Monday, 10 April, 2006

తెలుగుకు పట్టిన తెగులు

ఏది తెలుగు? ఏది కాదు?
ఓ మహాత్మా! ఓ మహర్షీ!!


తెలుగు పద సంపద పెరగాలి. కొత్త పదాలు పరభాషల్నుంచి వచ్చినా అభ్యంతరం లేదు కానీ మనం విపరీతంగా వాడే పరభాషా పదాలు తెలుగును పరిపుష్టం చేసే మాట అటుంచి ఉన్న తెలుగు పదాల్నే మింగేస్తూంటే భాష అభివృద్ధి చెందేదెలా?
'చీటికి మాటికి ఏమిటీ గోల?' అని చిరాకు పడే వాళ్ళు దయచేసి ప్రసిద్ధ రచయిత, అనువాదకుడు అయిన డా.ఉప్పల లక్ష్మణరావు వ్రాసిన ఈ కథ చదవండి~:

స్పోకెన్ టెలుగులో చిల్డ్రెన్ కి ఎ షార్ట్ స్టోరీ


ఒకానొకప్పుడు - అనగా వన్స్ అపానె టైమ్ ఇన్ ది వోల్డెన్ డేస్ - ఒక పేద ముసలివాడు - తెలుగులో చెప్పాలంటే - యె పూర్ వోల్డుమాన్ - జీవించుతూ ఉండే వాడు. వాడు ముసలివాడవడం చేతనూ, అండ్ దట్ టూ పూర్ మాన్ అవడం చేతనూ వాడికి యీ లోకంలో నూకలు చెల్లి పోయాయి - అనగా సింపుల్ తెలుగులో ఎక్స్ ప్లెయిన్ చెయ్యాలంటే - వాడు డెత్ బెడ్ మీద లై అయివున్నాడు. ఆ వోల్డు అండ్ పూర్ మాన్ కి టూ సన్స్ అండ్ వన్ డాటరూ ఉన్నారు. పెద్ద సన్నుకి ఫార్టీ యియర్సూ, చిన్న సన్ను కి ట్వెంటీ యియర్స్.

వన్ డాటర్ యొక్క యేజి ముప్ఫై - అనగా సింపుల్ టెలుగూలో థర్టీ యియర్సు. డాటర్ కి యుక్త వయస్సు రాక ముందే, సంతానం కలగక పూర్వమే వైధవ్యం సంప్రాప్తించింది - టు పుట్ ఇట్ ఇన్ స్పోకెన్ టెలుగూ - షి బికేమ్ యె చైల్డు విడో విథౌట్ చిల్డ్రన్ ఆరె హస్బెండు. అందుచేత ఆ యంగు విడో తండ్రి పంచన చేరింది - అనగా చక్కని తెలుగులో చెప్పాలంటే ఆమె ఫాదర్ పైనే యెంటైర్ గా డిపెండై, ఫాదర్స్ హౌస్ లోనే లివ్ చేస్తూ లైఫ్ ఈక్ ఔట్ చేస్తూ ఉండేది.ఆ ఓల్డ్ అండ్ పూర్ మాన్ కి డెత్తు వెరీ నియరై, టుడే ఆర్ టుమారో అన్నట్టుండడమ్ చేత తన టూ సన్స్ అండ్ వన్ డాటర్ ని తన డెత్ బెడ్డు దగ్గరికి రమ్మని వర్తమానమంపించెను - అనగా ఇన్ టెలుగూ~: బెడ్ సైడ్ కి రావలసిందిగా వర్డు పంపించాడు - అదే ఇడియమాటిక్ టెలుగూలో చెప్పాలంటే ఆర్డరు చేశాడు. వాళ్ళు డెత్తు బెడ్డుని సమీపించిన అనంతరం - అనగా మన వాడుక భాషలో అప్రోచి అయిన తర్వాత, తన చిల్డ్రెను కి ఈ విధంగా ఇన్ ఫారం చేశాడు~:

"నేను పూర్ మాన్ని. నాకు ఏ కైండాఫ్ ఆస్థిపాస్థులూ లేవు. మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే నేను ప్రాపర్టీలెస్ ఫకీర్ని. నాకున్న చరాస్థి అంతా - అనగా మన టెలుగూ లో మై మూవబుల్ ప్రాపర్టీ యావత్తూ - ఓన్లీ పద్ధెనిమిది గోవులు మాత్రమే - అనగా సులభశైలి టెలుగూ లో యెయ్ టీన్ కౌసు మాత్రమే. ఈ యెయ్ టీన్ కౌస్ లోనూవన్ కవ్ ని నా లాస్ట్ మోమెంట్సు లో సింగినాథపు సింగయ్య సిద్ధాంతి గారికి గోదానం నా చేత ఆఫర్ చేయించండి. నేను ఆ వన్ కౌ టెయిలు పట్టుకుని రివర్ వైతరిణిని క్రాస్ చేసి హెవెన్ రీచయి శాశ్వత ఇంద్ర భోగం అనుభవిస్తాను - ఇన్ సింపుల్ టెలుగూలో పెర్మనెంట్ గా పారడైజులో ఫర్ యెవ్వర్ గా లివ్ చేస్తాను. ఇక రిమెయినింగ్ సెవెన్ టీన్ ఆవులని మీ త్రీ మధ్యా పంచుకోంఢి - అనగా చేస్ట్ టెలుగూ లో చెప్పాలంటే - డివైడ్ చేసుకోంఢి. ఎల్డెర్ సన్నుకి జేష్ఠ భాగం న్యాయం కనుక - అనగా వ్యావహారిక టెలుగూలో చెప్పాలంటే జస్ట్ అండ్ ఫెయిర్ కాబట్టి - సెవెన్టీన్ గోవుల్లోనూ సంగోరు భాగం - అనగా టెలుగూలో చెప్పాలంటే సెవెన్ టీన్ కౌసులోనూ హాఫ్ ది నంబరు పెద్ద సన్నుకీ, చిన్న సన్ కి సెవెన్ టీను కౌసులోనూ మూడింట ఒక పాలూ - అదే ఈజీ టెలుగూలో చెప్పాలంటే వన్ థర్డూ - ఇహ తలచెడ్డ గొడ్డు ముండకి - అనగా క్లీన్ షేవెన్ మరియూ చైల్డ్ లెస్ మరియూ హస్బెండ్ లెస్ విడోకి - మీకూ, మీ వైఫ్ లకీ మీ చిల్డ్రెన్ లకీ సేవ చేసేంహుకు గానూ - అనగా శిష్ఠ వ్యవహారిక టెలుగూలో చెప్పాలంటే - డెయ్ లీ కుక్ చేసీ, యుటెన్సిల్స్ క్లీన్ చేసీ, హౌస్ వాష్ చేసే ఇత్యాది డాంకీ వర్కు చేసేందుకు గానూ - దానికి తొమ్మిదింట ఒక భాగమూ, అనగా సింపుల్ టెలుగూలో ఎక్స్ ప్రెస్ చేసి చెప్పాలంటే కౌస్ నంబర్ లో వన్ నైన్తూ - వచ్చేటట్టు కౌస్ ని డివైడ్ చేసుకుని హాపీగా లివ్ చేయండి. ఇహ వెళ్ళి - అనగా గో అండు ఫెచ్ సిద్ధాంతి గార్నీ!"

సిద్ధాంతి గారు వచ్చి గోదానం పట్టిన తర్వాత - అనగా కౌని డెత్ గిఫ్టుగా రిసీవ్ చేసుకున్న తర్వాత - ఆ వోల్డ్ అండు పూర్ మాను శాశ్వతంగా కన్ను మూశాడు - అనగా వాడుక భాషలో చెప్పాలంటే డైడ్ అయిపోయాఅడు. పిత్రు వాక్య పాలనకై - అనగా యీజీ టెలుగూ లాంగ్వేజీలో - ఫాదర్స్ లాస్ట్ విషెస్ కి రెస్పెక్ట్ ఇవ్వడానికని - వాళ్ళు టూ బ్రదర్సూ అన్డ్ వన్ విడోడ్ సిష్టరూ - మల్లగుల్లాలు పడ్డం మొదలుపెట్టారు. వాళ్ళలో వాళ్ళకి డివిజన్ ఆఫ్ ది కౌస్ తెగక తగాదాలు పడుతూండగా - అనగా ఫైట్ చేస్తూండగా, సిద్ధాంతి గారు తన వన్ కౌనీ సేల్ చెయ్యడానికని వెళ్తూ ఆ తోబుట్టువులకి - అనగా టూ బ్రదర్స్ అండ్ వన్ సిష్టరుకి ఎదురు పడ్డాడు. ఆ టూ బ్రదర్స్ అండ్ వన్ సిష్టరూ ఆ సిద్ధాంతి గార్ని ఇలా అర్థించారు - అనగా తెలుగులో చెప్పాలంటే రిక్వెస్టు చేశారు.

"మేము మా గోవుల్ని విభజిచుకోలేకుండా వున్నాం - అనగా కరెక్టుగా డివైడ్ చేసుకోలేకుండా వున్నాం. దయుంచి మాకు సహాయమొనరించ ప్రార్థన - అనగా స్పోకెన్ టెలుగూలో చెప్పాలంటే - ప్లీజ్ మాకు హెల్ప్ చేయవలసింద"ని అతనిని బెగ్ చేశారు.

సిద్ధాంతి గణిత శాస్త్రజ్ఞుడు- -అనగా స్వచ్ఛమైన టెలుగూలో చెప్పాలంటే అతడు మాథమెటీషియను - కాబట్టి నిమేష మాత్రం దీర్ఙ్హాలోచనాపరుడై - ఇన్ ఈజీ టెలుగులో చెప్పాలంటే - ఫైవ్ మినిట్స్ పాటు థింక్ చేసి ఇలా అన్నాడు~:

గతించిన మీ తండ్రి గారు మిమ్మల్ని ముగ్గురినీ మూడు చెరువుల నీళ్ళు త్రాగించి ముప్పు తిప్పలు పెట్టారన్న మాట నిజం.అనగా చక్కని టెలుగూ నానుడిలో ఆనొటేట్ చెయ్యాలంటే - మీ ఫాదర్ మీ త్రీ పీపుల్ నీ ...త్రీ టాంకు వాటర్సూ తాగించి మిమ్మల్ని ట్రబుల్స్ లో పెట్టాడనడం నిజమే అంటే ఇటీజ్ ట్రూ. నేను మీకు సహాయం చేస్తాను - అనగా నేను మీకు హెల్ప్ చేస్తానుకానీ నా వద్ద ఒక ఏకైక గోవు మాత్రమే కలదు - అనగా మీకు అర్థమయేటట్లుఆర్డినరీ వాడుక భాషలో చెప్పాలంటే నాకు వోన్లీ వన్ కౌ మాత్రమే ఉన్నది.ఐనప్పటికీ ఆ వన్ కౌనీ మీ పదిహేడు ఆవులతోనూ కలుపుకునీ - అనగా సింపుల్ టెలుగూలో మీకర్థమయేటట్టు చెప్పాలంటే మీ సెవెన్టీన్ కౌస్ కీ నా కౌ యాడ్ చేసిమీ జనకుడి ఆజ్ఞను పాలించి ఆస్తి విభజించుకోండి అనగా సింపిల్ అండ్ ఈజీ టెలుగూలో చెప్పాలంటే - మీ ఫాదర్ గారి విషెస్ ప్రకారం మీ కౌస్ ని డివైడ్ చేసుకుని యేదైనా గోవు శేషించిన యెడల దానిని నాకు తిగి ఇచ్చి వేయండి" అన్నాడు - అనగా వాడుక భాషలో లేక స్పోకెన్ టెలుగూలో చెప్పాలంటే - ఇఫ్ ఎ కౌ కనక రిమెయిన్ అయిపోతే ఆ కౌ ని నాకు రిటర్న్ చేసేయండి." అని సలహా చెప్పాడు - అనగా అడ్వైస్ చేశాడు.

ఆ ప్రకారం వాళ్ళు గోవులను పంచుకోగా - అనగా డివైడ్ చేసుకోగా, జ్యేష్ఠుడికి తొమ్మిది గోవులూ - అనగా యెల్డర్ సన్ కి నైన్ కౌసూ, రెండో వాడికి ఆరు గోవులూ - అనగా ఠెలుగులో చెప్పాలంటే సిక్స్ కౌసూ, బాల వితంతువు సోదరికి - అనగా ఇస్స్యూలెస్సూ మరియు హస్బెండ్లెస్సూ అయి వున్న వర్జిన్ విడోకి - రెండు గోవులూ - అనగా టూ కౌసూ పంచుకోగా ఒక గోవు - సిద్ధాంతిగారి గోవు మిగిలి పోవడమూ చూసి - వన్ కౌ రిమెయినింగ్ గా ఉండడం చూసి వాళ్ళు ముగ్గురూ వండర్ స్ట్రక్ ఐ పోయారు. ఆ మిగిలిపోయిన గోవు సిద్ధాంతిగారిదవడం చేత దానిని ఆయనకి వాపస్ అప్పనం ఇచ్చి వేశారు.అనగా వాడుక భాష టెలుగూలో చెప్పాలంటే ఆయనకు రిటర్న్ చేసి తమ కృతజ్ఞతాభివందనములను ఆయనకు అర్పించారు - అనగా వ్యవహారిక టెలుగూ లాంగ్వేజీలో చెప్పాలంటే తమ గ్రేట్ ఫుల్ థ్యాంక్స్ ని ఆఫర్ చేసి స్వగృహానికి వెళ్ళి పోయారు - అనగా శిష్టులు స్పీక్ చేసే టెలుగూలో చెప్పాలంటే వారి హౌస్ కి రిటర్న్ అయిపోయారు. ఇంతటితో కథ సమాప్తం- అనగా ది స్టోరీ హాజ్ గాన్ టు ది ఫెన్స్ అని వాడుకభాషలో అర్థమూ.

"వికాసం" సభ్యుడు,
టెలుగూ రచయిత,
డబ్ల్యూ ఎల్ రావు.

ట్వంటీ~:టెన్ ~:1971
బెర్ హెం పూర్
(గంజామ్)

No comments: