Thursday, 4 January, 2007

ఉలిపికట్టె

ఊరందరిదీ ఒకదారైతే ఉలిపికట్టెదింకొకదారి అని సామెత. ఇక్కడ ఉలిపికట్టెను నేనే! ఒకటిరెండు విషయాల్లో నేను నిజంగా ఉలిపికట్టెనేనేమో అనిపిస్తుంది కొన్నిసార్లు. ఉదాహరణకు నా రూమ్మేట్లందరూ టీవీకి అతుక్కుపోయి క్రికెట్ మ్యాచ్ చూస్తున్న సమయంలో అసలా మ్యాచ్ ఎవరెవరికి మధ్య జరుగుతోందో కూడా పట్టించుకోకుండా నా పనిలో నేను నిమగ్నమవడం మా రూం లో సాధారణంగా కనబడే దృశ్యం. మరే ఇతర క్రీడా లేనంతగా రోజంతా మాత్రమే కాకుండా రోజుల తరబడి కూడా ఆడే ఆట కూడా ఇదొక్కటే! ఎవరైనా క్రికెట్ గురించి నాతో మాట్లాడబోతే 'ఊ', 'ఆ' అని ఊకొట్టడమే తప్ప నేనెప్పుడూ సంభాషణ పొడిగించను.

టీవీలో మ్యాచులు చూడను, సరే! పేపరులో కూడా స్పోర్ట్స్ పేజీలో క్రికెట్ గురించి చదవడం మానేశానీమధ్య. ఎందుకంటే క్రికెట్ గురించి నేను చదివి తెలుసుకోదగ్గ విశేషాలన్నీ మొదటి పేజీలోనే ప్రత్యక్షమౌతూ ఉంటే ఇంకా స్పోర్ట్స్ పేజీలో కూడా క్రికెట్ గురించే చదవడమెందుకు? అదీ నా ఆలోచనాధోరణి. మరి నేను ఉలిపికట్టెను కాదంటారా?

కొంతమంది...కొంతమందేమిటి లెండి చాలా మంది కూడూ నీళ్ళూ కూడా మానేసి క్రికెట్ చూడడమే గాక క్రికెట్ గురించి మాట్లాడుతూ కూడా కూడూ నీళ్ళూ మరిచిపోగలరు. క్రికెటర్ల క్రీడానైపుణ్యాల గురించి, క్రీడారాజకీయాల గురించి, బీసీసీఐ నిర్వహణ గురించి అంతులేని ఉత్సాహంతో తమ చుట్టూ ఉన్నవారికి తమ అభిప్రాయాలు, సూచనలు అందజేస్తూ ఉంటారు. అలాంటివాళ్ళందరికీ నా విన్నపం: మీ చర్చోపచర్చల ద్వారా భారత క్రికెట్ ను సంస్కరించగల సత్తాయే మీకుంటే మీ చర్చలను దయచేసి మనదేశంలో శాసనవ్యవస్థ మీదికి, చట్టాలు అమలౌతున్న తీరు మీదికి మళ్ళించండి. దేశానికి మీరు అంతకంటే చెయ్యగల గొప్ప సేవ మరి ఉండబోదు.

కోట్లాది మందికి రోజుల తరబడి నిరర్థకంగా గడపగల గొప్ప అవకాశాన్నిచ్చింది క్రికెట్. అసలు క్రికెట్ ఆటే పొద్దున్నుంచి సాయంత్రం దాకా - టెస్ట్ మ్యాచైతే ఐదు రోజులపాటు, వన్ డే ఐతే ఒక రోజంతా - జరుగుతుంది. ఇంత సుదీర్ఘ సమయాన్ని హరించే ఆట మరేదీ లేదు. ఈ విషయంలో ఇప్పుడిప్పుడే కళ్ళు తెరిచి ఆటను 20 ఓవర్లకు కుదిస్తున్నారనుకోండి.

అసలు ఆటల ప్రధానోద్దేశ్యం వ్యాయామం. క్రికెట్ ఆట జరిగేటప్పుడు మీరు జాగ్రత్తగా గమనించండి: మైదానంలో ఇరుజట్లలో మొత్తం కలిపి ఉండే 13 మంది ఆటగాళ్ళలో ఎప్పుడు చూసినా కనీసం 9-10 మంది కదలామెదలక ఊరికే నిలబడి ఉంటారు:
బౌలర్ బంతి విసిరేటప్పుడు బౌలర్, స్ట్రైకింగ్ బ్యాట్స్‌మన్, వికెట్ కీపర్ మాత్రమే "అలర్ట్" గా ఉంటారు. వాళ్ళలో "కదిలేది" బౌలర్ ఒక్కడే! మిగిలినవాళ్ళు 10-12 మంది.

బ్యాట్స్‌మెన్ పరుగులు తీసేటప్పుడు పరిగెత్తేవాళ్ళు మహా ఐతే నలుగురు (ఇద్దరు బ్యాట్స్‌మెన్ పరుగుల కోసం, ఇద్దరు ఫీల్డర్లు బంతి కోసం). మిగిలినవాళ్ళు 9 మంది.

ఈ పరిగెత్తే అవసరం ప్రతి బంతికీ రాదనే విషయం మనం లెక్కలోకి తీసుకుంటే మైదానపు ఆటల్లో (out-door games) ఇంత "రిలాక్సింగ్ గేమ్" ఇంకొకటి లేదు.

అలాగే సామాన్య ప్రేక్షకుల సమయాన్ని ఇంతగా వ్యర్థం చేసే ఆటా మరొకటి లేదు. క్రికెట్ మ్యాచ్ జరుగుతోందంటే చాలు. కార్యాలయాల్లో పనిచేసేటందుకు పెద్ద పెద్ద మొత్తాల్లో జీతాలు తీసుకునేవారు సైతం పనిమానేసి క్రికెట్ గురించే ఆలోచించడం, 'స్కోరెంత?' తో మొదలుపెట్టి రోజంతా క్రికెట్ గురించే కబుర్లు చెప్పుకోవడం. ఇదీ వరస.

ఇది చాలనట్లు గత సంవత్సరంలో ఒకసారి క్రికెట్ ఆటను ప్రత్యక్షంగా చూడలేకపోవడం తమ ప్రాథమిక హక్కులకు భంగం అని భావించి సుప్రీమ్‌కోర్టులో ప్రజాప్రయోజనవ్యాజ్యం వేయడమే పిచ్చికి పరాకాష్ట అనుకున్న నన్ను సుప్రీమ్‌కోర్టు ఆ పిటీషన్ను తోసిపారెయ్యకుండా విచారణకు స్వీకరించడం అయోమయంలో పడవేసింది. టీవీలో వార్తాఛానెళ్ళు నిమిషానికొకసారి, ఇంటర్నెట్లో కొన్ని వెబ్‌సైట్లు ప్రతి బంతికి ఒకసారి (ball-to-ball updates) విశేషాలను అందిస్తుండగా ఈ పిచ్చేమిటా అని. నా ఆలోచనాధోరణిలో లోపమేమైనా ఉందా?

పోనీ మన దేశంలో ఇంత ఆదరణ పొందుతున్న ఈ ఆటలో మన జట్టు సాధిస్తున్న విజయాలు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయా? అంటే అదీ లేదు. ఉలిపికట్టెను ఐతే అయ్యానుగానీ ఈ క్రికెట్ పిచ్చి నాకు లేనందుకు నేనెంతో సంతోషిస్తున్నాను. ఈ క్రికెట్ మూలంగా జనాలు మరో ఆట గురించి, మరో వ్యాపకం గురించి ఆలోచించడమే మానేశారు. ఇది అత్యంత దురదృష్టకర పరిణామం.
ఐతే క్రికెట్ వల్ల లాభాలే లేవా అంటే లేకేం? ఉన్నాయి.
1. జట్లు జట్లుగా ఆడే ఆటల వల్ల ఉండే ప్రయోజనమొకటుంది. అదే: ఆడేవాళ్ళలో "నేను, నా" అనే భావనలకు బదులుగా "మనం, మన" అనే భావనలు బలపడడం. ఆటలో రాజకీయాలు, స్వార్థప్రయోజనాలు చోటుచేసుకోనంతవరకు ఇది ఖచ్చితంగా ప్రయోజనమే. ఇది ఆటగాళ్ళకు కలిగే ప్రయోజనం.
2. ఇక ప్రేక్షకుల్లో కుల, మత, జాతి, వర్ణ, వర్గ భేదాలు సమసిపోతాయి క్రికెట్ విషయంలో. అలాగే
3. 'స్కోరెంత?' అనే మాటకు ఏ మంత్రానికీ లేని శక్తి ఉంది - ఇద్దరు అపరిచితుల మధ్య మాటలు కలపడంలో.


ఇవి కాక ఇంకేమైనా ఉన్నాయా? మీకు తెలిస్తే చెప్పండి.

11 comments:

ప్రసాద్ said...

అమ్మయ్య! నేనే కాదు, ఇంకొకరున్నారు అని అనుకున్నాను ఇది చదివి. మీతో నేను 200 శాతము అంగీకరిస్తున్నాను.

--ప్రసాద్
http://blog.charasala.com

Naveen said...

హమ్మయ్య నాలాగే ఇంకొందరున్నారన్న మాట.

సత్యసాయి కొవ్వలి said...

నేను క్రికెట్ వినను, చూడను, మాట్లాడను. ఎప్పుడైనా చాలా ఖాళీగా ఉంటే, చూస్తాను అదీ నిర్లిప్తంగా ఎటువంటి ఉద్వేగంలేకుండా. దేశం ఏమాత్రమైనా బాగుపడాలంటే క్రికెట్ని బ్యాన్ చేయాలంటాను- ఎంత కాలాన్ని వృధా చేస్తుందీ ఆట!.

Anonymous said...

నేనూ క్రికెట్ చూస్తా కానీ అంత పిచ్చి లేదు.

క్రికెట్ గురించి ఏమాత్రం పట్టించుకోని త్రివిక్రం, ప్రసాద్ మరియూ సత్య సాయి లాంటివి వాళ్ళు కూడా ఉన్నారా అనిపిస్తోంది నాకు.


విహారి

వెంకట రమణ said...

మీరు చెప్పింది నిజమే. కాని క్రికెట్టు చూడడం అనేది ఒక వ్యసనం లాంటిది. అప్పుడప్పుడు చూసే నేనే, క్రికెట్టును అసలు పట్టించుకోకుండా ఉందామని చాలా సార్లు విఫలయత్నం చేశాను. ఇక క్రికెట్టు చూడడమే పనిగా పెట్టుకున్నవాళ్ళ గురించి చెప్పేదేముంది.

ప్రవీణ్ గార్లపాటి said...

మీరు చెప్పిన క్రిక్కెట్ పిచ్చి కోవలోకి నేను తప్పకుండా వస్తానండి....
అసలు క్రిక్కెట్ వస్తోందంటే స్కోరు చూసే దాకా మనసాగాడు, మరి స్కోరు చూసిన తరువాత బాగా ఆడుతుంటే లైవ్ గా చూడక పోతే ఎలాగా...ఆది కూడా కానిచ్చేస్తాను :)

radhika said...

స్కోరు వినే వరకే నా అభిమానం.ఇంట్లో ఎవరన్న చూస్తుంటే నేను కూర్చుంటాను.ఇండియా,పాకిస్తాన్ మధ్య పోరు అయితే మాత్రం వదిలిపెట్టను.

cbrao said...

ఇంటికొచ్చిన బంధువులు క్రికెట్ చూస్తుంటే, ఏదైనా మంచి పుస్తకం తీసుకొని నా పడకగది లోకి వెళ్ళి పోతాను.

రవి వైజాసత్య said...

భలే, నేనూ అచ్చం మీలాగే. ఆడటం ఐదో తరగతిలో.. పట్టించుకోవటం పదో తరగతిలో వదిలేశా

Nagaraja said...

బెట్టింగ్ తరువాత ఉన్న ఇంట్రెస్ట్ పోయింది. సమయం వృధా అనిపిస్తుంది.

చదువరి said...

క్రికెట్ అంటే నాకూ ఇష్టమే. అయితే నా ఇష్టాన్ని తీసి కిష్టాయపాలెంలో పారేయించేందుకు మన వీరులు శాయశక్తులా ప్రయత్నం చేస్తున్నారు. ఒకదాని తరవాత మరోటి ఓడిపోతూ ఉంటే నిదానంగా దూరం జరుగుతూ పోతాను. ఎప్పుడో ఓ ఆట గెలుస్తారు. అదుగో దాంతో మళ్ళీ ప్రేమ పొంగుకొస్తుంది.