ఎక్కడైనా ఒక ప్రాంతం సజావుగా/వేగంగా అభివృద్ధి చెందడమో, అభివృద్ధి కుంటుపడడమో, లేక అసలు లేకపోవడమో చూస్తాం. కానీ అభివృద్ధిపథంలో నానాటికీ వెనక్కెనక్కి పోవడం కడప జిల్లా ప్రత్యేకతేమో అనిపిస్తుంది కొన్ని విషయాలు చదివితే.
వివిధరంగాల్లో కడపజిల్లా అభివృద్ధి చరిత్రను ఒకసారి పరిశీలిస్తే,
రైల్వే: దేశాభివృద్ధికి జీవనాడుల్లాంటివి రైలుమార్గాలు. దేశంలోనే అతిప్రధానమైన రైల్వే మార్గాల్లో ఒకటి, స్వర్ణచతుర్భుజి లో భాగమైన ముంబై-చెన్నై రైలు మార్గం కడప గుండా పోతుంది. కానీ ఒక్క కడప జిల్లాలో మాత్రం ఆ మార్గం విద్యుదీకరణ గానీ, డబ్లింగు గానీ ఇంతవరకు పూర్తికాలేదు. (ఈ మార్గంలో ఉండడం వల్లే నూటపాతికేళ్ల కిందట రాష్ట్రంలో మొట్టమొదట రైల్వే సౌకర్యం పొందిన జిల్లాకేంద్రం కడప అయింది. విచారకరమైన విషయమేమిటంటే నేటికీ అదొక్కటే ఈ జిల్లాలో రైలుమార్గం. దశాబ్దాలు గడుస్తున్నా ఎర్రగుంట్ల-నంద్యాల రైలుమార్గం పూర్తికానే లేదు. కడప-నెల్లూరు, కడప-బెంగుళూరు రైలుమార్గాల పనులు ఇప్పట్లో ప్రారంభమౌతాయనే ఆశలు కూడా లేవు.)
పైగా ఆ మార్గంలో కడపజిల్లాలోనే నందలూరులో రైల్వే లోకో షెడ్ ఉండేది. గత ఐదేళ్ళుగా ఈ ప్రాంత ప్రజలు, ప్రజాప్రతినిధులు ఎన్నిసార్లు విజ్ఞాపనలు, ఆందోళనలు చేసినా పట్టించుకోకుండా దాన్ని కాస్తా ఈమధ్యే తిరుపతికి తరలించేశారు. అక్కడి ప్యాసింజర్ డ్రైవర్ల క్రూ కేంద్రాన్ని కూడా మూసేశారు. ఇక్కడి ప్రజలు నందలూరు రైల్వే ఐక్యపోరాట సమితి (ఐకేపీఎస్) ఆధ్వర్యంలో పలుదఫాలు ఆందోళనలు చేసిన మీదట స్థానిక రైల్వేకేంద్రంలో గూడ్సు వ్యాగన్ల మరమ్మతు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని రైల్వేమంత్రి హామీ ఇచ్చారు గానీ అది నెరవేరే సూచనలు ఇంతవరకూ కానరాలేదు.
విమానయానం: బ్రిటిష్ వారి హయాం లోనే రాష్ట్రంలో రెండో విమానాశ్రయం కడపలో ఏర్పాటుచేశారు. దాన్ని కాస్తా 1993లో అనుకుంటా మూసేశారు. పోనీ ఇదేమైనా మారుమూల ప్రాంతమా అనుకుంటే 6 జిల్లాలకు నడిబొడ్డులాంటి నగరం. మౌలిక సౌకర్యాలు ఎంతగానో అభివృద్ధి చెందవలసిన ప్రాంతం.
పారిశ్రామికాభివృద్ధిని చూద్దామంటే అపారమైన ఖనిజసంపద ఉన్నా పరిశ్రమలు మాత్రం సున్నా. (ఎర్రగుంట్ల దగ్గర మాత్రం 3 సిమెంటు ఫ్యాక్టరీలున్నాయి.) నందలూరు దగ్గరే ఆల్విన్ ఫ్యాక్టరీ ఉండేది. అది అనతికాలంలోనే మూతపడింది.
ప్రొద్దటూరు మిల్క్ ఫాక్టరీ (PMF): ప్రారంభంలో సుమారు లక్ష లీటర్ల పాల సేకరణలో పి.ఎం.ఎఫ్. అందరి మన్ననలు పొందింది. ఇక్కడి ఉత్పత్తులు దేశ రక్షణకు పనిచేసే సైనికులకు సరఫరా చేసేవారు. భక్తులందరూ అమితంగా ఇష్టపడే ప్రీతికరమైన తిరుపతి లడ్డూల తయారీకి ఇక్కడి పాలనే వినియోగించేవారు. సరైన నిర్వణ లేకపోవడంతో 13 ఏళ్ళ కిందట నష్టాల బాటలో మూతపడింది.
తాజాగా చెన్నూరు దగ్గరున్న కడప చక్కెర కర్మాగారం మూతపడింది.
విద్య, వైద్య సౌకర్యాలు: 1972 వరకు జిల్లాలో ఒకే ఒక డిగ్రీ కళాశాల ఉండేది. నిన్నమొన్నటి వరకు ఒక్క ఇంజనీరింగ్ కళాశాల మాత్రమే ఉండేది. పెద్దజబ్బులేవైనా చేసినా, అత్యవసర పరిస్థితుల్లో ఐనా పొరుగుజిల్లాలైన నెల్లూరికో, కర్నూలుకో పోవలసివచ్చే దుస్థితి.
ఇలా అన్నిరంగాల్లో ఒక అడుగు ముందుకేస్తే రెండడుగులు వెనక్కి వేస్తున్న ఇలాంటి ప్రాంతాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి మౌలిక సదుపాయాలు కల్పించడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత. అందులో భాగంగానే కేంద్రప్రభుత్వం స్థాపింపతలపెట్టిన కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని వెనుకబడిన ప్రాంతమైన రాయలసీమలోని కడపలోనే ఏర్పాటు చెయ్యాలని నేను కూడా కోరుతున్నాను. దీనికి సంబంధించి ఈరోజు హిందూలో వచ్చిన వార్త:
Plea to locate Central University in Kadapa Special Correspondent
District has been neglected for centuries, leaders of citizen associations tell Union Minister |
Constitution of committee to study economic backwardness of the district sought
While Visakhapatnam has developed, Kadapa had only one degree college between 1952 and 1972
KADAPA: Citizens’ association leaders of the city on Sunday urged Union Minister for Human Resource Development N. Purandareswari to locate the Central University at Kadapa, which has been neglected for centuries, and not establish it at Visakhapatnam.
Association’s honorary chairman P. Subba Reddy, chairman S. Sitaramaiah and general secretary S. Elias Reddy said in a memorandum faxed to the Minister to constitute a committee to study the economic backwardness of Kadapa as well as Visakhapatnam before locating the Central University. Otherwise, the south Andhra Pradesh campus of the university may be located at Kadapa and the north campus at Visakhapatnam, they demanded.
Lost opportunityRayalaseema lost an opportunity to get a university at Anantapur during the British rule, when Prof. Kattamanchi Ramalinga Reddy recommended location of Andhra University at Visakhapatnam as Madras university was far away from it.
While Visakhapatnam has developed over the years, Kadapa had only one degree college between 1952 and 1972, they said.
When Chief Minister Y.S. Rajasekhara Reddy proposed to set up the Central University at Kadapa, people of Visakhapatnam launched an agitation, unmindful of Rayalaseema people’s agitation for a steel plant and upgradation of All India Radio at Visakhapatnam, they asserted. Visakhapatnam got a port, naval base, steel plant, Bharat Heavy Plates and Vessels, but Central funds to Kadapa were meagre.
Central locationKadapa is centrally located in Rayalaseema region and is about 250 km from the south coastal backward districts.
The district would also serve backward areas like Bellary, Chintamani, South Arcot in neighbouring Tamil Nadu, they said.
Kadapa was on the Chennai-Mumbai railway line and Kadapa aerodrome was being developed, the citizen association leaders said.
14 comments:
చిత్తూరు (తిరుపతి) లో వెంకటేశ్వరా విశ్వవిధ్యాలయం ఉంది. అనంతపురంలో కృష్ణదేవరాయా యునివర్సిటీ, కడపలొ ఇప్పుడే ‘వేమన’ పేరుతో పెట్టారు మరి మిగిలింది కర్నూలు...మరలాంటప్పుడు మళ్ళీ కడప కు ఒక సెంట్రల్ యూనివర్సిటీ కావాలా? ఎందుకూ?
మహేశ్ కుమార్ గారూ!
చిత్తూరు జిల్లాలోని కుప్పంలో ద్రవిడ విశ్వవిద్యాలయం, తిరుపతిలో రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం, శ్రీ పద్మావతి మహిళావిశ్వవిద్యాలయం, SVIMS, SVU,
ఇన్ని ఉండగా కొత్తగా Vetarinary University అక్కడే ఎందుకు అనే ప్రశ్న వచ్చిందా? అనంతపురం జిల్లాలో మూడు విశ్వవిద్యాలయాలు (SKU, JNTU, పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయం) ఉన్నాయి. కర్నూలులోని SVU PG సెంటర్ ఎప్పటినుంచో autonomous గా ఉంది. అంతేగాక ప్రస్తుత ప్రభుత్వం ప్రతి జిల్లాలో ఒక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తోంది. (యోగి వేమన విశ్వవిద్యాలయం వాటిలో మొదటిది.) ఇక్కడ నేను రాసింది కేంద్రీయ విశ్వవిద్యాలయం గురించి. అది కడపలోనే ఎందుకంటే రాయలసీమ, దక్షిణకోస్తాలోని 6 జిల్లాలకు దగ్గరౌతుంది కాబట్టి.
కడప మరీ అంత వెనుకబడిన ప్రాంతమేమీ కాదు కదా. వెనుకబాటుదనం ప్రాతిపదికయితే సెంట్రల్ యూనివర్సిటీని శ్రీకాకుళంలో పెట్టాలేమో.
ఈ టపాకు వచ్చిన వ్యాఖ్యలను చూస్తుంటే పాఠకులకు ఈ టపా రాసిన నేపథ్యం తెలియదనిపిస్తోంది. మొదటే స్పష్టంగా రాయకపోవడం నా పొరబాటే.
వై.యెస్. ప్రభుత్వం IIT, IIM, central University లను రాష్ట్రంలో స్థాపించడానికి ప్రయత్నాలు చేసింది. వాటిలో IIT తెలంగాణా ప్రాంతంలోను, IIM కోస్తా ఆంధ్రలోను, కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని రాయలసీమలోను స్థాపించాలని యోచన. ఐతే రాష్ట్రంలో IIM స్థాపించడానికి కేంద్ర మానవవరుల శాఖ అనుమతి లభించలేదు. దాంతో అదే శాఖలో సహాయమంత్రిగా ఉన్న పురంధరేశ్వరి రాయలసీమలో స్థాపించవలసిన కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని ఏవేవో సాకులు చూపి విశాఖపట్టణానికి తరలించుకుపోవడానికి ప్లానేశారు. ఆమె రానున్న ఎన్నికల్లో విశాఖపట్నం నుంచి పోటీ చేసే ఆలోచనలో ఉన్నారని, అందుకే ఇలా చేశారని సమాచారం. అబ్రకదబ్ర గారూ! శ్రీకాకుళం లో స్థాపిస్తే అది రాష్ట్రంలో చాలా తక్కువమందికి మాత్రమే సౌకర్యంగా ఉంటుంది. పైగా ఇది రాయలసీమలో స్థాపించవలసిన వి.వి.
ఆ మాటకొస్తే నెల్లూరులో అసలు ఒక్క యూనివర్సిటి కూడా లేదు కదా !! నెల్లూరు వాల్లు voice raise చెయ్యాలేమో ??
@అబ్రకదబ్ర గారు
అవునండి.. బాగా చెప్పారు... జిల్లాలకి దగ్గరతనాన్ని ప్రాతిపదికగా చేసుకోడానికి అదేమీ పరిపాలనా విభాగమేమీ కాదు... అది కడపలో లేకపోతే జనానికి గానీ, ఆ విద్యాలయానికి గానీ వచ్చే నష్టమేమీ లేదు... అలాగే అక్కడ ఉంటే ఆ విద్యాలయానికి నష్టమే గానీ పెద్ద లాభం జరగదు... ఒకవేళ ఆ విద్యాలయం త్వరితగతిన వృద్ధి చెందాలి, మంచి గురువులని ఆకర్షించాలి అనుకుంటే అది అన్ని సౌకర్యాలకీ దగ్గరగా ఉందేమొ చూసుకోవాలి... ప్రస్తుతం విశాఖపట్టణం అన్ని అర్హతలు ఉన్నదిగా అనిపిస్తుంది... కేంద్రీయ విద్యాలయం రాయలసీమలోనే పెట్టాలి అన్నట్టు ప్రతిపాదన ఎదీ లేదు.. విశాఖపట్టణం లొ వచ్చిన దాన్ని చివరలొ పావులు కదిపి కడపకి తన్నుకుపోవాల్ని చూస్తున్నట్టు ఉంది...
@ lucky: అవును, SVU పరిధిలో జిల్లాకొకటి చొప్పున ఏర్పాటు చేసిన PG సెంటర్లలో అనంతపురం సెంటర్ SKU అయింది, కర్నూలు సెంటర్ స్వయంప్రతిపత్తితో ఉంది. తాజాగా కడప సెంటరు కూడా యూనివర్సిటీ అయ్యాక కావలి సెంటరొక్కటీ అలాగే మిగిలింది. దాన్ని కూడా త్వరలోనే యూనివర్సిటీ చేస్తారని ఆశిద్దాం.
@ ఏకాంతపు దిలీప్ గారూ! నేను పరిపాలనాసౌలభ్యాన్ని గురించి కాక విద్యార్థుల సౌలభ్యాన్ని గురించి మాట్లాడుతున్నాను. కడప ఇప్పుడొక విద్యాకేంద్రంగా ఎదుగుతోంది కాబట్టి మీరు చెప్తున్న నష్టాలు ఉండవని నేనంటున్నాను.
"విశాఖపట్టణం లొ వచ్చిన దాన్ని చివరలొ పావులు కదిపి కడపకి తన్నుకుపోవాల్ని చూస్తున్నట్టు ఉంది..."
ఈ విశ్వవిద్యాలయం కోసం నెలరోజుల కిందటే కడప జిల్లాలో 700 ఎకరాల భూమిని కూడా కేటాయించడం జరిగింది. (వార్త: http://www.thehindu.com/2008/05/06/stories/2008050653190400.htm) ఆ తర్వాతే విశాఖపట్నంలో పెట్టాలని నిర్ణయం తీసుకున్నారంటే "చివరలో పావులు కదిపి" తన్నుకుపోతున్నదెవరో అర్థమౌతుంది.
ఈ వివాదాలన్నింటికీ మూలం - ప్రైవేటు విశ్వవిద్యాలయాల concept మన రాష్ట్రంలో అభివృద్ధి చెందకపోవడం. నాణ్యమైన ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు అనుమతిస్తే "మా ప్రాంతంలో" అంటే "కాదు, మాప్రాంతంలో.." అని ఇప్పటిలా మనం తగువులాడుకునే పని ఉండదు. నా అంచనాలో జిల్లాకి ఒకటి కాదు ; మూడు, నాలుగు ప్రామాణిక విశ్వవిద్యాలయాలుండాలి.
@ త్రివిక్రం గారు
మీకీ విషయం తెలుసో లేదో కేంద్రీయ విశ్వవిద్యాలయాలని ఎక్కడ పెట్టాలో సహజంగా నిర్ణయించేది కేంద్ర ప్రభుత్వం.. అన్నీ అనువుగా ఉన్నాయో లేదో పరిశీలించుకుని మానవ వనరుల శాఖ వాటిని ధృవీకరిస్తుంది... IIT,IIM ల విషయంలో కూడా ఇది వర్తిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు సలహాలు ఇవ్వొచ్చు, కానీ అవి కేంద్రం యొక్క నియమ నిభంధనలకి అనువుగ ఉంటేనే అమలు అవుతాయి. లేకపోతే కేంద్ర నిర్ణయమే అమలవుతుంది.
http://www.hindu.com/thehindu/holnus/001200803281340.htm
అదే హిందు లో ఈ వార్త చూడండి... ఇది మార్చి 28 న ప్రచురితమైనది... మీరు రెఫెరెన్సుగా ఇచ్చినదానికన్నా 40 రోజుల వెనకటి వార్త... అక్కడ నిర్ణయించిన అన్ని పట్టణాల్ని గమనిస్తే మీకు అర్ధమవుతుంది... మిగిలిన పట్టణాల స్థాయికి కడప పొల్చదగినదేమొ మీరే చెప్పండి..
ఇంకొక వార్త లో నేను చదివాను. మీకు లంకెని ఇవ్వలేకపోతున్నాను... కేంద్రం ఆ నిర్ణయం తీసుకుందని తెలిసి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు పక్షపాతంతో పావులు కదిపి మే మొదటి వారంలో ఆఘ మేఘాల మీద స్థలం కేటాయించేసారు... ఇది తెలిసిన ఉత్తరాంధ్ర ప్రజలు, నాయకులు నిరసనలు తెలియ చేసారు చాలా రోజులు... అప్పుడు మన ముఖ్య మంత్రి గారు వెనక్కి తగ్గారు, ప్రజల ఆగ్రహాన్ని చవి చూసిన తరవాత...
కడప ఇప్పుడు ఎదుగుతున్నది మాత్రమే.ఇంకా పిండావస్తలోనే ఉంది.ఆ లెక్కన చూసుకుంటే ఎదిగిన విద్యాకేంద్రాలు గుంటూరు,విజయవాడలు మరింత ఆకర్షణీయమైన ప్రత్యామ్నాయాలు.అక్కడ పెడితే మొత్తం రాష్ట్రమంతటికీ అందుబాటులో ఉంటుంది మీ వాదన ఆధారంగా చేసుకుంటే...
కానీ కేంద్రీయ విశ్వవిద్యాలయాలకి జాతీయ స్థాయిలో పోటి పరీక్షలు జరుగుతాయి.అందరు అర్హులే.అలాంటప్పుడు దగ్గరలో ఉంది అనేది సహేతుకమనిపించుకోదు.జనానికి దగ్గరలో ఉంది అనేదానికన్నా ఆ విద్యాలయం అన్ని సదుపాయాలకి దగ్గరగా ఉందా లెదా అన్నదే మనవ వనరుల శాఖ పట్టించుకుంటుంది...
మీరు తన్నుకుపోవడాన్ని బోల్డ్లో పెట్టడం నాకైతే రుచించలేదు. అది ఆరోగ్యకరంగా లేదని మాత్రం చెప్పగలను. అరమరికలు లేని, సహేతుకమైన చర్చకి అలాంటి మంచి సూచకాలు కావు.
పైన లంకె సరిగా ముద్రితమవ లేదు..
http://www.hindu.com/thehindu/holnus/001200803281340.htm
@ తాలబాసు గారు,
చక్కటి మాట సెలవిచ్చారు.
@ ఏకాంతపు దిలీప్ గారు,
పూర్వాపరాలు క్షుణ్ణంగా తెలిపినందుకు ధన్యవాదాలు. ఆ వార్త నేను ఇంతకు ముందు చూడలేదు. వెనుకబడిన ప్రాంతాలకు సంబంధించి - అది శ్రీకాకుళం కానివ్వండి, ఆదిలాబాద్ కానివ్వండి, అనంతపురం కానివ్వండి - వాటి అబివృద్ధికి తోడ్పడే ఏ చిన్న చర్య ఐనా నాకు సంతోష కారణమే. ఐతే కేవలం హైదరాబాదు, విశాఖపట్నం, తిరుపతి లాంటి కొన్ని నగరాలే అభివృద్ధి కేంద్రాలుగా తయారవడం, మిగిలిన ప్రాంతాలు నిర్లక్ష్యానికి గురికావడం నన్ను బాధిస్తుంది. అన్నీ ఒక్కచోటే పెట్టే బదులు ఒక నగరం ఆధ్యాత్మిక కేంద్రంగానూ, ఇంకొక నగరం వాణిజ్య కేంద్రంగానూ, మరొక నగరం పారిశ్రామిక కేంద్రంగానూ, వేరొక నగరం విద్యాకేంద్రంగానూ అభివృద్ధి చెందేలా చూడొచ్చు కదా? అప్పుడు ప్రాంతీయ అసమానతలు కొంతవరకైనా తగ్గుతాయి అనేదే నా పాయింటు.
స్థాయి విషయానికి వస్తే IITలు గానీ, IIMలు గానీ అన్నీ ఒకే స్థాయిగల నగరాల్లో లేవన్న విషయం మీకు తెలియనిది కాదు.
"మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు పక్షపాతంతో పావులు కదిపి "
నేను ఈ టపా రాసింది కూడా అదే పక్షపాతంతో అని గ్రహించగలరు. :)
ఇక బోల్డు గురించి: మునుపటి వ్యాఖ్యలో మీరు ఆ పదం వాడడం నాకు నచ్చలేదు. అది ఎత్తిచూపడానికే ఆ పదాన్ని బోల్డులో పెట్టాను.
లంకె సరిగా రావాలంటే వ్యాఖ్యలో < a > ట్యాగు వాడాలి.
@ త్రివిక్రమ్ గారు
ముందుగా నాకు లంకె సరిగా ఎలా రావాలో తెలియ చేసినందుకు నెనర్లు...
తోటి పౌరునిగా నేను మీ ఆలోచనని,ఆవేదనని అర్ధం చేసుకోగలను. ఎవరో అన్నట్టు అభివృద్ధిని అర్ధం చేసుకోవడం చాలా కష్టం. ప్రపంచంలో ఏ పెద్ద దేశమైన తీసుకోండి... మీకు అభివృద్ధి అలానే కనపడుతుంది... కొన్ని చోట్ల కేంద్రీకృతమయి ఉంటుంది. కాకపొతే మన దేశానికి అభివృద్ధి చెందిన దేశాలని నేను గమనించిన తేడా ఏంటంటే అక్కడ సాపేక్షికంగా అంతగా అభివృద్ధికి నోచుకోని ప్రదేశాల్లో కూడా జీవన పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి.
మనం కూడా మెరుగైన జీవనం మీద దృష్టి సారించాలి ముందు.
ఇంక అభివృద్ధి అక్కడ ప్రజలు ఎంత చైతన్యవంతంగా ఉన్నారు అనే దాన్ని బట్టి ఉంటుంది. ఆ ప్రాంతపు పురోగమనానికైన, తిరోగమనానికైన ఆ ప్రాంత ప్రజలు భాధ్యత వహించాల్సిందే.
ఇక్కడ మన పక్షపాతంతో విద్యాలయానికి అన్యాయం చెయ్యలేము. ఒక వేళ మనం నెగ్గినా దాని లక్ష్యం ఓడిపోతుంది.
IIT, IIM లు మీరు గమనించి ఉంటే అన్నీ ఆయా రాష్ట్ర రాజధానులలోనో, ముఖ్య పట్టణాలలోనో స్థాపించబడినవే. మానవ వనరుల వారు అన్నీ పరిగణనలోకి తీసుకుని ఖరారు చేసినవే.
ఇక పోతే చివరగా నా ముందు స్పందనలో ముఖ్యమంత్రిని విమర్శించినట్టు అర్ధం చేసుకోవచ్చు గానీ, మిమ్మల్ని కాదు. మరి మీకు ఎందుకు నచ్చలేదొ అర్ధం కాలేదు. బహుసా ఆయన అభిమానేమొ మీరు :-) మీ ప్రాంతం వారని పక్షపాతం చుపించారా? :-)
@ ఏకాంతపు దిలీప్ గారు,
నా భావాన్ని సరిగా అర్థం చేసుకున్నందుకు నెనర్లు.
అభివృద్ధి అక్కడ ప్రజలు ఎంత చైతన్యవంతంగా ఉన్నారు అనే దాన్ని బట్టి ఉంటుంది. ఆ ప్రాంతపు పురోగమనానికైన, తిరోగమనానికైన ఆ ప్రాంత ప్రజలు భాధ్యత వహించాల్సిందే.
చక్కగా చెప్పారు.
ఇక పోతే చివరగా నా ముందు స్పందనలో ముఖ్యమంత్రిని విమర్శించినట్టు అర్ధం చేసుకోవచ్చు గానీ, మిమ్మల్ని కాదు.
నేను అలా అనుకోలేదు. ప్రతిపాదిత వి.వి.ని కడపలో స్థాపించాలని కోరుతున్నవారందరి గురించి అన్నారనుకున్నాను.
మీ ప్రాంతం వారని పక్షపాతం చుపించారా? :-)
మా ప్రాంతం వారని కాదుగానీ మా ప్రాంత అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న నాయకుడనే అభిమానం ఉంది. ;-)
Post a Comment