Sunday 9 July, 2006

మెడ ముడి (నెక్ టై) - 2

చలిదేశాలవాళ్ళు శరీరంలోని వేడిమి బయటికి పోయే దార్లన్నిటినీ బలంగా మూసేస్తే తప్ప చలిని తట్టుకోలేరు. అందుకే చేతులకు గ్లవ్సు, కాళ్ళకు షూసే గాక మెడ దగ్గర చొక్కా కాలరు రెండు కొసల్నీ కలిపి ఒక గుడ్డపేలికతో గట్టిగా ముడి పెట్టుకుంటారు. అప్పుడే వాళ్ళకు వెచ్చగా ఉంటుంది. ఐతే అలా ముడేశాక గొంతు కింద వేలాడే గుడ్డ ముక్క ఇబ్బందిగానో ఎబ్బెట్టుగానో అసహ్యంగానో ఉంటుందని ఇతరులు (అనగా వేడి దేశాలవాళ్ళు) ఎక్కడ అనుకునిపొతారో అని దాన్నొక ఫాషన్ కింద మార్చేశారు. (అది, ముఖ్యంగా బౌ టై, క్రైస్తవ చిహ్నమైన శిలువను పోలి ఉంటుంది.) మనలో కొందరు వెర్రివాళ్ళు అది ఫాషనేనని, ఆ గుడ్డ పేలిక కట్టుకోకపోవడం అనాగరికమమేనని నమ్మి గొంతుకురి బిగించుకుంటున్నారు. మనది అసలే ఉష్ణదేశం. వేడి ఎక్కువ. మన శరీరాలకు వీలైనంత ఎక్కువ గాలి తగలడం అవసరం. లేకపోతే వంట్లో నిరంతరం ఉత్పత్తయ్యే వేడికి లోపలే ఉడికి ఛస్తాం. మన లాయర్లు ధరించే నల్ల కోట్లు కూడా చలిదేశం వాళ్ళైన బ్రిటీషు వాళ్ళు వాళ్ళ దేశంలోని వాతావరణ పరిస్థితులకు అనువుగా ఉండేటట్లు ఏర్పాటు చేసుకున్నదే. ఆ కాలంలో ఎవడో బుర్రలేని మూర్ఖుడు ఇక్కడా అదే పద్ధతిని ప్రవేశపెడితే రాజకీయ స్వాతంత్ర్యం వచ్చి 60 యేళ్ళైనా మన లాయర్లు, జడ్జీలు ఆ నల్లకుంపట్లలోనే నిలువునా ఉడికిపోతున్నారు. ఈ మెడముడులు, నల్లగౌన్ల మూలంగా కలిగే అసౌకర్యమొకవైపు, ఆ అసౌకర్యాన్ని అధిగమించడానికి కృత్రిమంగా కల్పించుకునే చల్లదనం కోసం అదంగా ఖర్చయ్యే విద్యుత్ శక్తి మరోవైపు. దీన్ని మన పాలకుల కంటే ముందుగా జపాన్ పాలకులు గుర్తించారు. గత నెలలో వాళ్ళు మెడముడులను పీకి అవతల పారేశారు. జపాన్ ప్రధాని కొయిజుమి "మెడముడి లేకపోవడం వల్ల ఇప్పుడు నాకెంతో హాయిగా, ఉల్లాసంగా ఉంది." అని సంబరంగా ప్రకటించారు. వాళ్ళను చూసైనా మనవాళ్ళు మేలుకుంటారా?

No comments: