Tuesday 2 January 2007

తెలుగు సాహితీ సదస్సు

అనుకున్నట్లుగానే చదువరి, సుధాకర్, రమణ, నేను తెలుగుసాహితీసదస్సులో "మీ కంప్యూటరుకు తెలుగు నేర్పడం ఎందుకు? ఎలా?" పుస్తకం ప్రతులు దాదాపు 600 మందికి పంచిపెట్టాం. అంతే కాదు, అక్కడ కొందరు ప్రముఖులను కలిసి మన కార్యక్రమాలను వివరించే అవకాశం కూడా కలిగింది. తెలుగు వికీపీడియన్ కూడా అయిన ప్రసిద్ధ రచయిత వివినమూర్తిగారు బెంగళూరు నుంచి కేవలం తెలుగు వికీపీడియనులను కలవడానికే హైదరాబాదుకు వచ్చాననడం సంభ్రమాశ్చర్యాలను కలిగించే విశేషం. అంతే కాదు, ఆయన కారా మాస్టారికి, ప్రముఖ చిత్రకారుడు చంద్ర, తదితరులకు వికీపీడియా, విక్షనరీ, ఇతర సోదర ప్రాజెక్టులను గురించి ఉత్సాహంగా వివరించారు. హైదరాబాదు తెలుగు బ్లాగరులు-వికీపీడియనుల సమావేశాల్లో చాలా మంచి విషయాలను చర్చిస్తున్నారని, బెంగుళూరులో సమావేశాలు జరుగుతున్నట్లైతే తాను తప్పక హాజరౌతానని కూడా అన్నారు. బెంగుళూరు తెలుగు బ్లాగరులారా! ఇక మీదే ఆలస్యం. (మాకినేని ప్రదీపు, కూనపరెడ్డి మురళీకృష్ణ, అనిల్ చీమలమఱ్ఱి బెంగుళూరులోనే ఉన్నారనుకుంటా!)

ప్రవాసాంధ్ర రచయితల్లో అగ్రగణ్యుడు, గతంలో vemurione పేరుతో సైన్సు విషయాల గురించి అరటిపండు ఒలిచిపెట్టినట్లు వికీపీడియాలో వ్యాసాలు రాసిన వేమూరి వేంకటేశ్వరరావుగారికి ఆ విషయాలను గుర్తుచేసి, పుస్తక ప్రతులను ఇవ్వడమేగాక మళ్ళీ ఒకసారి వికీపీడియాలో రాయవలసిందని కోరాం.

వీళ్ళిద్దరి ఈమెయిల్ ఐడీలను కూడా తీసుకున్నాం. ఈ సదస్సులో మరో ప్రముఖ రచయిత సత్యం మందపాటి గారితో కూడా పరిచయం ఏర్పడింది. ఆయన వెబ్‌సైటు (http://satyam-mandapati.com) యూనికోడులో లేకపోవడాన్ని గమనించి నేను ఆయనకు గతరాత్రే ఈమెయిల్ కూడా చేశాను.

ఇక ఈటీవీ2 లో తెలుగు-వెలుగు కార్యక్రమ ప్రయోక్త మృణాళిని గారు తెలుగుబ్లాగులు, తెలుగువికీల గురించి వరల్డ్ స్పేస్ రేడియో ప్రేక్షకులకు కూడా తప్పక చెబుతానన్నారు. హైదరాబాదు విశ్వవిద్యాలయం లోని CALTS కు చెందిన డా.ఉమామహేశ్వరరావు గారు వేదికమీద మాట్లాడిన ధోరణి యూనికోడుకు వ్యతిరేకంగా ధ్వనించినా తర్వాత రమణ, నేను విడిగా కలిసి మాట్లాడినప్పుడు మన కార్యకలాపాలపై ఆసక్తి కనబరచారు. సదస్సులో తెలుగుబ్రెయిన్స్ ప్రతినిధి భాస్కర్ తెలుగుబ్రెయిన్స్ లో వీవెన్ ద్వారా మన కార్యక్రమాలు తమకు బాగా తెలుసని చెప్పారు. ఒక్క తెలుగుపీపుల్.కాం ప్రతినిధిని మాత్రం కలుసుకోలేకపోయాం.

7 comments:

శోధన said...

ఈ ప్రయత్నం భారీగా విజయవంతం అయ్యిందని చెప్పవచ్చు :-)

cbrao said...

Feb 2007 లో బెంగళూరు వెళ్లే ఆలోచన ఉంది. నేను వెళ్ళినప్పుడు అక్కడి తెలుగు బ్లాగరులు, వికిపీడియన్స్ తో సమావేశం అవ్వాలని అకాంష. అక్కడి బ్లాగరులు తమ e-mail address,Phone numbers నాకు పంపిస్తే వారిని సంప్రదిస్తాను.

Veeven said...

సుధాకర్ తో నేను ఏకీభవిస్తున్నాను. నూతన సంవత్సరాన్ని మంచి విజయంతో ప్రారంభించాం.

చదువరి, సుధాకర్, రమణ మరియు త్రివిక్రమ్ లకు అభినందనలు.

Ramanadha Reddy said...

విజయీభవ!!

chandu said...

అందరికీ అభినందనలు.

రవి వైజాసత్య said...

ఇక్కడ గదిలో ఇంకొక శాల్తీ లేకపోతే జజ్జినకడి జనారే అని చిందెయ్యాలన్నంత ఆనందంగా ఉంది. ఇందుకు కృషి చేసిన తెలుగు బ్లాగ్లర్లందరికి నా ధన్యవాదాలు.

శ్రీ హర్ష PVSS Sri Harsha said...

త్రివిక్రం గారూ, చాలా చక్కగా వివరించారండి। నేను ఊరికే ఏదో attendance వేయించుకునే వాడిలాగా వచ్చి వెళ్లిపోయినందుకు ఎంత గొప్ప వ్యక్తుల పరిచయభాగ్యాన్ని ఎన్ని మంచి విషయాలని కోల్పోయానో మీ ఈ టపా చదివాకా తెలిసింది :-(

అన్ని పుస్తకాలు పంచగలగడం Internet లో తెలుగు వ్యాప్తి గురించి మీరు చేసిన శ్రమకి మంచి గుర్తింపు । ఇది ఆదిగా ఇలాంటివి ఇంకా విరివిగా జరగాలని కోరుకుంటూ
శ్రీహర్ష।

నాకు సాహితీ సదస్సుకి ఎంట్రీ సంపాయించిపెట్టినందుకు ధన్యవాదాలు। అన్నట్టు, ఆ డబ్బులు మీకు ఇవ్వాలండోయ్..