"నిర్ణీతశాతం కంటే ఎక్కువమంది ఓటర్లు తమ ఓట్లు రద్దు చేసుకున్నప్పుడు ఆ ఎన్నిక రద్దవుతుందని, ఆ అభ్యర్థులు మళ్లీ పోటీకి అనర్హులనీ ఈ అంశంగురించి ఎక్కడో చదివాను." - అభిరామ్ బ్లాగులో రానారె వ్యాఖ్య.
నెట్లో వెదికితే కొన్ని బ్లాగుల్లో ఆసక్తికరమైన విషయాలు కనబడ్డాయి. పోలైన ఓట్లలో 50% కంటే ఎక్కువ మంది తమ ఓటును రద్దు చేసుకుంటే అక్కడి ఎన్నిక రద్దవుతుందని, అక్కడ పోటీ చేసిన అభ్యర్థులందరూ మళ్ళీ పోటీ చెయ్యడానికి అనర్హులవుతారని; ఓట్ల లెక్కింపు తర్వాత గెలిచిన అభ్యర్థి ఎన్ని ఓట్ల తేడాతో గెలిచాడో అంతకంటే ఎక్కువ మంది తమ ఓట్లను రద్దు చేసుకుని ఉన్నట్లైతే ఆ ఎన్నిక చెల్లదని, ఇలా...
వీటి మాటెలా ఉన్నా ఎన్నికల సంఘం మాత్రం బాలట్ పత్రాల్లో (ఓటింగు యంత్రాల్లో) "None" అని చేర్చడానికి సుముఖమేనని తెలుస్తోంది. దీనికి సంబంధించిన ప్రజాప్రయోజనవ్యాజ్యమొకటి సుప్రీంకోర్టులో నడుస్తోందట. వాస్తవమేమిటంటే Election rules 1961 లోని Section 49 ‘O’ ప్రకారం ఓటరు పోలింగు బూత్ లో ఓటేసిన వాళ్ళ సంతకాలు/వేలిముద్రలు తీసుకునే ఓటర్ల రిజిస్టర్ లో తన పేరు నమోదయ్యాక సంతకం/వేలిముద్ర వేశాక ఆ ఓటరు పేరుకెదురుగా "ఓటు వెయ్యలేదు" అని రాసి ఆ ఓటరు సంతకం/వేలి ముద్ర తీసుకుని వదిలేస్తారు. ఐతే ఇలా తమ ఓటును రద్దు చేసుకున్న వారెవరన్నది అందరికీ తెలిసిపోతుంది. ఇది రహస్య ఓటింగ్ నియమాలకు విరుద్ధం. కాబట్టి బాలట్ పత్రం/ఓటింగ్ యంత్రంలో "None" చేర్చడమే సముచితం.
ఎన్నికల కమీషను ఈవీఎం లలో None of the above ను చేర్చాలని సిఫార్సు చేసింది. ఆ ప్రతిపాదన ప్రకారం 50% కంటే ఎక్కువ మంది తమ ఓటును రద్దు చేసుకుంటే అక్కడి ఎన్నిక రద్దవడమేగాక, అక్కడ పోటీ చేసిన అభ్యర్థులందరూ మళ్ళీ పోటీ చెయ్యడానికి అనర్హులవుతారు. ఫలితంగా జరిగే ఉప ఎన్నికలో మాత్రం None of the above అని ఉండదు. (ఓటర్ల గ్రహచారం బాగలేక మళ్ళీ None ముందు అభ్యర్థులందరూ ఓడిపోతే? అందుకన్నమాట!) ఐతే ఈ సెక్షన్ 49 ‘O’ గురించి ఓటర్లలోనూ, అంతకంటే ముందు పోలింగ్ ఆఫీసర్లలోనూ అవగాహన కలిగించడం అవసరం. చాలా మంది పోలింగ్ అధికారులకే ఈ సెక్షన్ గురించి తెలియదు. ఒకవేళ ఎవరైనా తమ ఓటును రద్దు చేసుకోవాలనుకున్నా దాని గురించి తెలియని ఆఫీసర్లు తిరస్కరించే ప్రమాదముంది. తమిళనాడులో గత ఎన్నికల్లో అలాగే జరింది కూడా! జనాలు దీన్ని వాడుతున్నట్లైతే ప్రసారమాధ్యమాలు దీని మీద దృష్టిపెడతాయి. ఎవరూ వాడకపోయినా దీనిలోని లోపాన్ని కోర్టు దృష్టికి ఎవరైనా తీసుకెళ్తే తప్పక ప్రయోజనముంటుంది. చూద్దాం - కోర్టు ఏమని తీర్పు ఇస్తుందో?
ఇక ప్రజాస్వామ్యంలో "నిరక్షరాస్యులనో, రాజకీయాలంటే అవగాహన లేదనో వున్న ఓటుహక్కును నిరాకరిస్తే" అది ప్రజాస్వామ్యమే కాదు. నియంత్రించాల్సింది ఓటర్లను కాదు. రాజకీయులనే. నాకు ఈ జ్ఞానోదయం కింది టపాపై చరసాల గారి వ్యాఖ్య చదివాక కలిగింది. :) నిజానికి ఓటుహక్కు మన రాజ్యాంగం భారత పౌరులందరికీ ఆర్టికల్ 19(1)(a) క్రింద ప్రసాదించిన భావప్రకటనా స్వాతంత్ర్యపుహక్కులో భాగం. ఎన్నికల విషయంలో మరీ తీవ్రమైన తప్పిదం చేస్తే తప్ప దీన్ని కాదనే హక్కు ఎవరికీ లేదు.
5 comments:
త్రివిక్రం గారూ,
నా వాఖ్యను చదివాక మీ అభిప్రాయాన్ని మార్చుకున్నందుకు సంతోషం. మీరన్నట్లు నియంత్రించాల్సింది రాజకీయులనే గానీ ఓటర్లను గాదు.
--ప్రసాద్
http://blog.charasala.com
nijame maa vurilo oka teacher tana vote ni raddu ceasukuntanamte a scetion ledani akkadi vaallu vadincharu.vaadana anavasaramani a teacher ika vadilesaranukomdi.
mii blaaguki ragane popups vastunnayandi.
ప్రసాద్ గారూ! మీ వ్యాఖ్య చదవగానే నేను అంతకుముందు ఏర్పరచుకున్న అభిప్రాయం తప్పని తెలిసొచ్చింది. అందుకే మార్చుకున్నాను. మీరు ఏది చెప్పినా చాలా తార్కికంగా చెప్తారు. :)
రాధిక గారూ! ఎన్నికలొచ్చిన ప్రతిసారీ పోలింగాఫీసర్లకు ప్రత్యేకంగా ట్రెయినింగిస్తారు. అయినా వాళ్ళకిలాంటి విషయాలు తెలికపోవడం దారుణం.
ఇక ఆ పాపప్పుల పాపం నాదే. నాకు తెలియజేసినందుకు కృతజ్ఞతలు. జరిగిందేమిటంటే నేను బ్లాగు టెంప్లేటు మార్చినప్పుడు Adsense code ను కొత్త టెంప్లేటులో చేర్చలేదు. బహుశా అందుకే బ్లాగులోకి వచ్చే మార్గం తెలియక Adsense code పాపప్పుల మార్గం ఎంచుకుని ఉంటుందనుకున్నాను. ఇప్పుడు దాన్ని inactive చేశాను.
నేనైతే ఓటరు లిస్టులోనే లేనింతవరకూ. "అక్కరుంటే వాళ్లే వచ్చి నిన్ను చేరుస్తార్లేరా" అన్నాడు మా నాయన. చేరిస్తే మాత్రం మనకే ఓటేస్తాడని నమ్మకమేంటని ఇరుపార్టీలవారు గమ్మునుండిపోయారు. ఎందుకంటే ఇద్దరూ కావలసినవాళ్లే, ఇద్దరూ కావలసినవాళ్లుకాదు కూడా. ఎవరికి ఓటేసినా ఒరిగేదేం వుండదులే అని, నేనూ ఎప్పుడూ పెద్దగా పట్టించుకోలేదు. ఈసారి చూద్దాం.
Post a Comment