Wednesday, 5 March 2008

చందమామ - పాఠకాదరణలో సమస్యలు

తెలుగుబ్లాగు గుంపులో "తెలుగువారి అభిమానాన్ని చూరగొన్న చందమామను నెట్‍లో చూస్తూవుంటే ఎంతో ఆనందం కలిగింది. ఆనాడు నాగిరెడ్డి, చక్రపాణి ద్యయం ప్రారంభించిన చందమామ ఈనాటికీ పెద్దలను, పిల్లలను కూడా అలరిస్తోంది." అన్న దూర్వాసుల పద్మనాభం గారి మాటలకు నెటిజెన్ సమాధానం: "మీరన్నట్టు అలరిస్తు ఉన్నట్టయితే అది మూతపడేది కాదు."

అలరించడంలో మొదట్లో లేని సమస్యలు ఇప్పుడు కొన్ని ఉన్నాయి:

1. కంటెంటులో నవ్యత తగ్గిపోవడం: రచనల క్వాలిటీ పరంగా 1950-60 లలో చందమామ ఉచ్ఛస్థితిలో ఉండేది. తర్వాత క్రమంగా పడిపోతూ వచ్చింది. ప్రస్తుతం చందమామలో ఒక జానపద సీరియల్, ఒక పౌరాణిక సీరియల్, జాతక కథ పాత చందమామల్లో వచ్చినవే మళ్ళీ వేస్తున్నారు. నిజానికి ఇదో drawback కాదు. ఎందుకంటే అవి ఈ తరం పిల్లలకు పరిచయం లేనివి కావడం వల్ల మళ్ళీ వెయ్యడంలో తప్పు లేదు. ఐతే అవి కాస్తా పుస్తకాల రూపంలో అందరికీ అందుబాటులోకి వచ్చాక పేజీలు ఎలా నింపుతారనేది వేచి చూడాలి. (గతంలో 64 పేజీలున్న చందమామ ఇప్పుడు 76 పేజీలు ఉంటోంది.) ఇంకో వైపు తెలిసిన కథలనే చందమామలో చదవాలనుకునే నాలాంటి వాళ్ళం కూడా ఉన్నాం. :-) చక్కటి నుడికారంతో అచ్చుతప్పులు అసలుండని చందమామలో తెలిసిన కథలైనా మళ్ళీ మళ్ళీ చదవడం నాకిష్టం. ఇది పాత చందమామ కథల్లోనే సాధ్యం. ప్రస్తుతం చందమామ భాషలో కూడా మార్పు వచ్చింది. ఇతర భాషల నుంచి తెలుగులోకి అనువదించుకోవడం ఎక్కువై, భాషలోని మాధుర్యం చాలా వరకూ తగ్గిపోయింది. అంతేగాక అప్పుడప్పుడూ ఆ అనువాదం కృతకంగా కూడా ఉంటోంది. మరిన్ని వివరాలకు తెవికీలోని చందమామ వ్యాసం చూడండి.

(కంటెంటులో నవ్యత తగ్గిపోవడమనేది నిజానికి ఒక్క చందమామ సమస్యే కాదు. మొత్తమ్మీద భారతదేశంలో బాలసాహిత్యం ప్రపంచ వ్యాప్తంగా బాలసాహిత్యంలో వస్తున్న పోకడలను, అవి తెస్తున్న మార్పులను అందిపుచ్చుకోవడం లేదు. అందుకే ఈ సమస్య. ఐతే కొత్తదనం కోసం చందమామ నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంది. పిల్లల కోసం పిల్లల చేతే కథలు రాయించి, వాటికి పిల్లల చేతే బొమ్మలు వేయించడం అలాంటి ప్రయత్నాల్లో ఒకటి.)

2. ప్రత్యామ్నాయ విజ్ఞాన, వినోద సాధనాలు ఇప్పుడు లెక్కకు మిక్కిలిగా ఉండడం. చందమామ 1947 జూలైలో మొదలైంది. ప్రైవేటు టీవీ ఛానెళ్ళు 1990లలో మొదలయ్యాయి. తర్వాత పదేళ్లకు కంప్యూటరు (గేమ్సు), ఇంటర్నెట్టు ప్రాచుర్యంలోకి వచ్చాయి. వీటి పోటీని తట్టుకోవడం ఒక పిల్లల పత్రికకు చాలా కష్టం. (చందమామ ఆగిపోయింది ఆ దశలోనే. తర్వాత కొంతకాలానికే మరో పిల్లల పత్రిక బొమ్మరిల్లు కూడా మూతపడింది.) ఐనా ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవడంలో చందమామ ఎప్పుడూ వెనుకబడలేదు.

3. పిల్లలను పాఠ్యపుస్తకాలు తప్ప కథల పుస్తకాలు చదివేటట్లు తల్లిదండ్రులు ప్రోత్సహించకపోవడం. (ఒక చిన్న ఉదాహరణ: తమ పిల్లలకు ప్రతివారమూ టీవీలో భాగవతం సీరియల్ చూపించడం కంటే భాగవతం పుస్తకం కొనివ్వడం అన్ని విధాలా మంచిదనే ఆలోచన ఈ కాలపు తల్లిదండ్రుల్లో చాలా మందికి రావడం లేదు. పిల్లల పత్రికలు/పుస్తకాల మీద పెట్టే ప్రతి పైసా వాళ్లకు దండగమారి ఖర్చుగానే అనిపిస్తుంది. వాళ్లలో చాలా మంది ప్రతివారం 10 రూపాయలు పెట్టి వారపత్రిక కొనగలిగే 'స్థితిమంతులే' కానీ నెలకు 10 రూపాయలు పెట్టి పిల్లల పత్రిక కొనడానికి వాళ్లకు చేతులు రావు.)

15 comments:

Anonymous said...

వస్తువులో నవ్యత ఒక్కటే కాదు. దాదాపు నాలుగు దశాబ్దాల నాటి కధలు అవి.
నాలుగు దశబ్దాలనాటి తల్లిదండ్రుల విలువలు వేరు. భాష మీద వారికున్న మక్కువ వేరు. భాషతో వారికున్న అవసరాలు వేరు.
నేటి పాఠకుడు వేరు.
ఆమే ఆసక్తులు వేరు.
భాష పట్ల ఆమేకున్న అభిప్రాయం వేరు.
భాషతో ఆమేకున్న అవసరాలు వేరు.
మీరంటున్న ఈ తరం "తెల్గు" పిల్లలల్కి ఏం "చెప్పవద్దు" , ఏం చెప్పవచ్చు అన్నది, డెస్కు వెనక కూర్చున్న వారు - భాషమీద కొంత అవగాహన ఉన్నవారిని బట్టి ఉంటుంది.

కుల, మత, ప్రాంతీయవాదంతో, మస్థిష్కానికి గజ్జి అంటించుకున్న వారు "పిల్ల" తలకాయలో అదే
నింపుతారు. వారికంతకంటే "దూరదృష్టి" ఉండదు.

అంతటి విశాలహృదయం ఉన్నవారున్నారా?
ఎమో!

Anonymous said...

చుట్టుపక్కల వుండే పంజాబీ,తమిళం,ముస్లీం పిల్లల మద్య తెలుగు ని కూడా బాగానే బ్రతికించు కోంటు న్నారు , ఈ తెల్గు పిల్లలు కి JETX,Disney తెలుగు ను బాగానే చూస్తారు కదా .పెద్దవాళ్ళు కూడా వారి భాషాభిమాన్నాని భల వంతంగా రుద్దకుండా సరిఅయిన పద్దతిలో చెపితే తప్పక వింటారు ,
ఉదాహరణకి :చందమామ నుంచి ఒక మంచి కదను పిల్లల కు చెప్పండి వారి ఆశక్తి బట్టి వారికి పత్రిక ఇవ్వండి .
కోద్దికాలం క్రితం తము చదువుకోన్న పాఠశాలకు చందమామ చందా విరాళం గా ఇచ్హే ఒక ఉద్యమం నడిచింది దీని ఫలితంగా అ పిల్లల కి చందమామ చదివే అవ కాశం కలుగుతుంది

Anonymous said...

2 - చందమామ యాజమాన్యం కూడా మారింది. ప్రస్తుత యాజమాన్యానికి - సిబ్బందికి తెలుగు మీద ఉన్న అభిమానం, వారి అభిరుచులు, వారి వాణిజ్య విధివిధానాలు, వస్తువు (content)ని,ప్రచురణ, ప్రచారాన్ని నిర్దేశించుతాయి అన్నదానిలో అనుమానంలేదు.

౩ - ఇక మీరు చెప్పినట్టు ప్రతినెల కొనడం. ఆ కొనడం అన్నది, బహుశ మీరే ఒకొక్కసారి, మీ తండ్రిగారినో, అమ్మనో ప్రేరేపించి ఉంటారు. అంటే చందమామ కోసం ఎదురుచూసేవారు. ఆలస్యాని భరించలేక వారిని ఇబ్బందిని పెట్టేవారు. అంటే దానిని అంత ఇష్ట పడేవారు. దానికి కూడా కారణం - మీ తల్లితండ్రులే. వారే మీలో ఆ అభిరుచిని పెంచారు.

మరి నేటి తల్లి తండ్రులలో అది ఉన్నదా?
లేకపోతే ఎందుకు లేదు?

ఇదే చందమామని జాలపత్రిక చేసి, సభ్యత్వ రుసుము
నిర్ణయిస్తే ఎంతమంది సభ్యులవుతారు?

ఇవన్ని కూడ ఆలోచించవలసిన విషయాలు.

krishna rao jallipalli said...

అప్పట్లో చక్రపాణి - నాగిరెడ్డి గార్ల 'చందమామ' 'విజయ చిత్ర' 'యువ' (మూడు మాస పత్రికలే) చాలా ప్రాచుర్యం. కొన్ని ఆర్దిక కారణాల వలన అన్ని మూత పడ్డాయి. యాజమాన్య మార్పుతో చందమామ మరల వస్తోంది. కాని అప్పటి కథలు, బొమ్మలు ఊహించండం కష్టం. టీవీలు లేని రోజులవి. ఇప్పుడు వస్తోన్న అన్ని ఛానల్స్ ని చూడడానికే టైం సరిపోవడం లేదు. ఇక బుక్స్ ని, పత్రికలను, వాటి లోని 'సరుకు' ని ఎవరు పట్టించు కుంటున్నారు? పిల్లలకి, పెద్దలకి టైం ఎక్కడా సరిపోతుంది. అప్పుడు కాని ఇప్పుడు కాని డబ్బు ఖర్చు చేసి పుస్తకాలు, పత్రికలూ కొనడం అనేది చాల తక్కువ. అప్పట్లో అద్దె పుస్తకాల దుకాణాలు ఒక వెలుగు వెలిగాయి. ఇప్పుడు ఫ్రీ గా ఇచ్చినా
చదివే వారు ఏరి?

త్రివిక్రమ్ Trivikram said...

నాలుగు దశాబ్దాల నాటి కథలైనా కాలదోషం పట్టినవి అనలేం.
"భాష పట్ల ఆమెకున్న అభిప్రాయం వేరు.
భాషతో ఆమెకున్న అవసరాలు వేరు." ఇది సుస్పష్టం. మీరు గమనించారో లేదో చందమామ ఎడిషన్ల సర్కులేషన్లో కూడా ఈ మార్పు కనిపిస్తుంది. తొలి యాభయ్యేళ్ళ కాలంలో భారతీయభాషా ఎడిషన్లే ఎక్కువ అమ్ముడుపోగా ఇప్పుడు అమ్మకాల్లో ఇంగ్లీషు ఎడిషన్ ముందుంది.

"మీ తల్లితండ్రులే. వారే మీలో ఆ అభిరుచిని పెంచారు." సరిగ్గా చెప్పారు. ఇప్పుడు బళ్లలో కనీసం వారానికి ఒక పీరియడ్ పిల్లల చేత స్కూల్ లైబ్రరీలోని పుస్తకాలు చదివించడమో, టీచర్లే చదివి వినిపించడమో చేస్తే పిల్లల్లో పఠనాసక్తి పెరుగుతుంది కదా? పిల్లలకు కథలు చదివి వినిపించడమనేది కొన్ని దేశాల్లో ఒక ఉద్యమంలా సాగుతోంది. మనమలాంటి పనులు ఎందుకు చెయ్యం? కశ్యప్ చెప్తున్నదీ అదే: కథలు చెప్పడం, కథల పుస్తకాలివ్వడం. రెండూ జరగాలి.

క్రిష్ గారూ! సరిగా చెప్పారు. ఐతే పిల్లల్లో మంచి పుస్తకాలు చదివే అలవాటు పెరగాలి. దానంతటది పెరగకపోతే పనిగట్టుకునైనా పెంచాలని నా ఉద్దేశం. BTW, మీరంటున్నది 'విజయ' గురించేమో? ఎందుకంటే వి.చి. సినిమా (వార?) పత్రికని నా అనుమానం.

krishna rao jallipalli said...

THANKS. విజయ చిత్ర వార పత్రిక కాదు. మాస పత్రిక. కాగడా పక్ష పత్రిక. సినిమా రంగం మాస పత్రిక. హిందూ నేషన్ వార పత్రిక.

Anonymous said...

ఈ చర్చకు స్పందనగా మొదలైనా తర్వాత నా ఆవవేశంలో కొట్టుకుపోవడం చేత లంకె తీసేశాను టపాలోంచి.

ఆ టపా ఇదిగో:
http://telugu4kids.wordpress.com/2008/03/05/%e0%b0%9a%e0%b0%82%e0%b0%a6%e0%b0%ae%e0%b0%be%e0%b0%ae-%e0%b0%95%e0%b0%a5%e0%b0%b2%e0%b1%81-%e0%b0%a4%e0%b1%86%e0%b0%b2%e0%b1%81%e0%b0%97%e0%b1%81-%e0%b0%aa%e0%b0%bf%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2/

అచ్చంగా మంచి తెలుగులో పిల్లల కోసం పుస్తకాలు తక్కువ.
మంచివి వచ్చినా అమ్ముడు పోయేది తక్కువ.
ఈ ముడి ఎలా విప్పుదాం?

త్రివిక్రమ్ Trivikram said...

లలిత గారూ!

తెలుగులో పిల్లల కోసం పుస్తకాలు తక్కువ అనేది ఒకప్పటి మాట. కనీసం గత రెండుమూడేళ్ళుగా మార్కెట్లో పిల్లల పుస్తకాలు విరివిగానే దొరుకుతున్నాయి. మీరు హైదరాబాదులో ప్రజాశక్తి, విశాలాంధ్ర లాంటిచోట్ల అడిగిచూడండి. పిల్లల పుస్తకాలు వేసే ప్రచురణకర్తలు కూడా ఇప్పుడు ఎక్కువగానే ఉన్నారు. ఐతే దాదాపు అందరూ ఒకే మూసలో వెయ్యడమే వాళ్లతో ఉన్న సమస్య. (అందరూ అవే బేతాళకథలు, అవే మర్యాదరామన్న కథలు, అవే రామలింగడి కథలు,...) పీకాక్ క్లాసిక్స్ వాళ్లు మాత్రం ప్రపంచ ప్రసిద్ధ కథలను, వివిధ దేశాల జానపదకథల్లోంచి ఏర్చికూర్చిన కథలను తెలుగులో వేస్తున్నారు. ఇవిగాక తమాషా కథలు, పిల్లలు చెప్పిన కథలు, ఫుప్పూజాన్ కథలు, బాలల గేయాలు/పిల్లల పాటలు, సామెతలు, పొడుపు కథలు,... మొదలుకొని భారీ భారీ పెద్దబాలశిక్షల దాకా ఇప్పుడు దొరుకుతున్నాయి.

ఇంతకుముందు తక్కువగా ఎందుకుండేవంటే పిల్లల పుస్తకాలకు తొందరగా చినిగిపోకుండా ఉండేలా మందమైన పేపరు వాడాలి. వస్తువు పిల్లలకు ఉపయుక్తంగా, పిల్లల స్థాయికి తగినదిగా ఉండాలి. వాళ్లను తప్పుదోవ పట్టించేదిగా ఉండకూడదు. ఆకర్షణీయమైన బొమ్మలు మంచి రంగుల్లో ఉండాలి. ఈ కారణాల వల్ల కంటెంటు దొరకడమూ కష్టమే. వాటిని ప్రచురించడానికి అయ్యే ఖర్చూ ఎక్కువే. అలాంటివాటిలో మంచి పుస్తకాలను మనం కొని, కొనిపించినట్లైతే వాళ్ళు మళ్ళీ మళ్ళీ తప్పక వేస్తారు. అమ్మకాలు ఎక్కువున్నట్లైతే ధర తగ్గే అవకాశం కూడా ఉంది.

Anonymous said...

కొనడం వరకూ చేస్తున్నానండీ.
AVKF ద్వారా కొన్నవాటిలో నాకు ఓ 10 శాతం అదృష్టం కొద్దీ మంచివి (నాకు నచ్చినవి) దొరికాయి.
హైదరాబాదులో నేను తిరిగి తిరిగి, నాకు నచ్చే పుస్తకాలు ఇంకొన్ని కొన్నాను.
ప్రజాశక్తి వారి దగ్గర నాలుగు సంవత్సారాలలు, రెండు visitల మధ్య సంఖ్యలో, విషయంలో చాలానే తేడా గమనించాను.
అయినా, భాష అండీ భాష.
బొమ్మలూ, కథా వస్తువూ.....
దయ చేసి కొన్ని మంచి పుస్తకాలు పరిచయం చెయ్య కూడదూ?

అన్నట్లు, అమరచిత్రకథ వారి పుస్తకాలు తెలుగులో ఎక్కడ దొరుకుతాయో చెప్పగలరా?

త్రివిక్రమ్ Trivikram said...

అమరచిత్రకథ వారి పుస్తకాల గురించి తెలియదుగానీ రామకృష్ణా మిషన్ వాళ్ల పుస్తకాలు తెలుగులో (శంకర్ బొమ్మలతో) దొరుకుతున్నాయి.
మరో విషయం: ఇప్పుడు చందమామ వెబ్సైటు నుంచి 1947 ఆగస్టు సంచిక మొదలుకొని పాత చందమామలను చదవవచ్చు/డౌన్లోడు చేసుకోవచ్చు కూడా! MTV ఆచార్య, చిత్రా ల బొమ్మలతో చక్కటి కథలే కాకుండా పాటలు, గడి లాంటి అదనపు ఆకర్షణలు కూడా ఉన్నాయి. :)

Anonymous said...

త్రివిక్రం గారు,
ధన్యవాదాలు.
ఆ పుస్తకాల కోసం ప్రయత్నిస్తాను.
చందమామ వారి తెలుగు వెబ్ సైటు చూసాను.
దాని గురించి ఇక్కడ రాశాను.
http://telugu4kids.wordpress.com/2008/03/05/%e0%b0%9a%e0%b0%82%e0%b0%a6%e0%b0%ae%e0%b0%be%e0%b0%ae-%e0%b0%95%e0%b0%a5%e0%b0%b2%e0%b1%81-%e0%b0%a4%e0%b1%86%e0%b0%b2%e0%b1%81%e0%b0%97%e0%b1%81-%e0%b0%aa%e0%b0%bf%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2/
పాటలు ఎక్కడ? నేను సరిగా చూడ లేదా? చూపించ గలరు.
వారిని ఇప్పటికే అచ్చుతప్పుల గురించి సప్రదించాను. వారూ respond అవుతున్నారు.
మీకు ఇంకేమైనా వివరాలు తెలిస్తే చెప్పగలరు.

నా స్పందన ప్రధానంగా దీని నుండి పుట్టి ఆవేశం పుంజుకుని విజృంభించింద్:
"ఇదే చందమామని జాలపత్రిక చేసి, సభ్యత్వ రుసుము
నిర్ణయిస్తే ఎంతమంది సభ్యులవుతారు?"

ఎక్కడైనా తప్పుగా అనిపిస్తే క్షమించగలరు.

తెలుగు4కిడ్స్ బ్లాగు స్పందనలు నాకైతే కూడలిలో కనిపించే లోపే మాయమౌతున్నాయి.
అందుకని ఇలా అక్కడా అక్కడా propogate చేస్తున్నాను. ఏమనుకోవద్దు.

త్రివిక్రమ్ Trivikram said...

పాటలు వినడానికి కాదండీ. పాత చందమామల PDF ఫైళ్లలో కథలే కాకుండా పాటలు కూడా ఉన్నాయి. అవును, వెబ్సైట్లో అచ్చుతప్పులు దారుణంగా ఉన్నాయి. మీరు ఆ విషయం వారికి తెలిపినందుకు అభినందనలు. తెలుగు4కిడ్స్ వెనుక ఉన్న తపన, శ్రమ మీ వెబ్సైటును ఒకసారి చూసినవారెవరికైనా అర్థమవుతాయి. చాలామంది ఇలాంటివి కావాలని, ఉంటే బాగుంటుందని అనుకునేవాళ్ళే గానీ, పూనుకుని చేయగలిగిందీ, చేస్తున్నదీ మీరొక్కరే!

చందమామ వెబ్సైటు చూడడానికి రుసుము నిర్ణయిస్తే ఎంతమంది సభ్యులౌతారు అంటే చాలా తక్కువమందే అనుకోవాలి. ఎందుకంటే ఆన్లైన్లో e-పత్రికలు కొని చదవడానికి మనమింకా అలవాటు పడలేదు. అంతేగాక చందమామకున్న రీడర్షిప్ పరిమితమైనది. పైగా చందమామ కావాలనుకునేవారు ఎక్కడున్నా చందాకట్టి పత్రికను తమ ఇంటికే తెప్పించుకోగలిగే సౌకర్యముంది కదా? ఆన్లైన్లో ఎంతసేపని చదువుతాం? అదే పుస్తకమైతే బుక్స్టాల్లో కొని ఇంటికొచ్చేదారిలో నడుస్తూ చదవొచ్చు, బస్టాపులో నిలబడి చదవొచ్చు, బస్సులోనూ చదవొచ్చు, ఇంటికొచ్చి కూర్చుని చదవొచ్చు, పడుకుని చదవొచ్చు, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు చంకలో పెట్టుకుని పోవచ్చు.

"Nothing can replace paper!" నేనైతే మార్కెట్లో దొరికే ఏ పత్రికనూ, పుస్తకాన్నీ ఆన్లైన్లో చదవడానికి ఇష్టపడను.

Anonymous said...

త్రివిక్రమ్ గారు,
ఇంత ఓపికగా సమాధానాలు చెప్పినందుకు ధన్యవాదాలు.
మంచి పుస్తకం అయితే కొనడానికే నేనూ ఇష్టపడతాను.
మరిన్ని నా ఆలోచనలు నా బ్లాగు ద్వారా పంచుకుంటాను.

kanthisena said...

నేను కూడా మీకు లాగే చందమామ పిచ్చోణ్ణే. నా బాల్యం నుంచి గత 35 సంవత్సరాల పైగా చందమామతో జ్ఞాపకాల చిత్తడిలో తడిసి ముద్దవుతున్నవాడినే. చెన్నయ్‌లో ఓ వెబ్‌సైట్‌లో నాలుగేళ్లుగా పనిచేస్తున్న నేను, ఆన్‌లైన్ చందమామ పిలిచి మరీ అఫర్ ఇవ్వడంతో ఎగిరి గంతేసి మరీ ఈ జనవరిలో అసోసియేట్ ఎడిటర్‌గా చేరాక గత నాలుగు నెలలుగా చందమామ గత చరిత్ర అన్వేషణలో మునిగి తేలుతున్నాను.నాలాంటి కొన్ని వందలమంది తెలుగు నేలపై, ప్రపంచం నలుమూలలనుంచి మన జాతి సంపద అయిన చందమామను ఇంత అపరూపంగా, హృద్యంగమంగా గుండెలకు హత్తుకుంటున్న వైనాన్ని ఆన్‌లైన్ అన్వేషణలో రోజూ చూస్తూ మూగగా ఏడుస్తున్న పరిస్థితి నాది. కొకు వంటి దిగ్ధంతులు దశాబ్దాలుగా ప్రాణం పోసిన చందమామ నీడలో నిలబడి తెలుగు కథా సౌరభాన్ని కొద్ది కొద్దిగా పీల్చుకుంటున్న చిన్నవాడిని. కాని ఈ రోజు అంటే 2009 మే 8-9 తేదీల మధ్య తెల్లార్లూ నెట్‌లో మీలాంటి వారిని గాలిస్తూ, పాత చందమామలకోసం మీ ఆరాటాన్ని చూస్తూ ఉప్పొంగుతున్న భావాలను అణుచుకోవడానికి విశ్వప్రయత్నం చే్స్తున్నాను. ఆన్‌లైన్ చందమామలో నా బాధ్యతల పరిధిని దాటి చందమామ చరిత్రను, ఇంతవరకు వెబ్‌సైట్లలో చందమామపై వచ్చిన సమస్త వివరాలను, వ్యాసాలను ఒక చోట గుది గుచ్చాలనే తపనతో ఈ మధ్యే chandamamatho.blogspot.com ను రూపొందించుకుని ఒకటొక్కటిగా దొరికిన వాటిని దొరికినట్లుగా పోస్ట్ చేస్తున్నాను. నా స్పందన మీలో ఎవరయినా చూసినట్లయితే నా వ్యక్తిగత ఈమెయిల్ ఐడి krajasekhara@gmail.com కు మెయిల్ పంపండి. చందమామ ప్రింట్, ఆన్‌లైన్ రెండింటినీ పదికాలాలపాటు బతికించుకోవాలంటే మీలాంటి మంచి పాఠకులు నిరంతరం చందమామతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధాలను పెంచుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. పాత కొత్తల మేలుకలయికగానే కాక కొత్త గెటప్‌,కొత్త కంటెంట్‌తో పురుడు పోసుకుంటున్న ఆన్‌లైన్ చందమామకు మీ ప్రోత్సాహం, ఆదరాభిమానాలే జవజీవాలను ఇస్తాయి. ఆర్తిక ఇబ్బందులు, తదితర పలు కారణాల వల్ల చందమామలో పనిచేసే వారి సంఖ్య కురచబడి, అన్ని బాద్యతలూ ఒకరు లేదా ఇద్దరు వ్యక్తులు మాత్రమే మోయవలసిన పరిస్తితుల్లో అనివార్యంగా చందమామలో దొర్లుతున్న లోపాలు, అచ్చుతప్పులు తదితరమైన మీరు గుర్తించిన ప్రతి అంశానికి మేం వినమ్రంగా క్షమాపణ కోరుతున్నాం. మీరూ మేమూ కలిస్తే చందమామ పదికాలాల పాటు బతకుతుందనే కొండంత ఆశతో చెబుతున్నా. వీలైనంతమంది కొత్తవారికి, దేశ దేశాల్లోని తెలుగు మిత్రులకు ప్రింట్, ఆన్‌లైన్ చందమామను పరిచయం చేయగలరని తెలుగు జాతి సంపదను మరి కొంత కాలం నిలబెట్టుకోవడంలో కలిసి వస్తారని మనసారా విశ్వసిస్తూ..

K.Raja Sekhara Raju
Associate Editor
telugu.chandamama.com
Email krajasekhara@gmail.com
my new blog : chandamamatho.blogspot.com
my mobile: 9884612596 (chennai)

kanthisena said...

http://telugu4kids.wordpress.com
కేవలం నెల రోజుల క్రితం చందమామ ఆఫీసులో ఈ సైట్ తెరిచి చూశాను. ఒరిజనల్ తెలుగు కథలను తీసుకుని మల్టీమీడియా ఫార్మేట్‌లో శ్రావ్యమైన కంఠస్వరంతో కూర్చిన దృస్య శ్రవణ రూపంలో ఈ సైట్‌ను చూసి నిజంగా అబ్బురపడ్డాను. నాకు తెలిసి ఈ లలితగారే కాబోలు.. గత అక్టోబర్‌ నెలలో చందమామలో జాబ్ కోసం రెస్యూమ్ పంపారనుకుంటా.. దాంట్లో ఆమె ప్రస్తావించిన పై బ్లాగ్‌ను కూడా ఈ మధ్యే చందమామ మానవ వనరుల విభాగం నాకు ఫార్వర్డ్ చేసింది. తెలుగులో మూల కథలకు ప్రాణం పోసేలా చిన్నపిల్లలకు ఓ మంత్ర జగత్తును చూపించేలా రూపొందించిన ఆ దృశ్య, శ్రవణ కథలను ఆన్‌లైన్ లోనే చూసి ఆమెకు ఉద్యోగం కల్పించలేని చందమామ అశక్తతకు బాధపడుతూ త్వరలోనే రిప్లై పంపాలనుకునుకుంటుండగానే ఈ మంచి తెలుగు సైట్‌ను కూడా తొలగించారంటూ కింది మెసేజ్ కనిపించింది.

The authors have deleted this blog. The content is no longer available.

ఇక్కడ ఆథర్స్ అంటే లలితగారా, లేక మరొకరా అర్థం కాలేదు. ఎందుకు మొత్తంగా సైట్‌నే తొలగించవలసి వచ్చిందో అర్థం కాలేదు. ఏంటో మరి. ఎందుకిలా జరుగుతున్నాయో...