Sunday 28 January, 2007

సినిమా పండుగ రెండోరోజు విశేషాలు


మార్కస్ బార్ట్లే వాడిన మిచెల్ కెమెరా


పాతపాత్రల్లో కొత్తనటులు

దుర్యోధనుడిగా బాలకృష్ణ
ఆహార్యం: అదిరింది.
ఆంగికం: ఫర్వాలేదు.
వాచికం: అధ్వాన్నం.

శకుని పాత్రకు ఏవీఎస్ అతికినట్లు సరిపోయాడు.

ఉత్తరకుమారుడిగా బ్రహ్మానందం: బ్రహ్మానందం పర్ఫార్మెన్స్ ఇంత పేలవంగా ఉండగలదని ఊహించనేలేదు. రేలంగిలో శతాంశమైనా లేదు.
***

స్టేజి క్రింద అలనాటి సదాజపుడు పద్మనాభం ఈ వయసులో కూడా ఎక్కడా తడుముకోకుండా, తడబడకుండా "ప్రేమకోసమై..." పాటను పూర్తిగా ఆలపించి ప్రేక్షకులను ముగ్ధులను చేశారు.

ప్రదర్శనలో ఎన్టీయార్ వాడిన గదలు, కిరీటాలు వగైరాలతోబాటు మార్కస్ బార్ట్లే వాడిన కెమెరాను కూడా ప్రదర్శించడం విశేషం.


ఇక వినోద కార్యక్రమాల్లో వార్తలకు సునీల్ చేసిన అభినయం హైలైట్. అది చూసి నవ్వలేక చచ్చాం.

Monday 22 January, 2007

సుభాషితాలు

పెళ్ళనే అగ్రిమెంటుతో మగాడు తన బాచిలర్ డిగ్రీని కోల్పోతే ఆడదానికి మాస్టర్ డిగ్రీ వస్తుంది.

భార్యాభర్తల్లో ఒకరు ఏది చేస్తే అదే కరెక్టు. రెండోవారే భర్త.

మా ఆవిడా నేనూ ఎప్పటికప్పుడు సర్దుకుపోతూ ఉంటాం: నేను తప్పు చేశానని ఒప్పుకుంటాను. తనేమో ప్రతిసారీ నాతో ఏకీభవిస్తుంది.

కాన్ఫరెన్సు: ఒకరి మనసులోని గందరగోళాన్ని అందరికీ పంచడం.

కాన్ఫరెన్సు: అందరూ మాట్లాడుతారు, ఎవరూ వినరు, ఏ ఇద్దరూ ఏకీభవించరు.

సాధన కంటే ముందు విజయం, పని కంటే ముందు గెలుపు, పెళ్ళి కంటే ముందు పెటాకులు వచ్చేది నిఘంటువులోనే!

స్నేహితుణ్ణి అప్పు అడిగే ముందు మరొక్కసారి ఆలోచించు: నీకు అంతకంటే ఎక్కువ కావాలేమో?

మరణం వారసత్వంగా వస్తుంది.

వాదనలో మూడు పక్షాలుంటాయి. నీపక్షం, నాపక్షం, సరైన పక్షం.

విషయనిపుణులెవరంటే నీకర్థమయ్యే ఒక విషయాన్ని తీసుకుని దాన్ని నీకర్థం కాకుండా వివరించేవాళ్ళు.

మూర్ఖుడితో ఎప్పుడూ వాదించకు. చూసేవాళ్ళకు తేడా తెలీదు.

తప్పులు అందరూ చేస్తారు. ఎవరూ చూడనప్పుడు చేసేవాళ్ళే తెలివైనవాళ్ళు.

డబ్బు అవసరమైతే నిరాశావాది నుంచి తీసుకో. తిరిగొస్తుందని అనుకోడు.

ఎక్కువ అలసిపోకుండా అప్పుడప్పుడూ కునుకుతీస్తూ ఉంటే వృద్ధాప్యం మీదాకా రాదు...ఆ కునుకేదో మీరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు తీసినట్లైతే.

మొదటి బిడ్డ పుట్టినప్పుడు మీరు అమ్మో నాన్నో అవుతారు. రెండో బిడ్డ పుడితే మీరు రిఫరీ అవుతారు.

ప్రభుత్వమిచ్చిన వాణిజ్యప్రకటనలో "చిరునవ్వు"తో పన్నుకట్టమన్నారు. తీరా నేనదే పని చెయ్యబోతే అది చెల్లదు. డబ్బు తియ్యమన్నారు.

మీకు ప్రతిభ లేదని బాధపడకండి. చాలా మంది మనలాంటివాళ్ళే.

మీరెవరితో జీవించాలనుకుంటున్నారో వారిని కాకుండా ఎవరు లేకుండా మీరు జీవించలేరో వారిని పెళ్ళి చేసుకోండి. ఎటుతిరిగీ పశ్చాత్తాపం తప్పదనుకోండి. అది వేరే విషయం.

మీరు ప్రేమను కొనుక్కోలేరు. కానీ ప్రేమను పొందడానికి చాలా ఖర్చవుతుంది.

నిజమైన స్నేహితులు వెన్నుపోటు పొడవరు. ఎదుటికి వచ్చి పొడుస్తారు.

నన్ను బాధపెట్టిన నిన్ను అసహ్యించుకోవడానికి నాకు గల హక్కును వదులుకోవడమే క్షమ.

మంచి పౌరులు ఓటెయ్యకపోవడం వల్లే చెడ్డవాళ్ళు నాయకులౌతారు.

అలసిపోకముందే విశ్రాంతి తీసుకోవడం అలవాటుగా మారితే అదే సోమరితనం.

తమను చూసి తాము నవ్వుకోలేనివాళ్ళను చూసి అందరూ నవ్వుతారు.

మహిళలను గౌరవించడం మన సంప్రదాయం. అందమైనవాళ్ళను మరింతగా...

పెళ్ళైన మగాడు ఎన్ని ఉద్యోగాలు మారినా అతని పై అధికారి మారదుగా?

మన భాషను మాతృభాష అంటారు. తండ్రికి మాట్లాడే అవకాశముండదుగా? అందుకన్నమాట.

పిల్లల కోసం డబ్బు కూడబెట్టడం చాలా అవసరం. ముఖ్యంగా మన తల్లిదండ్రులకు.

తాము చెప్పవలసిందేదైనా ఉన్నప్పుడు నోరుతెరుస్తారు జ్ఞానులు. నోరు తెరిచాం కాబట్టి ఏదో ఒకటి చెప్పాలనుకుంటారు మూర్ఖులు

మూలం: తెలియదు
అనువాదం: త్రివిక్రమ్

సన్నపురెడ్డి నవలల సవ్వడి

ఒకే సంవత్సరం జరిగిన 3 నవలల పోటీల్లో ఒకే రచయిత రాసిన నవలలకు ప్రథమ బహుమతులు లభించడం అపూర్వం, అనితర సాధ్యం. అది 2006లో సన్నపురెడ్డి సాధించిన ఘనత. ఈయన రాసిన ఆ మూడు నవలలు:
తోలుబొమ్మలాట 2006 ఆటా పోటీలలో ప్రథమ బహుమతి (ఈ నవల సాహిత్యనేత్రం అక్టోబర్ 2006 సంచికలోను, ఆటా వారి 9వ ఆటా మహాసభల ప్రత్యేక సంచికలోను ప్రచురితమైంది).
పాలెగత్తె 2006లో స్వాతివారపత్రిక నిర్వహించిన నవలలపోటీలో ప్రథమ బహుమతి
చినుకుల సవ్వడి 2006లో నిర్వహించిన చతుర నవలపోటీలో ప్రథమ బహుమతి
సాధించాయి.
ఎవరీ సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి?
ఈయన ఒక మారుమూల పల్లెటూరిలో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు.
1980లలో కవితలు రాయడం మొదలుపెట్టాడు. 1980లలో వచ్చిన అత్యుత్తమ కవితలను ఏర్చికూర్చిన కవితాసంకలనం "కవితా! ఓ కవితా!!" లో ఈయన రాసిన 2 కవితలు చోటు సంపాదించుకున్నాయి. తర్వాతి కాలంలో రచన మాసపత్రికలో ఈయన కవితలు చదివిన యండమూరి వీరేంద్రనాథ్ "(ఇంత) బాగా రాయగలవాళ్ళు ఎక్కువగా ఎందుకు రాయరో నాకు అర్థం కాదు." అని రాశాడు. (స్వతహాగా కవి కావడం వల్లేనేమో నిండుకుండ నెత్తినపెట్టుకుని అడుగులేస్తూ ఉంటే నీళ్ళు చిందినంత సహజంగా సన్నపురెడ్డి రచనల్లో కవిత్వం ఒలుకుతూ ఉంటుంది.) 1990ల ప్రారంభంలో కథలు రాయడం ప్రారంభించిన ఈయన అచిరకాలంలోనే విస్మరించరాని కథారచయిత గుర్తించబడ్డాడు. సన్నపురెడ్డి కథలను రెండురకాలుగా విభజించవచ్చు: మంచి కథలు, గొప్ప కథలు. ఈయన రాసిన కథలు రాతిపూలు, కథాసాగర్, విశాలాంధ్ర తెలుగుకథ మొదలైన కథాసంకలనాల్లో చోటు సంపాదించుకున్నాయి.

ఇక ఈయన రాసిన తొలి నవల కాడి 1998లో ఆటా వారు నిర్వహించిన నవలల పోటీలో ద్వితీయబహుమతి పొందదమేగాక చిరస్థాయిగా నిలిచిపోగల అతికొద్ది తెలుగు నవలల్లో ఒకటిగా గుర్తించబడింది. తర్వాత ఆయన స్వాతివారపత్రిక లో పాండవబీడు అనే నవల రాశాడు. అప్పటికే నా దృష్టిలో స్వ+అతి గా మారిన స్వాతి వారపత్రికను నేను కేవలం ఈ సీరియల్ కోసమే చదివేవాడిని. ఆ సీరియల్ ముగిసినవెంటనే అదీ మానేశాను. మళ్ళీ దానిజోలికి పోలేదు. ఇప్పుడు మళ్ళీ పాలెగత్తె కోసం మొదలుపెట్టాల్సి వచ్చేలా ఉంది.

బహుమతులు పొందిన సన్నపురెడ్డి కథలు:

1996లో అప్పజోస్యుల విష్ణుభొట్ల ఫౌండేషన్ వారి కథలపోటీలో అంతు కథ ప్రథమ బహుమతి పొందింది.
అదే సంవత్సరం సాహిత్యనేత్రం నిర్వహించిన కథలపోటీలో చనుబాలు కథ ప్రథమబహుమతి పొందింది.
ఇవే కాకుండా ఈయన తడి, కొత్తదుప్పటి, ఒక్కవానచాలు, గిరగీయొద్దు, ఒక్కవానచాలు, దిగంబరం, ఊరిమిండి లాంటి కథలు రాశాడు.
తెలుగు భాష, సాహిత్యాలకు ఆయన చేసిన సేవకు 2004, 2006 సంవత్సరాలలో అధికారభాషాసంఘం ఆయనను ఘనంగా సత్కరించింది.

1996లో రాతిపూలు సంకలకర్తలు ఈయన గురించి ఇలా అన్నారు:

చాలామంది రచయితలకు లేని వైవిధ్యభరిత జీవితానుభవం ఉన్న రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి - అటువంటి గ్రామీణ జీవితానుభవసారం ఉండబట్టే "కవిత్వాన్నీ, కథనీ కోపుయాస లేని ఎద్దులుగా సాహిత్య వ్యవసాయాన్ని" చేస్తున్నాడు.
కవితల్లో వ్యక్తీకరించలేని భావాల్ని కథల్లో, కథల్లో ఇమడ్చలేని సున్నితవ్యక్తీకరణల్ని కవితల్లో ఒదిగిస్తున్నారు వెంకటరామిరెడ్డి.
పుట్టింది, పెరిగింది, ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నది కడప జిల్లా కలసపాడు మండలం బాలరాజుపల్లె కుగ్రామం కావడంతో తన కథలకూ, కవితలకూ అవసరమైన మూలబీజాల్ని ఆ గ్రామీణం నుండే ఏరుకోగలుగుతున్నాడు. అక్కడి బడుగుజీవులైన రైతుల, రైతుకూలీల బతుకువెతల్ని తన కళ్ళలో నింపుకుంటూ, తన కళ్ళ దర్పణాల్లో వాళ్ళ జీవిత ప్రతిబింబాల్ని పాఠకలోకానికి స్పష్టంగా చూపించగలుగుతున్నారు.
అంతేకాకుండా పల్లె ప్రజల నెత్తుటిలో మలేరియా క్రిమిలా వ్యాపించిన హీనరాజకీయాల్ని - వాళ్ళ బతుకుల్నిండా చీడై కమ్ముకున్న కరువు గురించి - ప్రభుత్వ సవతి ప్రేమను గురించి ఆవేదన చెందుతూ వాటికి ఆస్కారమిచ్చిన మూలాల గురించి నిరంతరం అన్వేషిస్తూ ఉన్న అరుదైన రచయిత వెంకటరామిరెడ్డి.

Sunday 21 January, 2007

కడపోత్సవాలు - 00(7)

మీకు తెలుసా - జవహర్లాల్ నెహ్రూ తాను ప్రధానమంత్రిగా ఉన్నరోజుల్లో కడపజిల్లా బద్వేల్ తాలూకా పోరుమామిళ్ళ దగ్గరున్న సిద్ధవరం అగ్రహారం నుంచి తోలుబొమ్మలాట కళాకారులను ఢిల్లీకి ప్రత్యేకంగా పిలిపించుకుని ఆటాడించి అభినందించారని?
మామూలుగా అయితే ఈపాటికి కడప కడపోత్సవాలతో సందడిసందడిగా ఉండేది. కడప జిల్లాకు బాంబుల గడపగా, ఫ్యాక్షనిస్టుల గడ్డగా ఉన్న మచ్చను చెరిపేసి కడపకున్న భాషా, సాహిత్య, సాంస్కృతిక, చారిత్రక, ఆర్థిక ప్రాధాన్యతను చాటిచెప్పి 'ఇదీ మా కడప!' అని సగర్వంగా చెప్పుకునేలా చేసే వార్షిక సంబరాలు కడపోత్సవాలు. గత ఐదు సంవత్సరాలుగా జనవరి మూడో వారంలో కడపలో మూడురోజులపాటు జరుగుతూ వస్తున్నాయి.
ఘనమైన కడప ప్రాంత విశిష్టతలను చాటిచెప్పే వివిధ రకాల ప్రదర్శనలతో, అలనాటి విజయనగర భువనవిజయాన్ని గుర్తుకు తెచ్చే చర్చాగోష్టులతో సందడిగా ఉండవలసిన కడప గడప ఈసారి స్తబ్ధుగా ఉంది. కడపోత్సవాలు ఈసారి ఎందుకు నిర్వహించలేదని ఇద్దరు పురప్రముఖులను అడిగితే ముఖ్యమంత్రి ఈసారికి వద్దన్నాడని ఒకరు, కలెక్టరు ఆసక్తి చూపడం లేదని ఇంకొకరూ సమాధానం చెప్పారు. లోగుట్టు పెరుమాళ్ళకెరుక!

మీకు తెలుసా -

ప్రపంచప్రఖ్యాత సురభినాటకసమాజం కడపజిల్లాలోని ఒక మారుమూల పల్లెటూళ్ళో పుట్టిందని?
తొలి తెలుగుశాసనం కడపజిల్లాలోనే బయల్పడిందని?
తెలుగులో తొలి స్వతంత్రకావ్యకర్త, ఆంధ్రకవితాపితామహుడు ఇక్కడివాడేనని?
తొలి తెలుగు కవయిత్రి తాళ్ళపాక తిమ్మక్క, సుప్రసిద్ధ కవయిత్రి మొల్ల ఇక్కడివారేనని?
అష్టదిగ్గజకవుల్లో నలుగురు కడపజిల్లావారేనని?
అన్నమయ్య, యోగివేమన, సామాజికతత్త్వవేత్త పోతులూరి వీరబ్రహ్మం మొదలైనవారంతా ఇక్కడివారేనని?
ఆంధ్రవాల్మీకి, వాసుదాసు వావిలికొలను సుబ్బారావు ఇక్కడివాడేనని?
అగణితప్రజ్ఞగల గణితబ్రహ్మ లక్కోజుసంజీవరాయశర్మ ఇక్కడివాడేనని?
సరస్వతీపుత్ర, శివతాండవకర్త పుట్టపర్తి నారాయణాచార్యులు, శివభారతకర్త గడియారం వెంకటశేషశాస్త్రి ఇక్కడివారేనని?
అవధానులకు ఇది ఆలవాలమని?
తెలుగుసూర్యుడు సి.పి.బ్రౌన్ స్థిరనివాసమేర్పరచుకుని, తెలుగుతేజాన్ని, వేమనశతకపు వెలుగులను ప్రపంచానికి చూపింది ఇక్కడినుంచేనని?
తొలి తెలుగుపత్రిక రాయవాచకం సంపాదకుడు, ఇల్లస్ట్రేటెడ్ వీక్లీకి సంపాదకుడైన తొలి భారతీయుడు బి.వి.రామన్ ఇక్కడివాడేనని?
సుప్రసిద్ధ సాహితీ విమర్శకుడు, అనువాదకుడు, పత్రికా సంపాదకుడు రా.రా. ఇక్కడివాడేనని?
సుప్రసిద్ధ కవి, పాత్రికేయుడు గజ్జెల మల్లారెడ్డి ఇక్కడివాడేనని?
తెలుగుసినిమా స్వర్ణయుగపు ధృవతారలు బి.ఎన్.రెడ్డి, నాగిరెడ్డి ఇక్కడివారేనని?
సుప్రసిద్ధ కథారచయితలు కేతు విశ్వనాథరెడ్డి, సొదుం జయరాం, సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి, దాదాహయత్ మొదలైన వారు ఇక్కడివారేనని?
తిరుమలేశుని తొలిగడప ఇక్కడుందని?
భౌగోళికంగా దక్కన్ పీఠభూమి ఆవిర్భావానికి మూలం ఇక్కడేనని?
భారతదేశంలో హనుమంతుడు లేని ఏకైక రామాలయం ఇక్కడుందని?

Thursday 4 January, 2007

ఉలిపికట్టె

ఊరందరిదీ ఒకదారైతే ఉలిపికట్టెదింకొకదారి అని సామెత. ఇక్కడ ఉలిపికట్టెను నేనే! ఒకటిరెండు విషయాల్లో నేను నిజంగా ఉలిపికట్టెనేనేమో అనిపిస్తుంది కొన్నిసార్లు. ఉదాహరణకు నా రూమ్మేట్లందరూ టీవీకి అతుక్కుపోయి క్రికెట్ మ్యాచ్ చూస్తున్న సమయంలో అసలా మ్యాచ్ ఎవరెవరికి మధ్య జరుగుతోందో కూడా పట్టించుకోకుండా నా పనిలో నేను నిమగ్నమవడం మా రూం లో సాధారణంగా కనబడే దృశ్యం. మరే ఇతర క్రీడా లేనంతగా రోజంతా మాత్రమే కాకుండా రోజుల తరబడి కూడా ఆడే ఆట కూడా ఇదొక్కటే! ఎవరైనా క్రికెట్ గురించి నాతో మాట్లాడబోతే 'ఊ', 'ఆ' అని ఊకొట్టడమే తప్ప నేనెప్పుడూ సంభాషణ పొడిగించను.

టీవీలో మ్యాచులు చూడను, సరే! పేపరులో కూడా స్పోర్ట్స్ పేజీలో క్రికెట్ గురించి చదవడం మానేశానీమధ్య. ఎందుకంటే క్రికెట్ గురించి నేను చదివి తెలుసుకోదగ్గ విశేషాలన్నీ మొదటి పేజీలోనే ప్రత్యక్షమౌతూ ఉంటే ఇంకా స్పోర్ట్స్ పేజీలో కూడా క్రికెట్ గురించే చదవడమెందుకు? అదీ నా ఆలోచనాధోరణి. మరి నేను ఉలిపికట్టెను కాదంటారా?

కొంతమంది...కొంతమందేమిటి లెండి చాలా మంది కూడూ నీళ్ళూ కూడా మానేసి క్రికెట్ చూడడమే గాక క్రికెట్ గురించి మాట్లాడుతూ కూడా కూడూ నీళ్ళూ మరిచిపోగలరు. క్రికెటర్ల క్రీడానైపుణ్యాల గురించి, క్రీడారాజకీయాల గురించి, బీసీసీఐ నిర్వహణ గురించి అంతులేని ఉత్సాహంతో తమ చుట్టూ ఉన్నవారికి తమ అభిప్రాయాలు, సూచనలు అందజేస్తూ ఉంటారు. అలాంటివాళ్ళందరికీ నా విన్నపం: మీ చర్చోపచర్చల ద్వారా భారత క్రికెట్ ను సంస్కరించగల సత్తాయే మీకుంటే మీ చర్చలను దయచేసి మనదేశంలో శాసనవ్యవస్థ మీదికి, చట్టాలు అమలౌతున్న తీరు మీదికి మళ్ళించండి. దేశానికి మీరు అంతకంటే చెయ్యగల గొప్ప సేవ మరి ఉండబోదు.

కోట్లాది మందికి రోజుల తరబడి నిరర్థకంగా గడపగల గొప్ప అవకాశాన్నిచ్చింది క్రికెట్. అసలు క్రికెట్ ఆటే పొద్దున్నుంచి సాయంత్రం దాకా - టెస్ట్ మ్యాచైతే ఐదు రోజులపాటు, వన్ డే ఐతే ఒక రోజంతా - జరుగుతుంది. ఇంత సుదీర్ఘ సమయాన్ని హరించే ఆట మరేదీ లేదు. ఈ విషయంలో ఇప్పుడిప్పుడే కళ్ళు తెరిచి ఆటను 20 ఓవర్లకు కుదిస్తున్నారనుకోండి.

అసలు ఆటల ప్రధానోద్దేశ్యం వ్యాయామం. క్రికెట్ ఆట జరిగేటప్పుడు మీరు జాగ్రత్తగా గమనించండి: మైదానంలో ఇరుజట్లలో మొత్తం కలిపి ఉండే 13 మంది ఆటగాళ్ళలో ఎప్పుడు చూసినా కనీసం 9-10 మంది కదలామెదలక ఊరికే నిలబడి ఉంటారు:
బౌలర్ బంతి విసిరేటప్పుడు బౌలర్, స్ట్రైకింగ్ బ్యాట్స్‌మన్, వికెట్ కీపర్ మాత్రమే "అలర్ట్" గా ఉంటారు. వాళ్ళలో "కదిలేది" బౌలర్ ఒక్కడే! మిగిలినవాళ్ళు 10-12 మంది.

బ్యాట్స్‌మెన్ పరుగులు తీసేటప్పుడు పరిగెత్తేవాళ్ళు మహా ఐతే నలుగురు (ఇద్దరు బ్యాట్స్‌మెన్ పరుగుల కోసం, ఇద్దరు ఫీల్డర్లు బంతి కోసం). మిగిలినవాళ్ళు 9 మంది.

ఈ పరిగెత్తే అవసరం ప్రతి బంతికీ రాదనే విషయం మనం లెక్కలోకి తీసుకుంటే మైదానపు ఆటల్లో (out-door games) ఇంత "రిలాక్సింగ్ గేమ్" ఇంకొకటి లేదు.

అలాగే సామాన్య ప్రేక్షకుల సమయాన్ని ఇంతగా వ్యర్థం చేసే ఆటా మరొకటి లేదు. క్రికెట్ మ్యాచ్ జరుగుతోందంటే చాలు. కార్యాలయాల్లో పనిచేసేటందుకు పెద్ద పెద్ద మొత్తాల్లో జీతాలు తీసుకునేవారు సైతం పనిమానేసి క్రికెట్ గురించే ఆలోచించడం, 'స్కోరెంత?' తో మొదలుపెట్టి రోజంతా క్రికెట్ గురించే కబుర్లు చెప్పుకోవడం. ఇదీ వరస.

ఇది చాలనట్లు గత సంవత్సరంలో ఒకసారి క్రికెట్ ఆటను ప్రత్యక్షంగా చూడలేకపోవడం తమ ప్రాథమిక హక్కులకు భంగం అని భావించి సుప్రీమ్‌కోర్టులో ప్రజాప్రయోజనవ్యాజ్యం వేయడమే పిచ్చికి పరాకాష్ట అనుకున్న నన్ను సుప్రీమ్‌కోర్టు ఆ పిటీషన్ను తోసిపారెయ్యకుండా విచారణకు స్వీకరించడం అయోమయంలో పడవేసింది. టీవీలో వార్తాఛానెళ్ళు నిమిషానికొకసారి, ఇంటర్నెట్లో కొన్ని వెబ్‌సైట్లు ప్రతి బంతికి ఒకసారి (ball-to-ball updates) విశేషాలను అందిస్తుండగా ఈ పిచ్చేమిటా అని. నా ఆలోచనాధోరణిలో లోపమేమైనా ఉందా?

పోనీ మన దేశంలో ఇంత ఆదరణ పొందుతున్న ఈ ఆటలో మన జట్టు సాధిస్తున్న విజయాలు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయా? అంటే అదీ లేదు. ఉలిపికట్టెను ఐతే అయ్యానుగానీ ఈ క్రికెట్ పిచ్చి నాకు లేనందుకు నేనెంతో సంతోషిస్తున్నాను. ఈ క్రికెట్ మూలంగా జనాలు మరో ఆట గురించి, మరో వ్యాపకం గురించి ఆలోచించడమే మానేశారు. ఇది అత్యంత దురదృష్టకర పరిణామం.
ఐతే క్రికెట్ వల్ల లాభాలే లేవా అంటే లేకేం? ఉన్నాయి.
1. జట్లు జట్లుగా ఆడే ఆటల వల్ల ఉండే ప్రయోజనమొకటుంది. అదే: ఆడేవాళ్ళలో "నేను, నా" అనే భావనలకు బదులుగా "మనం, మన" అనే భావనలు బలపడడం. ఆటలో రాజకీయాలు, స్వార్థప్రయోజనాలు చోటుచేసుకోనంతవరకు ఇది ఖచ్చితంగా ప్రయోజనమే. ఇది ఆటగాళ్ళకు కలిగే ప్రయోజనం.
2. ఇక ప్రేక్షకుల్లో కుల, మత, జాతి, వర్ణ, వర్గ భేదాలు సమసిపోతాయి క్రికెట్ విషయంలో. అలాగే
3. 'స్కోరెంత?' అనే మాటకు ఏ మంత్రానికీ లేని శక్తి ఉంది - ఇద్దరు అపరిచితుల మధ్య మాటలు కలపడంలో.


ఇవి కాక ఇంకేమైనా ఉన్నాయా? మీకు తెలిస్తే చెప్పండి.

Tuesday 2 January, 2007

తెలుగు సాహితీ సదస్సు

అనుకున్నట్లుగానే చదువరి, సుధాకర్, రమణ, నేను తెలుగుసాహితీసదస్సులో "మీ కంప్యూటరుకు తెలుగు నేర్పడం ఎందుకు? ఎలా?" పుస్తకం ప్రతులు దాదాపు 600 మందికి పంచిపెట్టాం. అంతే కాదు, అక్కడ కొందరు ప్రముఖులను కలిసి మన కార్యక్రమాలను వివరించే అవకాశం కూడా కలిగింది. తెలుగు వికీపీడియన్ కూడా అయిన ప్రసిద్ధ రచయిత వివినమూర్తిగారు బెంగళూరు నుంచి కేవలం తెలుగు వికీపీడియనులను కలవడానికే హైదరాబాదుకు వచ్చాననడం సంభ్రమాశ్చర్యాలను కలిగించే విశేషం. అంతే కాదు, ఆయన కారా మాస్టారికి, ప్రముఖ చిత్రకారుడు చంద్ర, తదితరులకు వికీపీడియా, విక్షనరీ, ఇతర సోదర ప్రాజెక్టులను గురించి ఉత్సాహంగా వివరించారు. హైదరాబాదు తెలుగు బ్లాగరులు-వికీపీడియనుల సమావేశాల్లో చాలా మంచి విషయాలను చర్చిస్తున్నారని, బెంగుళూరులో సమావేశాలు జరుగుతున్నట్లైతే తాను తప్పక హాజరౌతానని కూడా అన్నారు. బెంగుళూరు తెలుగు బ్లాగరులారా! ఇక మీదే ఆలస్యం. (మాకినేని ప్రదీపు, కూనపరెడ్డి మురళీకృష్ణ, అనిల్ చీమలమఱ్ఱి బెంగుళూరులోనే ఉన్నారనుకుంటా!)

ప్రవాసాంధ్ర రచయితల్లో అగ్రగణ్యుడు, గతంలో vemurione పేరుతో సైన్సు విషయాల గురించి అరటిపండు ఒలిచిపెట్టినట్లు వికీపీడియాలో వ్యాసాలు రాసిన వేమూరి వేంకటేశ్వరరావుగారికి ఆ విషయాలను గుర్తుచేసి, పుస్తక ప్రతులను ఇవ్వడమేగాక మళ్ళీ ఒకసారి వికీపీడియాలో రాయవలసిందని కోరాం.

వీళ్ళిద్దరి ఈమెయిల్ ఐడీలను కూడా తీసుకున్నాం. ఈ సదస్సులో మరో ప్రముఖ రచయిత సత్యం మందపాటి గారితో కూడా పరిచయం ఏర్పడింది. ఆయన వెబ్‌సైటు (http://satyam-mandapati.com) యూనికోడులో లేకపోవడాన్ని గమనించి నేను ఆయనకు గతరాత్రే ఈమెయిల్ కూడా చేశాను.

ఇక ఈటీవీ2 లో తెలుగు-వెలుగు కార్యక్రమ ప్రయోక్త మృణాళిని గారు తెలుగుబ్లాగులు, తెలుగువికీల గురించి వరల్డ్ స్పేస్ రేడియో ప్రేక్షకులకు కూడా తప్పక చెబుతానన్నారు. హైదరాబాదు విశ్వవిద్యాలయం లోని CALTS కు చెందిన డా.ఉమామహేశ్వరరావు గారు వేదికమీద మాట్లాడిన ధోరణి యూనికోడుకు వ్యతిరేకంగా ధ్వనించినా తర్వాత రమణ, నేను విడిగా కలిసి మాట్లాడినప్పుడు మన కార్యకలాపాలపై ఆసక్తి కనబరచారు. సదస్సులో తెలుగుబ్రెయిన్స్ ప్రతినిధి భాస్కర్ తెలుగుబ్రెయిన్స్ లో వీవెన్ ద్వారా మన కార్యక్రమాలు తమకు బాగా తెలుసని చెప్పారు. ఒక్క తెలుగుపీపుల్.కాం ప్రతినిధిని మాత్రం కలుసుకోలేకపోయాం.