రాష్ట్రం మొత్తం మీద భాష ఒకటే ఐనా ఒక్కోప్రాంతంలో ఒక్కో మాటకు ఒక్కో అర్థముంటుంది. ప్రతి ఐదు కిలోమీటర్లకూ భాష కాస్తైనా మారుతుందంటారు. మేం మాట్లాడేదే అన్నివిధాలా సరైన భాష అనే దురభిమానం నాకు లేదు. ఇవి కేవలం సరదాకోసం రాసినవి. "సరదా కోసం మా భాషను విమర్శిస్తావా?" అని ఎవరైనా కళ్ళెర్రజేస్తే నేనేం చెయ్యలేను.
రాయలసీమలో గమ్మున ఉండమని కసిరితే నోరుమూసుకొమ్మని అర్థం.
గోదావరి జిల్లాల్లో గమ్మున అంటే త్వరగా అని అర్థం.
"గమ్మునుండడం" ఏమిటో, ఎలాగో అర్థం కాక వాళ్ళు తెల్లమొహం వేస్తారు.
మేం మటిక్కాయలని పిలిచే ఒక కూరగాయను కొన్ని ప్రాంతాల్లో గోరుచిక్కుడు అని పిలిస్తే మాకు గందరగోళంగా అనిపిస్తుంది. చిక్కుడుతో ఎందులోనూ పోలికలేని దీనికి ఈపేరెట్లా పెట్టారా అని. "మొటిక్కాయలు తింటారా? అదేం సరదా మీకు?" అని మా మీద ఎవరైనా హాస్యమాడవచ్చు నిరభ్యంతరంగా.
అనపకాయ ఒకటి ఉండగా సొరకాయకు ఆనపకాయ అనే పేరెందుకో? అనవసరమైన కన్‌ఫ్యూజన్ కాదూ?
ఇక నాకు మరీ విడ్డూరంగా అనిపించేది "పదిహేను". "పదుగురాడుమాట"గా ఇది వ్యాప్తిలో ఉందేగానీ పది+ఐదు పదిహేను ఎలా అవుతుందని నేనడిగిన కొంటె ప్రశ్న*కు తెల్లమొహాలేశారు చాలామంది. 15 ను రాయలసీమలో పదహైదు అనే అంటారు. ఇదే నాకు అన్నివిధాలా సహజమైన, తార్కికమైన పదం అనిపిస్తుంది (పది+ఐదు = పదహైదు).
(*ఈ ప్రశ్నకు సమాధానం తెలిసినవాళ్ళు ఈ టపా వ్యాఖ్యల్లో రాయండి. రేపటిలోగా ఎవరూ రాయకపోతే దీన్ని బేతాళప్రశ్నగా భావించి విక్రమార్కుడే వివరిస్తాడు.)
9 comments:
పదిహేను అనే పదం పదహైదు లాగానే చాలా ప్రాచీనమైన తెలుగుపదం. ఇది నిజానికి రెండు పదాల సమాసం. ఇది పది+ఏను. ఏను అంటే ప్రాచీన తెలుగులో అయిదు అని అర్థం. ఈ అర్థంలో నన్నయభట్టు ఆ పదాన్ని చాలాసార్లు వాడాడు. కాలక్రమంలో అది వ్యవహారంలోంచి తొలగిపోయి సమాసరూపంలో మాత్రమే మిగిలింది.
:)లక్కీ!
స్కాండినేవియన్ భాషల్లో కూడా అప్లై కాదా? తెలుగులో మాత్రం పదకొండు తప్ప మిగిలినవన్నీ ఇలా ఏర్పడినవే అనుకుంటా.
అదికూడా బహుశా: పది+ఒకండు -> పద(నొ)కండు -> పదకొండు గా మారివుండవచ్చు.
పది+రెండు = పన్రెండు ->పన్నెండు/పండ్రెండు
పది+మూడు = పదమూడు
పది+నాలుగు = పద్నాలుగు
పది+ఐదు = పదైదు
పది+ఆరు = పదారు
పది+ఏడు = పదేడు
పది+ఎనిమిది = పదెనిమిది -> పద్దెనిమిది -> పజ్జెనిమిది
పది+తొమ్మిది = పత్తొమ్మిది -> పంతొమ్మిది/పందొమ్మిది.
మరి కొన్ని పద భేదాలు
నెల్లూరు ప్రాంతంలో తెల్లగెడ్డ, గోదావరి జిల్లాల్లో వెల్లుల్లి; హైదరాబాదులో ఆలుగెడ్డ, వేరే ప్రాంతంలో బంగాళా దుంప.
నన్నయ నాటి భాషలో ఐదు ఉన్నట్టు లేదు. దానికి బదులుగా ఏను ను ఉపయోగించారు. ఇప్పటికీ కొన్ని సమాస రూపాలలో (ఏబది, ఏదుం)లలోచూడొచ్చు. ఐదు కు ప్రాచీన రూపం ఐం. డు ప్రత్యయము
:) విక్రమార్కుడికి మౌనభంగం కలగలేదోచ్!
ప్రతిస్పందించినవారందరికీ కృతజ్ఞతలు.
గోకరకాయల గురించి మీకు తెలిసినట్టు లేదు
ఇహ అనపకాయ కేసీఆర్ కోసం పుట్టిందంటే మీరు నమ్మరేమో!
నాక్కూడా పదయిదే ఇష్టం, మా మాతృభాషలో పదిహేను అంటారు కాని ఈ పదిహేను పదిహేడు పెద్ద కన్ఫూజను
గమ్మున నేను రెండు సంధర్బాలలోనూ వాడతాను ॥ ఇదో ఓవర్లోడెడ్ పదమనుకుంటాను
ఏను అని చెప్పినందుకు ధన్యవాదములు, నాకు ఈ సంగతి ఎరుక లేదు
ఇంకా చెప్పాలంటే
నాకు బీగాలు అంటే ఇష్టం తాళం చేతులు అని పేద్దగా పిలవడం కంటే
"పదకొండు"కి ఒక చిన్న చరిత్ర ఉంది. ఇది కూడా రెండు పదాల సమాసం.పది+ఒకండు. వీటిల్లో ఒకండు అనేది ఈనాటి తెలుగులో మనం అర్థం చేసుకుంటున్నట్లుగా పుల్లింగం కాదు. అది ఒకటికి పూర్వరూపం. ఒకండు ఒకటి ఎందుకయింది అంటే- "త్రాడు" అనే పదానికి త్రాటి అనేది షష్ఠి అయినట్లు మొదట్లో "ఒకండు" కి "ఒకంటి" అనేది షష్ఠిగా ఉండేది. కాలక్రమంలో అది షష్ఠీరూపమనేది మర్చిపోయి అదే అసలైన పదం అనుకుని ప్రజలు వాడ్డం మొదలుపెట్టారు.అదే ఈనాటి ఒకటి.
ఇంకో విషయం.ఇక్కడ చర్చలో పాల్గొంటున్న వారు చాలామంది తెలుగుకి ఒక పూర్వదశ ఉందనే విషయం మర్చిపోయి ఇప్పటి వ్యావహారిక తెలుగు పదరూపాల దృష్టి నుంచి వాటి హేతుబద్ధతని నిర్ణయించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది సరైన ధోరణి కాదు. పాత తెలుగు తెలియకపోతే కొత్త తెలుగు కూడా అర్థం కాదు.
"నాక్కూడా పదయిదే ఇష్టం. గమ్మున నేను రెండు సంధర్బాలలోనూ వాడతాను" :) కిరణ్, బీగాలు అని ఇంకొక మంచి తెలుగు పదం గుర్తు చేశారు.
పదకొండు గురించి నా ఊహ సరైనదే అని తెలిపిన అంబానాథ్ గారికి కృతజ్ఞతలు.
Post a Comment