Tuesday 24 June, 2008

నమ్మ బెంగలూరు

ఐదేళ్లకు పైగా హైదరాబాదులో పాతుకుపోయిన నేను అకస్మాత్తుగా బెంగళూరు వచ్చెయ్యాలనేసరికి కాస్త బెంగపడ్డమాట నిజం. ఐతే నేను హైదరాబాదు వదిలేసి బెంగళూరు వచ్చేస్తున్నానని తెలియగానే కొందరు ఆత్మీయులు నా బెంగ అర్థరహితం, అనవసరం అని కొట్టిపారేస్తూ, "ఇక్కడికొచ్చాక మీరే నమ్మ బెంగుళూరు అంటారు, వచ్చెయ్యండి" అని నమ్మబలికారు. ఇంకా వెనుకాడుతున్న నన్ను చూసి బెంగుళూరులో ఉండివెళ్ళిన కొందరు మిత్రులు "బెంగుళూరు నచ్చాలంటే మనలో ఆ క్లాస్ ఉండాలమ్మా" అని విదేశాలనుంచి సన్నాయినొక్కులు నొక్కారు. ఏమైతేనేం, చివరకు అందరూ కలిసి నన్ను బెంగుళూరుకు లాగేశారు.

నిజం చెప్పాలంటే మా ఊరినుంచి హై. కంటే బెంగలే దగ్గర. కానీ రాష్ట్రం దాటి రావాలంటే ముందుగా భాష గురించే నాకు బెంగ. ఎందుకంటే మనకు ఆంధ్రాంగ్లములు దక్క ఇతరేతర భాషలు రావు. MCA చదువుతున్నప్పుడు స్నేహితుల బలవంతమ్మీద జీవితంలో మొదటిసారి హిందీ సినిమా చూడడానికి వెళ్తూ వెళ్తూ దారిలో విశాలాంధ్రలో హిందీ డిక్షనరీ కొనుక్కుని మరీ వెళ్ళాను. ఇప్పుడూ అలాగే బెంగుళూరుకు రాకముందే ముందుజాగ్రత్తగా విశాలాంధ్రలో National Integration Series వారి 30 రోజుల్లో కన్నడం కొనిపెట్టుకున్నాను. (దాన్నింత వరకు తెరిచి చూడలేదనుకోండి, అది వేరే విషయం.) గుడ్డిలో మెల్ల ఏమిటంటే చిన్నప్పుడే నాకు 'ఉ', 'హ', 'క' తో సహా కన్నడం చదవడం వచ్చు. అందుకే ఇక్కడి (బెంగళూరు)కొచ్చాక కనిపించిన ప్రతి కన్నడ బోర్డునూ ఉత్సాహంగా చదివిపారేస్తున్నాను - అర్థమైనా, కాకపోయినా.

మొదటి అనుభవం: షేవింగు సెట్టుకు 'కత్తెర'

అసలు బెంగళూరుతో నా అనుబంధం పదినెల్ల కిందటే మొదలైంది. వారాంతాల్లో బెంగళూరుకు రావడానికి నా అలవాటుకొద్దీ ఒక చిన్న బ్యాగులో నా బ్రష్షూ పేస్టూ, షేవింగ్ సెట్టూ, సెల్ ఫోన్ ఛార్జరూ, దార్లో చదూకోడానికి రెండు మూడు పుస్తకాలు వేసుకుని బయలుదేరితే హైదరాబాదు విమానాశ్రయంలోని భద్రతాసిబ్బంది నన్ను, నా మీసకట్టును చూడగానే తెగముచ్చటపడిపోయి, "మీ మీసకట్టు చూడముచ్చటగా ఉంది, మీరు ఏ కత్తెరతో షేప్ చేసుకుంటారో చూపించండి" అని, నేనెంత మొహమాటపడుతున్నా పట్టించుకోక నా బ్యాగునంతా వెదికి మరీ నా కత్తెరను సావనీరుగా తీసేసుకునేవాళ్ళు. అలా వాళ్ల దగ్గర నావి ఐదారు కత్తెరలు (ఉండి)పోయాయి. ఐనా నేనొచ్చినప్పుడల్లా కొత్త కత్తెరను తీసుకోవడం అస్సలు మర్చిపోరు. ఒకసారి ఎందుకనో గుర్తులేదుగానీ నా బ్యాగునిండా చీమ దూరడానికి కూడా సందు లేకుండా ఏవేవో వస్తువులు కుక్కుకుని బయలుదేరాను. (ఎందుకేమిటిలెండి, మా ఆవిడకు జన్మదిన కానుక(లు) తీసుకెళ్తున్నాను) అప్పుడైతే వాళ్లకు కత్తెర వెంటనే దొరకలేదని చిన్నబుచ్చుకున్నారు కూడా. 'లేదయ్యా, నా దగ్గర అసలు కత్తెర లేనేలేదు, పోయినసారి మీరు తీసేసుకున్న తర్వాత నేను మళ్ళీ కొనలేదు, ఒకవేళ కొన్నా వెంట తెచ్చుకోలేదు, కావాలంటే నా షేవింగ్ సెట్టు చూడండీ' అని షేవింగ్ కిట్టు తెరిచి చూపించినా వాళ్ళు నిరాశపడలేదు. నా బ్యాగునంతా రెండుసార్లు వెదికాక నేను బ్లేడుతోనే షేప్ అనుకుంటానేమో అని అనుమానించి బ్లేడ్లు తీసేసుకున్నారు. మళ్ళీ నా బ్యాగును వెనక్కి X-రే స్కానింగుకు పంపి "కహా హై, కహా హై" అని అక్కడి గార్డును కంగారుపెడితే అతను "Centre మే హై" అని చెప్పేవరకూ వాళ్ళు శాంతించలేదు. వాళ్ల వాలకం చూస్తే కత్తెర కోసం గిఫ్టు పాకెట్లు కూడా విప్పి చూపమంటారేమోననిపించింది. అసలా బ్యాగులో కత్తెర ఉన్నట్లు అప్పటివరకూ నేను చూసుకోనేలేదు. చూసుకున్నట్లైతే వాళ్లనంతగా ఇబ్బందిపెట్టి ఉండను. ;) అలా ఆ ట్రిప్పులో కత్తెరతోబాటు బ్లేడ్లు కూడా పోగొట్టుకున్నాను. (భద్రతాకారణాల వల్ల ఇలా ప్రయాణీకుల నుంచి స్వాధీనం చేసుకున్న "ఆయుధాల"ను బేగంపేటలో ప్రదర్శనకు పెట్టమని ఏలినవారిని కోరాలి). బెంగుళూరు వెళ్ళబోతే ప్రయాణంలోనే ఇలాంటి అనుభవాలౌతున్నాయే, బెంగుళూరు వెళ్ళాక పూర్తిగా క్షవరమైపోతానేమో అని కూడా అనిపించినా 'అబ్బే, మా ఆవిడ చాలా మంచిది. అలాంటి పనులేవీ చెయ్యదు' అని నాకు నేనే ధైర్యం చెప్పుకునేవాడిని. మొత్తానికి అలా నేను బెంగళూరు వచ్చిపడ్డానన్నమాట. ఇక బెంగళూరులో నా అనుభవాలు కాస్కోండి:

బాగిలు

మొదటిరోజు ఇంటినుంచి ఆఫీసుకు వెళ్లడానికి సిటీబస్టాపుకెళ్ళాను. 'హై.లోలాగ ఇక్కడ షేరింగ్ ఆటోలు ఎందుకు లేవా' అని చింతిస్తూ, బస్సు రాగానే ఎక్కడానికి వీలుగా కుడివైపు నిలబడ్డాను. ఇంతలో బస్సు రానేవచ్చింది. కానీ ఆ బస్సుకు వెనకవైపు అసలు డోరే లేదు. ముందుపక్క ఒకే ఒక డోరు మాత్రమే తెరచి ఉంది. ఇదెక్కడి వింత? అనుకుంటూ బస్సెక్కి చూస్తే ఒకచేత్తో స్టీరింగు తిప్పుతూ ఇంకో చేత్తో టికెట్లిస్తున్న డ్రైవరు కనబడ్డాడు. అది చూసి అదిరిపడ్డాను. సిటీ బస్సుల్లో వన్ మాన్ సర్వీసులా? బెంగళూరుకు రాకముందు ఇలాంటిదొకటి ఉందని, అది మనదేశంలోనే విజయవంతంగా అమలౌతోందని ఎవరైనా చెప్పినా నమ్మేవాణ్ణి కాదు. ఎవరూ చెప్పలేదు కాబట్టి బతికిపోయారు. బస్సెక్కిన కాసేపటికి రోడ్ల మీద వెస్టిబ్యూల్ బస్సులు కూడా తిరుగుతూ కనబడ్డాయి. ఇక్కడ విజయవంతంగా నడుస్తున్న ఈ జంటవాహనగళు హైదరాబాదులో మూణ్ణాళ్ళ ముచ్చటగా ఎందుకు మూలనబడ్డాయో నాకు అర్థం కాలేదు.

బస్సు ఎక్కబోతూ డోరు దగ్గర కన్నడంలో స్వయంచాలిత బాగిలు అని చూసి 'బాగిలు అంటే ఏమిటబ్బా?' అని ఆలోచించాను. అప్పుడేమీ తట్టలేదుగానీ 30 రోజుల్లో కన్నడం కూడా చదవనసరం లేకుండానే త్వరలోనే అదేమిటో అనుభవపూర్వకంగా బోధపడింది. కాసేపు ఓపిగ్గా ఈ టపా చదివితే మీకు కూడా తెలిసిపోతుంది. (అసలు నా బ్లాగు చదవడమే ఓ ఎడ్యుకేషన్. అందుకే రోజూ వచ్చి నా బ్లాగు చదివేస్తూ ఉండండి. మీ విజ్ఞానాన్ని పెంచుకోండి.)

హైదరాబాదులో ఐతే సిటీ బస్సులు బస్టాపులో ఆగడం, ఆగకపోవడం దైవాధీనం. అది డ్రైవరు మూడును బట్టి ఉంటుంది. బస్టాపులోని దీనజనాల మీద దయ కలిగిందా ఆగుతుంది, లేదంటే ఎక్కడో వెళ్ళి ఆగుతుంది. మనం అక్కడిదాకా పరిగెత్తిపోయేలోపే "Catch me if you can" అంటూ కదిలి బుర్రున వెళ్ళిపోతుంది. ఐతే ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర మాత్రం నమ్మకంగా ఆగుతుంది. అందుకే బస్సెక్కాలన్నా, దిగాలన్నా జనాలు బస్టాపుల కంటే ఎక్కువగా ట్రాఫిక్ సిగ్నళ్ళనే నమ్ముకుంటారు. ఈ ట్రెండు చూసి ఆర్టీసీ వాళ్లు ముచ్చటపడి అమీర్ పేట మైత్రీవనం గేటు ముందైతే ఏకంగా సిగ్నల్ దగ్గరే బస్టాపు ఏర్పాటుచేశారు.

ఒక అచ్చమైన హైదరాబాదీలాగ అదే అలవాటుతో నేనూ బెంగళూరులో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గరే బస్సు దిగడం మొదలుపెట్టాను. నాలుగురోజులు బాగానే గడిచింది. ఐదో రోజు, అనగా ఒక శుక్రవారం నాడు, శుక్రుడు వక్రదృష్టితో చూశాడేమో నన్ను, బస్సు డ్రైవరు బస్సు దిగడానికి వస్తున్న నన్ను చూసి ముఖం మాడ్చుకుని ముందుకు వంగాడు. అతడలా వంగాడో లేదో అప్పుడే అలీబాబా అన్నకు గుహద్వారం ముసుకుపోయినట్లు నా కళ్లముందే బస్సుడోరు ముసుకుపోయింది. అసలే మన హై.లో సిటీ బస్సులకు డోర్లుండడం, ఉన్నా అవి మూసుకుపోవడం ఏ జన్మానా ఊహించలేం కదా? అందుకే 'ఈ డోరేమిట్రా ఇలా చేసిందీ' అని నిర్ఘాంతపోయాను. "డోరా డోరా తెరుచుకోవే" అని నాకొచ్చిన మంత్రాలన్నీ పఠించాను, లాభం లేకపోయింది. బస్సు డ్రైవరేమో నా మొర ఆలకించకుండా ఎటో చూస్తున్నాడు. ఈలోగా సిగ్నలు మారి బస్సు కదిలిపోయింది. ఆ కదలడం కదలడం ఒక కిలోమీటరు దాకా ఎక్కడా ఆగలేదు! దార్లో ఎక్కడా అంగుళం కూడా అడ్డం రాని బెంగళూరు ట్రాఫిక్ మీద మండమంటే మరి నాకు మండదా?

అలా ఎక్కడో దిగవలసిన నన్ను ఇంకెక్కడో వదిలి వెళ్ళిపోతున్న బస్సు వైపు "బలివాడ కాంతారావు నవలలా" చూసేసరికి ఆ బస్సు వెనుక రాసి ఉన్న రెండులైన్ల ముషాయిరా కనబడింది:

నడువె అంతరవిరళి
అఫవాతక్కి అవసరవే కారణ


మొదట అదేమిటో అర్థం కాలేదు. కాసేపటికి తేరుకుని నాకు అర్థమైనంతవరకు ఆ రెండు లైన్లకు స్వీయానువాదం
"నడువరా అంతదూరమూ, అవసరమే అందుకు కారణము" (నడువరా కి నడువే అని లింగమార్పిడి చేశారన్నమాట!) అని పాడేసుకుంటూ వెనుదిరిగి సాగిపోతున్నాను. ఒక్కో బస్సూ నన్ను దాటుకుని వెళ్తున్నప్పుడల్లా స్వయంచాలిత బాగిలు అని కళ్లముందు కనబడుతూనే ఉంది. ముషాయిరా అనువాదం కనిపెట్టిన ఉత్సాహంలో ఉన్నా కదా? అదే ఊపులోనైతే వీజీగా తడుతుందని స్వయంచాలిత బాగిలును కూడా స్వీయానువాదం చేయడానికి ప్రయత్నించాను. స్వయంచాలిత అంటే ఆటోమాటిక్. మరి బాగిలంటే ఏమయ్యుంటుంది? అని ఊహించబోతే ఎంతకీ తట్టలేదు. కుంచంతో నిలువుగా కొలవడానికి వీల్లేనప్పుడు తిరగేసి కొలవమన్నారు కదా? అందుకని ఇలా కాదని అసలు ఆ బస్సుల్లో కదిలేవీ, హైదరాబాదు బస్సుల్లో కదలనివీ ఏమున్నాయాని ఆలోచించేసరికి మిష్టరీ ఇట్టే విచ్చిపోయింది. (చూశారా? అసలైన Education అంటే ఇదేగానీ జావాలు, డాట్ నెట్లూ కాదని మీకెవరు చెప్తారు?) ఇంతకూ బాగిలు అంటే ఏమిటనుకున్నారు? అవే... ముదనష్టపు డోర్లు!! వాకిలిని కన్నడంలో బాగిలు అంటారన్నమాట. ఆహా! గొప్ప డిస్కవరీ. (నిండా కష్టాల్లో ఉన్నప్పుడే మనకలా బ్రెయిన్ వేవులొస్తుంటాయిలెండి) ఈ లెక్కన కన్నడం నేర్చుకోవడం చాల వీజీనే. అర్థం కానిచోటల్లా తెలుగు పదాలతో రైమింగు కుదిరేటట్లు చూసుకుంటే సరి.

మనం దారిలో కనిపించిన బోర్డులన్నీ చదివేసుకుంటూ, అనువాదాలు చేసేసుకుంటూ ఇదే వేగంతో పురోగమిస్తే పది నిమిషాల్లో ఆఫీసు చేరుకోవచ్చు, ఆపైన పదిరోజుల్లో కన్నడంలో పండితులమైపోవచ్చు. 10 రోజుల్లో కన్నడం పుస్తకం సొంతంగా ముద్రించుకోవడం మంచిదా లేక ఆ అవకాశం విశాలాంధ్ర వాళ్ళకిద్దామా అని తీవ్రంగా ఆలోచిస్తూ ఆఫీసు చేరుకున్నాను.

హా!
హాఫీసు నుంచి తిరిగొచ్చేటప్పుడు పాలు, పూలు తీసుకురమ్మని చెప్పి పంపింది మా ఆవిడ. పాలను హాలు, పూలను హువ్వ అంటారని కూడా చెప్పింది. దాంతో మన చురుకైన బుర్రకు అంతా అర్థమైపోయింది. బెంగాలీలు 'వ' ను 'బ' అని పలికినట్లే కన్నడిగులు 'ప' ను 'హ' అంటారన్నమాట. ఆహా! మన కన్నడం క్షణక్షణాభివృద్ధి చెందడానికి ఇంటా బయటా ఇంత గొప్ప ప్రోత్సాహం లభిస్తూంటే పుస్తకం సొంతంగానే ప్రచురించుకోవచ్చు. కన్నడంలో కథలు కూడా రాసేసి అర్జెంటుగా ఒకటో రెండో జ్ఞానపీఠాలు కూడా గెలిచేసుకోవచ్చు. భారతదేశం వోల్మొత్తంలో జ్ఞానపీఠమెక్కడానికి దగ్గర దారి కన్నడ సాహిత్యమేకదా? అసలే గిరీష్ కర్నాడ్ కు ఆ పురస్కారం వచ్చాక మూడేళ్ల కాలపరిమితి దాటిపోయి కూడా చాలా కాలమైంది.

ఇంతకూ మా ఆవిడ హాలు, హూలు తెమ్మందేగానీ హళ్ళు తెమ్మని చెప్పలేదు (అదేనండీ పళ్ళు, ఇలాంటి పదాలు వీజీగా క్యాచ్ చెయ్యాలంటే చిట్కాల కోసం నేను రాయబోయే 10 రోజుల్లో కన్నడం పుస్తకం ముందుగానే పది కాపీలు రిజర్వు చేసుకోండి). కానీ కొన్ని పనులు చెప్పకుండా చేస్తే మనకే లాభం. (Education లో మూడో పాఠం) ఏ హళ్లు తీసుకెళ్ళాలి? సీజన్ కాబట్టి మామిడి హళ్ళు బెటర్.

మడివాళ లో దిగడానికి సిద్ధంగా డోరు దగ్గర చేరి బయటకు చూస్తున్న నాకు సెయింట్ జాన్స్ ఆస్పత్రి పక్కన ఆనందాశ్చర్యాలు కలిగించే బోర్డు ఒకటి కనబడింది. ఆ రోడ్డు పేరు "మహాయోగి వేమన రస్తె" అట! అదే హై.లోనైతే పెద్ద సెంటర్లకు కోఠీ, అబిడ్స్, లక్డీకాపూల్, కూకట్ పల్లి, మెహదీపట్నం, దిల్ సుఖ్ నగర్,.. అనీ; చిన్నసెంటర్లకు టప్పా చబుత్ర లాంటి విడ్డూరమైన పేర్లేవో ఉంటాయి. రోడ్లకు అన్నీ ఇంగ్లీషు పేర్లో, లేకపోతే నవాబుల పేర్లో ఉంటాయిగానీ తెలుగువాళ్ల పేర్లు కనబడవు. నిజం చెప్తున్నా, వీటిల్లో ఒక్కదానికి కూడా నాకు అర్థం తెలీదు. అలాంటిది ఇక్కడ ఒక రోడ్డుకు యోగి వేమన పేరు పెట్టారని చాలా సంతోషించాను. ఎంతైనా కన్నడిగులు చానా మంచోళ్ళు.

ఆ ఆనందంలోనే మామిడిపళ్ల బండి దగ్గరకెళ్ళి కొన్ని పళ్ళు ఏరుకున్నాను. తక్కెడ తీసి ఎన్ని కావాలని కాబోలు అడిగాడు పళ్లమ్మేవాడు. "హది" అన్నాను. అప్పుడు వాడు వేసిన వెర్రిమొహం మసకచీకటిలో కూడా స్పష్టంగా కనబడింది. దాంతో 'ఓ! మనమెక్కడో తప్పులో కాలేశాం' అనుకుని 'టెన్' అన్నాను, వాడింకా అలాగే చూస్తున్నాడు. 'దస్' అన్నాను. అది కూడా వాడికి అర్థమైనట్లు లేదు. ఇలా కాదని అచ్చతెలుగులో 'పది' అన్నాను. ఆ మాటతో వాడిలో చలనం వచ్చింది. 'హమ్మయ్య! వీడికి తెలుగొచ్చన్నమాట!!' అనే ఆనందంలో జరిగిందంతా మర్చిపోయి హళ్ళు తీసుకుని ఇంటికొచ్చేశాను.

మామిడి హళ్ళ ... క్షమించాలి, పళ్ళ అనుభవంతో నా కన్నడ పరిజ్ఞానం మీద నాకే రవంత అనుమానం కలిగింది. దాంతో 10 రోజుల్లో కన్నడం పుస్తకం రాసే ఆలోచన ప్రస్తుతానికి పక్కన పెట్టాను. ఐతే ఇటీవల నన్ను కన్నడంలో ఎవరేది అడిగినా సమాధానం కన్నడంలోనే చాలా జోరుగా, ఇంకా చాలా కాన్ఫిడెంటుగా చెప్పేస్తున్నాను. అదేమిటో గానీ అందరికీ ఆ సమాధానం అర్థమౌతోంది కూడా. అడిగినవాళ్ళెవరూ నాకేసి వెర్రిగా గానీ, విచిత్రంగా గానీ చూడకపోవడమే దానికి నిదర్శనం. "National Integration Series" వారి 30 రోజుల్లో కన్నడం పుస్తకం చదవకుండానే నాకు కన్నడం వచ్చేసిందా? బెంగుళూరులో నేను భాష గురించి బెంగ లేకుండా బతికెయ్యగలనా? మీరే చెప్పాలి.
... ... ...

ఇంతకూ అసలు విషయం నేను మీకు చెప్పనేలేదు కదూ? కన్నడంలో నేను చాలా జోరుగా, ఇంకా చాలా కాన్ఫిడెంటుగా వాడుతున్న ఏకైక పదం "గొత్తిల్ల"!
(ಗೊತ್ತಿಲ್ಲ = తెలీదు)



38 comments:

తెలుగు'వాడి'ని said...

చాలా అధ్భుతంగా రాశారు ... చక్కటి హాస్యగుళికలు .. అనుభవాల క్రమం, వివరించిన విధానం నిజంగా భలే పసందుగా ఉంది. అభినందనలు.

సుజాత వేల్పూరి said...

త్రివిక్రం గారు,
నేను రెండు వారాల క్రితమే బెంగళూరు నుంచి హైదరాబాదుకు shift అయి, ప్రస్తుతం బెంగుళూరు(రెండేళ్ళ ప్రేమ )మీద విరహంతో చచ్చిపోతూ ఉంటే ఇంతలో మీ టపా!దాదాపుగా మీ అనుభవాలే నావీనూ! కానీ బెంగుళూరు మనుషులు నాకు తెల్సినత వరకు సాఫ్ట్ గా ఉంటారండి,మరీ మనం హైదరాబాదు నుంచి వెళ్ళుంటామా, మరీ మెతగ్గా కనిపిస్తారు వాళ్ళు.

నడువ అంతర....అనువాదం అదిరిపోయిందనుకోండి!

మహాయోగి వేమన పేరు మడివాళ మార్కెట్ పక్క (ఎదురా) రోడ్డుకి చూసి నేనూ ఆనందంతో పొంగి పోయాను. ఆ రోడ్లో ఇంజనీరింగ్ కాలేజీ ఉంది, చూసారా!

కొత్తల్లో నేనూ మా పనమ్మాయినడిగి 'నాకు కన్నడ రాదు ' అనే మాట నేర్చుకుని ఎప్పుడూ తారక మంత్రంలా జపిస్తుండే దాన్ని.'ననగె కన్నడ బరల్ల ' అని! కానీ మేమున్న ప్రాంతంలో (బన్నేర్ ఘట్ట రోడ్) అందరూ తెలుగోళ్ళే, అందువల్ల అసలు కన్నడ వాడే అవసరం రాలేదు. మొత్తం జనాభా 65 లక్షలు కాగా, అందులో 25 లక్షలు తెలుగు వాళ్ళేట అక్కడ! అందువల్ల భాష సమస్య రాదు లెండి. మీరు ఉన్నది HSR లే అవుట్ ప్రాంతం అయితే అసలు ప్రాబ్లమే లేదు. అందరూ మనవాళ్ళే! మన జగన్ బాబు కి కూడా అక్కడ ఇల్లుంది. అయినా పది నెల్లయినా ఇంకా డౌటా మీకు? హాపీగా బతికేస్తారు చూడండి!

అన్నట్టు మీరు కాంఫిడెంట్ గా వాడుతున్న పదం 'గొర్తిల్ల ' అని సవరించుకోండి....'గొర్తు ' అంటే తెలుసు అని కదా!

మొత్తానికి బెంగుళూరు మీద నా విరహాన్ని మరింత పెంచింది మీ టపా!

karthik said...

nenu kuda yogi vemana street ani chusi chala anandinchanu anduke prastutam ade road lo illu teesukunnanu :)

క్రాంతి said...

బెంగుళూరికి స్వాగతం.టపా అదుర్స్ కాని మీ బ్లాగులో కామెంటు పోస్ట్ చెయ్యడానికి వర్డ్ వెరిఫికేషన్ అవసరమంటారా చెప్పండి.

Indian Minerva said...

చాలా బాగా రాసారండీ భాషానుభవాలు. ఇంతకీ మీ పుస్తకం యెప్పుడు రాయబోతున్నారో చెప్పనేలేదు. ఒక వేళ రాస్తే నకు తొలి copy నాకే అందేలా చూడండి. తెలీదు అంటే "గొర్తిల్ల" నా "గోత్తిల్ల" నా?
ఒక సారేమయిందంటే ఒక ICICI పిల్ల phone చేసి కన్నడలో యేక ధాటిగా వాయించేస్తుంటే నేను "కన్నడ గొత్తిల్ల" అని చెప్పా. దానికాపిల్ల "మాట్లాడతాయిదిరిగా సార్" (సరిగ్గా తెలీదు కానీ ఇలాగే అనిపించేలా ఏదో) అంది. నేనేమైనా తక్కువ తిన్నానా సహారా సినిమాని చూసిన inspiration తో "నాగె కన్నడదల్లి కన్నడ గొతిల్ల మాత్ర గొత్తు" అని చెప్పా. తరువాతి సంభాషణ english లో సాగిందని వేరే చెప్పాలా?

Anonymous said...

దీన్నిబట్టి నాకర్థమౌతున్నదేంటంటే హై.లో ఉన్న చక్కటి ప్రజాసౌకర్యాలు బెంగళూరులో లేవని. పాపం మీరు సర్దుకోవడానికి కాస్త సమయం పట్టేట్టే ఉంది.

ఇంగ్లీషు నేర్పే సారొకరున్నారు మనకు. ఇప్పుడిక కన్నడం కూడా నన్నమాట! కానివ్వండి.

Unknown said...

వెల్కం టు బెంగుళూరు...
మంచి అనుభవాలే ఉన్నాయి మీకు. టైముంటే చెప్పండి. ఓ సారి కలుద్దాము.

Kathi Mahesh Kumar said...

చాలా బాగుంది. ಬೆಂಗಳೂರಿಗೆ ಸ್ವಾಗತ...ನಿಮ್ಮ ಅನುಭವ ಚೆನ್ನಾಗಿರಲಿ.

చైతన్య కృష్ణ పాటూరు said...

మీ కన్నడానుభవాలు భలే వున్నాయి. నేను కూడా వచ్చిన కొత్తలో కన్నడ లిపిని తెలుగులో చదివేసేవాడిని. మెజెస్టికో, బ్యాంకో, రోడ్డో అని చదువుతుంటే తమాషాగా వుండేది.

మేముండేది కూడా బన్నెరు ఘట్ట రోడ్డులోనే. సుజాతగారు చెప్పినట్లు ఇక్కడంతా తెలుగు వాళ్ళే. ఎప్పుడో IIM-Bangalore కట్టడానికి కూలీలుగా, మేస్త్రీలుగా, ఇంకా ఇతర పనుల మీద వచ్చి స్థిరపడిపోయిన చిత్తూరు జనం. మేము ఈ ఏరియాలో నాలుగు సంవత్సరాలుగా "కన్నడ గొర్తిల్లా" అనే మాట కూడా వాడాల్సిన అవసరం లేకుండా బ్రతికేస్తున్నాం. వేరే ఏరియాకి మారితే మాత్రం తప్పకుండా మీ పుస్తకానికి ఆర్డర్ పెట్టుకుంటాం.

కొత్త పాళీ said...

మొత్తానికి బెంగుళూరు బదిలీ మీ తెలుగు ఘంటాన్ని కదిలించినందుకు చాలా సంతోషం.
మేము .. రోజూ కాకపోయినా .. అడపాదడపా మీ బ్లాగుని సందర్శిస్తూనే ఉన్నాం .. ఏమన్నా కొత్తగా రాశారేమోనని. :-)

krishna said...

Can you finish your book in two weeks. I have a trip to banglore very soon.
LOL.........

RG said...

కేక పెట్టించారండీ, నేనూ ఇలాగే బెంగుళూరు వచ్చిన కొత్తలో బస్సులో సీట్లో కొంచెం సర్దుకోమని ఎవరో కన్నడంలో అడిగితే, అంతే స్పీడుగా "కన్నడ గొత్తిల్లా" అని చెప్పాను. వాడు నేనేదో కామెడీ చేస్తున్నాననుకుని పక్కనే కూర్చుని యావూరు, హెసరెన్న అని కన్నడంలో అడగడం మొదలెట్టాడు. నాకు కన్నడ రాదని అతన్ని కన్విన్స్ చేసేసరికి మెజెస్టిక్ వచ్చేసింది :)

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం said...

నడువె అంతరవిరళి - మధ్యలో gap వదలండి
అఫవాతక్కి అవసరవే కారణ - ప్రమాదాలకు తొందఱపాటే కారణం.

వేణూశ్రీకాంత్ said...

త్రివిక్రం గారు చాలా బాగా రాసారండి. అర్ధమైనా కాకపోయినా కన్నడ చదవ గలగడం చాలా సరదాగా ఉండేది. నేను మొదటి సారి బెంగళూరు వెళ్ళినపుడు ఆటో మాట్లాడటానికి నాకు తెలిసిన భాషలు అన్నీ కలిపేసి నానా తంటాలు పడుతుంటే వాడు నాకేసి పైకీ కిందకి చూసి "What language?" అని అడిగాడు నాకు ఒక్క సారి sound ఆగిపోయింది. తెలుగు అని చెప్తే "అయితే తెలుగు లో చెప్పు" అనేసాడు అప్పట్నుండీ మొహమాటం లేకుండా తెలుగు లో మాట్లాడ్డం అలవాటు చేసుకున్నా, ఎక్కడో కాని గొత్తిల్లా అని సమాధానం వచ్చేది కాదు చాలా వరకు తెలుగు అర్ధం చేసుకునే వాళ్ళు.

Anonymous said...

మీ బెంగుళూరు అనుభవాలు చాలా బాగున్నాయి. నేనూ మూడేళ్ళ క్రితం బదిలీ మీద మైసూరు వచ్చాను. బెంగుళూరితో పోలిస్తే ఇది చాలా కన్నడ ప్రాబల్యం ఉన్న ఊరు (తెలుగువారికి విజయవాడ, గుంటూరు లాగన్నమాట). మొదట ఇబ్బందనిపించినా, వీరికి తమ భాషపైనున్న ప్రేమా, ఇంగ్లీషు నుండి, తమను త్రోసి రాజంటున్న తమిళ, తెలుగు భాషల నుండి తమ భాషను కాపాడుకోవడానికి వీరు పడే తాపత్రయం చూసి ముచ్చటేసింది. ఇప్పుడు నేనూ కన్నడం బాగా మాట్లాడడం నేర్చుకొన్నాను.

అన్నట్లు, 'గొర్తిల్ల' కాదు - 'గొత్తిల్ల'.
'గొత్తు' అంటే 'తెలుసు' అని.

Anil Dasari said...

చాలా బాగా రాశారు కామెడీ దట్టించి. నేనూ పదేళ్ల క్రితం ఓ ఆరు నెలలు ఉన్నా బెంగుళూరులో. సినిమాల్లో వాటిలో విధాన సౌధ రోడ్డొకటి చూపించి మురిపించేస్తారు కానీ, నాకయితే ఆ ఊరు ఏమంత నచ్చలా. సిటీ బస్సులు మరీ డొక్కుగా అనిపించేవి. అందులో కండక్టర్లిచ్చే చిల్లర నోట్లు గుర్తు పట్టలేని రకంగా ఉండేవి (చినిగి పేలికయిన రూపాయి నోటుకి లామినేషన్ చేసినట్లు సెల్లో టేపంటించేస్తారు). బస్టాపులెక్కడుంటాయో ఓ పట్టాన అర్ధం కాదు. ఇదంతా పదేళ్ల క్రితం సంగతి. ఇప్పుడెలా ఉందో తెలీదు.

ఇలా అంటున్నానని నేను హైదారాబాదుకి వీరాభిమానిననుకోవద్దు. నాకు మన భాగ్యనగరం కన్నా మద్రాసు బెటర్ అనిపిస్తుంది (ఉక్కపోత వాతావరణాన్ని మినహాయిస్తే). ట్రాఫిక్ సమస్యలతో సహా ఏ గొడవలూ లేని నగరం.

(బెంగళూరాభిమానులు బాంబులతో సిద్ధమైపోయుంటారు నేను దొరికితే వేసెయ్యటానికి. ఇలాంటప్పుడే కలంపేర్లు బాగా ఉపయోగపడతాయి)

రానారె said...

"బావా! ఛీ!!" తరువాత మల్లా ఆ తరహాలో మాంఛి టపా పడింది. :) నా బెంగళూరు కతలు శానా వుండాయి. మెల్లమెల్లగా నేనూ చెప్తా.

ఈ word vefification తీసేసే ఆలోచన చెయ్యండి మహాప్రభో ... వ్యాఖ్య రాసేలోగా అది time out కావడం, ఇంకోటి రావడం, దాంతోపాటు నా pasword టైపు చెయ్యాల్సిరావడం ... (ఇప్పుడు జరిగిందిదే)

సుజాత వేల్పూరి said...

ఇంకో ముచ్చట! మన హైదరాబాదులో ఒఖ్ఖడు కనీసం ఒఖ్క ఆటో డ్రైవరన్నా 'మీరు ' అని సంబోధించగా విన్నారా మీరు? బెంగళూరుత్లో ఒక సారి ఆటో ఒకటి నేను రోడ్ క్రాస్ చేస్తుండగా అడ్డం వచ్చింది. డ్రైవర్ బండాపి ' నీవు హోగి ' అన్నాడు. హోగి అంటే తెలుసు, వెళ్ళమని. మనకు ఇక్కడ కూడా గౌరవం లేదన్న మాట అనుకుని కోపంగా అతడికేసి చూస్తూ దాటేసాను రోడ్డు. తర్వాత ఇంటికెళ్ళి 30 రోజుల్లో కన్నడ పుస్తకం చూడగా తెలిసింది 'నీవు ' అంటే కన్నడలో ' మీరు ' అనే! నువ్వు అండానికి 'నీను ' అంటారు!చాలా మంది ఆటో డ్రైవర్లు ఇంగ్లీష్ దంచి పారేయడం మొదట్లో బలే వింతగా ఉండెది నాకు.

@చైతన్య కృష్ణ గారు,
మీరూ B.G. రోడ్డేనా, ఈ సంగతి బెంగళూరులో ఉన్నప్పుడు తెలిస్తే 'B.G. రోడ్డు బ్లాగర్ల మీటింగ్ ' పెట్టేసుకుందుము కదా! మేము IIM వెనకాలే ఉండేవాళ్లం లెండి!

GIREESH K. said...

అదిరిందండీ! "బెంగ"లూరుకు స్వాగతం. రెండున్నరేళ్ళగా నేను ఈ "బెంగ"లూరులో ఉంటున్నా. మీర్రాసినవన్నీ నేనూ అనుభవించాను. అమ్మో, అయ్యో అంటూ తెలుగులో గుండెలుబాదుకుంటున్నట్లుండే ఇక్కది సైన్ బోర్డులు, రహదారికీ, గల్లీకీ తేడా లేకుండా ఉండే ట్రఫిక్కూ, అందరూ వంట చేయడం మరచిపోయారా అనిపించే కిక్కిరిసిన హోటళ్ళూ/టిఫిన్ సెంటర్లూ, ఆంధ్రా భోజనం మళ్ళీ జన్మలో ముట్టుకోకూడదూ అనిపించే "ఆంధ్రా రెస్టారంట్లూ", ఒకపట్టాన అర్ధంకాని వన్ వే ట్రాఫిక్కులూ..... తన పేరులోకిమల్లే, ఇక్కడి జీవితంలో ఎన్ని "బెంగ"లున్నా... ఈ వూరు మాత్రం మిమ్మల్ని కట్టి పడేస్తుంది. ఇక్కడి వాతావరణం మిమ్మల్ని ఎంతగా pamper చేస్తుందంటే, ఈ వూరు విడిచిపెట్టే సమయంలో మాత్రమే మీకు తేడా అర్ధమౌతుంది!

అన్నట్లు, నేనుకూడా బన్నేరుఘట్ట రోడ్డులోని IIM కి దగ్గర్లో జె.పి.నగర్ 7 ఫేస్ లో ఉంటానండీ!

Unknown said...

చూస్తుంటే తెలుగు బ్లాగర్లందరూ బన్నేరుఘట్ట పరిసర ప్రాంతాల్లోనే ఉన్నట్టున్నారు.
నేనూ దానికి దగ్గర్లోనే. :)

రవి said...

సూపరు. నాకూ మొదట్లో కొంచెం కంఫ్యూసన్ కంపు తోట, కంపు పానీయగళు, మత్తు ఫలహార మందిర లాంటివి చూసి. ఇప్పుడు కన్నడ ('డు ము వు లు ' లేని భాష) అలవాటైపోయింది.

ప్రవీణ్ చెప్పినట్టు ఓ సారి బెంగ బ్లాగ్మిత్రులం అందరం కలవాలి. ప్రవీణే మళ్ళీ ఆర్గనైస్ చేయాలి.

Unknown said...

చూస్తుంటే, తెలుగు బ్లాగర్లు అందరూ జెపి నగర చుట్టుపక్కలే ఉన్నట్టు ఉన్నారే !! నేను కూడా జెపి నగరనే. అన్నట్టు, మొదట్లో నేను కూడా "లాలో బాగో".. మెజెస్టికో .. ఇలా చదివి నవ్వేవాడిని. నాకెందుకో బెంగళూరు కన్నా చెన్నై బావుంటుంది అనిపిస్తుంది. అక్కడ బీచ్ ఉంది కదా .. :)

Naveen Garla said...

నేనుండేదీ...BTMకు దగ్గరలోనే :)
మొన్నటి వరకు బిలేకహళ్ళిలో ఉండేవాడిని.

కర్ణాటకలోనే చదివాను కాబట్టి కన్నడతో ఎప్పుడూ ఇబ్బంది అనిపించలేదు.

( http://gsnaveen.wordpress.com )

త్రివిక్రమ్ Trivikram said...

@ తెలుగువాడిని గారు,

నెనర్లు.

@సుజాత గారు,

ఈ టపాకొచ్చిన వ్యాఖ్యలు చదివాక మీ విరహం ఇంకా ఎక్కువయ్యుండాలే? మేం ఉంటున్నది HSR లే అవుట్ లో 'రాజ'కుమారుడి ఇంటికి దగ్గర్లోనే. మొత్తానికి పెండ్యులం గుత్తిల్ల, గొర్తిల్ల ల మధ్య ఊగి ఊగి గొత్తిల్ల దగ్గర ఆగిందన్నమాట. నెనర్లు. అన్నట్లు మీరు కూడా 30 రోజుల్లో కన్నడ పుస్తకం పార్టీయేనన్నమాట. :)

@ కార్తీక్,

అవునా? మేముండేది అక్కడికి దగ్గర్లోనే. :)

@ క్రాంతి గారు,

నెనర్లు. మీరు, రానారె కోరిన మీదట వర్డ్ వెరిఫికేషన్ తీసేశాను.

@ ఇండియన్ మినర్వా గారు & చైతన్య క్రిష్ణ పాటూరు గారు,

మీలాంటి పాఠకులు ఉత్సాహం చూపాలేగానీ పదిరోజుల్లో పుస్తకం రాసెయ్యనూ? నెనర్లు.

@ చదువరి గారూ!

కుదురుకోవడానికేం లెండి, ప్రజాసౌకర్యాల విషయానికొస్తే ఇక్కడ కొందరు డ్రైవర్లు సిగ్నల్ దగ్గర అడిగినా తలుపు తియ్యరు. షేరింగు ఆటోలు లేవుగానీ బస్సుల్లో జనం హై.లో అంతగా విరగబడరు. ట్రాఫిక్ ఇబ్బందులు కూడా తక్కువే (కనీసం నేను తిరిగే రూట్లో, ఇప్పటి వరకూ). కానీ ఇంటి దగ్గర దొంగల బెడద ఎక్కువ. భద్రత తక్కువ. అక్కడ అర్ధరాత్రీ అపరాత్రీ అని లేకుండా ఊరంతా తిరిగేవాణ్ణి. ఇక్కడ పొద్దుపోయాక బయటికి రావాలంటే భయం. బహుశా అక్కడ అలా తిరగడానికి కారణం శతమర్కటాన్ని కావడమేమో? ఇక్కడ ముక్కుతాళ్ళు పడ్డాయి కదా? ;)

@ ప్రవీణ్,

తప్పక కలుద్దాం.

@ మహేష్ కుమార్ గారూ!

ಧನ್ಯವಾದಗಳು. అన్నట్లు మీ చిన్ననాటి స్నేహితుడు రాజశేఖర్ బాబు MCA రోజుల నుంచి నాకు మంచి స్నేహితుడు. మీ గురించి నాకు అతడి ద్వారానే తెలిసింది. :)

@ చైతన్య క్రిష్ణ పాటూరు గారు,

బారో మత్తు రెస్టారెంటో అని చదివి "తాగుబోతెదవలకు మత్తులో పడి బారో రెస్టారెంటో తెలియలేదు". అని, బస్సుల మీద "బెంగుళూరో మైసూరో" అని చూసి బెంగుళూరుకెళ్ళాలో మైసూరుకెళ్ళాలో డ్రైవరుకే తెలిసినట్లు లేదు అనీ నవ్వుకునేవాళ్ళం. :)

@ కొ.పా. గారూ,

నెనర్లు.

@ కృష్ణుడు గారూ!

మీరో వెయ్యి కాపీలకు స్పెషలార్డరిస్తే వారం రోజుల్లో రాసెయ్యనూ?

@ రాజశేఖర్ గారూ,

ఐతే మీకు నా పుస్తకం అవసరం చాలానే ఉంది. ;)

@ తాలబాసు గారూ,

నెనర్లు.

@ వేణూ శ్రీకాంత్ గారూ,

అలాంటప్పుడే కదా నమ్మ బెంగుళూరు అనిపించేది? :)

@ anonymous గారూ,

నెనర్లు.

@ అబ్రకదబ్ర గారూ!

కలం పేరును చాలాబాగా వాడుకున్నారు. :) అప్పటికీ ఇప్పటికీ ఊరు మారినట్లే ఉంది.

@ రానారె,

చిత్రమేమిటంటే బావా!...చీ!! హై.లో నా మొదటిరోజు అనుభవమైతే ఇది బెంగలో నేను పడిన బెంగ. అలాగే ఢిల్లీ వీధుల్లో నా వెతలు కూడా ఈ ధోరణిలోనే ఉంటాయి: నదిరే, పుదిరే.

@ గిరీష్ k గారు,

బెంగళూరు గురించి చక్కగా చెప్పారు. నెనర్లు.

@ రవి గారూ,

కంపు తోట, కంపు పానీయగళు, భలే. :)

@ ప్రదీప్ గారూ!

"లాలో బాగో".. మెజెస్టికో .. అనుకుంటే అదో ఆనందం. :)

@ నవీన్,

ఐతే మీరు చిన్నప్పుడే అక్కడికెళ్ళి పెద్దయ్యాక చాలా వినోదం మిస్సయ్యారు. ;)

oremuna said...

మీరు మన హై వదిలివ్ ఎళ్లారని బాధతో మీ పోస్టుకు ఒక్కటే మార్కు వేస్తున్నాను :)

Enjoy Banagalore.

How is e-telugu Bangalore doing?

జ్యోతి said...

అబ్బాయ్ త్రివిక్రమా!!

ఏ గూటి చిలక ఆ పలుకులే పలుకుతుంది అనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి. ఇక్కడున్నప్పుడూ బ్లాగడానికి తీరిక లేదు.కాని బెంగులూరు వెళ్ళి ఏకంగా పుస్తకం రాయడానికి తయారు. కానీ.
హై వాళ్ళందరికి నీ మీద చాలా కోపంగా ఉంది. నేనైతే నీకు సున్నా మార్కులు ఇస్తున్నాను.

Naveen Garla said...

హై వాళ్ళందరికీ బాధేమో కానీ, ప్రదీప్ బెంగళూరు వదిలి వెళ్ళిపోయాడన్న బెంగతో ఉన్న మాకు మాత్రం త్రివిక్రమ్ ఇక్కడకు రావటం భలే సంతోషంగా ఉంది :)
త్రివిక్రమా..నీకు మేము నూటికి నూరు మార్కులు ఇస్తాండాంలే....

త్రివిక్రమ్ Trivikram said...

@ చావా కిరణ్ & జ్యోతక్కా,

హై. మీద విరహం నేనూ ఫీలవుతున్నాను. కానీ ఏం చేస్తాం? తప్పదు మరి. :( మీ అభిమానం ముఖ్యంగానీ మార్కులు నేనేం చేసుకుంటాను?

@ నవీన్,

హై మిత్రులు మార్కులెయ్యలేదని అలా అన్నానుగానీ వెంటనే కరువుతీరిపోయేటన్ని మార్కులేసినందుకు మీకు రొంబ ధన్యవాదగళు. :) ప్రదీప్ కూడా ఇక్కడే ఉన్నట్లైతే ఇంకా బాగుండేది. ఇంతకుముందొకసారి బెంగుళూరులో ప్రదీప్, ప్రవీణ్, నేను కలిశాం. ఇకనుంచి ప్రతినెలా కలుస్తూ ఉందాం.

త్రివిక్రమ్ Trivikram said...

ఇంకోమాట: పొద్దు గడిలో "బెంగుళూరెవరిది?" అని రానారె అడిగిన ప్రశ్నకు సమాధానం రాయబోతే ఈ టపా తయారైంది. అలా ఈ టపాకు ప్రేరకుడు, ఈ టపా నుంచి ప్రేరణ పొంది తన బెంగళూరు అనుభవాల గురించి బ్లాగడానికి సిద్ధమౌతున్నవాడు ఐన రానారెకు ఈ టపాను అంకితమిస్తున్నాను.

Kathi Mahesh Kumar said...

ఓ రాజశేఖర్ తెలుసా మీకూ...మంచిది. మొత్తానికి ఒక common friend ఉన్నాడన్నమాట!

Anonymous said...

ఈ మహాయోగి వేమన రోడ్డు చూసి నేను బెంగలూరు లో కొంతమంది తెలుగు వాళ్లని, కొంతమంది కన్నడిగులనీ అడిగాను, ఈ వేమన ఆ వేమనేనా అని..ఎవరు సరి ఐన సమాధానం ఇవ్వలేదు. ఇదెపేరుతో కళాశాల ఉన్నట్టు గుర్తు.
-ఊకదంపుడు

చైతన్య కృష్ణ పాటూరు said...

ఊకదంపుడు గారు,
ఈ వేమన మన వేమనేనండి. ఆ రోడ్డుకు ఆ పేరు పెట్టింది, ఆ కళాశాల పెట్టింది "కర్ణాటక రెడ్డి జన సంఘం" వారు. ఇది కర్ణాటకలో స్థిరపడ్డ రెడ్ల సంఘం. భాషాభిమానమో, లేక కులాభిమానమో గాని మొత్తానికి మన వేమన పేరుని బెంగుళూరు నడిబొడ్డులో పెట్టించేశారు. అందుకు సంతోషించాలి.

సుజాత వేల్పూరి said...

చైతన్య కృష్ణ గారు,
అవును! Arekere (mantri paradise పక్కన, వెనక ఏరియా)లో వేమన రెడ్డి మహాజన సంఘం ఉందండోయ్! నాకు మొదట్లో అర్థం కాలేదు. వేమన రోడ్డు, కాలేజీ చూసాక ఎవరో ఇలాగే జ్ఞానోదయం గావించారు.

rākeśvara said...

ತ್ರಿವಿಕ್ರಮವರೆ, ನೀವು ಕೂಡಾ ಬೆಂಗಲೂರಂಥಾ ಹೆಳ್ತಾಯಿದ್ದಾರೆ ಏನೂ? ಉತ್ತರಾದಿ ಅವರ ತರಹಾ ನಿಮಗೆ ಕೂಡಾ ಳ ಅನ್ನೊದು ಬರೋದಿಲ್ಲಾ ಏನು ?
ಬೆಂಗಲೂರು ಅಲ್ಲ, ಬೆಂಗಳೂರು ಅನಬೆಕು ಕನ್ನಡದಲ್ಲಿ. తెలుగులోనయితే బెంగుళూరు అనుకోవచ్చి. :)

మొన్ననే కన్నడ స్వయంబోధిన అని పుస్తకం కొన్నాను, దాని ప్రతాపం ఇందులోఁ కొంత :)


ఊకదంపుడు గురువుగారు, మీ మహాయోగి వేమన రస్తె విషయఁవై నేను వేసిన టపా మీకోసమే.

అన్నట్టు త్రివిక్రంగారికి ನಮ್ಮ ಬೆಂಗುಳೂರಿಗೆ ಸುಸ್ವಾಗತ.

rākeśvara said...

అన్నట్టు
నడువె అంతరవిరళి
అఫవాతక్కి అవసరవే కారణ


నడువె అంతరవిరలి
అపఘాతక్కె అవసరవే కారణ

అక్షరాలా...
నడుమన అంతము ఉండనీయండి
అపఘాతానికి అవసరమే కారణము.

rākeśvara said...
This comment has been removed by the author.
త్రివిక్రమ్ Trivikram said...

@ కత్తి మహేష్ కుమార్ గారు,

:)

@ ఊకదంపుడుగారు,

సమాధానం దొరికింది కద? రాకేశ్వర రాక్స్! :)

@ చైతన్య క్రిష్ణ పాటూరు గారు,

ఆ వేమన మన వేమనేనని ధృవీకరించడమేగాక అదనపు సమాచారాన్ని అందించినందుకు నెనర్లు.

@ సుజాత గారు,

మీరిచ్చిన అదనపు సమాచారానికి నెనర్లు.

@ రాకేశ్వరా,

స్వాగతానికి, సవరింపుకు నెనర్లు. ఇక మీ కన్నడ స్వయంబోధిన ప్రతాపాన్ని చదివాను. స్వీయానువాదం చేసుకోమంటారా? ;)

త్రివిక్రమ్ Trivikram said...

రాకేశ్వరా!

నాది ಉತ್ತರಾದಿ ಅವರ ತರಹಾ కానే కాదు. Pun is intended wherever I wrote బెంగలూరు.