Friday, 13 April 2007

నదిరే, పుదిరే

గమనిక 1: ఇది సినిమా పాట గురించి కాదు.
గమనిక 2: అనిల్ బ్లాగులో నటురె, ఫుటురె, చదవగానే ఇది గుర్తొచ్చి బ్లాగాలనిపించింది. ఇది చదివే ముందొకసారి విహారి గారి బ్లాగులో మొట్టిక్కాయలు చదవవలసిందిగా మనవి. వాళ్ళిద్దరికీ ముందుగా ధన్యవాదాలు.

ముచ్చటగా మూడోమాట: చిన్నప్పుడు మా బళ్ళో సెక్షన్లు, మొట్టికాయలు మినహా హిందీ విషయంలో విహారి గారి అనుభవాలు, నా అనుభవాలు ఒకటేనని తేలడం వల్ల కత్తిరించి అతకడం కంటే ఒక లంగరెయ్యడం సుఖమని భావించి పైన ఆ పనే చేశాను.

ఇక చదవండి:



నేను ఢిల్లీలో ఉన్నప్పుడు సిటీబస్సుల మీద బోర్డులు నాకు అర్థం కాని భాషలో ఉండడం వల్ల నాకు అసలు అర్థం అయ్యేవి కావు. (నాకు అర్థం కాని భాష అనగా హిందీ అని నా భావము. మరియొక విధమ్మున జెప్పవలెనన్న ఆంధ్రము, ఆంగ్లము దక్క ఇతరభాషలన్నియు నాకర్థము గానివే)

పాడగా పాడగా రాగమైనప్పుడు చూడగా చూడగా ఏమౌతుంది? నా తలకాయవుతుంది. (నా తలకాయలో ఏమీ ఉండదని ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు.) అందువల్ల నేనెంత చూసినా ఆ బోర్డులు నాకు అర్థమయ్యేవి కావు. అలా నాకు అర్థంకాని బోర్డులు బోలెడు! అవన్నీ తమకు అందిన బస్సులెక్కి నగరవీధుల్లో ఊరేగుతూ ఉండేవి. అలాంటి బోర్డుల్లో ముఖ్యమైనవి రెండు: నదిరే స్టేశన్, పుదిరే స్టేశన్.

స్టేశన్ ఏమిట్రా? రాన్రానూ రాజుగారి గుర్రం గాడిదౌతోందే అని ఆగ్రహించకండి. [ఇంకో మనవి: రాజుగారి గుర్రమా అదెక్కడుంది? అని వెదక్కండి. చెప్పాలంటే నాకు వినయం అడ్డొస్తుంది. ;-)] పవిత్ర ఉత్తరభారతదేశంలో అంథే! మనం ప్రసాద్ అంటామా? వాళ్ళు ప్రషాద్ అంటారు. మనం నమస్కారం అంటాం. వాళ్ళేమో నమష్కార్ అంటారు. దాంతో చిరాకేసి ఇరిటేషన్ అంటామా? వాళ్ళేమో నింపాదిగా ఇరిటేసన్ అంటారు. శ, ష, స లలో ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా ఎందుకు వాడతారో తెలియక వినే దాక్షిణాత్యులకు పిచ్చెక్కిపోవాల్సిందే! ఇలాంటి పిచ్చి మా ఆఫీసులోనాకు రోజూ ఎక్కుతుంది. ఎందుకంటే ఆఫీసులో నా పక్కసీటమ్మాయిది బీహారు. ఐతే ఏంటట? మాది రాయలసీమ. ఎవరి గొప్ప వారిది. ;-) ప్రతిరోజూ ఏదో ఒక విషయమ్మీద ఆ అమ్మాయికి, నాకు గొడవవుతుంది - ఉత్తరభారతదేశానికి, దక్షిణభారతదేశానికి గల తేడాల మూలంగానో లేక ఆ తేడాల మీదనో. మా ఇద్దరికీ పనీపాటా లేనప్పుడు 'బీహారు ఉండేది ఉత్తరభారతదేశంలోనేనా కాదా?' అని కూడా వాదించుకుంటాం. ఏడుగురు అక్కచెల్లెళ్ళను మినహాయించి వింధ్యపర్వతాలకు అవతలుండేదంతా 'ఉత్త'రభారతదేశమేనంటాను నేను. ఎంతమాత్రమూ కాదు - మాది తూర్పు భారతదేశమంటుంది ఆ అమ్మాయి. తెలుగు రాదు కదా? అందుకే 'East India' అని ఒకసారి, 'పూరబ్ భారత్ దేష్' అని ఒకసారి... ఆ గొడవ మాకొదిలేయండి. మళ్ళీ ఢిల్లీ నగర వీధుల్లో నా వెతలు చూతము రారండి.

"ఆ బోర్డు మీద ఏమని రాసుంది?" అని ఎవరినైనా అడిగేటంత హిందీ మనకు రాదు కదా? ఆక్కడికీ సాహసం చేసి ఒకసారి హృదయమున్న ఒక 'దిల్లీ'వాసిని "ఓ క్యా హై?" అనడిగేశాను. "ఓ బోర్డ్ హై" అని చెప్పేసి చక్కా వెళ్ళిపోయాడు ఆ ఢిల్లీవాసి.

ఇక "ఆ బోర్డు మీద ఏముంది?" అనడిగేటంత హిందీ మనకు వచ్చిందెప్పుడు? "ఉస్,బోర్డ్, మే, మై, తుస్, బుస్..." అని నాలో నేను గొణుక్కోవలసిందే! ఇలా కుదరని చాలా రోజులు కష్టపడి నాకు తెలిసిన హిందీ అంతా గుర్తుతెచ్చుకుని, తెచ్చుకుని 'మీద'ను హిందీలో 'ఊపర్' అంటారని ఊహించాను. 'ఉస్ బోర్డ్ ఊపర్ క్యాహై?' అని ఇంకొకరోజు ఇంకొక 'దిల్'వాలాను అడిగాను. ఆయన నా వైపు విచిత్రంగా చూసి పలక్కుండానే వెళ్ళిపోయాడు. "అంత కష్టమెందుకు? చక్కగా ఇంగిలీసులో అడగొచ్చు కదా?" అని మీరంటారని నాకు తెలుసు. కానీ దిల్లీలో ఇన్లాండు లెటరును కూడా అంతర్దేశీయ్ పత్ర్ అంటారు. అలాంటి పవిత్ర నగరంలో (హైదరాబాదులో తెలుగురాని దుకాణదార్లను అడిగినట్లు) ఇంగ్లీషులో అడగాలంటే నాకు తెలియకుండా నాకే సిగ్గేసేది. :(

నాకసలే మతిమరపు ఎక్కువ. అందువల్ల రోడ్లమీద చూసినప్పుడే తప్ప ఇల్లు చేరాక ఈ నదిరే, పుదిరే ల గురించి గుర్తుండేది కాదు. అందువల్ల ఆ సందేహం చాలారోజులు అలాగే ఉండిపోయింది.


చివరకు న.ది.రే., పుదిరే ల మిష్టరీ విచ్చిపోకముందే ఒక శుభదినాన హైదరాబాదుకు తిరుగుప్రయాణమయ్యాను. రైలెక్కడానికి న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ కు వెళ్ళడానికి ఏ బస్సు ఎక్కాలని అడిగి కనుక్కుంటే రూట్ నంబరెంతో చెప్పారు. తీరా చూస్తే ఆ బస్సు మీద న.ది.రే. స్టేశన్ అని ఉంది. దారి పొడవునా దాని గురించే తీవ్రాతి తీవ్రంగా ఆలోచిస్తూ న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ దగ్గర ఆ బస్సు దిగి ఎదురుగా కనిపిస్తున్న "యీ దిల్లీ రేలవే స్టేశన్" అనే బోర్డు చూడగానే డిటెక్టివు కేయాస్ పెట్టిన రెండో కేక వినబడింది. (మొదటి కేక ఎప్పుడు వినబడింది? అనే సందేహం మీకొస్తే మీకు "బావా...చీ" అన్న మరదలు పిల్ల గురించి తెలియదన్నమాట. :)) అంటే డిటెక్టివు కేయాస్ రెండో కేసు విజయవంతంగా విచ్చగొట్టేశాడని అర్థం.

ఇంతకూ ఆ కేక వెనకనున్న రహస్యం: న.ది.రే. స్టేశన్ అంటే నయీ దిల్లీ రేల్వే స్టేశన్ అని, అలాగే పు.ది.రే. స్టేశన్ అంటే పురానీ దిల్లీ రేల్వే స్టేశన్ అని తెలియడమే! ఆ విధంగా అభినవ డిటెక్టివు కేయాసు రెండో కేసు విజయవంతంగా మూతపడింది అనగా క్లోజైంది.

10 comments:

oremuna said...

ఎంత బాగా వ్రాసినారండీ

అపున్‌కో హిందీ ఆతా హై :)

Unknown said...

హహహ...
ఇవాళ అందరూ నవ్వించి నవ్వించి కానీ వదిలెపెట్టేట్టు లేరే .

రానారె said...

అనగా క్లోజయిందన్నమాట. అనగా ...!!??? స్కూల్లో నామీద హిందీని రుద్దారనే కోపంతో హిందీ మీద నాకు ఒకలాంటి అసహ్యం ఉంది. అది పోగొట్టుకోవడానికి ప్రయత్నం మొదలెట్టాను - పాత హిందీ పాటల మీద కలిగిన మోజు వలన.

చదువరి said...

నేను హైదరాబాదు వచ్చిన కొత్తలో (1981) ఎమ్మెల్యే క్వార్టర్లలో (గదులు, ఇళ్ళు కాదు) తెలిసినాయన దగ్గరికి వెళ్ళాను. అక్కడ పక్క గదిలో నుండి ఓ హిందీ వ్యక్తి బయటికి వచ్చి.. "బుఖార్ హై.." అంటూ హిందీలో ఏదో అడిగాడు. నేను హిందీలో మరీ జ్ఞానశూన్యుడిని కాను, కాస్తో కూస్తో తెలుసు. (అర్థజ్ఞానం వల్లనే చిక్కొచ్చి పడింది) నాకు భూఖ్ అంటే ఆకలి అని తెలుసు. ఆకలవుతోంది కాబోలు అని అనుకుని నీచే కాంటీన్ హై అన్నాను. కాదని తల అడ్డంగా ఊపాడు. ఆ గురుడు ఫక్తు హిందీలోనే మాట్లాడుతున్నాడు. కాసేపు ఈ డ్రామా నడిచాక, ఎట్టకేలకు, చివరాఖరికి - ఫీవర్ అని అన్నాడు. 'జ్వరం, మందు బిళ్ళలు కావాలి' అదీ ఆయన బాధ!
- హిందీ బాధలు, ఇంతి బాధలు, ఈతి బాధలు ఇంతింత గావయా! (చెతురు!)

Anonymous said...

నేను హిందీలో మాట్లాడటం మొదలుపెడితే, అవతల వారు ఎంత హిందీ వారయినా ఇంగ్లీషులోకి మారిపోతుంటారు... 'కా'లు, 'కీ'లు పలుక లేక కేవలం మగ వారితో మాత్రమే హిందీలో మాట్లాడే ప్రయోగం చేస్తుంటాను... హి హ్హి హ్హీ... బాగుంది టపా.

Sriram said...

హ హ హా...మొత్తానికి ఈ హిందీవల్ల తిప్పలు పడ్డవాళ్ళు చాలామందే ఉన్నారు :)

Anonymous said...

పరాయి ప్రాంతం లొ ఈలంటి భాషరాని కష్టాలు నేను కూడా 1987లో పుణే లో, కొత్తగా ఉద్యోగంలో చేరినప్పుడు పడ్డాను. ఆ రోజులు, ఆ కష్టాలు తలుచుకుంటే భలే నవ్వు వస్తుందిప్పుడు. ఒకటేమిటి, సైనుబోర్డులు, సినిమాపొస్టర్లు, హొటెళ్ళపేర్లు అన్నికూడా మరాటి మయం. అరే! చివరకు బస్ నెంబర్లు కూడా మరాటి భాషలో రాసేవారండి అప్పట్లొ. ఇక ఎవరినైనా అడుగుదాము అంటే, "మద్రాసి" (వాళ్ళకి, దక్షిన భారతీయులందరు మద్రాసిలే) అని గేలి చేస్తారేమొనని మోహమాటం. సాయింత్రాలు, వారంతాలు మనవాళ్ళందరుము ఏ తెలుగు అసొసియెషన్ ఆఫిసులోనో కలిసి తమ తమ కష్టనష్టలు వేళ్ళబోసుకునేవారం.

త్రివిక్రమ్ Trivikram said...

@కిరణ్:
థ్యాంక్యూ!

@గార్లపాటి:
మీక్కూడా థ్యాంక్సండీ! కానీ నవ్వించడంలో వాళ్లముందు నేనెంత? అసలు నా కుట్ర మీకు అర్థం కాలేదు: ముందుగా ఆ రెండుబ్లాగులు చదివి మీరు నవ్వడం మొదలుపెడతారు. వెనక్కొచ్చి నా బ్లాగు చదవడం పూర్తయ్యేదాకా అలా నవ్వుతూనే ఉంటారు. దాంతో నా బ్లాగు చదివినా నవ్వొస్తుందనుకుంటారు. :) హాస్యంగా రాయాలనుకున్నప్పుడు విహారి గారిని తలుచుకునే మొదలుపెడతాను. ఎప్పటికైనా వారిలా రాయలని నాకొక అత్యాశ.

@రానారె:
అనగా డిటెక్షను పూర్తయిందని, ఇక నేరుగా సర్కిలు షణ్ముగం దగ్గరకెళ్ళి కేసు ఒప్పేసుకోవడమే మిగిలిందని అర్థం.

@చదువరి:
అదృష్టం! ;) ఇంతవరకు వాటిలో నాకు మొదటిదొక్కటే తెలుసు.

@ నాగరాజా:
హిందీ పేరెత్తగానే ముందుగా నన్ను లంఖిణిలా భయపెట్టేది కా, కీల గొడవేనండీ! థ్యాంక్యూ!

@శ్రీరామ్:
ఆ లెక్కలు తీస్తే లిస్టు చాలా...........పొడుగౌతుంది.

@వల్లూరి:
బస్సు నంబర్లు తెలుగులో రాస్తేనే మనకు అర్థం కావు. ఇక మరాఠీలో రాస్తే...? ఇప్పుడు నవ్వొచ్చినా అప్పుడు మాత్రం బావురుమనాల్సిందే కదా? :)

Anonymous said...

అద్భుతంగా వుంది మీ టపా.

ఈ మధ్య అందరికీ ఎదో అయింది. అందరూ కలిసి నన్ను మునగ చెట్టు ఎక్కించి అక్కడినుండి తోసెయ్యాలని కుట్ర పన్నుతున్నట్లున్నారు. నేను ఇక్కడినుండి జం.......ప్.

జంపింగ్ విహారి

oremuna said...

:)