సర్దార్జీలు:
గతంలో తాగుబోతుల మీదా, డాక్టర్ల మీదా ఎక్కువ జోకులు వచ్చేవి. కానీ ఇప్పుడు ఇంటర్నెట్‌లో సర్దార్జీల మీదొచ్చిన/వస్తున్న జోకులముందు అవెంత? మానవమాత్రులెవరి మీదైనా వెయ్యగలిగే జోకులను, ఎవరిమీదా వెయ్యలేని జోకులను కూడా సర్దార్జీల మీదే వేసి వినోదిస్తారు కొందరు. సర్దార్జీలంటే ఎందుకింత చులకనో నాకు తెలియదుగానీ ఇటీవల నాకొచ్చిన ఒక మెయిల్ గనక నిజమే అయితే అలా జోకులేసుకుని నవ్వుకున్నందుకు మనమే సిగ్గుతో తలదించుకోవలసి వస్తుంది. ఆ మెయిల్ ప్రకారం మన దేశం బ్రిటిష్ వారి పాలనలో ఉన్నప్పుడు సిక్కు వీరులు 1930 ప్రాంతంలో బ్రిటిష్ వారి దురాక్రమణకు వ్యతిరేకంగా అసమాన ధైర్యసాహసాలతో పోరాడారు. వాళ్ళ ధాటికి తట్టుకోలేకపోయిన బ్రిటిష్ పాలకులు వాళ్ళమీద ఇలాంటి జోకులెయ్యడం ద్వారా తమ కడుపుమంట చల్లార్చుకునేవాళ్ళట. అది తెలియక సర్దార్జీల మీద జోకులేసి నవ్వుకోవడం మనకు అలవాటైపోయింది.
అసలు 16వ శతాబ్దంలో సిక్కు మతం పుట్టినప్పటి నుంచి ఆ మతం మనుగడ వాళ్ళు మొఘలు పాలకులతో జరిపిన పోరాటాల్లో ప్రదర్శించిన గుండెధైర్యం, సాహసాల మీదే ఆధారపడింది. వాళ్ళ పవిత్రగ్రంథమైన ఆదిగ్రంథ్ ను రాయడంతో బాటు అమృత్‌సర్‌లో స్వర్ణదేవాలయం కట్టించిన గురు అర్జున్ దేవ్ ను చిత్రహింసలు పెట్టి చంపించాడు జహంగీర్. దాంతో తర్వాతి సిక్కు గురువైన హర్‌గోవింద్ సుశిక్షితులైన సిక్కులతో ఒక సాయుధదళాన్నే ఏర్పాటు చేశాడు. తొమ్మిదో గురువైన తేఘ్ బహదూర్ ను ఔరంగజేబు చంపించడంతో తొమ్మిదేళ్ళ వయసులో సిక్కు గురువైన గోవింద్ సింగ్ తర్వాతి కాలంలో పూర్తిస్థాయి సిక్కు సైన్యాన్నే (ఖల్సా) నడపవలసి వచ్చింది. తర్వాతికాలంలో ఔరంగజేబు అతడి నలుగురు కొడుకులను కూడా చంపించాడు. ఈ పోరాటాలు ఔరంగజేబుతో అంతమవలేదు. గురు గోవింద్ తర్వాత సిక్కు నాయకుడైన బందా బహదూర్ ను జహందర్ షా అనే మొఘల్ చక్రవర్తే చంపించాడు.
తర్వాతి కాలంలో పంజాబ్ లో సామ్రాజ్యాన్ని నిర్మించిన మహరాజా రంజిత్ సింగ్ కూడా సిక్కే. ఆఫ్ఘాన్లను పశ్చిమ పంజాబు నుంచి తరిమేసి పెషావర్ తో బాటే పష్టూన్ ను స్వాధీనం చేసుకున్నాడు. పష్టూన్ ప్రాంతాన్ని పాలించిన మొట్టమొదటి ముస్లిమితర పాలకుడు రంజిత్ సింగ్ - ఒక సర్దార్జీ! అంతకు ముందు వెయ్యేళ్ళ పైబడిన కాలంలో ఎప్పుడూ బయటి నుంచి కైబరు కనుమల గుండా విదేశీయులు మనదేశం మీదికి దండెత్తి ఆక్రమించుకోవడమే తప్ప ఇక్కడి నుంచి సైన్యాన్ని అటువైపు దాటించిన పాలకులెవరూ లేరు రంజిత్ తప్ప. రంజిత్ పాటించిన లౌకికవిధానాల వల్ల ముస్లిములు కూడా అతణ్ణి అభిమానించేవారు. అత్యంత సారవంతమైన పంజాబు భూమి మీద కన్నేసిన బ్రిటీష్ పాలకులు దాన్ని చేజిక్కించుకోవడానికి ఎన్ని కుట్రలు పన్నినా సిక్కుల పోరాటపటిమ వల్ల, రంజిత్ నాయకత్వలక్షణాల వల్ల అతడి జీవితకాలంలో అది సాధ్యపడలేదు.
దయచేసి సర్దార్జీల మీద జోకులేయడం ఆపండి. మీకు ఎవరైనా సర్దార్జీ జోకులు పంపినా, లేక చెప్పినా అలా చెయ్యొద్దని చెప్పండి.
బహద్దూర్లు:
పాత సినిమాలు చూసేవారికి కొన్ని ముసలిపాత్రలను రావు బహద్దూర్ అని గొప్ప అట్టహాసంగా చూపించడం తెలిసేవుంటుంది. ఈ బహద్దూర్లెవరో తెలుసా? ఇది కూడా బ్రిటిష్ వాళ్ళు మొదలుపెట్టిందే! తమ ప్రభుత్వానికి విధేయులుగా ఉన్న ఉన్నత కుటుంబాలవారికి వాళ్ళిచ్చిన బిరుదులే ఈ
రావు(రాయ్) బహద్దూర్ - హిందువులకు,
ఖాన్ బహద్దూర్ - ముస్లిములకు.
ఇప్పుడు ఆ "బహద్దూర్"ల భేషజం చూస్తే నవ్వొస్తుంది.
7 comments:
త్రివిక్రం గారూ - నాకు బల్జీత్ సింగ్ అని ఒకత మంచి స్నేహితుడు ఉన్నాడు. ఇతర స్నేహితులు ఇతని మీద కుళ్ళు జోకులు - మీరు ప్రస్తావించినవంటివి వేస్తూ ఉంటే , అడ్డుకున్నందుకు , ఈ మిగిలిన దరిద్రులంతా నన్ను వెలి వేసినట్టు చూసేవారు. కాని అతను ఎవరికి యే సహాయం కావలసి వచ్చినా మొదటగా ప్రత్యక్షమయ్యేవాడు.. ఈ దరిద్రులేమో పాపం అతని అమాయకత్వాన్ని ఆసరాగ తీసుకుని , అతని చేత సహాయం చేయించుకుని అతని వెనకాతల ఇలాంటి జోకులు వేసేవారు...వారిని, వారి మిత్రత్వాన్ని వదిలేసాననుకోండి...కానీ బల్జీత్ సింగ్ కి ఉన్న ఆ ధైర్యం , తెగువ, ప్రేమ అభిమానాలు నేను ఇప్పుడే కాదు, ఎప్పటికీ మర్చిపోలేను
సర్దార్జీ జోకులు చెప్పేవారి లేకితనాన్ని సూచిస్తూంటాయి. మంచి సందేశం ఇచ్చారు, అందరూ పాటించాలి.
మంచి పోస్ట్.మీరు చెప్పిన విషయాల వరకూ వెళ్ళక్కరలెద్దండి..కార్గిల్ లో వాళ్ళు ఎంత తెగువ చూపారో తెలుసుకున్నా ...వాళ్ళగురించి అలా మాట్లాడడం మానేస్తారు.కార్గిల్ ముందు వరకూ ఎవరన్నా సర్దార్ జోకులు చెపితే నేను ఎంజోయ్ చేసేదానిని.ఆ తరువాతి నుండి అలాంటివి ఎవరన్న చెపుతుంటే ఆపడం మొదలుపెట్టా.
త్రివిక్రం గారూ,
మీరు జోక్ లో కాలేసారు. ఎందుకంటే, చాలా మంది సర్దార్ లు హాస్యాన్ని అమితంగా అస్వాదిస్తారు. ఈ విషయాన్ని నేను స్వయంగా గమనించి అనుభవించాను. ఉద్యోగ రీత్యా నేను కొంత కాలం సర్దార్జీ లతో చాలా సన్నిహితంగా గడప వలసి వచ్చింది. అదిన్నూ పంజాబ్ లో, అప్పుడు గమనించిన పలు విషయాలు నా బ్లాగ్ లో త్వరలో ప్రచురిస్తాను.
ప్రసాదం.
మంచి మాట.
ప్రసాదం గారూ,
సర్దార్జీలు హాస్యాన్ని అభిమానించినంత మాత్రాన వాళ్ళ మీద వేసే జోకులనీ అభిమానిస్తారని కాదు కదా! అసలు ఏ జోకుకైనా ఒక జాతి, గుంపు, మతము టార్గెట్ అవకూడదు.
--ఫ్రసాద్
http://blog.charasala.com
నేను కూడా ప్రసాదంగారితో ఏకీభవిస్తున్నాను. నాకు తెలిసిన కొందరు సర్ధార్జీలను చూసి, ఇంకా కొందరినుండి విన్నదాన్ని బట్టి వారు చాలా హాస్యప్రియులని తెలిసింది. వారి మీద వేసే జోకులు వారికి తెలిసినప్పటికీ ఏమీ బాధ పడకుండా, అవి చదివి ఆనందించగల మనస్సు వారిది. అలా అని అడ్డమైన జొకులన్నింటినీ వారికే అంటగట్టడాన్ని నేను సమర్ధించను.
ఈ సర్దార్జీ జోకులకు నేను ముందు నుంచీ విముఖం.ఎంత హాస్యప్రియులైనా ఒక జాతిని,మతాన్ని,ప్రాంతాన్ని అవమానించినట్టు ఉంటుంది.
ఇక 'బహద్దూరు' విషయానికొస్తే 'వీరుడు','శౌర్యవంతుడు' అన్న అర్థం ఉంది. ఈ బిరుదు ఆంగ్లేయులు రాకముందు నుంచీ ఉంది. అది గౌరవచిహ్నం కాబట్టి వారు దాన్ని వారి అనుయాయీలకు ఉచితంగా పంచారు.మన వారు దాన్ని తమ పేరు ముందు తగిలించుకొని మురిసిపోయేవారు.'సుల్తాన్'ను 'సురత్రాణ' అన్నట్టు!
Post a Comment