Thursday 13 July, 2006

దశావతారాలు-2

దశావతారాల్లో మొదటి ఐదు అవతారాలు జీవ పరిణామ క్రమాన్ని సూచిస్తే తర్వాతి ఐదు అవతారాలు సామాజిక పరిణామ క్రమాన్ని సూచిస్తాయి:
పరశురామ:
సామాజిక పరిణామం ప్రాథమిక దశలో ఉన్నప్పుడు, మనుషుల్లోని పశుప్రవృత్తి పూర్తిగా సమసిపోనప్పుడు, ఆటవిక న్యాయం ఇంకా రాజ్యమేలుతున్నప్పుడు ధర్మసంస్థాపన కోసం కలుపు మొక్కల్ని నిర్దాక్షిణ్యంగా ఏరిపారేయడానికి ఆయుధం పట్టక తప్పదు. పరశురాముడు చేసింది అదే! (ధర్మసంస్థాపనకు) అడ్డొచ్చిన వాళ్ళందరినీ నరికిపారేశాడు. తర్వాత నిదానంగా ప్రజాపతుల ఆధ్వర్యంలో ధర్మబద్ధమైన పాలన, శాంతిభద్రతలు నెలకొన్నాయి. అంతే కాదు. తప్పుచేసినవారిని దేవుడే శిక్షిస్తాడంటూ తనను వారింపజూసిన మునులతో "దేవుడనేవాడు ఆకాశం నుంచి ఊడిపడడు. మనలో ఒకడిగా ఉంటూనే తప్పు చేసినవారిని శిక్షించి ధర్మాన్ని నిలబెడతాడు. ఐనా నేను దేవుణ్ణి కానని మీకెలా తెలుసు?" అని గర్జించిన పరశురాముడు బహుశా ప్రపంచసాహిత్యంలో మొట్టమొదటి విప్లవవీరుడు.

తర్వాతిది రామావతారం. "యదాయదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారతః అభ్యుత్థానమధర్మస్య తదాత్మానామ్ సృజామ్యహమ్" అంటూ పట్టాలు తప్పిన బండిని తిరిగి పట్టాలెక్కించడమే శ్రీరాముడు చేసింది. ఇలాంటి ప్రమాదాలు అరుదుగా మాత్రమే జరిగే అవకాశమున్న త్రేతాయుగమది. ఏది ధర్మం, ఏది అధర్మం అన్న విషయంలో కూడా అస్పష్టత/గందరగోళమేమీ లేదు.(రామావతారం గురించి, రామాయణం గురించి ఇంకొక జాబు రాస్తాను.)

తర్వాతిది ద్వాపరయుగంలోని శ్రీకృష్ణావతారం. ఈ యుగంలో ధర్మం రెండు పాదాల మీదే కుంటుకుంటూ, గెంటుకుంటూ నడుస్తుందని చెప్తారు. ఇది ధర్మానికి, అధర్మానికి మధ్య సంధికాలం. ఏది ధర్మం, ఏది అధర్మం అనే విషయంలో కూడా స్పష్టత లేదు. అంతా అస్పష్టత, అయోమయమే. ఈ గందరగోళం; ధర్మాధర్మాల మధ్య ఊగిసలాట ప్రతి మనిషి ప్రవర్తనలోనూ మనకు కనిపిస్తూనే ఉంటాయి. ఒక సందర్భంలో ఉత్తములనిపించినవారి ప్రవర్తనే ఇంకొక సమయంలో హీనంగా అనిపిస్తుంది. దీనికి మినహాయింపు బహుశా విదురుడొక్కడేనేమో? అలాంటి పరిస్థితుల్లో దేవుడే దిగివచ్చినా వాళ్ళ మధ్య నెగ్గుకురావడానికి మాయోపాయాలు, బలప్రయోగం తప్పనిసరి. కృష్ణుడంతటివాడికే తప్పలేదు! :(

మహాభారత యుద్ధంలో పద్దెనిమిది రోజుల్లో పద్దెనిమిది అక్షౌహిణుల సైన్యం నిర్మూలమైంది. (అక్షౌహిణి అంటే 109350 కాల్బలం, 65610 గుర్రాలు, 21870 రథాలు, అన్నే ఏనుగులు అట) ఆ కాలంలోనే దానికి ముందూ ఆ తర్వాతా కూడా ఎన్నో యుద్ధాలు జరిగాయి. అంటే దేశంలోని యువకులు, ఆరోగ్యవంతుల్లో చాలా మంది చనిపోయి ఉండాలి. దాంతో సహజంగానే ఉత్పాదకత పడిపోతుంది. (పాండవబీడు అనే మాట అందుకే పుట్టింది. మిగిలింది బీడే. భూమిని సాగుచేసేవాళ్ళూ లేరు. పన్నులు కట్టేవాళ్ళూ లేరు. ఖజానా ఖాళీ. అంత పెద్ద యుద్ధం జరిగాక ఇంకేం మిగిలుంటుంది? అందుకే రాజసూయ యాగం పేరు చెప్పి ఇతరరాజ్యాల మీద పడ్డారు - దోచుకోవడానికి.) పోయినవాళ్ళు పోగా మిగిలినవాళ్ళలో కాస్త తెలివో బలమో ఉన్నవాళ్ళు ఉత్పాదకవనరులపై ఆధిపత్యం కోసం తమకు చేతనైన మార్గాల్లో ప్రయత్నించడం వల్ల మళ్ళీ అరాచకం మొదలై ఉంటుంది. ఈ పరిస్థితులను చక్కదిద్దడానికి బుద్ధుడు రావలసి వచ్చింది.

ఇతర చారిత్రక ఆధారాలను బట్టి చూస్తే క్రీ.పూ.6వ శతాబ్దంలో ఉత్తరభారతదేశంలో గంగా-యమునా నదీతీరాల వెంబడి నగరీకరణ భారీ స్థాయిలో జరిగింది. పెద్దపెద్దపట్టణాలు వెలిశాయి. ఒకవైపు పట్టణ సంస్కృతిలో తప్పనిసరిగా ఉండే జీవనపోరాటాలు, విచ్చలవిడితనం, అనైతికత, నేరప్రవృత్తి; ఇంకొక వైపు పెరిగిపోతున్న జంతుబలులు, పూజల పేరుతో జరిగే అర్థం పర్థం లేని తంతూతతంగాలు ప్రజల్లో అలజడి, అశాంతి పెరిగిపోవడానికి కారణాలయ్యాయి. పర్యవసానమే ప్రజలు బుద్ధుడి బోధలపట్ల ఆకర్షితులు కావడం.

ఇంతకంటే భారీస్థాయిలో అశాంతి రేగినప్పుడు, నేరాలు - ఘోరాలు అదుపు చెయ్యలేని స్థాయికి చేరినప్పుడు మళ్ళీ పరశురాముడు చేసినపనే చెయ్యవలసివస్తుంది. ఆ రెండో పరశురాముడే కల్కి.

పురాణాల్లో నాకు నచ్చిన పాత్ర పరశురాముడు.

3 comments:

Anonymous said...

మరి, కల్కి ఇంకా కార్యరంగంలోకి అడుగుపెట్టినట్లు లేదు కదండీ.

Anonymous said...

పరశురమావతార కాలం నాటి సామజిక పరిస్తితులను విశ్లేషించిన తీరు అద్బుతమనదగిన రీతిలో ఉంది

Anonymous said...

kuMti,karNa,paaMDavulu >>>SRshTi aavirbhaavaaniki saMkEta padaalugaa paatralanu ilaa malichina tiiru,
aarsh muni rachayitalaku,manameMtO RNapaDiunnaamu. prapaMcha saahityamulO,
ilaaMTi vinuutna SailI vinyaasamu,ati praachiina saahitya vibhinna dRkkONa Saili,
manadE!,,,ani telisi,eMtO garvamu kalugutuMdi."ginniis^ rikaarDu"vaariki, I kaansepTuni cheppi,mana
praachiina graMdhaalanu,"ginnis rikaarDu"LlOniki, nissaMdEhamugaa chErchagalamu.