కైకేయి స్వగతం:
దండకారణ్యంలో రాక్షసుల ప్రాబల్యం విపరీతంగా పెరిగిపోతోంది. దక్షిణ ప్రాంతం నుంచి వాళ్ళు తండోపతండాలుగా వచ్చి అక్కడ స్థావరాలేర్పరచుకుని బీభత్సం సృష్టిస్తున్నారు. రాముడు తాటకను పరిమార్చిన తర్వాత కొంత కాలం స్తబ్ధుగా ఉన్న రాక్షసులు మెల్లగా విజృంభిస్తున్నారు. ఈ ప్రమాదాన్ని మొగ్గలోనే త్రుంచివేయకపోతే రాజ్యభద్రతకే ముప్పు వాటిల్లవచ్చు.
నా సాయంతో దేవాసుర సంగ్రామంలో గెలిచిన దశరథుడు ఇప్పుడు ముసలి వాడై మునుపటి చేవ తగ్గినా ముంచుకొస్తున్న ముప్పును గుర్తించడం లేదు. ముసలితనం ఎక్కువయ్యే కొద్దీ దశరథుడు అసలేదీ పట్టించుకోవడమే లేదు. లేకపోతే ఒక వైపు పెనుముప్పు ముంచుకొస్తూంటే ఇంకొక వైపు ఇంతలా సంబరాల్లో మునిగి తేలుతాడా? వేగులు తెచ్చిన సమాచారాన్నైనా వినిపించుకోడా? దండకారణ్యంలో శాంతిని నెలకొల్పే సత్తా ఒక్క రాముడికే ఉంది. కానీ దశరథుడు రాముణ్ణి అడవికి, అందునా రాక్షసులనెదుర్కోవడానికి పంపిస్తాడా? వట్టి మాట! గతంలో విశ్వామితృడొచ్చి అడిగినప్పుడే పంపలేదు. ఇప్పుడు, ఒక ఆడదాన్ని, నేనడిగితే పంపిస్తాడా? ఈ రఘు వంశం వాళ్ళకు ఆడదాని అభిప్రాయాలకు విలువివ్వడం తెలుసా? తెలిస్తే హరిశ్చంద్రుడు అలా చేసే వాడా?
ఇప్పుడు నేనేం చేయాలి? ఎవరి మనసుకు ఎంత కష్టం కలిగినా సరే! రాముణ్ణి తాత్కాలికంగా నైనా అడవికి పంపించాలి. దశరథుడు ఈ ముసలితనంలో రాముణ్ణి ఎడబాసిన దుఃఖంతో రాజ్యపాలన సరిగా చెయ్యలేడు. రాముణ్ణి విడిచి ఉండలేని లక్ష్మణుడు రాముడు కూర్చోవలసిన సింహాసనం మీద తా ను కూర్చోలేడు. ఇక మిగిలిందెవరు? భరత శతృఘ్నుల్లో భరతుడే సమర్థుడు. కానీ ఇవన్నీ ఎవరు నమ్ముతారు? కైకేయి ఇలా చేయమని సలహా ఇచ్చిందని వింటే తన కొడుక్కు రాజ్యం కట్టబెట్టడానికే ఇలా చేస్తోందంటారు. రాజ్యక్షేమం కంటే నాకేదీ ఎక్కువ కాదు.జనం ఇప్పుడే కాదు, యుగయుగాలుగా నన్నే ఆడిపోసుకోనీ. ఇప్పుడిలా మొండిగా వ్యవహరించడమే అన్ని విధాలుగా శ్రేయస్కరం.
2 comments:
నేను కైకేయి గురించి ఈ రకంగా ఎప్పుడూ ఆలోచించలేదు. సినిమాలలో చూపించినదే సరైనదని అనుకుంటూ ఉండేవాడిని. ఇది నిజంగా ఒక కొత్త కోణం.
For me this article reminded me of famous Iago's soliloquies, in Shakespear's Othello.
Post a Comment