Thursday, 7 December 2006

చందమామ జ్ఞాపకాలు-2

క్రింది టపాలో ప్రస్తావించిన పద్మపాదుడు-పింగళుల కథ:

ముగ్గురు మాంత్రికులు - నేను చిన్నప్పుడు చందమామ చదవడం మొదలుపెట్టినరోజుల్లో చందమామలో వస్తూండిన జానపద ధారావాహిక. దీనికి సమాంతరంగా నడిచిన పౌరాణిక ధారావాహిక వడ్డాది పాపయ్య రాసిన "విష్ణుకథ" (పోతన భాగవతానికి సంక్షిప్తరూపం). ఆరోజుల్లో బాలమిత్రలో గండభేరుండదీవి వస్తూ ఉండేది. ముగ్గురు మాంత్రికుల్లో కథానాయకుడైన పింగళుడు మాంత్రికుడు కాదు. అతడొక మామూలు జాలరి యువకుడు. అన్నదమ్ములైన ముగ్గురు మాంత్రికులు మహామాంత్రికుడైన మహామాయుడి సమాధిలోని అపూర్వ వస్తువులు - మంత్రదండం, మహిమగల ఉంగరం, బంగారుపిడిగల ఖడ్గం - సాధించుకుని రావడానికి ఒకరి తర్వాతొకరు బయలుదేరుతారు. వారిలో ఆఖరివాడైన పద్మపాదుడొక్కడే పింగళుడి సాయంతో అర్హతపరీక్షలో నెగ్గి ప్రాణాలతో బయటపడి చాణక్యుడి వలె తాను వెంట ఉండి ప్రణాళికలు వేసి సమయానికి తగిన సలహాలిస్తూ చంద్రగుప్తుడిలాంటి పింగళుణ్ణి మహామాయుడి సమాధిలోకి పంపుతాడు. ఆ సమాధి ఒక మహాసౌధం. మొదట అది నీళ్ళలో మునిగి ఉంటుంది. పద్మపాదుడు ఆ నీటిని ఇంకిపోయేలా చేసి దాన్ని బయటపడేస్తాడు. దానికి ఏడు ద్వారాలుంటాయి. ఒక్కో ద్వారం దగ్గరా తన మంత్రశక్తులతో మహామాయుడు సృష్టించుకున్న మాయలను పింగళుడు తన ధైర్యసాహసాలతో ఛేదించి సమాధిలోనికి ప్రవేశించి అపూర్వ వస్తువులను సంగ్రహించడం ప్రధాన కథ. మహామాయుడి శిష్యులు వీళ్ళను మహామాయుడి సమాధి వరకూ వెళ్ళనివ్వకుండా దారిలో తమ మాయలతో ఆటంకాలు కల్పించబోవడం, వీళ్ళు వాటిని ఛేదించుకుంటూ ముందుకు పోవడం, పనిలో పనిగా భల్లూకపర్వతాల్లో మహామాయుడిచేత బందీగా మారిన ఒక మాయావియైన రాక్షసుడొకణ్ణి (పేరు గుర్తురావడం లేదు...భల్లూకకేతుడా?) రక్షించడం, వాడు వారికిి నమ్మకస్థుడుగా మారడం, ఇంటిదగ్గర దుర్మార్గులైన పింగళుడి అన్నలకు, అహంకారియైన సేనానికి బుద్ధిచెప్పడం (ఈ సన్నివేశం బాగా నవ్వు తెప్పిస్తుంది),...అలా సాగిపోతుంది కథ.

మామూలుగా మాంత్రికులంటే జడలు, గడ్డాలు, మీసాలు పెంచి, మంత్రదండం చేతబూని విచిత్ర వేషధారణతో ఉంటారని ఊహిస్తాం. (వాళ్ళ మంత్రశక్తి అంతా ఆ జడల్లోనో, మంత్రదండంలోనో ఉంటుందని ఒక నమ్మకం.) కానీ ఇందులో పద్మపాదుడు ఏ రకమైన జడలు, జులపాలు గానీ, కనీసం గడ్డం, మీసాలు కూడా లేకుండా, ఒంటిమీద కూడా కేవలం డ్రాయరూ, బనీనుతో తలమీదుండే ఆ కొద్ది జుట్టు కూడా కనిపించకుండా అంటుకుపోయే టోపీ పెట్టుకుని ఉంటాడు. ఆ ఆలోచన బొమ్మలేసిన చిత్రాదో, సంపాదకులదో లేక రచయితదో మరి?

2 comments:

రాధిక said...

eppudoa cinnapudu chadivinavi perulatoa sahaa gurtu pettukunnarantea chala ascharyam gaa vundi.nakayite betaludi kadhalu tappinchi inkemi gurtu levu.avi kuda perulu assalu gurtulevu.betaludu,vikramarkudu tappa.

karthik said...

hi trivikram garu
aa rakshasudi peru bhallukaketudu.(u r correct). pingaludu avanti nagara jaalari.

maya sarovaram ane serial vachedi. dani gurinchi konta rastara?