Sunday 24 December, 2006

కలలు నిజమాయె(నా?)

సాధారణంగా మనం వింటూ ఉంటాం: మన ఇతిహాసాల్లో - ముఖ్యంగా మహాభారతంలో - రాసినవి "నిజంగా జరిగి ఉంటే అద్భుతం. జరగనట్లైతే వాటిని ఊహించగలిగిన కవుల కల్పన మహాద్భుతం." అని.

ఈ రోజు ఈనాడు ఆదివారంలో వచ్చిన ఒక వ్యాసంలోని కొన్ని అంశాలు:
రామాయణంలో రావణాసురుడికి పుష్పక విమానం ఉండేది. అది ఏవియేషన్‌... అనగా ఆకాశయానం! తన కంటే ముందు కుంతికి కొడుకు పుట్టాడనే ఆక్రోశంతో గర్భవిచ్ఛిత్తికి పాల్పడింది గాంధారి. ఛిద్రమైన పిండాన్ని వ్యాసుడి సూచనతో కుండల్లో పెట్టి జాగ్రత్తచేశారు. అలా పుట్టినవారే కౌరవులు. వాళ్లని టెస్ట్‌ట్యూబ్‌ బేబీలనొచ్చా?

అనకూడదు. టెస్ట్ ట్యూబ్ బేబీలనేది పూర్తిగా వేరే వ్యవహారం. ఇక్కడ కౌరవుల పిండం ఏర్పడడంలో సాంకేతికత ప్రమేయమేమీ లేదు. గాంధారి గర్భధారణ మామూలుగానే జరిగింది. ఐతే కౌరవులు పూర్తిస్థాయిలో పిండం ఎదగకుండానే పుట్టినవాళ్ళు. అంటే ప్రీ మెచ్యూర్ బేబీలన్నమాట. వాళ్లను నేతికుండల్లో పెట్టి పెంచారు. ఆ నేతి కుండలను నేటి ఇన్‌క్యుబేటర్లతో పోల్చవచ్చు.

ఐతే మహాభారతంలోనే అంతకు రెండు తరాల ముందు పుట్టిన టెస్ట్ ట్యూబ్ బేబీ ఒకరున్నారున్నారండోయ్! ఆయనే ద్రోణుడు. ఆ ద్రోణుణ్ణే దానవీరశూరకర్ణ సినిమాలో "నీచమైన మట్టికుండలో పుట్టితివికదా?" అని ఈసడిస్తాడు దుర్యోధనుడు. ద్రోణుడికంటే ముందు అదే పద్ధతిలో పుట్టినవాళ్ళు అగస్త్యుడు, వసిష్ఠుడు. ఇద్దరికిద్దరూ గొప్ప ఋషులు. ఈ వసిష్ఠుడు రఘువంశానికి కులగురువు. అగస్త్యుని గురించి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి.



వినాయకుడికి ఏనుగు తల అతికించాడు శివుడు... ఇది ప్లాస్టిక్‌సర్జరీ. ప్రస్తుతానికి తలలు మార్చలేం కానీ తెగినవేళ్లూ కాళ్లూ అతికించే దశలో ఉన్నాం. మంచి అభివృద్ధే!

అబ్బా...? అలాగా?!

మన పురాణాలన్నిట్లో కనిపించే మాయమవడం, ప్రత్యక్షమవడం, అణిమాది అష్టసిద్ధులూ... అన్నీ కథలూ, కల్పితాలేనంటారా. మరీ అంత తొందరపడి కొట్టిపారేయకండి.

చిత్తం!

3 comments:

Anonymous said...

అవన్నీ కల్పితాలూ, ఊహలూ అని భావించకపోతే రామేశ్వరం నుండీ కొలంభోకి ఒక్క ఉదుటున ఎగరగలిగిన కోతులప్పుడు వున్నాయనీ అనుకోవాలి. లేదంటే రేపెప్పుడో భవిష్యత్తులో వీపుకు రాకెట్ కట్టుకుని ఎవడైనా ఎగిరాడనుకోండి..వెవ్వెవ్వె మాకిది ముందే తెలుసు మా హనుమంతుడు ఇక్కడి నుంచీ అక్కడికి మా రామాయణ కాలంలోనే ఎగిరాడోచ్ అనొచ్చు.
అలాగే రేపెప్పుడో నీళ్ళమీద తేలే ఫైబర్ బ్రిడ్జి నిర్మించితే .. ఒచోచ్ మా రాముడదెప్పుడో కట్టాడని కోతలు కోయొచ్చు.

ఇంకా పసర్లు కాలికి పూసుకొని హిమాలయాల్లో తేలడం లాంటి విద్యలను ఆధునిక మానవుడు ఎప్పటికి తెలుసుకుంటాడు..ఒకవేళ ఇంకో సహస్రాబ్దికి తెలుసుకున్నా ...ఇంతేనా ఇది మాకెప్పుడో తెలుసు అనికూడా అనొచ్చు.

మన వూహాకల్పితాల సంపద మనకు వేల ఏళ్ళ భవిష్యత్తులో జరగబోయే అభివృద్దిని ఎద్దేవా చేయడానికి పుష్కలంగా వుంది.

ఇంకా ఆధునిక మానవుడు ఎముకతో అరివీర భయంకర ఆయుధం తయారుచేయడం నేర్చుకోవాల్సి వుంది. హిమాలయాల్లో మంచు పర్వాతాలపిన కేవలం జంతు చర్మం కప్పుకొని నివసించడం నేర్చుకోవాల్సి వుంది...అబ్బో ఇంకా ఎన్నో..మన పూర్వీకులు ఎప్పుడొ సాధించినవి.. ఇప్పుడు ఇంకా తెలియనివి...
--ప్రసాద్
http://blog.charasala.com

Anonymous said...

:D
ఈ సరదా ఊహలు, కల్పితాల మధ్య ఉండదగ్గవాడు కాదు చరిత్ర ప్రసిద్ధి గాంచిన సుశ్రుతుడు. అందుకే ఆయన ప్రస్తావన తీసివేస్తున్నాను. టెస్ట్ ట్యూబ్ బేబీలంటే ఏంటో తెలియని అజ్ఞాని ఆ వ్యాసం రాశాడు. ఆ తేడా చెప్పడం కోసం మొదలుపెడితే ఆ టపా అక్కడితో ఆగక ఇంకొంచెం ముందుకెళ్ళిపోయింది. టెస్ట్ ట్యూబ్ లలో కృత్రిమంగా ఫలదీకరణ చెందించగా ఏర్పడ్డ పిండాన్ని గర్భాశయంలో ప్రవేశపెడతారు. ఆ రకంగా పుట్టినవాళ్ళు టెస్ట్ ట్యూబ్ బేబీలు. ఆ తేడా తెలపడం కోసం కుంభసంభవుల గురించి రాశాను. మన ఇతిహాసాల విషయంలో నా అభిప్రాయమేమిటంటే "వాస్తవం కొంత, కల్పన కొండంత". కౌరవులు వందమంది అనడమే అతిశయోక్తి. దాన్ని సమర్థించడం కోసం ఒక ఊహ: ఒకే పిండం నూటొక్క ముక్కలైందని. నమ్మేవాళ్ళుంటే అశోక చక్రవర్తి సోదరులు కూడా 99 మందని, వాళ్ళందరినీ చంపి ఆయన రాజయ్యాడని కొన్ని బౌద్ధ కథలు (దీపవంశ, మహావంశ) చెప్తాయి. తారానాథుడనే బౌద్ధ లామా ప్రకారం ఆయన తన ఆరుగురు సోదరులను వధించాడని. ఒక వాస్తవాన్ని ఆధారంగా చేసుకుని ఎవరికి తోచిన కథలు వాళ్ళు అల్లేశారు. క్రీస్తు పూర్వం ఏర్పడిన ఒక సంపూర్ణసూర్యగ్రహణాన్ని చూసి సైంధవుడి కథ అలాగే అల్లారు - కృష్ణుడు సూర్యుడికి తన చక్రాన్ని అడ్డేశాడని. ఇవన్నీ కల్పనలనుకోకపోతే..?? అంతేమరి!

Anonymous said...

త్రివిక్రమ్ గారు
మీకు అవకాశం దొరికి చదవాలని ఉత్సాహం ఉంటే రమేష్ మెనన్ గారి "Ramayana: a modern rendering of great Indian epic" and "Mahabharatha: a modern rendering" పుస్తకాలు చదవండి. (Rupa publishers)

నేను ప్రస్తుతం రామాయణం చదువుతున్నా, (హైదరాబాద్ నుంచి మహాభారతం కూడా తెప్పించే ప్రయత్నంలో ఉన్నా)