Tuesday 13 February, 2007

దుస్సంధి-దుష్టసమాసం

రెండు వేర్వేరు భాషలకు చెందిన పదాలు కలిస్తే భాషాసంకరం అవుతుంది. అలాంటి పదాల కలయికతో ఏర్పడిన సమాసాల మాటెలా ఉన్నా సంధులకు మాత్రం సూత్రాలంటూ లేవు. ఉదాహరణకు:
అ+అ కలిస్తే తెలుగులో అ (అకారసంధి) ఐతే సంస్కృతపదాల్లో ఆ (సవర్ణదీర్ఘసంధి) అవుతుంది.
అలాగే అ+ఇ తెలుగులో ఇ (ఇకారసంధి) ఐతే సంస్కృతపదాల్లో ఏ (గుణసంధి) అవుతుంది. ఇలా ఒక్కో భాషలోని పదాల కలయికకు విడివిడిగా సూత్రాలున్నాయి. ఇలాంటి సంధి సూత్రాలు వర్తించని విధంగా రెండు వేర్వేరు భాషల్లోని పదాల మధ్య సంధి కలిపితే దాన్ని దుస్సంధి అని, ఆ సమాసాన్ని దుష్టసమాసం అని అంటారు.

ఒక ఉదాహరణ: నల్ల అనేది అచ్చతెలుగుపదం. ఇంద్రుడనేది ఇంద్ర: అనే సంస్కృతపదం నుంచొచ్చింది. ఇప్పుడు నల్ల+ఇంద్రుడు తెలుగుసంధిసూత్రాల ప్రకారమైతే నల్లింద్రుడు, సంస్కృతసంధి ప్రకారమైతే నల్లేంద్రుడు అవుతాడు. "ఏదైనా తప్పే. అసలలా వేర్వేరు భాషలకు చెందిన పదాలను కలపాలనుకోవడమే తప్పు" అంటారు వ్యాకరణవేత్తలు. వాళ్ళ ఉద్దేశ్యంలో రెండు వేర్వేరు భాషలకు చెందిన పదాలను కలపనే కూడదు. ఎందుకంటే రెండు పదాలు కలిసిపోయినప్పుడు ఏర్పడే కొత్తరూపం శబ్దాన్ని బట్టి కాక భాషను బట్టి మారుతుంది. ఉదాహరణకు రెండు హ్రస్వ అకారాలు కలిసినప్పుడు తెలుగులో "అ" ఏర్పడితే సంస్కృతంలో అవే శబ్దాలు కలిసినప్పుడు "ఆ" ఏర్పడుతుంది. అందుకే తెలుగులో రామ+అయ్య=రాయ్య (అకార సంధి) అయితే సంస్కృతంలో రామ+అవతారం=రామావతారం (సవర్ణదీర్ఘసంధి) అవుతుంది.

ఈ లెక్క ప్రకారం బ్లాగ్ అనేది ఆంగ్లపదం కాబట్టి బ్లాగోత్సాహం దుస్సంధి, దుష్టసమాసం అవుతుందా? (బ్లాగరులు తరచుగా తమది బ్లాగోత్సాహం అనే అంటున్నారు.) భాషలో ఎక్కువమంది వాడే పదమే వాడుకలో నిలుస్తుంది - వ్యాకరణసూత్రాలతో సంబంధం లేకుండా. ఇలాంటి వ్యాకరణవిరుద్ధమైన పదబంధాలు ఇప్పటికే కొన్ని బహుళవ్యాప్తిలో ఉన్నాయి.

సముదాయ పందిరి, వీక్షణజాబితాలు దుష్టసమాసాలా?

సముదాయ: సంస్కృతపదం
పందిరి: అచ్చతెలుగు

వీక్షణ: సంస్కృతపదం
జాబితా: విదేశీపదం (మనది కాదని తెలుసుగానీ ఏ దేశానిదో నాకు తెలియదు)

వికీపీడియాలో వాడుతున్న సముదాయ పందిరి దుష్టసమాసమని చెబితే తప్ప తట్టలేదు. ఐనా ప్రస్తుత పరిస్థితుల్లో దుష్టసమాసాలను ప్రయోగించకుండా మడి కట్టుకుని కూర్చోలేం.

19 comments:

oremuna said...

సంస్కృతము, ఆంగ్లము రెండూ ఇండో యూరోపియను భాషలు
అలాగే తెలుగు దక్షిణ భారత భాష

కనుక బ్లాగు అనే ఆంగ్ల పదానికి, ఉత్సాహము అనే సంస్కృత పదానికి సంద్ది కుదురిద్ది.

అయినా మమ్మళ్ని ఈ వ్యాకరణము పట్టి బందించలేదు

ప్రజలు చెప్పినదే వ్యాకరణము కానీ, వ్యాకరణము చెప్పినది ప్రజల భాష కానేరదు కదా!

తిరిగి వ్రాయండి మీ వ్యాకరణ సూత్రాలు 

రానారె said...

కావచ్చును. అయితే పండితులేం సూచిస్తున్నారో కూడా తెలుసుకోనవసరం లేదంటారా? 'సముదాయ పందిరి', 'ఇసుకపెట్టె' లాంటి పదాలకు ఇంకా అర్థవంతమైన, సరళమైన, కృతకం కాని, ఈనాటి వ్యవహారంలో ఆమోదయోగ్యాలైన పదాలను ఎవరైనా సూచించవచ్చుకదా. వాళ్లని తరిమేసేలా వ్యవరించడం చేటు అని నా భయం.

కొత్త పాళీ said...

భలే బాగుంది ఈ చర్చ.
మీరు ముగ్గురు చెప్పిందీ కరక్టే.
1. భాష, వాడుక ముందు పుట్టి వ్యాకరణ సూత్రాలు తరవాత వచ్చాయి - software పరిభాషలో standardization లాగా. ఇది చారిత్రక సత్యం.
2. ప్రతిభావంతులైన రచయితలు (పూర్వకాలంలో కవులు) వ్యాకరణ నియమాల్ని ఉల్లంఘించారు వారికి అవసరం అనిపించినప్పుడు. కాలక్రమేణా వాటిలో కొన్ని ప్రమాణాలైనాయి.
ఉ. గర్భగుడి.
3. కొత్త అవసరాల కోసం కొత్త పదాలు పదబంధాలు తయారు చేసుకోవటంలో, ఈ నియమాల్ని వీలున్నంత వరకూ పాటించటం మంచిదే - ఎక్కువమందికి తొందరగా అర్థం అవుతుంది.
4. నియమాల్ని తిరగరాయటమూ మంచిదే కాక అనివార్యం కూడా - మన అన్న ఘటోత్కచుడన్నట్టు - ఎవరూ పుట్టించకుండా మాటలెలా పుడతై.
5. టపాలో చెప్పినట్టు " భాషలో ఎక్కువమంది వాడే పదమే వాడుకలో నిలుస్తుంది - " ఇది సిసలైన మాట. దీని రుజువు ఇంటర్నెట్ చిన్ని జీవితంలోనే చూశాం. మొదట్లో దీన్ని information superhighway అని పిలవటానికి చాలా ప్రయత్నం జరిగింది. ఎలా మొదలైందో తెలీదు గానీ web, internet అనే పదాలు స్థిరపడి కూర్చున్నై.

కొత్త పాళీ said...

oremuna said...
సంస్కృతము, ఆంగ్లము రెండూ ఇండో యూరోపియను భాషలు
అలాగే తెలుగు దక్షిణ భారత భాష

కనుక బ్లాగు అనే ఆంగ్ల పదానికి, ఉత్సాహము అనే సంస్కృత పదానికి సంద్ది కుదురిద్ది.

- అదిరింది గురూ, నీ తర్కం:-)

జోకులలాగుంచి - బ్లాగోత్సాహం - సుబ్బరంగా వుందీ మాట. ఇంకా మాట్టాడితే, బ్రమ్మాండంగా ఉంది.

నేను గమనించింది ఏమంటే - కొత్తగా పుట్టించిన మాటల్లో, సరళంగా ఉండి, జాలువారేటట్టు ఒక easy flow ఉండే పదబంధాలు త్వరగానూ, విస్తృతంగానూ ఆమోదం పొందుతాయి వాడుకలో.

Anonymous said...

విజ్ఞానసర్వస్వములోని భాష కొంత సాంప్రదాయబద్ధంగా ఉంటుందని నా అభిప్రాయము..భాషా పరిణామాలకు వికిపీడియా వేదిక కాదు. కొత్త పదాలు మొదట నోట్లో ఆ తరువాత బ్లాగుల్లో, ఆ తరువాత మేగజిన్లు, ఆ తరువాత వార్తాపత్రికలలో ప్రస్తానము చేసిన తర్వాతనే డిక్షనరీలకు, విజ్ఞానసర్వస్వాలకు చేరుతాయి. మరీ గ్రాంథికము రాయాల్సిన అవసరం లేదు కానీ వార్తా పత్రికలకు కొంచెం పెచ్చుగా ఉంటే చాలు.

వికిలో భాష క్రమబద్దీకరించాల్సిన అవసరము ఎంతైనా ఉంది. ఇక్కడ పండితులు చర్చలు తప్ప ఏమీ చేయకపోవడమే సమస్య. అయినా మన ప్రయత్నం మనం చేసి చూద్దాం

Anonymous said...

[త్రివిక్రమ్, రానారె, చావా, కొత్త పాళీ, వైజాసత్య గార్లకు - నేను ఈ బ్లాగు చూడకముందు teluguwiki google group కు పోస్ట్ చేసిన జాబు ఇదిగో. కొత్తపాళి చెప్పిన విషయాలు చాలా వరకు నేను చెప్పాలనుకున్నవే. - సురేశ్. ]

దుష్ట సమాసాల విషయంలో, వేరే ఇతర వ్యాకరణాంశాల విషయంలో నేను descriptivism నే నమ్ముతాను. "మాహా తలవరి", "ముమ్మూర్తులు", "గర్భగుడి" అన్న ప్రాచీన సమాసాల నుండి "మహానాడు", "తెలుగుదేశం" మొదలైన ఎన్నో దుష్టససమాసాలు మన వాడుకలో ఇప్పటికే ఉన్నాయి కదా! అయితే "సముదాయ పందిరి" అంటూ ముక్కస్య-ముక్క అనువాదం కంటే Community Portal సూచించే అర్థాన్ని అనువాదం చేస్తూ "సహాయ కేంద్రం" అనో, "కూడలి", "రచ్చబండ" అనో అనవచ్చు. అట్లాగే sandbox ని ఇసుకపెట్టె అనడానికి బదులుగా "పిచ్చుకగూడు" అనవచ్చు. "వీక్షణ జాబితా" దుష్ట సమాసమే అయినా వినడానికి బాగానే ఉంది ("అభ్యర్థి జాబితా" అన్న వాడుక ఉండనే ఉంది కదా)! కనీసం ప్రతిపేజీలోనూ కనిపించే ఇలాంటి ముఖ్యమైన పదాలకోసమైనా, అనువాదాలు చేయడంలో విశేషానుభవం ఉన్న తెలుగు పండితులను సంప్రదించడం మంచిదని నా అభిప్రాయం.

తెలుగు వికీకి సహాయపడగలిగే భాషా పండితులు, భాషా శాస్త్రజ్ఞులు అందుబాటులో లేకపోతే తెలుగు జర్నలిస్టులకు ఉపయోగంగా బూదరాజు రాధాకృష్ణ గారు రాసిన కొన్ని పుస్తకాలు మనం ఉపయోగించుకోవచ్చుననుకుంటాను. "మంచి జర్నలిస్ట్ కావాలంటే ..." అంటు ఆయన రాసిన పత్రికా రచన పాఠాలు వికీపీడియన్లకు శైలీ మ్యానువల్ గా పనికి వస్తుందని నాకనిపిస్తుంది. అట్లాగే ఆయన రాసిన "అనువాద పాఠాలు" కూడా మనకు సహాయపడవచ్చు. అనువాదాల విషయంలోనూ, సగటు తెలుగు పాఠకునికి అర్థమయ్యే విధంగా రాయటంలోనూ తెలుగు పత్రికల్లోను, పాప్యులర్ సాహిత్యంలోను వాడే భాషనుండి కూడా కొంతైనా స్ఫూర్తి పొందడంలో తప్పేం లేదని నా అభిప్రాయం.

ఆఫీసు పనులు, ఇంటి పనులు, "ఈ-మాట" పనులతో ఇప్పటికే సతమతమౌతున్న నాకు వికీపీడియా మీద చురుగ్గా పనిచేయడం వీలు కాని పని. అందుకే దీక్షతో, అంకితభావంతో పనిచేస్తున్న మిమ్మల్ని విమర్శించడానికి మనసొప్పక ఇన్నాళ్ళు మౌనంగా ఉన్నాను (కూసే గాడిదొచ్చి మేసే గాడిదను చెరిపినట్టు కాకూడదని). అయితే, శైలి మ్యానువల్ ను తయారు చేయడంలో ఆసక్తి ఉన్నవారికి (నా సమయానుకూలాన్ని బట్టి) చేతనైనంత సహాయం చెయ్యడానికి నేను సిద్ధమే.

సద్భావనలతో,
సురేశ్.

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం said...

ఎందరో మహానుభావులు. అందరికీ వందనములు.

వ్యాకరణం మనకి శత్రువు కాదు.ముందు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి.మన వ్యాకరణపు శక్తిని మన భాష పదజాలాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోలేకపోవడం వల్ల ఇప్పటికే చాలా నష్టం జరిగింది.మన భాషకి స్వాభావికమైన పదాల స్థానే పరాయి భాషాపదాలు తిష్ఠ వేశాయి.ఇప్పుడు మంచినీళ్ళు కావాలనడం కూడా అపురూపమైపోతోంది.వాటర్ వాటర్ అంటున్నారు.కాబట్టి ఉన్న పదాల్ని సమగ్రంగా తెలుసుకోవడం ఆ పదాల్ని తెలుగు చెవులకి ఇంపుగా జతగూడించి సంధిసమాసాలు చెయ్యడం అవసరం.ఈ ఉద్దేశంతోనే నేను తెలుగుభాష అనే బ్లాగు మొదలుపెట్టాను.కాని దానిమీద పూర్తికాలికంగా సమయం కేటాయించలేనంత వ్యగ్రత (busy)లో పడిపోయాను.క్షమించాలి.ఎలాగైనా ఈ సంవత్సరం లోపల ఆ బ్లాగుని ఉపయోగకరమైన విషయాలతో నింపుతాను.

సంస్కృతమూ ఇంగ్లీషూ రెండూ ఒకే భాషా కుటుంబానికి చెందినంత మాత్రాన వాటి పదాల మధ్య సంధి సమాసాలు సబబు కాదు.అలాంటి కార్యక్రమాన్ని సంస్కృత పండితులు గాని ఇంగ్లీషు పండితులు గాని అంగీకరించరు.అలాంటివి చెవులకి ఇంపుగా ఉన్నచోట అంగీకరిద్దాం.కాని దాన్నొక సాధారణ నియమం చెయ్యబూనుకోవడం అతివ్యాప్తి కిందకొస్తుంది.భాషలో ప్రయోగాలు తప్పవు.కాని కేవలం ప్రయోగాల కోసమే ప్రయోగాలు చెయ్యడం పిల్లచేష్ట అవుతుంది.

spandana said...

"బ్లాగు" ఆంగ్ల పదమా? blog అనేది ఆంగ్లపదం. "బ్లాగు" + "ఉత్సాహము" = "బ్లాగోత్సాహము" ఇందులో తప్పెక్కడ వుంది?

--ప్రసాద్
http://blog.charasala.com

త్రివిక్రమ్ Trivikram said...

తమ తమ అభిప్రాయాలను ఇక్కడ తెలియజేసిన రానారె, చావా కిరణ్, కొత్తపాళీ, రవి, సురేశ్ కొలిచాల, బాలసుబ్రహ్మణ్యం గార్లకు ధన్యవాదాలు. ఇక చరసాల గారి అనుమానం:
బ్లాగు+ఉత్సాహము=బ్లాగూత్సాహము అవుతుంది (సవర్ణదీర్ఘసంధి) ఇదైనా బ్లాగు అనే మాటను సంస్కృతపదంగా స్వీకరిస్తేనే! సంస్కృతసంధిసూత్రాల ప్రకారం బ్లాగోత్సాహాన్ని విడదీస్తే బ్లాగ+ఉత్సాహము (గుణసంధి) అవుతుంది. మనకు తెలిసిన రూపం బ్లాగు ఐతే ఈ బ్లాగ ఎక్కణ్ణించి వచ్చింది?
ఈ గొడవంతా లేకుండా ఈ రెండిట్లో ఏ ఒక్కటీ అచ్చతెలుగుపదం కానప్పటికీ ఈ రెండు పదాలనూ వాడుతున్నది తెలుగులో కాబట్టి సంస్కృతసంధుల జోలికి పోకుండా తెలుగు సంధిసూత్రాల ప్రకారం ముడిపెడితే బ్లాగు+ఉత్సాహము=బ్లాగుత్సాహము (ఉకారసంధి) అవుతుంది.
ఇక్కడ రెండూ సంస్కృతపదాలైతేనే సంస్కృతసంధి సూత్రాలు వర్తిస్తాయి. అలాగే రెండూ అచ్చతెలుగుపదాలైతేనే తెలుగుసంధిసూత్రాలు వర్తిస్తాయి. బ్లాగు అనేది అటు సంస్కృతపదమూ కాదు, ఇటు అచ్చతెలుగుపదమూ కాదు గాబట్టి ఈ సంధులేవీ చెల్లవు. ఇలాంటివాటినే దుస్సంధులు అంటారు.
"ఇక్కడ సంస్కృతం గొడవెందుకు?" అంటే ఉత్సాహం అనే పదాన్ని సంస్కృతం నుంచి తెచ్చుకున్నాం కాబట్టి, ఇంతకాలమూ ఇలా దిగుమతైన సంస్కృతపదాలన్నిటికీ తెలుగులో కూడా సంస్కృత నియమాలే (సంధులు-సమాసాలు) వర్తింపజేస్తూ వచ్చాం కాబట్టి.

Suresh Kolichala said...
This comment has been removed by the author.
Suresh Kolichala said...

ఉ-కార సవర్ణధీర్ఘ సంధి విషయంలో చాలా మంది పప్పులో కాలేస్తారు. "రమించువారెవరురా రఘూత్తమా నిను విన" అన్న త్యాగరాజ కృతిని "రఘోత్తమ నిను విన" అని తెలుగు బాగా తెలిసిన వారు కూడా పాడటం నేను విన్నాను.

Now to defend బ్లాగోత్సాహము: దంతః, అంతరః, బంధః అన్న సంస్కృత పదాలకు Dent-, inter-, bind అన్న ఇంగ్లీష్ పదాల సోదర పదాలైతే, blog అన్న ఇంగ్లీష్ పదానికి సంస్కృతంలో బ్లాగః సమాన పదమవ్వాలి కదా! కాబట్టి బ్లాగ + ఉత్సాహము = బ్లాగోత్సాహము :-).

రామః ని మనం రాము అని తెలుగులో వాడినట్టే, బ్లాగః ని మనం బ్లాగు అని తెలుగులో ముద్దుగా పిలుచుకోవచ్చు! మీ రేమంటారు?

oremuna said...

వర్తిక్ గారూ,

బాగు బాగు

సో మనము బ్లాగోత్సాహం అని వాడటము వ్యాకరణమే అంటారు :!


ఇంతకీ బస్టాపు ఏ సంధి?

బస్సు + స్టాపు = ????

Dr.Pen said...

"మన దేశంలో తెలుగు, సంస్కృతం, ఇంగ్లీషు అనే మూడుభాషలనీ తప్పించుకుని బ్రతకలేము కనుక ఇక్కడ భాష అంటే ఈ మూడు భాషలూ అని గ్రహించునది." -వేమూరి వేంకటేశ్వరరావు.

అలా పండితులు సూచించాక ఈ సంధి తికమక గురించి నా మూడు ముక్కలూ పరికించండి.

1.మొదట బ్లాగు అన్నది తెలుగు పదంగా తీసుకోవాలి.బ్లాగ్ అన్నది ఆంగ్ల పదమైనా మన 'బస్సు'లాగా ఇది కూడా తెనుగీకరించబడింది. మనం రోజూ వాడే కుర్చీ,జిల్లా,సర్కారు,కబుర్లు,ఖర్చు,జమాబందీ,కోస్తా లాగే మన భాషలో చేరిన కొత్త పదం కింద జమకట్టాలి(జమ-కూడా కొత్త పదమే).దవాఖానా అంటే ఇది తెలంగాణా వారు తెలుగుకు చేస్తున్న చేటు అనేవారు అవలీలగా 'ఆసుపత్రి' అంటారు(Hospital కు తెలుగు)

ఇలా పరభాషా(సంస్కృతం!) పదాలతో మన భాషను సంకరం చేయడానికి నేనూ వ్యతిరేకినే...కానీ భాష అన్నది ప్రవహించే నది లాంటిది.ఎన్నెన్నో పదాలతో అది పరిపుష్టమవుతుంది.అది మీరు,నేను చెప్తే ఆగదు.ఉదాహరణకు ఇప్పుడు ఆంగ్లంలో విరివిగా ఉపయోగించే 'గురు'(చూ.Net Guru),'పండిట్'(Instapundit), 'బ్రాహ్మిణ్'(చూ.Boston Brahmin),'యోగా' (చూ.American Yoga)ఎక్కడివి?

2.ఇక బ్లాగోత్సాహం/బ్లాగుత్సాహం కొస్తే నేను కూడా బ్లాగోత్సాహం అనే ఉపయోగించినట్టు గుర్తు.కానీ ఇప్పుడు ఆలోచిస్తే 'బ్లాగుత్సాహమే' సరైనదనిపిస్తోంది.నేనన్నట్టు బ్లాగు-ఉత్సాహము రెండు తెలుగు పదాలను చేసి, త్రివిక్రముడన్నట్టు 'ఉకార సంధి'సూత్రం అన్వయిస్తే ఉన్నంతలో ఇదే సబబుగా తోస్తోంది.

3.ఇక బ్లాగ:+ఉత్సాహము అన్నప్పుడు (రెండు పదాలు సంస్కృతం కింద తీసుకొని చూస్తే) విసర్గ సంధి ప్రకారం 'హ్రస్వ అకారము కూడిన విసర్గకు(గ:) హ్రస్వ 'అ'కారము పరమైతేనే 'ఓ'కారమాదేశమవుతుంది'...మరి ఇక్కడ మనకు ఉన్నది 'ఉ'కారము...మరి ఇదెట్లా కుదురుతుందబ్బా!

కాబట్టి మనకందరికీ ఇకపై 'బ్లాగుత్సాహమే' కలగాలని అనుకొంటున్నాను:-)

(ఇక 'సముదాయపందిరి' బదులు సురేష్ గారన్నట్టు 'రచ్చబండ' భేషుగ్గా ఉంటుంది. 'పిచ్చుకగూడు' కూడా ఆలోచింపదగినదే)

మరోమాట మన తెలుగుకు 'తేనెలొలుకు తెలుగు','Italian of the East' అన్న నానుడి వచ్చింది ప్రతి పదము ఒక అచ్చుతో అంతము అవుతుంది కాబట్టి కానీ మన పేర్లేమో...'సురేశ్','కిరణ్','ఇస్మాయిల్','త్రివిక్రమ్','వార్తిక్','ప్రసాద్'...ఇలా ఆశ్చర్యంగా లేదూ?
రానారె,రవి,బా.సు.గార్లవి మాత్రం అచ్చ తెలుగు పేర్లని అనగలమా?

రానారె said...

చావాగారికి,

Bus బస్సు, Stop స్టాపు గా మన పల్లెజనాలు మార్చినట్లే Bus stop అనేవి రెండు పదాలని తెలీకముందే అవి ఆగే స్థలానికి బస్టాపు అని అదే పల్లెజనాలు పేరుపెట్టేశారు అనుకొంటాను. ఔననిపిస్తోందా!?

త్రివిక్రమ్ Trivikram said...

కిరణ్,
రానారె చెప్పినట్లు బస్టాండు, బస్టాపు అనేవి bus stand (బస్ స్టాండ్->బస్టాండ్->బస్టాండు), bus stop (బస్ స్టాప్->బస్టాప్->బస్టాపు) సమాసాలను పదాల కింద విడగొట్టకుండా యథాతథంగా తెచ్చుకుని అజంతాలుగా మార్చడం వల్ల ఏర్పడినవనుకుంటా.

త్రివిక్రమ్ Trivikram said...

ఐ'స్మైల్ గారూ!
ఈ పేర్లన్నీ దేవలోకం నుంచి కిందకొచ్చి, తమ దివ్యత్వ చిహ్నమైన విసర్గాన్ని వింధ్యపర్వతాలకవతలివైపున పోగొట్టుకుని అక్కడే ఆగిపోయాయి. ఆ హలంతం హిందీ ప్రభావమన్నమాట. తెలుగుజాతీయవాది అంబానాథ్ గారి పెరైనా, నా పేరైనా అంతే! నా పేరు బాగుంది గదాని మురిసిపోవడమే తప్ప ఆ పేర్లను కొండలు దాటించిన అగస్త్యుడెవరో తెలుసుకోలేదు. :( కుండికాళ్ళు/కుంటికాళ్ళు, తిరుపాలు,...ఇలాంటివే 'అచ్చతెలుగు' పేర్లేమో? మన పేర్లను తెలుగీకరిస్తే ప్రథమావిభక్తి ప్రత్యయం 'డు' కలిసి త్రివిక్రముడు, ఇస్మాయిలుడు(బాగుందా?)...అవుతాయి.

రానారె said...

"కుండికాళ్ళు/కుంటికాళ్ళు, తిరుపాలు,...ఇలాంటివే 'అచ్చతెలుగు' పేర్లేమో? మన పేర్లను తెలుగీకరిస్తే ప్రథమావిభక్తి ప్రత్యయం 'డు' కలిసి త్రివిక్రముడు, ఇస్మాయిలుడు(బాగుందా?)...అవుతాయి." అన్నారు త్రివిక్రమ్. త్రివిక్రముడు బాగుంది. ఇస్మాయులుడు అనే కన్నా శ్రీరాములు అన్నట్టుగా ఇస్మాయిలు అని ఆపేస్తే పోలా? (ఇదంతా నా ఇష్టం కాదనుకోండి :)))

త్రివిక్రమ్ Trivikram said...

@రానారె:

త్రివిక్రముడు నాకు నచ్చింది - ఎవరూ వాడకపోయినా. అలాగే ఇస్మాయిలు కూడా బాగుంది. ఎక్కువగా వాడుకలో ఉండేది కూడా ఈ పేరే. డాక్టరుగారూ! మీరేమంటారు? :)

Dr.Pen said...

మా నాయనమ్మ నన్ను అలాగే పిలుస్తుంది మరి :-)