Thursday 27 March, 2008

దుంగల దొంగలకు చందన చర్చ?

కడప జిల్లాలో సిద్ధవటం రేంజిలోని లంకమల అడవులు, పరిసరప్రాంతాల్లో ప్రపంచంలో మరెక్కడా దొరకని అరుదైన ఎర్రచందనం దొరుకుతుంది. (ఇది ప్రధానంగా కడప జిల్లాలోను, జిల్లా సరిహద్దుకవతల నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోను దొరుకుతుంది.) గతవారం నాకు పరిచయమైన ఒక సి.బి.సి.ఐ.డి. అధికారి దగ్గర మాటల సందర్భంలో దీనిగురించి ప్రస్తావిస్తే ఆయన "లంకమల అడవుల్లో గతంలో ఎర్రచందనం చెట్లు ఉండేవి. ఇప్పుడు అవి దాదాపుగా అంతరించిపోయాయి." అని విచారంగా అన్నారు. ఏమయ్యాయి? అని అడగనవసరం లేదు. దుంగల రూపంలో అక్రమంగా సరిహద్దులు దాటాయి. విదేశాల్లో ఎర్రచందనానికి విపరీతమైన గిరాకీ ఉండడం వల్ల గడచిన దశాబ్దకాలంలో ఎర్రచందనం అక్రమ రవాణా విపరీతంగా పెరిగిపోయింది.

కరువు ప్రాంతమైన కడప జిల్లాలో వ్యవసాయం మీద ఆధారపడిన కుటుంబాలు సాపేక్షంగా తక్కువే అని చెప్పాలి. కుటుంబాలను పోషించడానికి పొట్ట చేతబట్టుకుని కువైట్ తదితర గల్ఫ్ దేశాలకు వెళ్ళేవాళ్ళు ఇక్కడ ఎక్కువ. అంతదూరం వెళ్లలేని వాళ్లలో కొందరికైనా విపరీతమైన గిరాకీ ఉండే ఎర్రచందనం అక్రమరవాణాకు సహకరించడం మన ప్రజారాజ్యంలో ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశంగా కనిపించడంలో వింతేమీ లేదు. ఐతే గత్యంతరం లేనివాళ్ళే అక్రమరవాణాకు పాల్పడుతున్నారనుకోవడం అమాయకత్వం. స్థానికంగానూ, పొరుగు జిల్లాల్లోనూ రకరకాల వృత్తులు, వ్యాపారాలు చేసుకునేవాళ్ళు ఇందులో ఉన్నారు. పోలీసుల దాడిలో చిక్కినవారిలో జిల్లాలోని ఒక నగర కౌన్సిలర్, ఒక న్యాయవాది ఉన్నారు. ఒక్కోసారి దాడుల్లో దుంగలతో నిండిన వాహనాలు మాత్రమే పట్టుబడి, స్మగ్లర్లు, వాహనసిబ్బంది తప్పించుకు పారిపోవడంలోని లోగుట్టు అందరికీ ఎరుకే. గత సంవత్సరం సాక్షాత్తూ కడప నగర మేయర్, ముఖ్యమంత్రి బావమరిది ఐన రవీంద్రనాథ రెడ్డి సొంత వాహనాల్లోనే ఈ ఎర్రచందనం దుంగలు అక్రమంగా రవాణా అవుతూ పట్టుబడడం ఎవరూ మరచిపోలేదు.

సిద్ధవటం రేంజిలోని లంకమల్ల అభయారణ్యం (కలివికోడి కోసం ఏర్పడిన శ్రీ లంకమల్లేశ్వర అభయారణ్యం) లో ఎర్రచందనం వృక్షాలు విస్తారంగా ఉన్నాయి. కొన్నేళ్లుగా రోలబోడు, కొండూరు, మద్దూరు, పొన్నాపల్లి బీటులో ఎర్రచందనం దుంగలు అక్రమంగా రవాణా అవుతున్నాయి. ఖాజీపేట, మైదుకూరు, బ్రహ్మంగారిమఠం మండలాల్లోని బోగాదిపల్లె, వెంకటాపురం, భాగ్యనగరం, నాగసానిపల్లె, తూపల్లి, జాండ్లవరం గ్రామాలకు చెందిన కూలీలు లంకమల్లలోని రోలబోడు, బాలయ్యపల్లె బీటులో చందనం వృక్షాలను నరికి దుంగలను విక్రయిస్తారు. కూలీల నుంచి దుంగలను కొనుగోలు చేసిన జాండ్లవరం, జి.వి.సత్రం, ప్రొద్దుటూరులకు చెందిన బడా స్మగ్లర్లు వాటిని ఇతర ప్రాంతాలకు తరలిస్తారు. ఇది ఒకరకం స్మగ్లింగ్ కాగా కూలీల చేత చెట్లు నరికించి దుంగలను అడవిలోనుంచే నేరుగా వాహనాల్లో తరలించడం మామూలుగా జరుగుతుంటుంది. ఈ వాహనాల రాకపోకల కోసమైతేనేమి, కూలీలకు రాత్రిపూట అడవిజంతువుల నుంచి రక్షణ కోసమైతేనేమి అడవికి అగ్గిపెట్టడం, పనయ్యాక ఆ మంటలను ఆర్పకపోవడం వల్ల అడవంటుకోవడం ఇంకో విషాదం.

ఈ స్మగ్లర్ల వెనుక పెద్ద పెద్ద ముఠాలే ఉన్నాయి. జిల్లాలో ఎర్రచందనాన్ని అక్రమరవాణా చేసే ముఠాలు కనీసం 8 ఉన్నాయని పోలీసులే ప్రకటించారు. అలాంటి ముఠాలలో రెడ్డి నారాయణ ముఠాకు సహకరిస్తున్నందుకు గత అక్టోబరులో ఏకంగా 17 మంది అటవీ అధికారులను, 21 మంది పోలీసు అధికారులను సస్పెండ్ చేశారు. ఈ చర్య అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఒకేసారి ఇంతమంది అధికారుల సస్పెన్షన్ కు సిఫార్సు చేస్తూ అత్యంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న జిల్లా ఎస్పీ వై. నాగిరెడ్డి జిల్లాలో ఉమేష్ చంద్ర తర్వాత గొప్ప ఎస్పీగా నీరాజనాలు అందుకున్నారు. (పదేళ్ల కిందట దేశంలోనే అత్యంత సమస్యాత్మక జిల్లాల్లో రెండోస్థానంలో ఉన్న కడప జిల్లాలో ఫ్యాక్షనిజాన్ని అరికట్టి జిల్లాలో శాంతిభద్రతలు నెలకొల్పిన రియల్ హీరో ఉమేష్ చంద్ర.) మిగతా ముఠాలను, వారికి సహకరిస్తున్న పోలీసు, అటవీ అధికారులను పట్టుకోవడానికి పెద్ద పెద్ద ప్రణాళికలే వేశారు, పెద్ద పెద్ద శపథాలే పలికారు. ఐతే అందుకనుగుణంగా ఆ తర్వాతేమీ జరగలేదు.* ఈ సస్పెన్షన్ కు ముందూ, ఆ తర్వాతా కూడా ప్రతిరోజూ జిల్లా పత్రికల్లో అక్కడ (అక్రమంగా రవాణా అవుతున్న) అన్ని టన్నుల ఎర్రచందనం దుంగలను పోలీసులు పట్టుకున్నారు, ఇక్కడ ఇన్ని టన్నుల దుంగలను పట్టుకున్నారు, అని వార్తలు రొటీన్ గా వస్తూనే ఉన్నాయి. ఈ సస్పెన్షన్ విషయంలో నాణానికి రెండోవైపు కూడా ఉంది:

సస్పెండైన అటవీ, పోలీసు ఉద్యోగులు ఇప్పుడు తెగబడి మరింత ఉధృతంగా, బాహాటంగా దుంగల అక్రమ రవాణాకు పాల్పడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వారికి లంకమల ఆనుపానులు తెలుసు. అడవుల్లో దారులు తెలుసు. ప్రభుత్వ యంత్రాంగం పరిమితులు తెలుసు. దాని చేతగానితనమూ తెలుసు. అక్రమరవాణా చేయడంలో రకరకాల పద్ధతులు తెలుసు. ఏరకంగా అధికారుల కళ్ళుగప్పవచ్చో తెలుసు. ఈ అక్రమ వ్యాపారంలోకి దిగదలచుకున్న వారికి, వారితో చేతులు కలపదలచుకున్నవారికి, బేరసారాలు ఆడదలచుకున్నవారికి ఇప్పుడు పని మరింత సులభమైంది. 'పని' సులభంగా జరగాలంటే నేరుగా ఎవరిని కలవాలో ఇప్పుడు చిన్నపిల్లలక్కూడా తెలుసు. పైగా ఇప్పుడు ఈ 'అధికారులు' హమేషా హాజరీలో ఉంటారు. ఇంతకుముందు మొక్కుబడిగానో, తప్పనిసరయ్యో ఆఫీసులకు వెళ్ళడం, రిపోర్టు చెయ్యడం, 'పనిలోకి దిగేటప్పుడు' ముందూ వెనుకా చూసుకోవడం లాంటి జాగ్రత్తలు తీసుకోవడం అవసరమయ్యేవి. ఇప్పుడు అవేవీ అవసరం లేదు కదా? సస్పెండ్ చేసిన రెండువారాలకే సాక్షాత్తూ జిల్లా కలెక్టర్ అక్రమరవాణా ఇంకా జరుగుతూనే ఉందని, సస్పెండైనవారిలో కొందరు ఫుల్ టైం స్మగ్లర్లుగా మారి సొంత గ్యాంగులు నడిపేలా ఉన్నారని హెచ్చరించారంటే వీళ్ళు అక్రమ రవాణాకు ఎంతగా అలవాటు పడిపోయారో అర్థమౌతుంది. ఐనా కలెక్టర్ వెర్రిగానీ అరకొర చర్యలు తీసుకుంటే ఫలితం అలా కాక ఇంకెలా ఉంటుంది? వాళ్లకు ఆ సస్పెన్షన్ చర్యే ఎండాకాలంలో గంధం పూసినంత హాయిగొలిపి ఉంటుంది. అప్పుడు సస్పెన్షన్ కు సిఫార్సు చేసిన ఎస్పీ నాగిరెడ్డి ఆర్నెల్లు తిరక్కుండానే బదిలీ ఐతే ఇంకెంత హాయిగా ఉంటుంది?
"చందన చర్చిత ..."
-----------------------------------------------------------------------

* ఈ సస్పెన్షన్లైన కొన్నాళ్ళకే హైదరాబాద్‌ నుంచి వచ్చిన ముగ్గురు సీబీసీఐడీ అధికారుల బృందం మైదుకూరు ప్రాంతానికి చెందిన ఓ ప్రముఖ స్మగ్లరు ఇచ్చిన సమాచారం ఆధారంగా జిల్లాలో రహస్యంగా విచారణ జరిపి వెళ్ళింది. కోడూరు ప్రాంతంలో బడా నాయకులతో, అటవీ శాఖలో కొందరు అవినీతి అధికారులతో సంబంధాలున్న బడా స్మగ్లర్ల వివరాలు సేకరించడంతో పాటు అటవీ చెక్‌పోస్టుల సిబ్బంది వ్యవహారశైలిపై ఆరా తీశారు. ఆయా పోలీసుస్టేషన్లకు చెందిన అధికారుల కేసు డ్యూటీ రిజిస్టర్లను పరిశీలించారు. (విధి నిర్వహణలో భాగంగా పోలీసు అధికారులు ఏ కారణంపై, ఏ ప్రాంతాలకు, ఏ మార్గాల ద్వారా జీపులో వెళ్లారో రిజిస్టరులో నమోదు చేస్తారు.) ఎర్రచందనాన్ని తరలించేముందు స్మగ్లర్లు అనుసరించే వ్యూహాలు, వెళ్లే మార్గాలు, ఏఏ వర్గాల ద్వారా ఎలాంటి సహకారం అందుతోంది తదితర అంశాలను ఆ స్మగ్లరు సీబీసీఐడీ అధికారులకు వెల్లడించాడట. ఎర్రచందనం స్మగ్లర్లకు కొందరు పోలీసులు సహకరించారన్న ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కేసు డ్యూటీ రిజిస్టరును పరిశీలించడం పోలీసులకు గుబులు పుట్టించింది. కొన్ని చోట్ల ఎర్రచందనం దుంగులను తరలించే వాహనానికి పోలీసులు ముందు వెళుతూ అడ్డంకులు ఎదురుకాకుండా సురక్షితంగా జిల్లా సరిహద్దులు దాటిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. వివిధ ప్రాంతాలను సందర్శించే ముసుగులో పోలీసులు స్మగ్లర్లకు సహకరించారా, ఈ వ్యవహారంలో తలదూర్చకుండా తమ విధులు తాము నిర్వహించి వెనుదిరిగారా అనే కోణంలో విచారణ జరిగింది. జిల్లా సరిహద్దుల్లో అటవీ చెక్‌పోస్టులు ఎక్కడెక్కడ ఉన్నాయి? ఇందులో పనిచేసే సిబ్బంది వ్యవహారశైలి, పనితీరు ఎలా ఉన్నాయి? అనే అంశాలపై కూడా ఆరా తీశారు. తర్వాతేమైంది? Business as usual!

4 comments:

రానారె said...

క్రైం రిపోర్టు పక్కాగా వుంది.

పద్మ said...

బాగా రాశారు. అన్నీ తెలిసి ఏమీ చెయ్యలేని నిస్సహాయ పరిస్థితిలో ఉండటం కన్నా దారుణం ఇంకోటి ఉండదేమో. నీతికే అవినీతిని నేర్పించగల ఘనులు ఈ భక్షక భటులు. :(

Anonymous said...

మూడు నాలుగు నెలల క్రితం అనుకుంటా.
ఓ ఇరవై మంది పోలీసులు పెద్ద పథకం తో ఎర్రచందనం దొంగలని భాకరాపేట అడవుల్లో పట్టుకుంటే ఓ పై ఆఫీసర్ స్వయంగా రంగమ్లోకి దిగి వాళ్ళని రక్షించి విడిపించుకుని పోయాడు. అదే రక్షకభటుడంటే. మీకు అర్థం సరీగా తెలిసినట్టు లేదు :-)

-- విహారి

త్రివిక్రమ్ Trivikram said...

@రానారె: నెనర్లు!

@పద్మ: "నీతికే అవినీతిని నేర్పించగల ఘనులు ఈ భక్షక భటులు."
చక్కగా చెప్పారు.

@విహారి: రక్షక భటుడంటే ఏమిటో చక్కగా సెలవిచ్చారు. :)