తిమ్మిని బమ్మిని చేయడంలో మీడియాను మించిన వాళ్ళెవరూ లేరు. అందునా తెలుగులో సినిమా అనేది అన్నిటికంటే బలమైన మీడియాగా అవతరించింది. గత పది, పదహైదేళ్ళుగా రాయలసీమ ఫాక్షనిజాన్ని సినిమాల్లో వికృతంగా చూపుతున్న తీరు చూసి రాయలసీమ వాసులకు ఆవేదన కలుగుతోంది. రాయల సీమలో జీవితమెలా ఉంటుందో తెలియని, రాయలసీమ ఫాక్షనిజం స్వరూప స్వభావాలు ఎలా ఉంటాయో తెలియని కొందరు సినిమా రచయితలు పైత్యం ప్రకోపించి, రాయలసీమలో ఉండేది కూడా మనుషులేననే సంగతి విస్మరించి మానవత్వానికే మచ్చ తెచ్చే సన్నివేశాలను సృష్టించి దానిని రాయలసీమ ఫాక్షనిజానికి ఆపాదించడం హేయం, ఘోరం. ఈ సందర్భంలో రాయలసీమ నడిబొడ్డైన కడప గడ్డ మీద రెండు ఫాక్షన్ వర్గాల మధ్య జరిగిన ఒక యథార్థ సంఘటనను మీ ముందుంచుతున్నాను:
కొంత కాలం క్రిందట ఒకాయనకు ఒక ప్రమాదంలో తీవ్ర గాయాలై ఆసుపత్రిలో ప్రాణాపాయంలో ఉన్నాడు. ఆయనకు వెంటనే అత్యవసరంగా రక్తం ఎక్కించాల్సి వచ్చింది. ఆయన కుటుంబసభ్యుల్లో గానీ, ఆయన వెంట ఉన్నవాళ్ళలో గానీ ఎవరి రక్తమూ ఆయనకు సరిపోయే గ్రూపు కాదు. బ్లడ్ బాంకు లో కూడా ఆ గ్రూపు రక్తం లేదు. వాళ్ళు అందుబాటులో ఉన్న వాళ్ళందరినీ ఫలానా గ్రూపు రక్తం అత్యవసరంగా కావాలని, రక్తదాతలెవరైనా ఉంటే తెలుపమని కోరారు.
ఇంతలో ఆ ఆసుపత్రికే వచ్చిన ఇంకొకాయన ఈ విషయం తెలుసుకుని, తన గ్రూపు సరిపోతుందని తెలిపి, రక్తదానం చేయడానికి ముందుకు వచ్చాడు. ఎవరో ఒకాయన రక్తదానం చేయడానికి ముందుకు వచ్చాడని తెలిసి మొదటాయన బంధువులు సంతోషించారు. రక్తం అవసరమైనదెవరికో రక్తం ఇస్తున్నాయనకు తెలియదు, రక్తం ఇస్తున్నదెవరో అవతలి వాళ్లకుతెలియదు. గండం గట్టెక్కాక, రక్తదానం చేసి ప్రాణం కాపాడినాయనకు కృతజ్ఞతలు తెలుపడానికి వెళ్ళిన వాళ్ళు అవాక్కయారు!
రక్తదాత, గ్రహీత ఫాక్షన్ గొడవల్లో ప్రధాన ప్రత్యర్థులు!
ఇక్కడ ఇంద్ర సినిమా లో ఒక సన్నివేశాన్ని గుర్తుకు తెచ్చుకోండి:
ఆ సినిమాలో విలన్ కొడుకు ప్రాణాలను హీరో కాపాడితే, ఆ విలన్ తన కొడుకును తనే చంపేస్తాడు తన శతృవు దయ వల్ల దక్కినదేదీ తన కక్కరలేదని. కానీ నిజజీవితంలో ఏం జరిగింది? వీళ్ళు తమ పగను పక్కనపెట్టి కృతజ్ఞతలు చెప్పుకోవడమూ, ఆయన కూడా పాత విషయాలు పక్కనపెట్టి స్నేహంగా మాట్లాడడమూ, తర్వాత రెండు వర్గాల వారూ పగను పాతిపెట్టి కలిసిపోవడమూ జరిగాయి.
(ఇటీవల కడప జిల్లాలో ఫాక్షనిస్టుల లెక్కల గురించి ఏర్పడిన గందరగోళం, తర్వాత ఈనాడు లో వచ్చిన శ్రీధర్ కార్టూను చూసి ఇదంతా గుర్తొచ్చి వ్రాయాలనిపించింది. ఆధారం: 'కడపోత్సవాలు' సావనీర్లు)
5 comments:
మామూలు మనుషులెవరైనా కడపలో జరిగిన సంఘటనలోని వాళ్ళలాగానే ప్రవర్తిస్తారు. మన సినిమా వాళ్ళే.. ఇలా పైత్యకారి ప్రయోగాలు చేస్తారు. మంచి జాబు! తరువాతి వాటి కోసం చూస్తూంటాను.
maaradu lOkam maaradu kaalam sirivennela paaTa gurthuku vastundi
డబ్బులు సంపాదించుకోవడానికి నానా చెత్త రాసే వాళ్ళతో మనకి ఏమి పని త్రివిక్రం. మనుషుల్లాగా , మానవత్వంతో బతికితే చాలు. ఫాక్షనిజం అనేది వీరి లాంటి మనుషులు పుట్టించిందే కదా...
మన తెలుగు సినీ రచయితల ఊహా శక్తి ఎంతయినా గొప్పది. ఎన్ని హత్య లు చేసినా, తలలు నరికినా, కేసులు, శిక్షలు ఎమీ ఉండవు, అదేదో సహజ సిద్ధమైన పని లాగా ఎంత బాగా చూపిస్తరో. అది చూసి మన తమ్ముళ్ళు కొందరు అమాయకం గా అమ్మయిల్ని చంపి జీవితాలు నాశనం చేసుకుంటారు(ఇతరులవీ చేస్తారు).
ఈ దర్శకులు, రచయితలు తమ కున్న కనీస సామాజిక భాద్యతని విస్మరించటం చూస్తే హ్రుదయం ద్రవిస్తుంది.
ఇవే కాదు.. పదో క్లాస్ చదివే అబ్బాయి ఒకమ్మాయిని ప్రేమించి వాళ్ళు తలకోన అడవుల్లోకి పారిపోయి బోల్డు మంది గూండాలను కొట్టి..
ఇవన్నీ కూడా చిన్నపిల్లలకి సినిమాలు నేర్పే విజ్ఞానమే..
సదరు దర్శకులు వాళ్ళ పిల్లలకి ఈ సినిమాలు చూపిస్తారో లేదో సందేహమే..
సరిగ్గా చెప్పారు. అంతే కాదండీ, స్టైలుగా సిగరెట్టు కాల్చే హీరోలను చూసి తామూ మోజుపడి ప్రయోగాలు చేసి, పొగ త్రాగడానికి అలవాటు పడ్డ టీనేజర్లు చాలా మంది ఉన్నారు. మనిషిని మచి కంటే చెడు ఎప్పుడూ బలంగానే ఆకర్షిస్తుంది. ఇక దాన్నే గ్లామరస్ గా చూపిస్తే ఇక చెప్పేదేముంది? ఇది రచయితలు, మాస్ మీడియా ఎప్పటికీ విస్మరించరాని విషయం.
Post a Comment