మీకు తెలుసా - జవహర్లాల్ నెహ్రూ తాను ప్రధానమంత్రిగా ఉన్నరోజుల్లో కడపజిల్లా బద్వేల్ తాలూకా పోరుమామిళ్ళ దగ్గరున్న సిద్ధవరం అగ్రహారం నుంచి తోలుబొమ్మలాట కళాకారులను ఢిల్లీకి ప్రత్యేకంగా పిలిపించుకుని ఆటాడించి అభినందించారని?
మామూలుగా అయితే ఈపాటికి కడప కడపోత్సవాలతో సందడిసందడిగా ఉండేది. కడప జిల్లాకు బాంబుల గడపగా, ఫ్యాక్షనిస్టుల గడ్డగా ఉన్న మచ్చను చెరిపేసి కడపకున్న భాషా, సాహిత్య, సాంస్కృతిక, చారిత్రక, ఆర్థిక ప్రాధాన్యతను చాటిచెప్పి 'ఇదీ మా కడప!' అని సగర్వంగా చెప్పుకునేలా చేసే వార్షిక సంబరాలు కడపోత్సవాలు. గత ఐదు సంవత్సరాలుగా జనవరి మూడో వారంలో కడపలో మూడురోజులపాటు జరుగుతూ వస్తున్నాయి.
ఘనమైన కడప ప్రాంత విశిష్టతలను చాటిచెప్పే వివిధ రకాల ప్రదర్శనలతో, అలనాటి విజయనగర భువనవిజయాన్ని గుర్తుకు తెచ్చే చర్చాగోష్టులతో సందడిగా ఉండవలసిన కడప గడప ఈసారి స్తబ్ధుగా ఉంది. కడపోత్సవాలు ఈసారి ఎందుకు నిర్వహించలేదని ఇద్దరు పురప్రముఖులను అడిగితే ముఖ్యమంత్రి ఈసారికి వద్దన్నాడని ఒకరు, కలెక్టరు ఆసక్తి చూపడం లేదని ఇంకొకరూ సమాధానం చెప్పారు. లోగుట్టు పెరుమాళ్ళకెరుక!
మీకు తెలుసా - ప్రపంచప్రఖ్యాత సురభినాటకసమాజం కడపజిల్లాలోని ఒక మారుమూల పల్లెటూళ్ళో పుట్టిందని?
తొలి తెలుగుశాసనం కడపజిల్లాలోనే బయల్పడిందని?
తెలుగులో తొలి స్వతంత్రకావ్యకర్త, ఆంధ్రకవితాపితామహుడు ఇక్కడివాడేనని?
తొలి తెలుగు కవయిత్రి తాళ్ళపాక తిమ్మక్క, సుప్రసిద్ధ కవయిత్రి మొల్ల ఇక్కడివారేనని?
అష్టదిగ్గజకవుల్లో నలుగురు కడపజిల్లావారేనని?
అన్నమయ్య, యోగివేమన, సామాజికతత్త్వవేత్త పోతులూరి వీరబ్రహ్మం మొదలైనవారంతా ఇక్కడివారేనని?
ఆంధ్రవాల్మీకి, వాసుదాసు వావిలికొలను సుబ్బారావు ఇక్కడివాడేనని?
అగణితప్రజ్ఞగల గణితబ్రహ్మ లక్కోజుసంజీవరాయశర్మ ఇక్కడివాడేనని?
సరస్వతీపుత్ర, శివతాండవకర్త పుట్టపర్తి నారాయణాచార్యులు, శివభారతకర్త గడియారం వెంకటశేషశాస్త్రి ఇక్కడివారేనని?
అవధానులకు ఇది ఆలవాలమని?
తెలుగుసూర్యుడు సి.పి.బ్రౌన్ స్థిరనివాసమేర్పరచుకుని, తెలుగుతేజాన్ని, వేమనశతకపు వెలుగులను ప్రపంచానికి చూపింది ఇక్కడినుంచేనని?
తొలి తెలుగుపత్రిక రాయవాచకం సంపాదకుడు, ఇల్లస్ట్రేటెడ్ వీక్లీకి సంపాదకుడైన తొలి భారతీయుడు బి.వి.రామన్ ఇక్కడివాడేనని?
సుప్రసిద్ధ సాహితీ విమర్శకుడు, అనువాదకుడు, పత్రికా సంపాదకుడు రా.రా. ఇక్కడివాడేనని?
సుప్రసిద్ధ కవి, పాత్రికేయుడు గజ్జెల మల్లారెడ్డి ఇక్కడివాడేనని?
తెలుగుసినిమా స్వర్ణయుగపు ధృవతారలు బి.ఎన్.రెడ్డి, నాగిరెడ్డి ఇక్కడివారేనని?
సుప్రసిద్ధ కథారచయితలు కేతు విశ్వనాథరెడ్డి, సొదుం జయరాం, సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి, దాదాహయత్ మొదలైన వారు ఇక్కడివారేనని?
తిరుమలేశుని తొలిగడప ఇక్కడుందని?
భౌగోళికంగా దక్కన్ పీఠభూమి ఆవిర్భావానికి మూలం ఇక్కడేనని?
భారతదేశంలో హనుమంతుడు లేని ఏకైక రామాలయం ఇక్కడుందని?