Sunday, 9 July 2006

చలి (మెడముడి-1)

వాతావరణంలో ఉష్ణోగ్రత బాగా పడిపోయినప్పుడు అది మన శరీరం నుంచి వేడిమిని లాగేసుకుంటుంది. మన శరీరానికేమో ఉష్ణోగ్రత 98.4 సెంటీగ్రేడు డిగ్రీలకంటే తక్కువకు పడిపోతే పని జరగక పోవడమే కాదు తేడా మరీ ఎక్కువైతే ప్రమాదం కూడా. ఆ ప్రమాదం జరగకుండా ఉండాలంటే
1. మన శరీరంలోని వేడిని వాతావరణానికి అందనీయకుండా జాగ్రత్తపడాలి. ఆ ప్రయత్నంలో భాగంగానే మనం చలి రాత్రుల్లో దుప్పట్లు, స్వెట్టర్లు కప్పుకుంటాం (వేడిని పుట్టించే విద్య దుప్పటికి తెలియదు పాపం! వంట్లోని వేడి బయటికి పోకుండా అడ్డుకోవడానికి మాత్రమే పనికొస్తుందది). లేదా
2. బయటి వాతావరణాన్ని (కనీసం మన వంటికి అంటే గాలిని) వెచ్చజెయ్యాలి. అందుకే మనం రూం హీటర్లో, చలిమంటలో వేసుకుంటాం.
3. మనం పై పనులు రెండూ చెయ్యలేదనుకోండి, మన శరీరమే నేరుగా రంగంలోకి దిగుతుంది. తాను కోల్పోతున్న వేడిని వెన్వెంటనే భర్తీ చేసుకోవడానికి కండరాలను అధిక వేగంతో చలింపజేస్తుంది. అదే వణుకు. మనకు వణుకు పుట్టినప్పుడు కండరాల మధ్య జరిగే రాపిడితో మన శరీరంలో అధికంగా వేడిమి పుట్టి శరీరం చల్లబడకుండా కాపాడుతుంది. ఐతే ఇది అత్యవసర ఏర్పాటు. ఎక్కువ సేపు వణకాలంటే ఎక్కువ శక్తి ఖర్చవుతుంది. ఇంకో తమాషా ఏమిటంటే లావుగా ఉండేవాళ్ళ కంటే సన్నగా ఉండేవాళ్ళకే ఎక్కువ చలేస్తుంది. దీనికి రెండు కారణాలున్నాయి: 1. లావుగా ఉండేవాళ్ళ శరీరపు పరిమాణానికి, ఉపరితల వైశాల్యానికి గల నిష్పత్తి సన్నటివాళ్ళ నిష్పత్తి కంటే ఎక్కువగా ఉంటుంది. శరీర పరిమాణాన్ని(బరువును) బట్టి వేడిమి పుట్టే వేగం మారుతుంది. నేరుగా గాలి తగిలే చర్మపు వైశాల్యాన్ని బట్టి వేడిమి కోల్పోయే వేగం మారుతుంది. అందుకే సన్నటివాళ్ళు కోల్పోయే ఉష్ణం భర్తీ కావడానికి లావుపాటివాళ్ళకంటే ఎక్కువ సేపు పడుతుంది. 2. సాధారణంగా లావుపాటివాళ్ళ శరీరంలో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది. ఈ కొవ్వులో కొంత భాగం చర్మం క్రింద పేరుకుని ఉష్ణాన్ని బయటికి పోనీయకుండా అడ్డుకోవడమే గాక ఒకవేళ వణకాల్సి వచ్చినా శక్తినందించడానికి ఉపయోగపడుతుంది. (చలికాలంలో మనం ఏదైనా పని చేసేటప్పుడు చలెందుకు అనిపించదో అర్థమైందా?)

No comments: