Saturday 26 August, 2006

రాబందుల రెక్కల చప్పుడు...


రాబందుల రెక్కల చప్పుడు ఇక వినిపించదా? ఆకాశవిహంగాల్లో రారాజు..రాబందు. ఇది వేటాడే పక్షి. దీన్ని మరే జీవీ వేటాడదు. మరి అలాంటప్పుడు వీటి జాతి దినదినం అభివృద్ధి చెందాలి. కానీ అలా జరగడం లేదు. పైగా ఆందోళన కలిగించేటంత వేగంగా తగ్గిపోతోంది. ఇంకొన్నాళ్ళు పోతే ఈ పక్షి పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది. భూమిపై వాటి మనుగడ ప్రశ్నార్థకమైంది. ఇందుకు కారణం డైక్లోఫెనాక్ అనే సూదిమందు. అదేమిటి? ఆకాశంలో ఎవరికీ అందనంత ఎత్తులో ఎగిరే ఆ పక్షులకు సూదులెవరేస్తారు? ఎలా వేస్తారు? అని ఆశ్చర్యపోకండి. సాధారణంగా రోగాల బారినపడిన గేదెలు, కుక్కలు ఇతర జంతువులకు చికిత్స చేసేందుకు ఎక్కువగా డైక్లోఫెనాక్ అనే సూదిమందును వాడుతారు. చికిత్స చేసినా అవి బతకకపోతే వాటి కళేబరాలను బయట పడేస్తారు. అలా చనిపోయిన జంతువుల కళేబరాలను రాబందులు తింటాయి. (రాబందులే గనక లేకపోయినట్లైతే ఈ శవాల మూలంగా వ్యాధులు ప్రబలకుండా ఉండడానికి చనిపోయిన వాటన్నిటినీీ పూడ్చిపెట్టడమో, లేక కాల్చివేయడమో చేయవలసి వచ్చేది.) ఆ మాంసంలోని డైక్లోఫెనాక్ ప్రభావం వల్ల రాబందుల మూత్రపిండాలు దెబ్బతింటున్నాయి. అందువల్లే అవి త్వరగా చనిపోయి వాటి జాతి అంతరించిపోతోందని గుర్తించారు. ముఖ్యంగా భారత్, నేపాల్, పాకిస్తాన్ దేశాల్లో వేల సంఖ్యలో చనిపోయాయి. ప్రస్తుతం ఈ సూదిమందు మీద మన దేశంలో నిషేధం ఉన్నప్పటికీ అది నామమాత్రంగానే అమలవుతోంది.

రాబందులు అంతరించిపొయే ప్రమాదాన్ని గుర్తించిన కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలోని సెంట్రల్ జూ అథారిటీ వాటి సంరక్షణ చర్యల్లో భాగంగా రాబందుల సంతానాభివృద్ధికి సహజ వాతావరణాన్ని కల్పించేందుకు హైదరాబాదులోని నెహ్రూ జంతుప్రదర్శనశాలతోబాటు రాజస్థాన్ రాష్ట్రంలో కూడా ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇక నగరంలో వన్యప్రాణుల కృత్రిమ గర్భధారనకు కృషి చేస్తోన్న సీసీఎంబీ పావురాలు, జింకలు, దుప్పులు, కుందేళ్ళతో బాటు రాబందుల వీర్యాన్ని కూడా సేకరించింది.(ఆధారం: 23-8-2006 నాటి ఈనాడు హైదరాబాదు జిల్లా పత్రికలో వచ్చిన వార్తాకథనం)

మీకు తెలుసా?
మీరొక వింత గమనించారా? రాబందులకు తలమీదగానీ, మెడమీదగానీ అసలు బొచ్చే ఉండదు. ఎందుకో ఊహించండి:
ఎందుకంటే శవాలే రాబందుల ప్రధాన ఆహారం కాబట్టి. జంతువుల కళేబరాలను తింటున్నపుడు అవి తమ తలలను ఆ శవాల లోపలికి -ముఖ్యంగా పక్కటెముకల మధ్యలోకి- బాగా లోతుగా చొప్పించ వలసివస్తుంది. అలా తరచుగా చెయ్యడం వల్ల వాటికి బొచ్చు గనక ఉన్నట్లైతే ఆ బొచ్చులో శవాల మాంసఖండాలు చిక్కుకుపోయి, వాటిని తొలగించేవాళ్ళు లేక అక్కడే కుళ్ళిపోయి, రాబందుల అనారోగ్యానికి, తద్వారా చావుకు దారితీసేవి. అంటే రాబందుల తల మీద, మెడ మీద బొచ్చు లేకపోవడం డార్విన్ చెప్పిన నాచురల్ సెలక్షన్ అన్నమాట!

2 comments:

చదువరి said...

నూరు గొడ్లను తిన్న రాబందు ఒక్క సూదిమందుతో సరి అన్నమాట! మన ప్రభుత్వం రాబంధువులను కాపాడే పని సక్రమంగా చేస్తుందా అనేది ఆలోచించాలి. మనుషుల ప్రాణాలను హరించేవాటి నిషేధానికే దిక్కు లేదు, ఇక రాబందుల గురించి ఎంత సలక్షణంగా చేస్తారో కదా!
రాబందుకు మెడమీద బొచ్చు ఎందుకుండదో తెలిసింది.థాంక్స్! మంచి జాబు!

మదన్ మోహన్ said...

బాగుంది