Tuesday, 31 October, 2006

సాహిత్య నేత్రం-మరో మంచి పత్రిక

అనిల్ చీమలమఱ్ఱి తన బ్లాగులో పేర్కొనని మరో మంచి పత్రిక సాహిత్య నేత్రం.


సాహిత్య నేత్రం త్రైమాస పత్రిక. ఇది పదేళ్ళ కిందట మొదలైంది. దీంట్లో ప్రతి సంచికలోనూ అద్భుతమైన కథలు, కవితలు , సాహితీ వ్యాసాలు, విశ్లేషణలు వచ్చేవి. ఉత్తమాభిరుచిగల వారందరి ఆదరణా పొందినా ఆర్థికంగా నిలదొక్కుకోలేక రెండేళ్ళ కాలంలో 9 సంచికలు వెలువడి ఆగిపోయింది. అయితే పట్టు వదలని విక్రమార్కుడు శశిశ్రీ పదేళ్ళ తర్వాత ఇపుడు దాన్ని డిసెంబరు 2005 నుంచి తిరిగి నడిపిస్తున్నాడు.

ఈ పత్రిక ప్రత్యేకతలు: ఇప్పుడు సరికొత్త ఆకర్షణ ప్రతి సంచికలోనూ ఒక మంచి తెలుగు కథను ఇంగ్లీషులోకి అనువదించి ప్రచురించడం. (మన దురదృష్టమేమిటంటే ప్రపంచ, దేశ భాషల్లోని ఉత్తమసాహిత్యాన్ని తెలుగువాళ్ళకు పరిచయం చేసేవాళ్ళు, తేటతెలుగులోకి అనువదించేవాళ్ళు, ప్రచురించేవాళ్ళు ఉన్నారు గానీ మన సాహిత్యాన్ని ఇతరభాషలవారికి పరిచయం చేసే ప్రయత్నాలెవరూ సీరియస్ గా చెయ్యడం లేదు. ఒక తెలుగుకవి గుంటూరు శేషేంద్రశర్మ నోబెల్ పురస్కారానికి నామినేట్ అవడానికి కారణం తన రచనలన్నిటినీ ఆయన ఆంగ్లంలో రాయడం లేదా తెలుగులో రాసినా వెంటనే ఆంగ్లంలోకి తనే స్వయంగా అనువదించుకోవడం. నోబెల్ దాకా ఎందుకు? మనకు దక్కిన జ్ఞానపీఠాలెన్ని? రెండు (అవి కూడా జ్ఞానపీఠ్ అవార్డుల కమిటీ అధ్యక్షుడుగా పి.వి.నరసింహారావు ఉన్నప్పుడు ఒకటి, బెజవాడ గోపాలరెడ్డి ఉన్నప్పుడు ఇంకొకటి) కాగా కన్నడానికి ఏడు. తేడా ఎక్కడుందో తెలియడం లేదూ??)

ఈ పత్రికను మార్కెట్లోకి విడుదల చెయ్యడం లేదు. ప్రతులు కావలసినవారు శశిశ్రీ (సంపాదకుడు), సాహిత్య నేత్రం త్రైమాస పత్రిక, డోర్నెంబరు 21-107, ఏడురోడ్లకూడలి, కడప - 516001 ఆం.ప్ర., ఫోన్: 93474 10689 ను సంప్రదించవచ్చు. విడిప్రతి 12/-.

పత్రిక సలహామండలి:

కాళీపట్నం రామారావు
డా||వై. బాలశౌరిరెడ్డి (సుప్రసిద్ధ హిందీ రచయిత, అనువాదకుడు. ఈయన హిందీ చందమామకు నలభయ్యేళ్ళపాటు సంపాదకుడుగా పనిచేశాడు.)
డా||జానమద్ది హనుమచ్ఛాస్త్రి (ప్రసిద్ధ సాహితీవేత్త, బహుగ్రంథకర్త)
డా||కేతు విశ్వనాథరెడ్డి
డా||పాపినేని శివశంకర్
వల్లంపాటి వెంకటసుబ్బయ్య
సింగమనేని నారాయణ
షేక్ హుసేన్ సత్యాగ్ని
మాకం అశోక కుమార్
బి.కె.ఆర్. మూర్తి

3 comments:

Bhale Budugu said...

బాగా చెప్పారు త్రివిక్రం.. మన్ వారు ఈ ఇతర భాషా జాడ్యాన్ని, వ్యామోహాన్ని ఎప్పుడు వదిలించుకుంటారో?

varttik said...

"రెండు భాషలు వచ్చిన ప్రతీవాడూ అనువాదకుడు కాలేడు.ఎవరైనా మాతృభాషలోకి మాత్రమే సమర్థవంతమైన అనువాదాలు చెయ్యగలరని చాలా మంది నమ్ముతారు." అన్న వల్లంపాటి గారి మాటల్ని మననం చేసుకుంటే మనం ఇతర భాషల నుండి తెలుగులోకి మాత్రమే సాహిత్యాన్ని దిగుమతి చేసుకోవడం ఎందుకు జరుగుతుందో కొంత అర్థం చేసుకోవడానికి వీలౌతుందనుకుంటాను.

"మన సాహిత్యాన్ని ఇతరభాషలవారికి పరిచయం చేసే ప్రయత్నాలెవరూ సీరియస్ గా చెయ్యడం లేదు." అన్న వాక్యం లో కూడ నిజం లేదు. దక్షిణ భారతీయ భాషలలో ఇంగ్లీష్ లోకి ఎక్కువగా అనువాదం పొందిన సాహిత్యం తెలుగుదేనని అంటారు. ఉదాహరణకు పాల్కూరికి సోమనాథుని సాహిత్యం నుండి ఆధునిక సాహిత్యం వరకూ తెలుగులోని శ్రేష్టసాహిత్యాన్ని(Classicsను) అనువదించడానికి నిర్విరామంగా కృషి చేస్తున్న వెల్చేరు నారాయణ రావు గారి పుస్తకాలు చూసారా?

Naveen Garla said...

www.eemaTa.com లో వ్యాసం చదివేంత వరకు "వల్లంపాటి వెంకటసుబ్బయ్య"గారు సాహిత్య అవార్డు పొందిన రచయిత అని, మా ఊర్లోనే (మదనపల్లె) కాలేజీ లో లెక్చరర్ గా పని చేశారని తెలియదు. తెలిసేపాటికి ఆయన లేరు (ఈ నెల 2వ తేదీ మరణించారు). ఒకే ఊర్లో ఉండి ఆయనను కనీసం చూడనైనా లేకపోయాను. తలుచుకొంటేనే బాధా, ఏడుపు కలసి తన్నుకొచ్చేస్తున్నాయి :(