Thursday, 30 November, 2006

"చందమామ" జ్ఞాపకాలు-1

అప్పుడు నాకు ఏడెనిమిదేళ్ళుంటాయేమో! అది చలికాలం కావడంతో చిరుచలిగా ఉంది. ఆ రోజు సెలవు కావడం వల్ల మా నాన్న ఇంటి దగ్గరే ఉన్నాడు. పొద్దున్నే లేచి వంటింట్లో పొయ్యి దగ్గర వెచ్చగా చలి కాగుతున్నాం మా నాన్నా నేనూ. మా అమ్మ కొంచెం దూరంలో మజ్జిగ చిలుకుతోంది. చందమామ మా నాన్న చేతిలో ఉంది. (తొందరపడి మా నాన్నను అపార్థం చేసుకోకండి. అంతకు ముందురోజే అరడజనుసార్లు చందమామ పారాయణం పూర్తిచేశాను నేను.) మా నాన్నేమో చందమామ చాలా దీక్షగా చదివేస్తున్నాడు. మజ్జిగ చిలకడమయ్యాక వెన్నతీస్తూ మా అమ్మ మా నాన్నతో ఏదో చెప్పింది. మా నాన్న అప్పటికి పద్మపాదుడు, పింగళుల వెంట పిశాచగార్ధభాలెక్కి ఆకాశమార్గాన శరవేగంగా ప్రయాణం చేస్తున్నాడు. ఆ హోరులో ఈ మాటలు ఎవరికి మాత్రం వినిపిస్తాయి చెప్పండి? ఐతే మా అమ్మ ఆ మాత్రమైనా అర్థం చేసుకోకుండా మళ్ళీ ఏదో చెప్పింది. అప్పటికీ మా నాన్న కిందికి చూడలేదు.

వెన్న తీసిన తర్వాత కవ్వం వంటింట్లో పెట్టడానికొచ్చిన మా అమ్మ మా నాన్న "ఆకాశయానాన్ని" గమనించింది. గమనించి, అంతసేపూ మా నాన్న తన మాటలు విననందుకు ఉక్రోషం వచ్చి మూడోసారి అదేమాట ఇంకాస్త గట్టిగా చెప్పింది. అంత చలిలో కూడా వాతావరణం వేడెక్కుతోందని నాకర్థమైంది కానీ పరిస్థితి తీవ్రత తెలియలేదు. మా నాన్నకు అసలు ఆ మాత్రం కూడా తెలియదు! అప్పుడు ఏం జరుగుతోందో మా ఇద్దరికీ అర్థమయ్యే లోపలే మా అమ్మ మా నాన్న చేతుల్లో నుంచి చందమామ లాక్కుని, నలిపి పొయ్యిలో పెట్టేసింది! అలా చెయ్యడం మా అమ్మకు చందమామ అంటే ఇష్టం లేక కాదు. అప్పట్లో మా అమ్మ కూడా ప్రతి నెలా చదివేది. (మా నాన్న, నేను ఇప్పుడు కూడా చదువుతూనే ఉన్నాం.) ఇక ఆ పొయ్యిలో మహామాయుడి సమాధిలోని అనంత ధనరాశులతో బాటు మహామాయుడి మంత్రదండం, బంగారుపిడి గల ఖడ్గం, అతడి కుడిచేతి చూపుడువేలికి ఉన్న మహిమ గల ఉంగరం లాంటి అమూల్యవస్తువులు కూడా అంటుకోవడం వల్ల వంటిల్లంతా వింతవెలుగుతో నిండిపోయింది.

ఇంకేముంది? హాహాకారాలతో వంటిల్లు అదిరిపోయింది! పెట్టింది మనమే:) దాంతో ఈ లోకంలోకొచ్చిన మా నాన్న వెంటనే చందమామను బయటికి లాగి నిప్పునార్పేశాడు. ఇక దాన్ని తీసుకుని నేనక్కడి నుంచి పరుగో పరుగు...ఇంకా అక్కడే ఉంటే ఏం మూడుతుందో అని! (ఇక వాతావరణమా? అది ఆ నిప్పుతోబాటే చల్లారిపోయిందిగా? మంటల్లో పడిన చందమామను చూసి మా నాన్న కంగారు పడితే అది చూసి మా అమ్మకు నవ్వొచ్చింది. నవ్వుతూనే అంది "లేకపోతే ఏమిటది? ఒక పక్క నుంచి చెప్తూంటే చెవినేసుకోకుండా అదే లోకమా?" అని.)

7 comments:

Pradeep said...

హ హ హ! చాలా బాగా చెప్పారు.

radhika said...

mii kalam numdi vachina jnaapakaalu vinadam chaalaa bagumdi.eppudu raajakiiyala gurinchi kakunda ila raayadam miiku kuda maarpe kada

త్రివిక్రమ్ Trivikram said...

రాధికగారూ! నా జ్ఞాపకాలు మీకు నచ్చినందుకు సంతోషం! ఐతే మీరు అనుకున్నట్లు నేను రాజకీయాల గురించి ఎక్కువగా రాయలేదే? రాజకీయాల గురించి రాయాలంటే ప్రతిరోజూ రాజకీయనాయకులను తిడుతూనే రాయవలసి వస్తుంది. (ఈరోజు కూడా హరికృష్ణ ఏమన్నాడో విన్నారా? బీడీ కార్మికులకు అన్యాయం జరిగితే రక్తం ఏరులవుతుందట! అంటే ఇంతకాలమూ వారికి న్యాయమే జరిగిందా? ఈ నాయకులు ఇప్పుడు పుర్రె గుర్తు గురించి ఇంత యాగీ చేస్తున్నారే? ఆ బీడీ కార్మికులెలాంటి పరిస్థితుల్లో పనిచేస్తున్నారో ఈ నేతలెప్పుడైనా పట్టించుకున్నారా? నిరంతరం పొగాకు ను నలిపి, చుట్టలు చుడుతూ, ఆ ధూళినే పీలుస్తూ క్షయ, క్యాన్సర్ లాంటి వ్యాధుల పాలబడి వాళ్ళ ఆరోగ్యాలు, జీవితాలు ఎలా నాశనమవుతున్నాయో వీళ్ళకేనాడైనా పట్టిందా? వాళ్ళకొచ్చే ఆదాయమెంత? దాంతో వాళ్ళెలా బతకగలుగుతున్నారు? అని ఈ నేతలెప్పుడైనా ఆలోచిస్తారా?) అందుకే నా బ్లాగులో వాటి జోలికి పోనేవద్దని ఒక నియమం పెట్టుకున్నాను. నేను రాజకీయుల గురించి ఒకే ఒక సారి రాశాను. పుట్టపర్తి నారాయణాచార్యుల విగ్రహం స్థానంలో ఇందిరా గాంధీ విగ్రహం పెట్టడానికి ప్రొద్దుటూరు ఎమ్మెల్యే పూనుకున్నప్పుడు. ఇక ప్రజాస్వామ్యం గురించి కూడా రెండు సార్లు రాయాలని ముందు అనుకోలేదు. కానీ విజయ గారు, చరసాల గారు రాసింది చదివాక దానికి రెండో భాగం రాయడం తప్పనిసరి అయింది.

(మీరు ఒకందుకు సంతోషపడి వ్యాఖ్య రాస్తే నేను ఇంకొకందుకు ఆవేశపడి ఇదంతా రాశాను. :) ఇకనుంచి రాజకీయాల గురించి రాయాలనిపించినప్పుడు మరింత నిగ్రహం పాటిస్తాను.)

radhika said...

ayyayo nenu maamulu ga annanadi.mee reply kuda chala aasaktikaram ga vundi.

unique speck said...

""చందమామ" జ్ఞాపకాలు-1" బాగున్నాయి!

Ramanadha Reddy said...

ఆ లెక్కనైతే నా పెళ్లాం ఏకంగా నన్నే పొయ్యిలోకి తోసేయాలి. అంత ఏకాగ్రత నాది :)) ఈ పద్మపాదుడు, పింగళుల కథ నాకు గుర్తులేదు. ఇది కథా లేక ధారావాహికా?

kotta pALI said...

త్రివిక్రం గారూ
ఇదీ, చిరుకోలా బ్లాగులు చూశాను. మీరు రాస్తున్న విషయాలు, రాసే శైలీ రెండూ బాగా నచ్చాయి. మన సంఘంలో పైకి మాట్లాడని taboo విషయాల్ని గురించి గట్టిగా రాయటం ముదావహం.
తెలుగు రచనలకి ఇంగ్లీషు అనువాదాల ద్వారా విస్తృత ప్రచారం జరగాల్సిన అవసరం చాలా వుంది. కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. విస్కాన్సిన్ యూనివర్సిటీ నుండి ఆచార్య వెల్చేరు నారాయణరావు గారు ప్రాచీన సాహిత్యాన్ని ఇంగ్లీషులో అందిస్తున్నారు. tulika.net లో నిడదవోలు మాలతి గారు సమకాలీన కథలకి అనువాదాలు పెడుతున్నారు. నా వొంతు సేవగా నాకు నచ్చిన ప్రాచీన సమకాలీన పద్య సాహిత్యాన్ని ఆంగ్లంలో పరిచయం చెయ్యటానికి బ్లాగులు మొదలెట్టాను. త్వరలోనే సమకాలీన కవిత్వాన్ని కూడా పరిచయం చేస్తాను. ఇక్కడ చూడండి.
http://telpoettrans.blogspot.com

శశిశ్రీ గారి పత్రిక గురించి చెప్పినందుకు ధన్య వాదాలు.