Tuesday, 14 February, 2006

జరాసంధ

మహాభారతంలో నా దృష్టిని అమితంగా ఆకర్షించిన యోధాగ్రేసరుడు జరాసంధుడే. జరాసంధుడి పాలనలో ప్రజలు కష్టాలపాలైనట్లు నాకు గుర్తు లేదు..అయితే అతడు వందల మంది రాజులను బందీలుగా పట్టుకున్నాడట-శివుడికి బలి ఇవ్వడానికి! నమ్మశక్యంగా లేదు. ఆ కథల కల్పన కృష్ణుడిని దేవుడి అవతారంగా చూపడానికీ, అతడి ప్రత్యర్థులను కౄరులుగా చూపడానికీ జరిగిన ప్రయత్నంగా అనిపిస్తుంది. ఎందుకంటే అతడు కృష్ణుడి ఆధిపత్యాన్ని మాత్రం ఎప్పుడూ అంగీకరించలేదు. వాళ్ళిద్దరి రాజ్యాల మధ్య దాదాపు 20 సార్లు (18 సార్లా? 21/24/28?????? పాత చందమామలు తిరగేయాలి) హోరాహోరీ యుద్ధం జరిగింది. అయితే జరాసంధుణ్ణి నేరుగా ఎదుర్కొనే సాహసం కృష్ణుడెప్పుడూ చేయలేదు. మహాబలశాలి అయిన బలరాముణ్ణి ఉసిగొలిపే వాడు.
ఈ బలరాముడు కల్లు ప్రియుడు, హలధారి. కోపమొచ్చి ఆ హలంతో హస్తినాపురాన్నే పెళ్ళగించాడట ఒకసారి. ఇంకొక సారి అదే హలంతో పిల్లలు పలక మీద పిచ్చిగీతలు గీసినంత సుళువుగా యమునానది మార్గాన్ని ఇష్టమొచ్చినట్లు మార్చిపారేశాడట. ఈ బలరాముడే జరాసంధుడికి సరిజోడీ. ఎటూ తేలకుండా ఇద్దరూ రోజుల తరబడి కొట్టుకునే వారు. ఈ జరాసంధుణ్ణి జయించే మార్గం తోచక కృష్ణుడు కొట్టుకునే వాడు. చివరకు "యమునాతీరమునా.. సంధ్యాసమయమునా.." హాయిగా ఉండలేక మథురనొదిలేసి ఎక్కడో దూరానున్న ద్వారకకు పారిపోయిందీ జరాసంధుడికి భయపడే!
వీణ్ణీ, వీడితో బాటుగా దుర్యోధనుడినీ తనకు అడ్డు రాకుండా తొలగించుకోవడానికి అతడాలోచించిన మార్గాల్లో అద్భుతమైన దాన్నే అమలు చేశాడు...వీళ్ళను ఓడించడానికి అవసరమైన భుజబలశాలురు, చిరకాలం తన చెప్పుచేతల్లో ఉండిపోయే బుద్ధిహీనులుగా పాండవులను సరిగ్గా గుర్తించాడు.
కర్ణుడి విషయంలో ఎంత జాగ్రత్తగా ఉన్నాడో చూడండి: ఎంతసేపూ కర్ణుణ్ణి ఇటువైపు వచ్చేయమంటూ తనే వెళ్ళి చెప్పడమో లేక ఆ పిచ్చి తల్లిని చెప్పమనడమో చేస్తాడే గానీ పాండవులకు మాత్రం విషయం తెలియకుండా జాగ్రత్త పడతాడు - కర్ణుడే తమ పెద్దన్న అని తెలిస్తే పాండవులు ఎక్కడ తనను వదిలేసి అతడితో కలిసి దుర్యోధనుడి పంచన చేరుతారో అని భయపడి.
చివరకు అన్నీ కృష్ణుడనుకున్నట్లుగానే జరిగాయి-జరాసంధుడి చావు, కౌరవుల పతనం, తన మాట వినే పాండవులకు రాజ్యాధికారం.

4 comments:

karthik said...

hi trivikram..
its because of passionate people like you telugu language is standing high despite all the challenges. mee bhashabhimananiki naa vandanalu

oremuna said...

మీరు బొత్తిగా దర్శకుడినే తిట్టడము బాగాలేదు

స్టోరీ అన్నాక అంతా డైరెక్టరు ఇష్టము కదా

త్రివిక్రమ్ Trivikram said...

:)
తప్పొప్పులన్నిటికీ సూత్రధారిదే కదా బాధ్యత?

ఇటీవలే సరిచూశాను. జరాసంధుడు కృష్ణబలరాములతో తలపడింది 18 సార్లే. ఎందుకో తెలియదుగానీ భారతంలో అన్నీ పద్దెనిమిదే కనిపిస్తాయి. పర్వాలు 18, భగవద్గీతలో అధ్యాయాలు 18, యుద్ధం జరింది 18 రోజులు, నాశనమైన సైన్యం 18 అక్షౌహిణులు,...ఇలా. అలాగే పరశురాముడి కథలో 21.

spandana said...

జరాసంధ వధను కొత్త కోణం నుంచీ చూపించారు.
--ప్రసాద్
http://blog.charasala.com