Monday 28 August, 2006

అపహాస్యం పాలౌతున్న సెన్సార్ సర్టిఫికెట్లు

ఈ మధ్య మన సెన్సారు బోర్డు వారు ఎడాపెడా A సర్టిఫికేట్లు, U/A సర్టిఫికేట్లు ఇచ్చి పారేస్తున్నారు. మన ఎగ్జిబిటర్లు, దర్శకనిర్మాతలు, టీవీ ఛానెళ్ళవారు ఆచరణలో ఆ సర్టిఫికెట్లను అంతే ఉత్సాహంగా "పారేస్తున్నారని" నాకు ఈ మధ్యే తెలిసివచ్చింది. అసలు విషయం చెప్పబోయే ముందు ఈ సెన్సార్ సర్టిఫికేట్ల గురించి కొన్ని వివరాలు:

ఎవరైనా నిరభ్యంతరంగా చూడదగ్గ సినిమాలకు U సర్టిఫికెటు,
మితిమీరిన శృంగారం, అశ్లీలత, అసభ్యత, బూతులు, లేదా హింసాత్మక సన్నివేశాలు ఉండడం వల్ల పిల్లలు చూడకూడని సినిమాలకు A సర్టిఫికెటు,
పెద్దవారి తోడు లేకుండా చూస్తున్నప్పుడు పిల్లలు భయపడే అవకాశముందనిపించిన హార్రర్ సినిమాలకు, చిన్నపిల్లలు పెద్దవాళ్ళతో కలిసి మాత్రమే చూడదగ్గ సినిమాలకు U/A సర్టిఫికెటు ఇస్తారు.

హాస్యం పేరుతో పచ్చిబూతుమాటల్ని విరివిగా వాడిన ఒక సినిమా U/A సర్టిఫికెటుతో విడుదలైంది కొన్ని నెలల కిందట. అంటే చిన్న పిల్లలు ఆ బూతు మాటల్ని పెద్దల పర్యవేక్షణలో మాత్రమే నేర్చుకోవాలని అ సర్టిఫికెటు ఇచ్చినవారి ఘనమైన అభిప్రాయమనుకోవాలా? సెన్సారైన సినిమాలకు కూడా ప్రచారం చేసుకోవడానికి వాడుకునే స్టిల్స్, క్లిప్పింగులకు ఫిల్మ్ ఛాంబర్ నుంచి అనుమతి పొందాలి. కానీ సదరు సినిమావారిచ్చిన టీవీ ప్రకటనల్లో కూడా బూతు మాటలే ఉన్నాయి. :(

దీని తలదన్నే సంఘటనొకటి రెండు మూడు వారాల కిందట జరిగింది. (దీని గురించి అప్పుడే బ్లాగకపోవడానికి కారణం "విక్రమార్కుడు" సినిమాకు U/A సర్టిఫికెటు వచ్చిందని ఇన్నిరోజులూ నేను అపోహ పడ్డమే.)
వాస్తవమేమిటంటే "విక్రమార్కుడు" సినిమాకు వచ్చింది A సర్టిఫికెటు. అంటే అది పిల్లలెవరూ చూడగూడని సినిమా. A సర్టిఫికెటు ఎందుకొచ్చిందో నాకు తెలియదు. నేనా సినిమా చూడలేదు. ఐతే రెండు మూడు వారాల కిందట ఆ సినిమా "చూసి వచ్చిన" చిన్నపిల్లలతో ఆ సినిమా హీరో రవితేజ, దర్శకుడు ? చాలా సేపు ఆ సినిమా గురించే మాట్లాడారు. ఒక ఆదివారం మధ్యాహ్నం ఆ సన్నివేశం మొత్తం ఒక టీవీ ఛానెల్ వారు (మా టీవీ?) చక్కగా ప్రసారం చేశారు. చాలా మంది చూసే ఉంటారు. కానీ ఎవరూ అభ్యంతరపెట్టినట్లు దాఖలాల్లేవు.

ఇంతకూ సెన్సార్ బోర్డ్ వారి బాధ్యత తమకు తోచిన సర్టిఫికెట్ ఇవ్వడంతో తీరిపోతుందా? U/A, A సర్టిఫైడ్ సినిమాలు ప్రదర్శించే థియేటర్ల వాళ్ళు టికెట్లిచ్చేతప్పుడు, హాల్లోనూ చిన్న పిల్లలను గమనించి తగిన చర్య తీసుకోవలసిన బాధ్యత ఆ థియేటర్ల యాజమాన్యానికి లేదా? ఇంత బాధ్యతారహితంగా, ఇంత బహిరంగంగా చట్టాన్ని ఉల్లంఘించి తాము చూడగూడని ఆ సినిమాను చూసిన పిల్లలతో కలిసి ఇద్దరు బాధ్యత గల పెద్దమనుషులు నిర్లజ్జగా పాల్గొన్న ఆ కార్యక్రమాన్ని టీవీ ఛానెళ్ళ వాళ్ళు ఇంత బాహాటంగా ప్రదర్శించినా పట్టించుకున్నవాళ్ళే లేరు!
ఇంతకూ సెన్సార్ బోర్డ్ ఎందుకున్నట్లు? ఆ సర్టిఫికెట్లు ఎందుకిస్తున్నట్లు?

No comments: