Tuesday, 3 April, 2007

బొట్టు-జ్ఞానం

రాధిక గారి సందేహం చదివాక గూగుల్ చేసి చూస్తే బొట్టు గురించి బోలెడు విషయాలు తెలిశాయి. వాటికి నాకు తెలిసినవాటిని కలిపి రాస్తే ఇది తయారైంది.

యోగ, ఆగమ, తాంత్రిక శాస్త్రాల ప్రకారం మన శరీరంలో ఉద్దీపనం చెందిన కుండలినీ శక్తి వెన్నెముక వెంబడి గల శక్తి కేంద్రాలను దాటుకుని శిరస్సును, తద్వారా పరాశక్తిని చేరుకుంటుంది. ఆ శక్తికేంద్రాలు ఏడు. వీటినే చక్రాలు అంటారు. అవి:

మూలాధార చక్రం,
స్వాధిష్ఠాన చక్రం,
మణిపూర చక్రం,
అనాహత చక్రం,
విశుద్ధ చక్రం,
ఆజ్ఞా చక్రం,
సహస్రార చక్రం
ఇవీ ఆ ఏడు చక్రాలు.
నుదుటి మీద కనుబొమల నడుమ బొట్టు పెట్టుకునే ప్రాంతంలో ఆరవదైన అగ్నిచక్రం/ఆజ్ఞాచక్రం ఉంటుందట. అగ్ని తేజస్సుకు, జ్ఞానానికి చిహ్నం. ఆజ్ఞాచక్రం అంతర్గతమైన/నిబిడీకృతమైన జ్ఞానానికి చిహ్నం. మన అనుభవ, సంచిత జ్ఞానమంతా అక్కడే కేంద్రీకృతమై ఉంటుంది. ధ్యానం చేసినప్పుడు ఉద్దీపనం చెందే కుండలినీశక్తి వెన్నెముక అడుగునుండి పైకి పాకుతుంది. ఆ శక్తి శరీరం లో నుంచి ఈ చక్రం గుండా వెలుపలికి పోతుందని తంత్రవేత్తల నమ్మకం. అక్కడ పెట్టుకునే బొట్టు ఆ శక్తిని వెలుపలికి పోనివ్వకుండా అడ్డుకుని తద్వారా ఏకాగ్రతను, ధారణ శక్తిని పెంపొందిస్తుందని వారంటారు. బొట్టు దుష్టశక్తులను, మనకు రానున్న చెడును అడ్డుకుని మనలను కాపాడుతుందని ఒక నమ్మకం.


ప్రాచీన కాలంలో ఆర్యసమాజంలో పెళ్ళి కొడుకు పెళ్ళైందనడానికి గుర్తుగా పెళ్ళి కూతురి నుదుటన బొట్టు పెట్టేవాడు. బహుశా సుమంగళి యొక్క ముత్తైదువతనానికి ఒక చిహ్నంగా నిలచిన బొట్టు ఒక సంప్రదాయంగా మారింది అక్కడి నుంచే కావచ్చు. మొదట్లో పెళ్ళైన ముత్తైదువులే తప్ప పెళ్ళికాని ఆడవాళ్ళు అసలు బొట్టు పెట్టుకునేవాళ్ళు కాదట! (ఇప్పుడు పాపిట్లో పెట్టుకునే బొట్టులాగే).

ఆడవాళ్ళు రకరకాల వస్తువుల నుంచి తయారుచేసిన బొట్లు పెట్టుకున్నప్పటికీ మగవాళ్ళు మాత్రం సాధారణంగా చందనపు బొట్టును పెట్టుకుంటారు. మనదేశంలాంటి ఉష్ణమండలపుదేశాల్లో ఇది చల్లదనాన్ని కలిగిస్తుంది.

బొట్టునే కుంకుమ అని, మాంగల్యం అని (మంగళప్రదమైనదనే అర్థంలో), తిలకమని, సింధూరమని అంటారు. హనుమంతుడి ఒళ్ళంతా సింధూరవర్ణంలో ఉండడానికి ఒక చక్కటి కథ చెప్తారు: ఒకసారి సీతాదేవి సింధూరపు బొట్టు పెట్టుకోవడం చూసిన హనుమంతుడు ఆమెను అడిగాడట ఆ బొట్టెందుకు పెట్టుకుంటారని. అప్పుడు సీతమ్మ ఈ సింధూరపు బొట్టు పెట్టుకునేవాళ్ళమీద రామయ్య అనుగ్రహం ఉంటుందనో ఏదో చెప్పిందట. అప్పుడు హనుమంతుడు తన మీద రాముడి దయ సంపూర్తిగా ఉండాలని ఒళ్ళంతా సింధూరం పులుముకున్నాడట. అదీ కథ.

హిందీ లో బొట్టును బిందీ అంటారు. ఇది బిందు అనే సంస్కృత పదం నుంచి వచ్చింది. ఈ మాటకు చుక్క అని అర్థం. సాధారణంగా ఇది ఎర్రని ఎరుపురంగులో ఉంటుంది. బొట్టు స్త్రీశక్తికి ప్రతీకగా కూడా చెప్తారు. దీనిని ధరించిన స్త్రీలను, వారి భర్తలను ఆ శక్తే కాపాడుతుందని ఒక నమ్మకం.
-------------------------------------------------------------------------------
(వేదకాలంలోనే గార్గి, మైత్రేయి, లోపాముద్ర, రోమశ లాంటి స్త్రీలు గొప్ప పాండిత్యం కలవారుగా గుర్తించిన దేశం మనది. ఇదే దేశంలో స్త్రీలు, శూద్రులకు జ్ఞానం పొందే అర్హత లేదని తర్వాతి కాలంలో ఛాందసులు తీర్మానించారు. ఇక భర్త పోయిన స్త్రీకి జ్ఞానం అక్ఖర్లేదా అంటే ఏం చెప్తాం? బృహదారణ్యకోపనిషత్తులో ఒక కథ ఉంది. దాంట్లో జనకమహారాజు స్వయంగా గొప్ప జ్ఞాని. అలాంటివాడు పండితులతో ఏర్పాటు చేసిన చర్చాగోష్టిలో యాజ్ఞవల్క్యుడనే వాడు అందరినీ ఓడిస్తాడు. చివరకు గార్గి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక "ఎక్కువగా ప్రశ్నించావంటే నీ తల పగిలిపోతుంది" అని బెదిరించి ఆమె నోరు మూయిస్తాడు. తర్వాతి కాలంలో మగవాడు ఆడవాళ్ళ మీద అదే దౌర్జన్యాన్ని ప్రయోగించి వాళ్లను ఆలోచించనివ్వకుండా, వాళ్లకు చదువు-సంధ్యల్లేకుండా చేశారేమో? మీకు కచ-దేవయాని కథ తెలిసే ఉంటుంది. దాంట్లో రాక్షసులు కచుణ్ణి చంపి శుక్రాచార్యుడి కడుపులోకి పంపేసినప్పుడు అతణ్ణి బ్రతికించిన శుక్రుడు మృతసంజీవనీవిద్యను కచుడికే నేర్పి తన ప్రాణాలు వాడి చేతుల్లో పెట్టడానికి సిద్ధపడుతాడు. ఏం? అక్కడే ఉన్న తన కూతురు దేవయానికే నేర్పొచ్చు గదా? ఆమెకెందుకు నేర్పలేదంటే స్త్రీలు మంత్రోపదేశానికి అనర్హులట!!!)

8 comments:

వెంకట రమణ said...

బొట్టుగురించి చాలా వివరాలు తెలియజేశారు.

>>మొదట్లో పెళ్ళైన ముత్తైదువులే తప్ప పెళ్ళికాని >>ఆడవాళ్ళు అసలు బొట్టు పెట్టుకునేవాళ్ళు కాదట!

నాకు తెలిసి ఉత్తర భారతదేశంలోని ఆడవారు ఇప్పటికీ ఇదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.

radhika said...

థాంక్స్ త్రివిక్రం గారూ.ఇలానే చెప్పారు మా మాష్టారు కూడా.కానీ నాకు ఆ చక్రాలు అది గుర్తులేక అలా చెప్పాను.పూర్వకాలం లో పెళ్ళికి ముందు బొట్టు పెట్టుకునే ఆచారం లేదంటే నమ్మకస్యం గా లేదు.ఆర్య సమాజం పుట్టి ఎన్నో సంవత్సరాలు కాలేదు కదా?

lalitha said...

"రుక్మిణీ కళ్యాణం" లో శ్రీకృష్ణుడి జవాబు కోసం ఎదురు చూస్తున్న రుక్మిణీ దేవి "తిలకమిడదు నుదుట తిలకనీ తిలకంబు" అని ఉంది. రుక్మిణీ దేవి అప్పటికి కన్యే కదా. ఆమె తన అలంకారంలో భాగంగా తిలకం ధరించేది అన్నట్టే కదా. "బొట్టు" పెట్టుకోవడానికి చాలా కారణాలు చెప్తారు మనవాళ్ళు. మగ వాళ్ళకి కూడా "తిలక ధారణ" ఉండేది.

ప్రధానంగా "బొట్టు" అలంకారం కోసమే ఉద్దేశించబడినది అనిపిస్తుంది.

లలిత.

lalitha said...

a correction:
"తిలకినీ తిలకంబు"

కొత్త పాళీ said...

బలే బలే! ఒక్క వారంలో ఈ పద్యం ప్రసక్తి రెండుసార్లు!
http://kottapali.blogspot.com/2007/04/blog-post.html
ఆహా, పోతన గారు నిజంగా ధన్యుడే.
లలిత గారూ, తిలకమూ బొట్టూ వేరువేరు అనుకుంటున్నాను.
ఇంకో విషయం పోతన గారు భాగవతం రాసేటప్పుడు ఆయన ద్వాపరయుగపు ఆచారాలు దృష్టిలో పెట్టుకుని రాశారా అన్నది కొంచెం అనుమానమే - తన కాలపు రాచ పడుచుల్నీ, భాగ్యవంతులైన స్త్రీలనీ దృష్టిలో పెట్టుకుని రాసి ఉండవచ్చు. మాటవరసకి ఆయన చేసింది "తెనిగించడం" అయినా ఆయన మూల కథనించి చాలా స్వేఛ్ఛ తీసుకున్నారని చాలా మంది పండితులు అంగీకరించారు.

lalitha said...

కొత్త పాళీ గారూ,
మరలా సగంలో ఆపేసినదండీ ఈ వ్యాఖ్య.
పొతన గారి స్వంత వర్ణన అయ్యుండచ్చు, అది వేద కాలం నాటిది కాకపోవచ్చు అని ఎవరో ఒకరు అంటారు అని అనికున్నాను. ఈ సారి నేను వ్యాసం కూడ పూర్తిగా ధ్యాస పెట్టి చదివినట్టు లేను. రాధిక గారి వ్యాఖ్యలో "ఆర్య సమాజం" అని చదివి అంతకంటే
పోతన గారి భగవతం పాతదే కదా అనుకున్నాను. అప్పట్నుంచైనా కొందరు ఆడవాళ్ళైనా అలంకారం కోసం పెళ్ళికంటే ముందే తిలకం ధరించే వారు కదా అని అనుకున్నాను. అదే మాట రాయడనికి బద్ధకించాను. తర్వాత వ్యాసం చదివితే "ఆర్యుల" సమాజం గురించి అంటున్నారేమో అనిపిస్తోంది.త్రివిక్రం గారు నా సందేహం తీర్చగలరు.

అయితే కొత్త పాళీ గారు, తిలకానికీ బొట్టుకీ తేడా వివరించగలరు. తిలకుడు అంటే గొప్పవాడని అర్థం వస్తుందేమో? రవికుల తిలకుడు... ఇలా అంటారు కదా. తిలకం వంటి వాడు అనే అర్థం వస్తుంది ఏమో కూడా కదా? వివరించగలరు.

లలిత.
పోతన గారు ధన్యుడండీ. ఆయనను, ఆయన భాగవత పద్యాలనీ తల్చుకొని మనం ధన్యులమవుతున్నాము.

త్రివిక్రమ్ Trivikram said...

లలిత గారూ!
నేను "ప్రాచీన కాలంలో ఆర్యసమాజంలో " అని రాశాను. అక్కడ ఆర్యసమాజమంటే నా ఉద్దేశం 19వ శతాబ్దంలో దయానంద్ సరస్వతి స్థాపించిన సమాజం కాదండీ. మీరనుకున్నట్లు "ఆర్యుల" సమాజమనే! అందుకే మొదట రాధిక గారు "ఆర్య సమాజం పుట్టి ఎన్నో సంవత్సరాలు కాలేదు కదా?" అని రాసినందుకు ఆశ్చర్యపడ్డాను. మీ వ్యాఖ్యతో ఆవిడ ఉద్దేశం స్పష్టంగా తెలిసింది.

కొత్తపాళీగారూ!

పోతన గారు నిజంగా ధన్యుడు. మరే భారతీయభాషలోనూ లేనంత కమనీయమైన భాగవతం మనకందించి ఆయన తెలుగువారిని ధన్యులను చేశారు.

Veeru said...

I recently started my research on topics around this. I liked the discussion around here. Here are a few comments from my side.
1. We use Tilak (bindi) in basically 3 different approaches they are Religious, Schientific and Traditional.
Scientific Aspect: It improves our concentration and energy levels as we keep it around the Triveni Sangamam (where the Ida, Susumna & Pingala 3 Nadis meet together).
Religious Aspect: We believe that it protects from Evils and bad sights as we always associate Kunkum with God in temple
Traditional Aspect: Since beginning, we used Tilakam/Bottu as an indication for our tradition and identification of the communities. Seriously there are various types and patterns of Tilaks/bottus practiced by various communities and category people.