Saturday, 8 July, 2006

అరవయ్యో ఏట చందమామ

1947 జూలై నెలలో తెలుగులో మొదలైన చందమామ ఈ నెలలో అరవయ్యో ఏట (షష్టిపూర్తి సంవత్సరం - వజ్రోత్సవమని కూడా అనవచ్చు)అడుగు పెట్టింది. ఇది ఆసియా ఖండంలోనే మరే పిల్లల పత్రికా సాధించని ఘనవిజయమని ఈ నెల సంపాదకీయంలో పేర్కొన్నారు. ఇది చందమామ ప్రచురణకర్తలకే కాదు యావదాంధ్రులకూ గర్వకారణమైన విషయమే.
ప్రస్తుతం చందమామ 14 భాషలతో బాటు 5 ద్విభాషా ఎడిషన్లలో కూడా వెలువడుతోంది. ఇది ప్రపంచంలో మరెక్కడా కానరాని విశిష్టత. చందమామ గురించి మరిన్ని విశేషాలను వికీపీడియా లో చదవండి.
ప్రస్తుతం అది అక్కడ విశేష వ్యాసంగా ప్రదర్శితం కావడం కాకతాళీయమే అయినా "రాయాలి రాయాలి" అని కొన్ని నెలలుగా నేను అనుకుంటున్న ఆ వ్యాసం ఈ వజ్రోత్సవ శుభవేళకల్లా సిద్ధం కావడానికి కారకుడు మాత్రం వీవెన్. వీవెన్ చెప్పిన ఒక చందమామ కథ సాహిత్యం గ్రూపులో చదివిన వెంటనే ఆపుకోలేనంత ఆవేశమొచ్చి వికీపీడియాలో ఆ వ్యాసానికి నేను శ్రీకారం చుట్టడమూ, వెన్వెంటనే వైఙాసత్య, కిరణ్, చదువరి, ప్రదీపు తదితరులంతా తలా ఓ చెయ్యి వేసి దాన్ని పూర్తి చెయ్యడమూ జరిగాయి:

వీవెన్ చెప్పిన చందమామ కథ:

అనగనగా ఒక ఊరిలో సోమయ్య అనే వాడు ఉండేవాడు.వాడు పనీపాటా ఏమీ లేక జులాయిగా
తిరుగుతూ ఉండేవాడు.అంతేకాక, కనపడిన వాళ్ళందరిని తిక్క ప్రశ్నలు వేసి
విసిగించేవాడు.వీడంటే ఊళ్ళోనివారందరికీ చిరాకే!
ఓరోజు, సోమయ్య అడవిమార్గం గుండా పక్క ఊరికి బయలుదేరాడు. ఎవరూ కనబడక వీడికి ఏమీ
తోచట్లేదు.అలా వెళ్తూ ఉండగా, గొర్రెలు మేపుకొంటున్న పిల్లలు కనిపించారు.భలే
దొరికారు అనుకొని వారి దగ్గరకు వెళ్ళాడు.పిల్లలకి సోమయ్య సంగతి తెలియడంతో,
అందరూ పారిపోయారు, ఒక్క గోపీ తప్ప.
గోపీ కి వీడంటే కోపం.
ఎలాగైనా పగ తీర్చుకోవాలి అనుకొన్నాడు
సోమయ్య వచ్చి గోపీ ప్రక్కనే చెట్టుకి ఆనుకొని కూర్చొని, తన ప్రశ్నల దండకం
మొదలుపెట్టాడు.
"ఒరే అబ్బిగా, ఈ గొర్రెలు రోజుకి ఎంత గడ్డి తింటాయంటావ్?"
గోపీ వినయంగా, "ఏవండి, తెల్లవా? నల్లవా?" అని అడిగాడు.


సోమయ్య: తెల్లవైతే?
గోపీ: ఓ పది మోపులు
సో: మరి నల్లవో?
గో: అవి కూడా 10 మోపులే


సో: ఒక్కో గొర్రె నుండి ఎంత ఉన్ని వస్తుందంటావ్?
గో: తెల్లవా? నల్లవా?
సో: తెల్లవైతే?
గో: 5 కిలోలు
సో: మరి నల్లవో?
గో: అవి కూడా 5 కిలోలే!
ఆ జవాబులకి సోమయ్యకి చిర్రెత్తుకొచ్చింది.
ఇంతలో గోపీ సోమయ్యని వెక్కిరిస్తూ పరుగందుకొన్నాడు.


సోమయ్య గోపీ ని తిడుతూ, "ఒరే పిల్ల వెధవా, నీకేమైనా వెర్రివాడిలా
కనిపిస్తున్నానా?" అని అరిచాడు.
దానికి గోపీ మరింత వెక్కిరింతగా, "నాకేంటీ, ఊర్లో సగం మందికి నువ్వు వెర్రి
వాడివే?"
సోమయ్య ఉండబట్టలేక, "మరి మిగతా సగం మందికో?" అని అడిగాడు.
"వాళ్ళకి కూడా వెర్రివాడివే!" అని కేరింతలు కొడుతూ, సోమయ్యకి అందనంత దూరం
పారిపోయాడు.

No comments: