గమనిక 1: ఇది సినిమా పాట గురించి కాదు.
గమనిక 2: అనిల్ బ్లాగులో
నటురె, ఫుటురె, చదవగానే ఇది గుర్తొచ్చి బ్లాగాలనిపించింది. ఇది చదివే ముందొకసారి విహారి గారి బ్లాగులో
మొట్టిక్కాయలు చదవవలసిందిగా మనవి. వాళ్ళిద్దరికీ ముందుగా ధన్యవాదాలు.
ముచ్చటగా మూడోమాట: చిన్నప్పుడు మా బళ్ళో సెక్షన్లు, మొట్టికాయలు మినహా హిందీ విషయంలో విహారి గారి అనుభవాలు, నా అనుభవాలు ఒకటేనని తేలడం వల్ల కత్తిరించి అతకడం కంటే ఒక లంగరెయ్యడం సుఖమని భావించి పైన ఆ పనే చేశాను.
ఇక చదవండి:
నేను ఢిల్లీలో ఉన్నప్పుడు సిటీబస్సుల మీద బోర్డులు నాకు అర్థం కాని భాషలో ఉండడం వల్ల నాకు అసలు అర్థం అయ్యేవి కావు. (నాకు అర్థం కాని భాష అనగా హిందీ అని నా భావము. మరియొక విధమ్మున జెప్పవలెనన్న ఆంధ్రము, ఆంగ్లము దక్క ఇతరభాషలన్నియు నాకర్థము గానివే)
పాడగా పాడగా రాగమైనప్పుడు చూడగా చూడగా ఏమౌతుంది? నా తలకాయవుతుంది. (నా తలకాయలో ఏమీ ఉండదని ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు.) అందువల్ల నేనెంత చూసినా ఆ బోర్డులు నాకు అర్థమయ్యేవి కావు. అలా నాకు అర్థంకాని బోర్డులు బోలెడు! అవన్నీ తమకు అందిన బస్సులెక్కి నగరవీధుల్లో ఊరేగుతూ ఉండేవి. అలాంటి బోర్డుల్లో ముఖ్యమైనవి రెండు: నదిరే స్టేశన్, పుదిరే స్టేశన్.
స్టేశన్ ఏమిట్రా? రాన్రానూ రాజుగారి గుర్రం గాడిదౌతోందే అని ఆగ్రహించకండి. [ఇంకో మనవి: రాజుగారి గుర్రమా అదెక్కడుంది? అని వెదక్కండి. చెప్పాలంటే నాకు వినయం అడ్డొస్తుంది. ;-)] పవిత్ర ఉత్తరభారతదేశంలో అంథే! మనం ప్రసాద్ అంటామా? వాళ్ళు ప్రషాద్ అంటారు. మనం నమస్కారం అంటాం. వాళ్ళేమో నమష్కార్ అంటారు. దాంతో చిరాకేసి ఇరిటేషన్ అంటామా? వాళ్ళేమో నింపాదిగా ఇరిటేసన్ అంటారు. శ, ష, స లలో ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా ఎందుకు వాడతారో తెలియక వినే దాక్షిణాత్యులకు పిచ్చెక్కిపోవాల్సిందే! ఇలాంటి పిచ్చి మా ఆఫీసులోనాకు రోజూ ఎక్కుతుంది. ఎందుకంటే ఆఫీసులో నా పక్కసీటమ్మాయిది బీహారు. ఐతే ఏంటట? మాది రాయలసీమ. ఎవరి గొప్ప వారిది. ;-) ప్రతిరోజూ ఏదో ఒక విషయమ్మీద ఆ అమ్మాయికి, నాకు గొడవవుతుంది - ఉత్తరభారతదేశానికి, దక్షిణభారతదేశానికి గల తేడాల మూలంగానో లేక ఆ తేడాల మీదనో. మా ఇద్దరికీ పనీపాటా లేనప్పుడు 'బీహారు ఉండేది ఉత్తరభారతదేశంలోనేనా కాదా?' అని కూడా వాదించుకుంటాం. ఏడుగురు అక్కచెల్లెళ్ళను మినహాయించి వింధ్యపర్వతాలకు అవతలుండేదంతా 'ఉత్త'రభారతదేశమేనంటాను నేను. ఎంతమాత్రమూ కాదు - మాది తూర్పు భారతదేశమంటుంది ఆ అమ్మాయి. తెలుగు రాదు కదా? అందుకే 'East India' అని ఒకసారి, 'పూరబ్ భారత్ దేష్' అని ఒకసారి... ఆ గొడవ మాకొదిలేయండి. మళ్ళీ ఢిల్లీ నగర వీధుల్లో నా వెతలు చూతము రారండి.
"ఆ బోర్డు మీద ఏమని రాసుంది?" అని ఎవరినైనా అడిగేటంత హిందీ మనకు రాదు కదా? ఆక్కడికీ సాహసం చేసి ఒకసారి హృదయమున్న ఒక 'దిల్లీ'వాసిని "ఓ క్యా హై?" అనడిగేశాను. "ఓ బోర్డ్ హై" అని చెప్పేసి చక్కా వెళ్ళిపోయాడు ఆ ఢిల్లీవాసి.
ఇక "ఆ బోర్డు మీద ఏముంది?" అనడిగేటంత హిందీ మనకు వచ్చిందెప్పుడు? "ఉస్,బోర్డ్, మే, మై, తుస్, బుస్..." అని నాలో నేను గొణుక్కోవలసిందే! ఇలా కుదరని చాలా రోజులు కష్టపడి నాకు తెలిసిన హిందీ అంతా గుర్తుతెచ్చుకుని, తెచ్చుకుని 'మీద'ను హిందీలో 'ఊపర్' అంటారని ఊహించాను. 'ఉస్ బోర్డ్ ఊపర్ క్యాహై?' అని ఇంకొకరోజు ఇంకొక 'దిల్'వాలాను అడిగాను. ఆయన నా వైపు విచిత్రంగా చూసి పలక్కుండానే వెళ్ళిపోయాడు. "అంత కష్టమెందుకు? చక్కగా ఇంగిలీసులో అడగొచ్చు కదా?" అని మీరంటారని నాకు తెలుసు. కానీ దిల్లీలో ఇన్లాండు లెటరును కూడా అంతర్దేశీయ్ పత్ర్ అంటారు. అలాంటి పవిత్ర నగరంలో (హైదరాబాదులో తెలుగురాని దుకాణదార్లను అడిగినట్లు) ఇంగ్లీషులో అడగాలంటే నాకు తెలియకుండా నాకే సిగ్గేసేది. :(
నాకసలే మతిమరపు ఎక్కువ. అందువల్ల రోడ్లమీద చూసినప్పుడే తప్ప ఇల్లు చేరాక ఈ నదిరే, పుదిరే ల గురించి గుర్తుండేది కాదు. అందువల్ల ఆ సందేహం చాలారోజులు అలాగే ఉండిపోయింది.
చివరకు న.ది.రే., పుదిరే ల మిష్టరీ విచ్చిపోకముందే ఒక శుభదినాన హైదరాబాదుకు తిరుగుప్రయాణమయ్యాను. రైలెక్కడానికి న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ కు వెళ్ళడానికి ఏ బస్సు ఎక్కాలని అడిగి కనుక్కుంటే రూట్ నంబరెంతో చెప్పారు. తీరా చూస్తే ఆ బస్సు మీద న.ది.రే. స్టేశన్ అని ఉంది. దారి పొడవునా దాని గురించే తీవ్రాతి తీవ్రంగా ఆలోచిస్తూ న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ దగ్గర ఆ బస్సు దిగి ఎదురుగా కనిపిస్తున్న "
నయీ
దిల్లీ
రేలవే
స్టేశన్" అనే బోర్డు చూడగానే డిటెక్టివు కేయాస్ పెట్టిన రెండో కేక వినబడింది. (మొదటి కేక ఎప్పుడు వినబడింది? అనే సందేహం మీకొస్తే మీకు "బావా...చీ" అన్న మరదలు పిల్ల గురించి తెలియదన్నమాట. :)) అంటే డిటెక్టివు కేయాస్ రెండో కేసు విజయవంతంగా విచ్చగొట్టేశాడని అర్థం.
ఇంతకూ ఆ కేక వెనకనున్న రహస్యం: న.ది.రే. స్టేశన్ అంటే నయీ దిల్లీ రేల్వే స్టేశన్ అని, అలాగే పు.ది.రే. స్టేశన్ అంటే పురానీ దిల్లీ రేల్వే స్టేశన్ అని తెలియడమే! ఆ విధంగా అభినవ డిటెక్టివు కేయాసు రెండో కేసు విజయవంతంగా మూతపడింది అనగా క్లోజైంది.