Monday, 9 April, 2007

మోసపోయిన వరూధిని

కొత్తపాళీ గారి బ్లాగులో సుగాత్రి "అమాయకంగా" అడిగిన ప్రశ్న: "వరూధిని చివరికి మోసపోయింది అన్నారేమిటండీ? పాపం...నిజంగానే మోసపోయిందా?" అని.

వరూధినీప్రవరాఖ్యుల కథ అందరికీ తెలిసిందేననుకుంటున్నాను. వరూధిని వక్షమ్మీద చెయ్యేసి గోళ్ళు గుచ్చుకునేంత బలంగా తోసేసిన తర్వాత ప్రవరాఖ్యుడు తన నిష్టాగరిష్టత చేత అక్కడ మాయమై ఇక్కడ ఇంట్లో వచ్చి పడ్డాడు కదా? ఆ తర్వాతి కథేమిటంటే...

గంధర్వలోకంలో ఎప్పటి నుంచో వరూధినిని ప్రేమిస్తున్న వాడొకడున్నాడు. ఐతే వాడు వరూధిని కంటికి ఆనలేదు. వాడికి ఇక్కడ హిమవన్నగం మీద జరిగిన సంఘటన ఎలా తెలిసిందో తెలిసింది. దాంతో వాడు "Everything is fair in war and love" అనుకుంటూ అచ్చం ప్రవరాఖ్యుడిలా వేషం మార్చుకుని వరూధిని చెంతకు చేరాడు. ఆ అమాయకురాలు వాడు నిజంగానే ప్రవరుడనుకున్నది. కానీ మోసం ఎంతో కాలం దాగదు కదా? పైగా నిద్రపోయేటప్పుడు, శృంగారంలో అసలు రూపాలు బయటపడతాయంటారు. వాడిది దొంగవేషమని తెలుసుకున్న వరూధిని వాణ్ణి వదిలించుకుంది. కానీ ఈలోపే జరిగిన ప్రణయఫలంగా వరూధినికొక కొడుకు పుట్టాడు. వాడిపేరు స్వరోచి.

ఇదిలా ఉండగా ఆ వరూధినికొక తమ్ముడున్నాడు. వాడి పేరు ఇందీవరాక్షుడు. వాడికొక కూతురు. పేరు మనోరమ. వాడు ఒక ముని దగ్గర దొంగతనంగా ఆయుర్వేదం నేర్చుకుని, పోతూ పోతూ ఆయన్నే ఎగతాళి చేసేసరికి ఆయనకు కోపమొచ్చి వాణ్ని రాక్షసుడైపొమ్మని శపిస్తాడు. వీడు బావురుమని వేడుకోగా నువ్వు ఎప్పుడైతే తెలియక నీ సొంత కూతుర్నే మింగబోతావో అప్పుడే ఒక వీరుడి వల్ల నీకు శాపవిమోచనం కలుగుతుంది అని అనుగ్రహిస్తాడు. ఆ వీరుడే వరూధిని కొడుకైన స్వరోచి. ఆ స్వరోచి కొడుకే మనువు. ఆ మనువు పుట్టుక వెనకున్న కథే స్వారోచిష మనుసంభవం (స్వరోచి కొడుకైన మనువు పుట్టుక) లేక మనుచరిత్ర.

కొసమెరుపేమిటంటే ఇంతా చేసి ఆ మనువు పుట్టింది మనోరమ కడుపున కాదు!

7 comments:

రానారె said...

మనువు అంటే వివాహం అనే అర్థం ఉందికదా, స్వరోచి పుత్రునికి మనువు అనే పేరుండటానికీ దీనికీ ఏమైనా సంబంధం ఉన్నదా? "జగన్నాటక సూత్రధారులు" సెలవిస్తారని ఆశిస్తున్నాను.

వీవెన్ said...

ఇంకెవ్వరికీ సందేహం రాదు!

చదువరి said...

ఆసక్తిగా ఉన్నాయి ఈ కథలు.

Sriram said...

@రానారె: మనువు - పెళ్ళి ఇవి తెలుగు పదాలు.

మన్వంతరానికి సంబంధించిన "మను" అనే సంస్కృత శబ్దం నామవాచకం కనుక తెలుగులో డు,ము,వు లు ప్రధమావిభక్తిగా వు కలపబడి మనువు అయ్యింది అని నా అభిప్రాయం.

ప్రసాద్ said...

త్రివిక్రమా,
ఎవ్వరో వుదహరిస్తేనో, కవితల్లో ఎత్తిపొడిస్తేనో తప్ప ఎక్కడా వివరంగా "శంభూకుని కథ" చదవలేదు నేను. అది కాస్తా వివరిస్తారా? అలాగే తేడాలుంటే భిన్నమూలాలనుండి వివరిస్తారా?

--ప్రసాద్
http://blog.charasala.com

త్రివిక్రమ్ Trivikram said...

@రానారె :
సంబంధం లేదని శ్రీరామ్ గారు సెలవిచ్చారు కదా? :)

@శ్రీరామ్ గారూ!
వివరించినందుకు ధన్యవాదాలండీ!

@ప్రసాద్ గారూ!
ఆ కథ నాకు కూడా వివరంగా తెలియదు. ఐతే త్రిపురనేని రామస్వామి చౌదరి శంబూకవధ అనే పేరుతో ఏకంగా ఒక పుస్తకమే రాసినారు. ఇది 1934లో తెనాలిలో ప్రచురితమైంది. ఇది మార్కెట్లో దొరక్కపోవచ్చు గానీ వాషింగ్‌టన్ లోని కాంగ్రెస్ లైబ్రరీలో దొరుకుతుంది.


మరో లంకె: http://www.advaita-vedanta.org/archives/advaita-l/2006-May/017437.html

చదువరి said...

శంబూకవథ పుస్తకాన్ని మిలియన్ బుక్స్ ప్రాజెక్టు నుండి డౌనులోడు చేసుకోవచ్చు. లింకు: http://www.archive.org/details/ShabhukaVadha