Sunday, 13 August 2006

మనం మాట్లాడే ఇంగ్లీషు

చదువరిగారి బ్లాగులో ఎన్నోవాడు?, భావ దారిద్ర్యం, భావ దాస్యం అనే పోస్టులు చదివాక:

తెలుగు బ్లాగరులందరం "ఎన్నవ" అనే మాటను ఇంగ్లీషులో how manieth అనడం మొదలుపెడదాం. ఎవరికైనా అభ్యంతరమా? (దీన్ని యర్రపురెడ్డి రామనాథ రెడ్డి సూచించారు.)

ఆంగ్లభాషలోని కొన్ని పదబంధాలను గుడ్డిగా అరువు తెచ్చుకుని యథాతథంగా వాడెయ్యడం వల్ల మనం భారతీయుల్లా కాకుండా ప్రపంచమంటే ఒక్క ఐరోపా మాత్రమే అని నమ్మేవాళ్ళలా మాట్లాడుతున్నామా అనిపిస్తుంది.. ఉదాహరణకు "Rome was not built in a day." అనే మాటను పదేపదే వినడం, వాడ్డం వల్ల "అబ్బో! రోం నగరం ఎంత పాతదో! దాన్ని ఎన్నాళ్ళు కట్టారో?" అనుకుంటాం. రోం నగరం గురించి ప్రచారంలో ఉన్న పుక్కిటి పురాణాలను నమ్మినా ఆ నగరాన్ని 2,300 సంవత్సరాల క్రితం నిర్మించినట్లు తెలుస్తుంది. అదే రోం నగరం కంటే నాలుగింతలు పెద్దదీ, చారిత్రక ఆధారాల ప్రకారమే పాతరాతియుగం నుంచి జనావాసాలున్నదీ, పురాణాల ప్రకారం 5,000 సంవత్సరాల క్రితమే నిర్మించబడిందీ, గత వెయ్యేళ్ళ కాలంలో కనీసం పది సార్లు దశలవారీగా నగర నిర్మాణం, విస్తరణ జరిగిందీ అయిన మహానగరం గురించి "Delhi was not built in a day." అని సగర్వంగా చెప్పుకోవచ్చన్న విషయమే మనకు తెలీదు!

ఆంగ్ల భాష ప్రభావం వల్ల ఇప్పటి మన రచయితలకు, పాత్రికేయులకు; వాళ్ళ పుణ్యమా అని సామాన్య జనానికి చాణక్యుడి పేరు కంటే మాకియవెల్లి పేరే బాగా తెలుసు. కాళిదాసును షేక్స్పియర్ ఆఫ్ ఇండియా అంటారు. ఇలాంటి "షేక్స్పియర్ ఆఫ్ "అనే "బిరుదు" ప్రతి దేశంలో ఒక కవికి ఉంటుంది. అంటే షేక్స్పియర్ ప్రపంచస్థాయి కవి అని, వీళ్ళంతా వారి వారి దేశాల స్థాయిలోనే కవులు అని చెప్పకనే చెప్తున్నారన్నమాట. కనీసం "కాళిదాసు ఏ కాలం వాడు? షేక్స్పియర్ ఏ కాలం వాడు? షేక్స్పియర్ కంటే కొన్ని శతాబ్దాల ముందే అంత గొప్ప సాహిత్యాన్ని సృష్టించిన మన దేశపు మహాకవికి షేక్స్పియర్ తో పోల్చిచెబితే తప్ప మనదేశంలో గుర్తింపు ఉండదా?" అనే ఆలోచనలు లేకుండా మనం గుడ్డిగా సముద్రగుప్తుడిని "Nepolian of India" అని, ఇలా ప్రతి రంగంలోనూ భారతీయ ప్రముఖులను యూరోపియన్ ప్రముఖులకు డమ్మీలుగా మనమే చిత్రించడానికి అలవాటు పడిపోయాం. చాణక్యుడి ఎత్తుల్ని సైతం Machiavellian Tactics అనే అనువదిస్తారు. ఏం? Chanakya's Tactics అని ఎందుకనకూడదు?

నా అభిప్రాయం ఎప్పుడూ ఒక్కటే: మనం వాడే భాష మన భావాలను స్పష్టంగా ప్రతిబింబించాలి. అలా చెయ్యలేనప్పుడు అది ఎంత గొప్ప భాషైనా మనకు పనికిరాదు. అందుకే మనం వాడే భాషను మన అవసరాలకు తగినట్లు మార్చాలి. ఆంగ్లభాష ప్రపంచంలోని వివిధ దేశాల్లో అనేక మార్పులకు లోనయింది. మనం కూడా అవసరమైన మార్పులు చేయాలి.

అవసరమైన మార్పులు కొన్ని:

బంధుత్వాల్లో పెద్ద-చిన్న తేడాలను తెలిపే పదాలు:
అన్న-తమ్ముడు (elder brother-younger brother సరిపోవు. పెద్దన్న-చిన్నన్న-పెద్దతమ్ముడు-చిన్నతమ్ముడు తేడాలను తెలిపే విధంగా ఉండాలి.)
అక్క-చెల్లెలు
cousin, uncle-aunt ల దశావతార విన్యాసాలు ఇక చాలు. విడివిడిపదాలు కావాలి.
బియ్యానికి, అన్నానికి మధ్య గల తేడా స్పష్టంగా తెలియాలి.

ఇలాంటి మార్పులు జరిగేవరకూ ఆ భాష అసంపూర్ణమే.

11 comments:

oremuna said...

I completely agree with you.

Let us start the revolution.

I particularly liked the cousin thing...

రానారె said...

"మా నాన్నకు అన్నీ నా పోలికలే!!" అని పిల్లలు అన్నట్లుగా ఉంది కాళిదాసును అలా సంబోధించడం.
"హౌమెనిఎథ్" విషయంలో నేనూ ఇదే ఆలోచించాను. "ఎన్నోవాడు?" పై నా అభిప్రాయంలో.

చదువరి said...

"ఎన్నవ" అనేదానికి "హౌమెనియెత్" బాగుంది. ఇహ కజినూ, కజ్జికాయల సంగతి.. చక్కగా మన అన్న, తమ్ముడు, బాబాయి, మేనమామ, మేనత్త అనే మన తెలుగు మాటలనే వాడదామని నా ప్రతిపాదన. ఇంగ్లీషులో మన తెలుగు మాటలను కలపడం తప్పేమీ కాదు. మనం తెలుగులోకి ఇంగ్లీషు మాటలను తెచ్చినట్లే ఇదిగూడా!

త్రివిక్రమ్ Trivikram said...

@కిరణ్
చదువరి గారు సూచించిన ప్రత్యామ్నాయాలతో మొదలుపెడదాం.
@రాంనాథ్
"మా నాన్నకు ..." అని చక్కటి పోలిక చెప్పారు.
"హౌమెనిఎథ్" విషయంలో అందరం అదే అభిప్రాయంతో ఉన్నామన్నమాట. :)
@చదువరి
మీ ఆలోచన చాలా బాగుందండీ! ఇందరిని కలిపి అమ్మా నాన్నల్ని వదిలేస్తే ఎలా? అందుకే ఇక ఇప్పట్నుంచీ ఇంగ్లీషులో మాట్లాడేటప్పుడు సైతం ఈ పదాలు వాడబోను(తెలుగు రానివాళ్ళకు వివరించాల్సి వస్తే తప్ప): mother-father, mummy-daddy (mom-dad), brother, sister, cousin, uncle, aunt(y), rice.

చదువరి said...

బాగుందండీ త్రివిక్రమ్! మీ ప్రతిపాదనకు నేను సై! దీన్ని మెరుగుపరచి ప్రతిజ్ఞ లాగా రాసి, మీ బ్లాగులో పెట్టండి. దాన్నే బ్లాగరులందరం మా మా బ్లాగుల్లో ప్రముఖంగా రాసుకుంటాం. ఏమంటారు?

శ్రీనివాస said...

చాలా బాగుంది. నేను ఇప్పటికే చాలా పాటిస్తున్నాను. మీ అందరి దృఢ సంకల్పం చూసాకా ఇక విజృంభించాల్సిందే :)

spandana said...

చర్చ బాగుంది.
కాళిదాసును "షేక్స్పియర్ ఆఫ్ ఈస్ట్" అని ఆయనను యూరోపియన్లకు పరిచయం చేయడానికి ఆంగ్లేయులు పిలిచివుంటారు. అలాగే "ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్", "నెపోలియన్ ఆఫ్ ఇండియా" లాంటివి. కాళిదాసు గురించి, తెలుగు గురించి తెలియని వాళ్ళకు, వాళ్ళకు తెలిసిన గొప్ప వారితో పోల్చి చెప్పడం ఆనవాయితీయే. ఇందులో తప్పేమీ లేదు. మనం కూడా షేక్స్పియర్ గురించి తెలియని, కాళిదాసు గురించి తెలిసిన వాళ్ళకి ఆయన "కాళిదాస్ ఆఫ్ ది వెస్ట్" అని చెప్పొచ్చు. కానీ మన ఖర్మ ఏంటంటే కాళిదాసు తెలియని వాళ్ళున్నారు గానీ షేక్స్పియర్ గురించి తెలియని వాళ్ళు లేరే! కనుక "కాళిదాస్ ఆఫ్ ది వెస్ట్" అని ఆయన్ను పరిచయం చేయాల్సిన అవసరం రాదు.
ఇక పోతే "Rome not built in a day", మరియు "Be as a Roman while in Rome" లాంటివి ఆంగ్లేయుల సామెతలు. వీటిని వాడితే అలాగే వాడాలి లేదా వాటి తత్సమాన తెలుగు సామెతలు వుంటే వాటిని వాడాలి, అంతేగానీ Rome స్థానంలో డిల్లీ పెట్టినంత మాత్రాన అది తెలుగీకరణ అవ్వదు. ఎందుకంటే దండ ఆంగ్లేయుడిదే అందులో ఒక పువ్వు మాత్రమే మారుస్తున్నాం. ఇది నా అభిప్రాయం, మీరేమంటారు?
-- ప్రసాద్
http://charasala.wordpress.com

రానారె said...

మీరన్నది నిజమే ప్రసద్ గారు. కొంచం ఆవేశం లో ఉండి అలా అనేశాను.

త్రివిక్రమ్ Trivikram said...

ప్రసాద్ గారూ!
ఈస్ట్-వెస్ట్ ల గురించి మీరు చెప్పింది నిజం. ఇంకొన్నాళ్ళు పోతే మన దేశంలో కూడా కౌటిల్యుడి కంటే మాకియవెల్లీ పేరే ఎక్కువమందికి తెలిసేటట్లుంది. కానీ రోం-ఢిల్లీల గురించి మీరు పొరబడ్డారనుకుంటా. నేనంటున్నది మనం వాడే ఇంగ్లీషును మన అవసరాలకు లేదా పరిస్థితులకు తగినట్లు మార్చుకోవడం గురించి. తెలుగును గురించి కాదు. మనం వాడుకునేటప్పుడు ఆంగ్లేయుడి దండలోనే నేను భారతదేశపు పువ్వులు పెడదామంటున్నాను. Be as a Roman while in Rome ను మార్చవలసిన అవసరం నాకూ కనిపించలేదు. ("పరాయి ప్రాంతంలో ఉన్నప్పుడు.." అని చెప్పే సామెత కాబట్టి పరాయి పేరే సరిపోతుంది. :) )

spandana said...

త్రివిక్రం గారూ!
నేనదేమంటే మనం దండకూడా అరువు తెచ్చుకోకుండా తెలుగు దండనే వాడగలమా అని? ఒకవేళ మనకు అలాంటిది లేకుంటే అది పరాయి వాళ్ళనుండి అరువు తెచ్చుకున్నామన్న దాన్ని దాచిపెట్టాల్సిన అవసరం లేదు అని నా అభిప్రాయము.

-- ప్రసాద్
http://charasala.wordpress.com

Anonymous said...

మీ వ్యాసము చాలా బాగుంది. అయితే దీన్ని కొందరు చాలా సాగదీస్తే వికటిస్తుందని నా అభిప్రాయము. పదాలు అరువు తెచ్చుకోవడములో తప్పులేదు. కానీ ఉన్న పదాలను పక్కంపెట్టి సులువుగా ఉంటుందని (బంధుత్వాలు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరము లేకుండా) మేనమామని, మామని, బాబాయిని, పెద్దనాన్నని, దారిన పోయే దానయ్యనీ అందరినీ ఒకే గాటిన కట్టి అంకుల్ అనడము ఛండాలంగా ఉంది. ఈ ప్రయత్నములో కొంత సమాచారాన్ని కోల్పోతున్నాము. బాష సమాచార ప్రసరణను స్పష్టము చెయ్యాలే కానీ తికమక పెట్టకూడడు. వీటన్నిటికీ వేరువేరు పదాలు లేకపోవడము ఆంగ్ల బాష దురదృష్టము. మనకున్నాయిగా మనము వాడొచ్చు. అలాగే తెలుగు వీరాభిమానినని రైలు బండిని ధూమశకటమని సంస్కృతీకరించిన పదముతో పిలవడము అంతే హాస్యాస్పదము.