Saturday, 15 March 2008

333.3 మీటర్లు అనగా ఆకాశవాణి జానపద కేంద్రం

రాష్ట్రంలోని నాలుగు ప్రధాన రేడియో కేంద్రాల్లో ఒకటైన కడప కేంద్రం మొదటి నుంచీ జానపద కార్యక్రమాల్లో తన ప్రత్యేకతను నిలబెట్టుకుంటూనే ఉంది. జానపద కార్యక్రమాల నిర్వహణలో పలుమార్లు జాతీయ బహుమతులు పొందిన జానపదకార్యక్రమాల ప్రయోక్త ఆరవేటి శ్రీనివాసులు, జానపదగేయాల ఆడియో కేసెట్లలో ట్రెండ్ సెట్టర్, జానపదబ్రహ్మ గా పేరుపొందిన పల్లెపదాల సేకర్త, గాయకుడు కె. మునెయ్య (తెలుగు అకాడెమీ ప్రచురించిన "రాయలసీమ రాగాలు" రచయిత) లాంటి అతిరథ మహారథులతో కడప కేంద్రం నుంచి ప్రసారమయ్యే జానపద కార్యక్రమాలు జాతీయస్థాయిలో గుర్తింపు పొందాయి. ఇప్పుడు వారిద్దరూ లేకపోయినా వారి వారసత్వం ఇంకా కొనసాగుతోందని తెలిసి మా కేంద్రం గురించి నేను గర్వపడుతున్నాను. జానపద లలిత సంగీత వసంతోత్సవం నిర్వహణకు జాతీయస్థాయిలో ఎంపికచేసిన 10 కేంద్రాల్లో* కడప కేంద్రం ఒకటి. ఈనాడులో వచ్చిన వార్త ప్రకారం
ప్రాంతీయ జానపద లలిత సంగీత వసంతోత్సవం లో భాగంగా కడప కళాక్షేత్రంలో వసంతోత్సవాలను శనివారం సాయంత్రం 6.30 గంటలకు జిల్లా కలెక్టరు ఎం.టి.కృష్ణబాబు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభిస్తారు. మొదట అర్జున జోగియాత్ర జానపద మహాభారత ఘట్టం నుంచి కన్నడంలో మైసూరు గురురాజు బృందం 30 నిమిషాల ప్రదర్శన ఇస్తారు. ఆకాశవాణి, తిరునల్వేలి మాయాకృష్ణన్‌ బృందం తమిళంలో నయ్యాండి మేళం ప్రదర్శిస్తారు, కడప జిల్లా జానపద గేయాలను పాణ్యం నరసింహులు ఆలపిస్తారు. ఇలా నిర్వహించిన 10 కేంద్రాల కార్యక్రమాలు నెలలోని మొదటి గురువారం రాత్రి 9.30 గంటలకు ఢిల్లీ నుంచి వ్యాఖ్యాన సహితంగా ప్రసారం అవుతాయి.
-------------------------------------------------

* అహమ్మదాబాదు, త్రిచీ, ఢిల్లీ, గౌహతి, జమ్మూ, జలంధర్, జైపూర్, రోహ్తక్, సతారా, కడప.

2 comments:

రానారె said...

గొప్ప శుభవార్త. జానపద కార్యక్రమాలను ఇప్పుడు ఎవరు నిర్వహిస్తున్నారు? కడప ఆకాశవాణిని హైదరాబాదునుండి మీరు వినగలరా, యింటికెళ్లినప్పుడేనా?

త్రివిక్రమ్ Trivikram said...

థ్యాంక్యూ రానారె! ఇప్పుడు ఎవరు నిర్వహిస్తున్నారో తెలియదు. ఇంటికి వెళ్ళినప్పుడు వినడమే.