ఈరోజు హిందూ (ప్రింట్ ఎడిషన్)లో

Saturday 2 September, 2006

ఆసక్తికరమైన వార్తలు:

ఈరోజు హిందూలో వచ్చిన కొన్ని ఆసక్తికరమైన వార్తలు:

బలవంతమైన సర్పము నాలుగెలుకలచేత చిక్కి చావదె?(విశాఖపట్నంలో)
Rats kill cobra

VISAKHAPATNAM: Rodents are easy prey for snakes but a cobra that felt it could feast on a handful of rats kept in a tray faced stiff resistance and was killed by the rodents. This rare incident occurred in the Animal House of Andhra University College of Pharmaceutical Sciences on Friday. The research scholars fed the rats, on which an experiment was being carried out, around 11 a.m. and left . Meanwhile, the snake slithered into the Animal House and attacked the rats and killed two of them. But the remaining four rats attacked the cobra and killed it. - Special Correspondent

ముప్ఫయ్యేళ్ళుగా కూడబెట్టిన మూడున్నర లక్షల రూపాయలను దేవాలయానికి విరాళంగా ఇచ్చిన బిచ్చగత్తె!(కడపలో)

రాబందుల పరిరక్షణలో నెహ్రూ జూ పార్కు(హైదరాబాదు)

"ప్రమాదాల్లో గాయపడి గానీ, పురిటినొప్పులతో గానీ, మరేవిధంగానైనా అత్యవసర వైద్యసహాయం అవసరమైనవారికి తక్షణ వైద్యసహాయం అందించడం వైద్యుల, ఆసుపత్రుల తప్పనిసరి బాధ్యత" అని చట్టాలు చేయమని రాష్ట్రప్రభుత్వాలకు సూచించిన 17వ లా కమిషన్.(ఢిల్లీ)