Thursday, 1 March 2007

బావా!...చీ!!

నేను హైదరాబాదుకు వచ్చిన కొత్తల్లో జరిగిందిది. జవహర్‍నగర్‍లో ఉండడానికి రూమ్ దొరకగానే లగేజ్ మొత్తం అక్కడ పడేసి, అవసరమైనవన్నీ కొనుక్కుని "హమ్మయ్య!" అనుకునేసరికి సాయంత్రమైంది. స్నానం చేసి, పరిసరాల పరిజ్ఞానం పొందుదామని బయలుదేరాను. రోడ్డు దాటి అటూ ఇటూ దిక్కులు చూస్తూ మళ్ళీ ఇంకో రోడ్డు దాటి కొంత దూరం ముందుకెళ్ళి రోడ్డు పక్కన చోద్యం చూస్తూ నిలబడ్డాను. అటూ ఇటూ హడావిడిగా ఉరుకులు పరుగులతో వెళ్తున్నారు జనాలూ, వాహనాలూ. ఉండుండీ వాహనాలన్నీ ఒకదానివెనకొకటి ఆగిపోతున్నాయి. (ముందు ట్రాఫిక్ సిగ్నల్ ఉండడం వల్ల అని అప్పుడే ఊహించేశాను.) ఒక్కసారిగా జనాలు ఎక్కణ్ణించో గుంపులుగుంపులుగా వెళ్తున్నారు. (సినిమా థియేటర్ల నుంచి అని తర్వాత తెలిసింది.) అక్కడ కనుచూపు మేరలో నాలాగ దిక్కులు చూస్తూ నిలబడ్డ నరమానవుడెవడూ లేడు. ఇదీ వాతావరణం.

నేనా వాతావరణానికి అలవాటు పడుతున్న సమయంలోనే తూర్పు దిక్కు నుంచి ఉల్కాపాతంలాగ దూసుకొచ్చి సడన్ బ్రేకుతో సరిగ్గా నా ముందే ఆగిందొక ఆటో! ఆ ఆటోలో నుంచి జీన్స్ ప్యాంటూ టీషర్టులో సన్నగా, నాజూగ్గా కనిపిస్తున్న ఒక టీనేజీ అమ్మాయి కొంగలాగ మెడసాచి తల మాత్రం బయటపెట్టి "బావా...!" అని సన్నగొంతుతో పెద్దగా పిలిచింది. పిలిచి, అరక్షణం ఆగింది. ఆ గొంతు వినగానే చిన్నప్పుడు చదివిన ఫిజిక్స్ పాఠాలు తోసుకుంటూ వచ్చి "ఈ పిల్ల గొంతులో పిచ్చెక్కువ (pitch-a quality of sound-ఎక్కువ)." అని చెప్పాయి.
నేనా మాటలకు ఊకొడుతూనే "ఈ పిల్ల పిలుస్తున్నదెవరినబ్బా?" అని నా తలను శరవేగంతో వెనక్కి తిప్పి తేరిపారజూశాను. దరిదాపుల్లో ఎవరూ లేరు.........నేను తప్ప! 'ఆ పిల్ల రాకముందు నుంచే ఆ (పారజూసే)పనిలో ఉండడం వల్ల గదా నాకు కుడి ఎడమల ఎవరూ లేరని ఆ పిల్ల పిలిచిన వెంటనే నిర్ధారించుకోగలిగాను? పరిసరాల పరిజ్ఞానమంటే ఇదిగాక మరేది?' నేనా ఆలోచనతో బుడుంగున ఆనందసాగరం లోతు కొలవడానికి వెళ్ళిపోయాను. అందుకే ఆ తర్వాత ఆ పిల్ల పలికిన పలుకులు కాస్త ఆలస్యంగా, అస్పష్టంగా నా చెవిని సోకాయి: "చీ ఎక్కడా?" అని.

తత్తరపడ్డాను. ఆ మాటతో నేను ఓలలాడుతున్న ఆనందసాగరం అకస్మాత్తుగా మంత్రమేసినట్లు ఇంకిపోయింది. 'ముక్కూ మొహం ఎరుగని నన్ను పట్టుకుని ఒక ఆడపిల్ల 'బావా' అని పిలవడమేమిటి? పిలిచెనుపో మరుక్షణమే 'ఛీ ఎక్కడ?' అని అనడమేమిటి? కొంపదీసి 'ఛీ! ఇక్కడా?' అన్లేదుగద? ఆ మాట మాత్రం ఎందుకంటుంది? అందునా నన్ను (అనగా ఒక అపరిచితుణ్ణి అని భావము)?' ఆనందసాగరం నుంచి ఎగిరొచ్చి అయోమయాగాథంలో పడ్డ నేను ఒకవైపు పైకి రావడానికి గింజుకుంటూనే ఇంకోవైపు ఊపిరందక తల ఎలా ఆడిస్తున్నానో కూడా నాకే తెలియకుండా ఊపేశాను. ఆ ఊపుడు చూసిన ఆటోవాడు 'వీడెవడో వెర్రిబాగులవాడు. వీణ్ణడిగి లాభం లేదు.' అని తెలుసుకున్నాడేమో ఆటోను ముందుకు దూకించాడు. సర్రుమని దుమ్ములేపుకుంటూ ఆటో, ఆటోలోని పిల్లా వెళ్ళిపోయారు. నిదానంగా తేరుకున్న నేను 'అసలు నేక్కడున్నాను? ఆ పిల్ల నన్నేమడిగింది?' అని పరిశోధించే పనిలో పడ్డాను.

ఎదురుగా కొంచెం దూరంలో ఒక పెద్ద హీరో కటౌట్ ఉంది. అదొక సినిమా థియేటర్లా ఉంది. ఇక నా వెనకేముంది? అసలు నేను ఎక్కడ, దేని ముందు నిలబడ్డాను? అని వెనుదిరిగి చూస్తే 'Bawarchi' అని పెదపేద్ద అక్షరాలతో బోర్డు కనిపించింది. 'ఇదేం పేరు? విచిత్రంగా ఉందే? అసలిది ఏ భాష? దీన్నెలా పలకాలి? ఈ పేరుకర్థమేమిటి?' అని సందేహాలు కలిగాయి. ఆ పేరునెలా పలకాలో ప్రయత్నిస్తుండగా దాన్ని 'బావర్చి' లేక 'బావార్చి' అని పలకవచ్చనిపించింది. దాంతో మిష్టరీ విచ్చిపోయిందని నాలోని డిటెక్టివ్ కేయాస్ ఒక్క కేక పెట్టాడు. (ఘనత వహించిన నా ఈ అభిమాన డిటెక్టివ్ పేరుకు Chaos (అనగా గందరగోళం) అని భాష్యం చెప్పారు కీ.శే.వల్లంపాటి వారు.) ఇందాక ఆ పిల్ల నన్నడిగిన అడ్రసు ఇదే! ఆ పిల్ల నన్ను 'బావా' అని పిలవలేదు!! ఏ సంబోధనా లేకుండానే('ఇస్సీ! ఎంత అమర్యాద?' అనుకోరాదు. పాపం, ఆ పిల్ల తొందర ఆ పిల్లది) 'బావా...ర్చీ ఎక్కడ?' అని అడగబోయి నోరు తిరక్కనో ఏమో 'బావా...చ్చీ ఎక్కడ?' అని అడిగింది. దాన్ని మనం 'బావా...చీ ఎక్కడ?' అని అర్థం చేసుకున్నాం. సరే, 'బావా...చీ' ఆచూ...కీ తెలిసింది "మరదలా రమ్మని" కేకేద్దామని చూస్తే అప్పటికే ఆ మరదలు పిల్ల కనుచూపుమేరలో లేకుండాపోయింది. నేను ఆ ఆటో వదిలిన పొగమేఘం వైపే దీ...ర్ఘంగా ఆ పొగ గాలిలో కలిసిపోయేవరకు చూసి, ఒక నిట్టూర్పు విడిచి అక్కడి నుంచి బయలుదేరి మెల్లగా మా రూముకు వచ్చేశాను.

ఇంతేసంగతులు.

(ఇంతకూ బావార్చి లేక బావర్చి అనేది ఏభాషలోని పదమో, ఆ మాటకు అర్థమేమిటో నాకు ఇంతవరకు తెలియదు. మీకు తెలిస్తే చెప్పరూ?)

16 comments:

స్వేచ్ఛా విహంగం said...

మీరు వివరించిన తీరు బాగుంది

శ్రీనివాస said...

భలే భలే! నేను ఇప్పటికీ అఫ్జల్‌గంజ్‌ని అఫ్జల్‌జంగ్‌ అనీ, లక్డీకాపూల్‌ని లడ్కీకాపూల్‌ అనీ అంటుంటాను. బావార్చీ కి అంటే ఏంటో ఇక్కడ చూడండి.
http://en.wikipedia.org/wiki/Bawarchi

Anonymous said...

చాలా బాగా వివరించారు! ఆంధ్రప్రభలోనో జ్యోతిలోనో అనుకుంటా ' కాలం (column) దాటని కధలు ' అని వచ్చేవి. మీ శైలి చూస్తే ఆ కధలు గుర్తుకొచ్చాయ్. ఇంకా మరిన్ని మాతో పంచుకుంటారని ఆశిస్తున్నాను!

Anonymous said...

మీ బావా...చీ అనుభవం బాగుంది, మీరు చెప్పిన విధానం ఇంకా బాగుంది.బావర్చి పేరు నాకు కూడా కొత్తలో వింతగా ఉండేది.మ అత్త గారి ఇల్లు ఆ బావర్చి కి దగ్గరే కావడం తో మా వారిని నేనూ ఇలా అయోమయంతో ఈ ప్రశ్న అడిగాను. బావర్చి అంటే వంట వాడు అని అర్ధం అని. బావర్చి హోటల్ లొ బిర్యానీ హైద్రాబాద్ మొత్తంలో ఫేమస్ అనీ, ఆ బిర్యానీ తెచ్చుకుని మా వారు, ఆయన స్నేహితులు చేసుకున్న పార్టీలు, ఆ రుచి, ఆ అనుభవాల గురించి పెద్ద లిస్టే చెప్పరు. ఇప్పటికీ, ఆ హోటల్ ఎదురుగా మేము ఎప్పుడు వెళ్ళల్సి వచ్చినా దాని ప్రసక్తి రాకుండా ఉండదు.

Raghuram Murthy said...

బాగా వివరించారు. bhawarchi అనేది హిందీ పదం. దీనికి వంటవాడు అని అర్థం.

కొత్త పాళీ said...

Hilarious.
While the incident is funny, your narration makes it hysterical.
BTW, you must be the only other human being who read or even heard of KEyaas detective stories. sounding like chaos is only one of the puns in that name.
BTW, I never liked Bawarchi Biryani.

రాధిక said...

మరదలు పిల్ల క్షణకాలంలో ఎంత అయోమయంలో పడేసింది.ఆయోమయంలోంచి వచ్చిన ఈ రచన గిలిగింతలు పెట్టింది.

Unknown said...

మరదలు ని మిస్ అయిపోయారు కదండీ. ముందే కనుక్కుంటే చగ్గా ఇద్దరూ కలిసి బావర్చీ సినిమా చూసేవాళ్ళు.

Dr.Pen said...

అమ్మా...త్రివిక్రమ్!టీనేజీ హైద్రాబాదీ గర్ల్ కు 'బావ'అయిపోదామనే...ఎంత ఆశ!ఇప్పటి కాలం అమ్మాయిలు 'బావా' అని పిలిచే కాలం దాటిపోయింది.మొత్తానికి రసవత్తరంగా చెప్పావు 'బావా...రుచీ' కథ!

రానారె said...

'బావరో బావర్చి' అంటూ ఒక్క మాటతో'తినిపించే'సిందన్నమాట 'మిర్చీ'. భలే! యెమో యెమో యెమో యమోలే!

తెలు'గోడు' unique speck said...

"బాచిలరు,బీరు,బావర్చీ బిరియానీ"-హైదరబాదు బాయ్స్ హాస్టల్లలో సర్వసాధారణం!మొత్తానికి మిస్సుని "మిస్" అయ్యిన సన్నివేశాన్ని భలే వివరించారు!

Anonymous said...

ఎక్కడ హోటల్ కనబడినా బిర్యానీ ఆర్డర్ చేసి వాళ్ళను తిట్టుకోవడం అలవాటు అయ్యింది. బావర్చి బిర్యాని మిస్ అవుతున్నాను.

Sudhakar said...

బావార్చి బిర్యాని రోజులు ఇప్పుడు పోయాయండి. వాడీ మధ్య శానిటరీ వారికి అడ్డంగా దొరికిపోయాడు కూడా (ఫ్రిజ్ లో నిలువ వుంచిన చికెన్,మటన్ వాడుతూ). ఇప్పుడే కాదు ఎప్పుడయినా బిర్యానీ అంటే ప్యారడైస్ మాత్రమే. పొరపాటున కూడా వాడికి చికెన్ నిలువ వుంచే చాన్సు కూడా ఇవ్వరు జనాలు. ఇప్పటికీ సీటు దొరకటానికి ఇరవై నిమిషాలు పడుతుంది.

త్రివిక్రమ్ Trivikram said...

వ్యాఖ్యలు రాసినవారికి, ఈ టపా బాగుందని మెచ్చుకున్నవారికి, పదానికి అర్థం చెప్పినవారందరికీ ధన్యవాదాలు. ఈ టపాకు అందరికంటే ముందు స్పందించింది వీవెన్. ఆయనకు ఆమకవేప బొమ్మ కనిపించక ఆ వ్యాఖ్య ఇక్కడ కనబడలేదు. వీవెన్ రాసిందిదీ: I could not comment in your blog. The capcha is not being displayed.

from EnWiki: Bawarchi (Devnagari: बावर्ची, meaning cook)
from Google definitions: Typical North Indian food named after the
Mughal dynasty of Muslim rulers who ruled India for 400 years

http://en.wikipedia.org/wiki/Bawarchi
http://www.google.co.in/search?q=define%3Abawarchi

jayachandra said...

baagundhi baavaarchi ante emito naaku theliadhu.

no said...

mee *baava..chee ni 16.3.14 adivaram andhrajyothi sanchikalo sankshipthanga prachuristhunnamu.
-editor, andhrajyothi