Tuesday 23 May, 2006

భాషాంతక కార్యక్రమాలు

భాషాంతక ఛానెళ్ళలో తెలుగు కార్యక్రమాలు

(మీరు సుజనరంజని వెబ్ పత్రికలోగానీ, రచన మాస పత్రికలో గానీ అమెరికాలక్షేపం చదివేవాళ్ళయితే మీరు ఈ పోస్టు చదవనవసరం లేదు. ఈ పోస్టు అందులోనుంచి ఎత్తిరాసిందే. -3vkrm)

రాసిన వారు: వంగూరి చిట్టెన్ రాజు

ఈ మధ్య కొత్తగా వస్తున్న ఒక తెలుగు టీవీ గేం షో నాలుగైదు సార్లు చూశాను. మీరందరూ ఊహించినట్టుగానే ఈ (అంటే ఈనాడు కాదు - సదరు అని మాత్రమే అర్థం -3vkrm) టీవీ షో కూడా నాలుగైదు అమెరికన్ టీవీ షోలను మ్యూజిక్ తో సహా అనుకరిస్తూ వాటిని కలగాపులగం చేసి రంగరించిన "ఒరిజినల్" తెలుగు టీవీ ఆట...

మొదటి సారి ఈ షో చూసినప్పుడు టైటిల్స్ లో "రాడిక్కాస్ కాస్ట్యూములు, విగ్గు, నగలు, వగలు సప్లయిడ్ బై హాలీవుడ్ టైలర్స్ ఆఫ్ అంబాజీపేట" అని ఆవిడ ఫేషన్ కన్సల్టెంట్ వారి పేరు చూసి, ఈ షో నిర్వహించే ఆవిడ పేరు రాడిక్క అని కనిపెట్టేశాను. ఇటువంటి పేరు ఎక్కడా వినక బహుశా ఏ ఇండొనేషియా నుంచో లేక ఇథియోపియా నుంచోఆవిడను దిగుమతి చేసుకుని, చీరా, నగలూ, తెలుగు వగలూ పెట్టారేమో అనుకున్నాను. అంతే కాదు, పోటీ మధ్యలో "మీ బార్యా బరతలలోఎవరు లక్కీ పెర్సను?" అనో, "మీ పెల్లి అయి ఎన్నాలయినది?" అనో 'స్వచ్ఛమైన తెలుగు ఉచ్ఛారణ' క్షమించాలి...స్వచ్‌మనియన తెలుగు ఉత్‌చారణ తో మట్లాడడం కూడా ఆవిడ ఇంపోర్టెడ్ సరుకేమో అనే నా అనుమానానికి దోహదం చేసింది. మరొక సారి సదరు రాడిక్క గారు "బీ టీము వారు ఎరవై (అవును అక్షరాలా ఎరవై) గ్రాముల బంగారం గెలుసుకున్నారు." అనగానే నా అనుమానం పటాపంచలైపోయింది. ఎటొచ్చీ బీ టీము వారు 'గెలుసుకున్నది' అరవై గ్రాములా లేక ఇరవై గ్రాములా నాకు తెలియలేదు. ఎరవయ్యో అంకె గురించి మా లెక్కల మాస్టారు నాకెప్పుడూ చెప్పలేదు.

ఇక రాడిక్క గారు అడిగిన ప్రశ్న ఒకటి:
"ఆంధ్ర రాష్ట్ర అవతరణకి ప్రాణత్యాగం చేసిన వారు ఎవరు?"
ఎ)మహాత్మా గాంధీ
బి)ఇందిరా గాంధీ
సి)రాజీవ్ గాంధీ
డి)పొట్టి శ్రీరాములు

ఇంత క్లిష్టమైన ప్రశ్నకు 'ఏ' టీములో పదేళ్ళ అబ్బాయి తీవ్రంగా ఆలోచించి "నాకు మొన్ననే మా స్కూలులో ఈ విషయం చెప్పారు. ఆన్సరు రాజీవ్ గాంధీ." అని చాలా విజయగర్వంతో సమాధానం చెప్పాడు.

"నో, రాజీవ్ గంఢీ, ఈజ్ నాట్ థ రైట్ ఆన్సర్" అని రాడిక్క గారు అంగ్రేజీలో అరిచి, "నౌ, ద ప్రశ్న గోస్ టు 'బీ' టీం" అని అటు వేపు తన భారీ తలకాయ తిప్పారు, పూర్తిగా శరీరం తిప్పలేక. సదరు బీ టీములో తల పండిపోయి, గడ్డాలు, మీసాలు వెలిసిపోయి, మాజీ సినీ నటుడు బాబూమోహన్ వేలు విడిచిన మేనత్త పోలికలో ఉన్న ఆయన అంతకంటే విజయగర్వంతో వికటాట్టహాసం చేసి, "ఓస్, ఇంతేనా? నాకు తెలుసు. మనకోసం రాజీవ్ కంటే ముందు ప్రాణత్యాగం చేసింది ఇందిరమ్మ, గరీబీ హటావో" అంటూ ఆవేశపడ్డాడు.

ఇలాంటి మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలూ, వాటికి రెండు మూడు తరాల తెలుగువారి సమాధానాలూ విని, ఆనందం పట్టలేక వెంటనే టీవీ కట్టేసి,...నా గురించి సాహిత్యప్రియులు నిఝంగా ఏమనుకుంటున్నారో అని ఒక చిన్న ప్రయత్నం చేద్దామనిపించి ఒక మల్టిపుల్ చాయిస్ ప్రశ్న వేద్దామనుకుంటుండగా మా ఆవిడ బంగారం షో కోసం టీవీ ఆన్ చేసింది.

రాడిక్క గారి కట్టుకున్న చీర, వేసుకున్న నగలు చూస్తూ "అబ్బ, ఎంత బావుందో, ఆ రాధిక ఒంటి మీద కనీసం పది లక్షల రూపాయలైనా ఉంటాయి అన్నీ కలిపి..." అంది మా శ్రీమతి.

"రాధిక ఎవరూ, ఆ యాంకర్ పేరు రాడిక్క కదా?" అన్నాను.

"రాడిక్క ఏమిటి, రాడిక్కా గీడిక్కానూ - మన చిన్నప్పుడు సినిమాలలో హీరోయిన్ వేషాలు వేసేది రాధిక అనీ, అరవమ్మాయి అనుకుంటా" - సమాధానం చెప్తూ నా మొహం చూసి, "ఏం, మొహం అలా ఉంది?"-

4 comments:

oremuna said...

This is what makes Telugu loose the grammer also, and finally giving birth to a new language.

చదువరి said...

వాక్శుద్ధి లేని ఇలాంటి వాజమ్మలను పనిగట్టుకు మరీ లంగర్లుగా తెస్తారనుకుంటా, వీళ్ళు. జెమినీలో పొద్దుటిపూట నీకోసం అనే కార్యక్రమంలో ఉత్తరాలు చదివే వాళ్ళు (అందరూ నండి!) కూడా ఇదే పద్ధతి. 'రాడిక' గురించి ఇంతకు ముందు కూడా ఎవరో ప్రస్తావించినట్లు గుర్తు.. బహుశా మన మీటింగుల్లోనేనేమో!

Anonymous said...

ఇవి చెప్పుకుంటే తీరే బాధలు కావులెండి.
అప్పుడెప్పుడొ Maa Tv లో స్వాతి అని ఒకమ్మాయి
"మీయు ఎవయు.. ఏం చేస్తాయు" అంటూ మాట్లాడేది. చాల సాల్లు క్షమించాలి చాల సార్లు చూసాక ఆమె భావం అర్ధమయ్యి పాపం ర పలకదు కాబోలు అని సరిపెట్టుకున్నా.
తీరా తవ్వాత్తవ్వాత ఛి ఛీ తర్వాత్తర్వాత చాలా మంది ర ఒక్కటే కాకుండా ఇంకా చాలా పలకటం రాని వాళ్ళని చూడగలిగే అవకాశం ప్రైవేటు చానెళ్ళ వలన మనందరికి కలిగింది.
ఈ మధ్య ఒక ప్రశ్న చూశా ఎదో దిక్కుమలిన చానెల్ లో
స్కూల్ ని తెలుగులో ఏమంటారు
a. వైద్య శాల
b. పాఠ శాల
c. చెరసాల
అది చూసి కొన్నాళ్ళు మనిషిని కాలేకపోయా.

త్రివిక్రమ్ Trivikram said...

మీరంటుంటే గుర్తొచ్చింది: ఈ మధ్యే ఒకరోజు తెల్లారి లేస్తూనే ఎందుకో (ఎందుకో ఏమిటి, నా ఖర్మ కాలి!) టీవీ పెట్టాను. ప్రేక్షకులకు పుట్టినరోజులు, పెళ్ళిరోజుల శుభాకాంక్షలు తెలిపే కార్యక్రమం నడుస్తోంది. లంగరమ్మ కొన్ని పేర్లు వినిపించి "...లకు పుట్టినరొజు సుబాకింక్షలూ." అనేసింది. నేను దిమ్మెరపోయాను. బహుశా నేనే నిద్రమత్తులో సరిగా వినలేదో, లేక ఆ అమ్మాయి అప్పటికే ఆగకుండా చాలా పేర్లు చదివి ఉండడం వల్ల గుక్క తిప్పుకోవడం కష్టమైపోయి, అలా పలికిందేమోనని సరిపెట్టుకుని, మళ్ళీ ఆ అమ్మాయి శుభాకాంక్షలు అని పలికే సమయానికి ఆ ఛానెల్ మార్చకుండా శ్రద్ధగా విన్నాను. అనుమానం లేదు. ఎన్నిసార్లు విన్నా ఆ లంగరమ్మ అక్షరం పొల్లుబోకుండా "సుబాకింక్షలు" అనే అంటోంది. :(
కిరణ్ అన్నట్లు వీళ్ళంతా కలిసి కొత్త భాషను పుట్టించి మనమీదకు వదిలేటట్లే ఉన్నారు.