Thursday, 27 April, 2006

ముక్కు యొక్క అందం (లేక) ముక్కందం

నంది తిమ్మన పారిజాతాపహరణంలో సత్యభామ ముక్కును గొప్పగా (అంటే వాడుక భాషలో 'అతిగా' అని విజ్ఞులు అర్థం చేసుకోవాలి) వర్ణించి "ముక్కు తిమ్మన" అని పేరు తెచ్చుకున్నాడట. 'ముక్కు గురించి అంతగా వర్ణించడానికేముంటుందబ్బా?' అని నేను "తెగ బోలెడు చాలా " హాశ్చెర్యపోయానన్నమాట. ముళ్ళపూడి 'రాధాగోపాళం'లో రాధ ముక్కు గురించి రమణగారు రాసింది చదివే వరకూ అలా అంతూ పొంతూ లేకుండానే నా హాశ్చెర్యపోవడం కొనసాగింది. ఇందులో మరీ విచిత్రం (అంటే నా హాశ్చెర్యంలో కాదు, రాధాగోపాళంలో): మనం బ్రమ్హ అని పలుకుతూ బ్రహ్మ అని రాస్తామే, ఆ పేరు గల సృష్టి కర్త ఒక రోజు ఒక అందమైన ముక్కును సృష్టించాలనుకుని మరీ శ్రద్ధగా ఒక ముక్కును సృష్టించాడట. ఆ ముక్కు చుట్టూ దానికి అత్యంత అద్భుతంగా నప్పేటట్లు అంతంత అందమైన నోరూ, కళ్ళూ, చెక్కిళ్ళూ ఇతర అవయవాలూ సృష్టించాడట.

ముఖారవిందం యొక్క అందంలో ముక్కు అంత ముఖ్య పాత్ర పోషిస్తుందని నేను ఆ నాటి వరకూ కలలో కూడా ఊహించలేదు. అసలు ఎవరినైనా మొదటి సారి కలిసినప్పుడు ఆ(డవారి) ముఖంలో ముందుగా నాక్కనిపించేది వాళ్ల కళ్ళు. తర్వాత పెదవులు, నుదురు, చెక్కిళ్ళు, చుబుకం, చివరగా మొహం మొత్తం ఆకారం (అంటే కోలగా ఉందా? లేక గుండ్రంగా ఉందా?...ఇలాంటివన్నమాట). తొలి పరిచయం లోనే ఇవన్నీ కాదు: "అనగనగ రాగం" టైపులో ఒక మనిషిని చూడగా చూడగా నిదానంగా ఇవన్నీ తెలుస్తాయన్నమాట.

అంతే తప్ప దీనికంతకటికీ మధ్యలో సెంటరాఫ్ అట్రాక్షన్ గా ముక్కనేదొకటుంటుందని నాకెప్పుడూ తట్టనే తట్టదు. భామ ముక్కు గురించి వ్రాసిన తిమ్మన, రాధ ముక్కు గురించి వ్రాసిన రమణ నా గురించి తెలిస్తే నాకేసి చూసే చూపు తలచుకుంటే నా మీద నాకే జాలి కలిగి ఏమిటోగా అనిపిస్తూంటుంది అప్పుడప్పుడూ.

కేవలం కథలూ కావ్యాల్లోనే కాదండోయ్! నిజ జీవితంలో అంటే సమకాలీన చరిత్రలో భారత దేశ సమాజంలో కూడా ముక్కందం పోషించిన పాత్ర సామాన్యమైనదేమీ కాదు. అందాల నటి శ్రీదేవి తన ముక్కుకు ఆపరేషన్ చేయించుకుందట! "మళ్ళీనా? మాకు తెలియకుండానే?!" అని తత్తర పడకండి. ఈ వార్త నాకు చరిత్ర పుటల్లో దొరికింది. అక్కడ (అంటే చరిత్ర పుటల్లో) ఇంకా చాలా విశేషాలున్నాయి లెండి. అవి మనకు అప్రస్తుతం.

"శ్రీదేవి అందం: ముక్కాపరేషన్ కు ముందూ - వెనకా" అనే పేర్లతో గొప్ప గొప్ప పాత్రికేయులూ, వాళ్ళను చూసి చరిత్రకారులూ పరిశోధన చేసేసి పుస్తకాలకు పుస్తకాలే వ్రాసేసి ఉంటారు. అసలు అంత ఘనమైన ముక్కు సదరు ఆపరేషన్ కు ముందు ఆమె ముఖారవిందం మీద ఉండేదో లేదో కూడా నాకు తెలియదు. నేనెప్పుడూ గమనించనే లేదు. ఇప్పుడు మాత్రం ముక్కు ఉందండీ. చాలా స్పష్టంగా, కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అయితే ఆ ముక్కు అలా కాక ఇంకోలా ఉన్నా ఆమె అందానికి వచ్చే లోటేమిటో నాకు అర్థం కాదు - అసలెప్పటికీ!

ఈ మధ్య పాత పాటలు వింటూంటే ఒక పాటలో ఒక ప్రౌఢ - "నా ముక్కు చూడు ముక్కందం చూడు - ముక్కున ఉన్న ముక్కెర చూడు - మ.గ.డా! నే మునుపటి వలెనే లేనా?" అని నిలదీస్తోంది తన మొగుణ్ణి. అది విని నాకు దడ పుట్టింది. ముక్కెర సంగతి దేవుడెరుగు గానీ తన ముక్కందం గురించి రేప్పొద్దున నా (కాబోయే) పెళ్ళాం అంత గట్టిగా నిలదీసి అడిగితే నా గతేం కాను? ఎందుకంటే ఎదుటి మనిషి ముక్కు కాదు కదా నా సొంత ముక్కెలా ఉంటుందో కూడా నాకింతవరకూ తెలీదు!

- త్రివిక్రమ్

8 comments:

Pradeep said...

శ్రీదేవి ఒక్కరే కాదు దాదాపు అందరు కథనాయికలు ముక్కును సరి చేసుకుని తమ అందాన్ని పెంచుకున్న వాళ్ళే. కాకపోతే శ్రీదేవి ఆ ట్రెండు మొదలు పెట్టారు, ఇతరులు ఆమెను అనుసరిస్తున్నారు. మీరు గమనిస్తే "పదహారేళ్ళ వయసు" లో శ్రీదేవికి ముక్కు కొద్దిగా లావుగా(దిబ్బ) ఉండేది. తరువాతి (ఎప్పుడో తెలీదు) సినిమాలకు ఆపరేషను చేయించుకొని సన్నబరచుకొంది. మక్కును మనము గమనించము కానీ ముక్కానికి మంచి ముక్కు చాలా కళ తెస్తుంది.

త్రివిక్రమ్ Trivikram said...

"శ్రీదేవి ఆ ట్రెండు మొదలు పెట్టారు, ఇతరులు ఆమెను అనుసరిస్తున్నారు."

అయితే న్యాయంగా కూడా చరిత్రకెక్కాల్సిన ముక్కు శ్రీదేవిదేనన్నమాట! ;)

"మక్కును మనము గమనించము కానీ ముక్కానికి మంచి ముక్కు చాలా కళ తెస్తుంది."

తప్పకుండా గుర్తుంచుకుంటాను! :)

స్వాతి said...

ఎమో నండీ నాకూ ముక్కు గొడవ సరిగ్గా అర్ధం కాదు, కాకపోతే మన NTR గారిని చూసి మన జనాల మాటలు విన్నాక కొటేరేసిన ముక్కు అంటె కొంత ఐడియా వచ్చింది. పోతే ఇక చట్టి ముక్కు, దిబ్బ ముక్కు, సంపంగి లాంటి ముక్కు ఇత్యాదివి ఇంకా సందేహాలే.

Chinthu said...

nenaithe andarlonoo modhata mukkune chusevanni chinnappuudu...

cbrao said...

Nose is like salt in a curry. Though not noticeable, it brings grace to face.

శ్రీనివాసరాజు said...

Ha హ హ, చాలా బాగుందండి. మీకు తెలియదేమో ముక్కందం కానీ నాకు నచ్చేది ముక్కే..

అమ్మాయికి "కొటేరేసిన ముక్కు" చాలా అందానిస్తుంది.
మరి ఈ పదం చాలా సార్లు విన్నాకానీ, ఎక్కడినుండి వచ్చిందో, అసలు అర్ధం తెలియదుకానీ,
కాస్తఅందమైన ముక్కు అని అర్ధంచేసుకున్నా.

ఏది ఏమైనా "ముక్కేన, ముక్కో ముక్కోభ్యాం..",
..(అమ్మో ముక్కుమీదకూడా పద్యాలొచ్చేస్తున్నాయేంటి). హ హ హా ;-)

రానారె said...

ఇప్పటికీ తెలీదా? ;-)

త్రివిక్రమ్ Trivikram said...

@స్వాతి & శ్రీనివాసరాజు: కోటేరు అంటే తిరగేసిన నాగలి అని బ్రౌణ్య ఉవాచ (మొదలు పైకెత్తి కాడికి కట్టిన నాగలి). అంత సూటిగా ఉంటుందన్నమాట.
@రావుగారు: చక్కగా చెప్పారు.
@చింతు: కూరలో ఉప్పులా దాగుండే ముక్కును ముందుగా చూడగలిగే మీ పరిశీలనాశక్తికి, సౌందర్యదృష్టికి నా జోహార్లు.
రానారె,
ఇప్పుడు రెండు ముక్కుల సొగసు తెలిసింది...రెండో ముక్కు నాదన్నమాట! :)