Friday 13 April, 2007

కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం

ఈనాడులో వార్త

అంబవరం వద్ద ఉక్కు కర్మాగారం


* చొరవ చూపుతున్న ముఖ్యమంత్రి వై.ఎస్‌.
* 8000 ఎకరాల కేటాయింపునకు సన్నాహాలు

జిల్లా రూపురేఖలు మారిపోతున్నాయి. సిమెంటు ఉత్పాదనలో తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకున్న జిల్లాలో స్టీల్‌ కంపెనీని నెలకొల్పేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. బ్రాండిగ్స్‌, ఐఐఐటీ తదితర సంస్థల ఏర్పాటుకు చొరవచూపుతూనే మరోవైపు స్టీలు కంపెనీని తీసుకువచ్చేందుకు వై.ఎస్‌. ప్రయత్నాలు చేస్తున్నారు. జమ్మలమడుగు మండలం అంబవరం పరిసర ప్రాంతాల్లో ఈ కర్మాగారం కోసం భూమిని కేటాయించేందుకు జిల్లా ఉన్నతాధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఏప్రిల్‌ 19న జిల్లాను సందర్శించనున్న ముఖ్యమంత్రి ఈ అంశంపై చర్చించనున్నారు.

న్యూస్‌టుడే, కడప


ఉక్కు కర్మాగారాలకు ప్రధాన వనరు అయిన ఇనుప ఖనిజం కర్ణాటకలోని బళ్లారి నుంచి చెన్నై నౌకాశ్రయం ద్వారా విస్తారంగా విదేశాలకు ఎగుమతి అవుతోంది. ప్రస్తుతం బళ్లారి చుట్టుపక్కల, అనంతపురం సరిహద్దులో మినహా మిగతా రాయలసీమ జిల్లాల్లో స్టీల్‌ కంపెనీలు లేకపోవడంతో అధికభాగం ఇనుప ఖనిజం ఇతర ప్రాంతాలకు తరలిపోతోంది. జిల్లా మీదుగానే చెన్నైకు రవాణా చేస్తుండటంతో ఇక్కడ స్టీల్‌ కంపెనీ ఏర్పాటుకు అనుకూలంగా ఉంటుందని సీఎం భావిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా కొందరు పారిశ్రామికవేత్తలతో ఆయన చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. కంపెనీ నిర్మాణానికి అనువైన భూమిని ముందుగా గుర్తిస్తే ఔత్సాహికులు పరిశీలించి సానుకూలంగా స్పందించేందుకు అవకాశం ఉంటుందని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు సమాచారం. అధికారులు ఇప్పటికే స్థల పరిశీలనలో నిమగ్నమై ఉన్నారు.
కొలిక్కివచ్చిన స్థల పరిశీలన
* ముద్దనూరు, జమ్మలమడుగుల మధ్య కంపెనీ నిర్మించేందుకు అనుకూలంగా ఉంటుందని అధికారవర్గాలు భావిస్తున్నాయి. అంబవరం పరిసర ప్రాంతాల్లో దాదాపు 8,000 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నట్లు వారు గుర్తించారు. పట్టాభూమిని సేకరించేందుకు పెద్ద కసరత్తు చేయాల్సిన అవసరం కూడా ఉండదని భావిస్తున్నారు.
* ముద్దనూరు రైల్వేలైను సమీపంలో ఉండటంతో ఇనుప ఖనిజం, బొగ్గు దిగుమతి చేసుకొనేందుకు, ఉత్పత్తిచేసిన స్టీలు రవాణా చేసుకునేందుకు ఎంతో అనువుగా ఉంటుంది. దగ్గరలో ఉన్న మైలవరం జలాశయం నుంచి కంపెనీకి అవసరమైన నీరు సరఫరా చేసేందుకూ వెసులుబాటు ఉంటుంది.
* అంబవరం వద్ద స్టీలు కంపెనీ ఏర్పాటుచేస్తే పరిసర గ్రామాలైన పాటి, బొమ్మేపల్లి, ఒంటిమిద్దె, పొన్నతోట, బి.ఆర్‌.కొట్టాల తదితర గ్రామాల ప్రజలకు మహర్దశ పట్టినట్టే!

-----------------------

ఈనెల 20న మైలవరం మండలంలోని నవాబుపేట సమీపంలో దాల్మియా (ఈశ్వర్‌) సిమెంటు ఫ్యాక్టరీ శంకుస్థాపన

3 comments:

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం said...

కడప ప్రజల ఆకాంక్షలపై చన్నీళ్ళు జల్లడం ఇష్టం లేదు కాని గతానుభవాల దృష్ట్యా నమ్మలేక పోతున్నాను. శేఖర్ దాదా భూసేకరణ యజ్ఞంలో ఇదో తాజా పథకం అయి ఉంటుంది.ఈ సారి కడపలో ఎవరి భూములకి ఎసరొస్తుందో ఏంటో పాపం ? పిచ్చి ప్రజలు !!

త్రివిక్రమ్ Trivikram said...

సుబ్రహ్మణ్యం గారూ! మీరన్నదే నిజమయ్యే అవకాశమూ లేకపోలేదు. గత అనుభవాలు గుర్తుకొచ్చి వెక్కిరిస్తూనే ఉన్నా...ఈసారైనా పరిస్థితి భిన్నంగా ఉండదా అని ఎక్కడో ఒక ఆశ.

చదువరి said...

{సరదాగా రాస్తున్నాను)
ఉక్కు కర్మాగారం రాని పక్షంలో తాడేపల్లి వారి వ్యాఖ్య అనుకూలంగా ఉంటుంది.
ఒకవేళ ము.మం. చిత్తశుద్ధితో పనిచేసి, కర్మాగారం వస్తే.. ఇదిగో, కింది వ్యాఖ్య పనిచేస్తుంది.

"మా జిల్లాక్కూడా ఓ ముఖ్యమంత్రి ఉంటే బాగుండు"