Thursday 21 December, 2006

ఎట్టకేలకు జెస్సికాకు న్యాయం

మను శర్మకు జీవిత ఖైదు: ఢిల్లీ హైకోర్టు తీర్పు
వికాస్ యాదవ్, టోనీలకు నాలుగేళ్ల జైలు, ఎదురు తిరిగిన సాక్షులకు నోటీసులు


మోడల్ జెస్సికాలాల్ హత్య కేసులో ఎట్టకేలకు న్యాయం గెలిచింది. ప్రజాస్వామ్య సౌధానికి గల నాలుగు మూలస్థంభాల్లో (Executive, Judiciary, Legislature and The Media) రెండు - మీడియా, న్యాయవ్యవస్థ - సమర్థవంతంగా, బాధ్యతాయుతంగా పనిచేసి కాస్త ఆలస్యంగానైనా న్యాయాన్ని నిలిపిన ఘట్టమిది.

ఒక రెస్టారెంట్లో పని చేస్తున్న జెస్సికా లాల్ ను తుపాకితో కాల్చిచంపిన మను శర్మకు ఢిల్లీ హైకోర్టు బుధవారం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 1999 ఏప్రిల్ 29వ తేదీ రాత్రి తానడిగిన మద్యపానీయం రెస్టారెంట్లో లేదని అన్నందుకు అతడు జెస్సికా లాల్‌ను కాల్చిచంపాడని అభియోగం. ''ఇది సమాజపు అంతరాత్మను కదిలించిన కేసే. అయినప్పటికీ మను శర్మకు గరిష్ఠ శిక్ష (ఉరి) విధించలేం. దీనిని అత్యంత అరుదైన కేసుగా భావించలేం'' అని జస్టిస్ ఆర్.ఎస్.సోధీ, జస్టిస్ పి.కె.భాసిన్లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఈ కేసులో సాక్ష్యాలను నాశనం చేసేందుకు ప్రయత్నించిన వికాస్ యాదవ్, అమర్‌దీప్‌సింగ్ గిల్ (టోనీ)లకు నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.2,000 చొప్పున జరిమానా విధించింది.

నటుడు శ్యాన్ మున్షీ, వ్యాపారవేత్త ఆండ్లీబ్ సెహగల్ సహా ఎదురు తిరిగిన 32 మంది సాక్షులకు నోటీసులు జారీ చేసింది. మొదట ఇచ్చిన సాక్ష్యాన్ని మార్చడంపై వారు కోర్టుకు సరైన వివరణ ఇవ్వలేని పక్షంలో వారిని కూడా ప్రాసిక్యూట్ చేసే అవకాశాలున్నాయి. మను శర్మ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వినోద్ శర్మ కుమారుడు కాగా వికాస్ యాదవ్ ఉత్తరప్రదేశ్‌కు చెందిన వివాదాస్పద నేత డి.పి.యాదవ్ కుమారుడు. కింది కోర్టు ఈ కేసులో అతణ్ని నిర్దోషిగా ప్రకటించడంపై గతంలో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. జెస్సికాకు న్యాయం జరగాలంటూ ఒక టీవీ ఛానల్‌కు లక్షలాది ఎస్ఎంఎస్‌లు వచ్చిపడ్డాయి.

మను శర్మ ఇంతకుముందెప్పుడూ ఎలాంటి నేరాలూ చేయనందువల్ల అతడికి తక్కువ శిక్ష విధించాలని అంతకుముందు ఆయన కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అయితే కోర్టు ఈ అభ్యర్థనను తోసిపుచ్చింది. టోనీ ఒక బహుళ జాతి సంస్థలో పని చేస్తున్నందున అతడిపై కరుణ చూపాలని న్యాయవాది కోరగా బెంచ్ ఆగ్రహంగా స్పందించింది. ''ఇలాంటి వాదన చేయడం నీకు వ్యతిరేకంగా పరిణమిస్తుంది'' అని వ్యాఖ్యానించింది.

ఈ కేసులో దోషులకు శిక్ష పడడం సంతోషంగా ఉందని జెస్సికా సోదరి సబ్రినా లాల్ చెప్పారు. మను శర్మకు మరణ శిక్ష పడాలని తానెప్పుడూ కోరుకోలేదన్నారు. ''మరణ శిక్ష పట్ల నాకు నమ్మకం లేదు. నా సోదరిని చంపినందుకు శిక్ష అనుభవించాల్సింది మను శర్మే. అంతేగానీ అతడి మరణం ద్వారా అతడి కుటుంబ సభ్యులు బాధపడాలని నేను కోరుకోవడం లేదు'' అని చెప్పారు. హైకోర్టు తీర్పు పటిష్ఠంగా ఉందని, సుప్రీంకోర్టు కూడా దానిని సమర్థిస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ఒకరికి శిక్ష పడడం తనకెప్పుడూ సంతోషం కాదని ఈ కేసులో సాక్షి అయిన బినా రమణి అన్నారు. ఈ కేసులో శిక్ష పడిన వికాస్ యాదవ్... నితీశ్ కతారా హత్య కేసులో కూడా నిందితుడిగా ఉన్నాడు. కోర్టు తీర్పుపై కతారా తల్లి నీలం హర్షం వ్యక్తం చేశారు. జెస్సికా కుటుంబం న్యాయం కోసం చాలాకాలం ఎదురుచూడాల్సి వచ్చిందని ఆమె అన్నారు. ఈ తీర్పు వల్ల న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వాసం బలపడిందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి వి.ఎన్.ఖరే వ్యాఖ్యానించారు. ఎదురు తిరిగిన సాక్షులకు నోటీసులివ్వడమనే కొత్త సంప్రదాయాన్ని ఆయన స్వాగతించారు.

(ఈనాడులో వచ్చిన వార్త ఆధారంగా)

4 comments:

రానారె said...
This comment has been removed by the author.
రానారె said...

శుభవార్త. సంతోష్ కుమార్ సింగ్ ని మాత్రం ఉరితీయాలి. ఎందుకంటే కిరాతకుడు, ఉన్మాదియైన కుమారుని రక్షించుకోవడానికి బాధ్యతాయుతమైన అధికారాన్ని దుర్వినియోగపరచిన ఆ తండ్రికి పుత్రశోకమే సరైన శిక్ష.
అప్పుడే ప్రియదర్శిని కేసులో న్యాయం జరిగినట్లు. భారతదేశ న్యాయ వ్యవస్థ సజీవంగా వుందని సామాన్యునికి నమ్మిక కలిగాలంటే ఇది జరగాలి.

spandana said...

ఆరు నెలల జైలు శిక్ష లేదా 2000 జరిమానా.... ఏంటిదసలు? ఇలాంటివి చదివినపుడు రక్తం ఊడికిపోతుంది. అంటే ఏమిటి 2000 రూపాయల డబ్బున్నవాడు దర్జాగా శిక్ష తప్పించుకోవచ్చనేగా? అయినా ఒక చిన్న పార్టీకే 2000ల రూపాయలు ఖర్చవుతున్న రోజుల్లో బుద్దిమాలిన ఈ క్లాజులేంటి? రెండువేల రూపాయల డబ్బుకూడా లేని వాడు అతి నిరుపేద అయివుండాలి, మరి అలాంటివాడికి ఆరు నెలల జైలు శిక్షా? డబ్బున్న వాడికీ లేని వాడికి వివిధ రకాల శిక్షలు అని చెప్పడమే ఇలాంటి క్లాజుల లక్ష్యంగా కనిపిస్తోంది.

--ప్రసాద్
http://blog.charasala.com

త్రివిక్రమ్ Trivikram said...

"చట్టం ముందు అందరూ సమానులే" అని గొప్పగా ఆదర్శాలు వల్లిస్తాం గానీ మన చట్టాల్లో అన్నిరకాల అసమానతలూ ఉన్నాయండీ! మీరు ఎత్తిచూపినట్లు ఉన్నవారికీ, లేనివారికీ వేర్వేరుగా న్యాయం చెప్పడమేగాక ఆడవాళ్ళకొక న్యాయం - మగవాళ్ళకొక న్యాయం (సెక్షను నంబరు గుర్తులేదుగానీ మన శిక్షాస్మృతిలోని ఒక సెక్షను ప్రకారం భర్త అనుమతితో ఎవరైనా వాడి భార్యతో శృంగారం చేయవచ్చు. తన అనుమతి లేకుండా ఎవరైనా తన భార్యతో శృంగారం జరిపినట్లు తెలిస్తే ఆ భర్త వారిమీద కేసుపెట్టి పరిహారం కూడా పొందవచ్చు. ఇక్కడ భర్త అనుమతే ముఖ్యం గానీ భార్య మనోభావాలను (ఈ శృంగారం ఆమె ఇష్టప్రకారం జరిగిందా లేక ఆమెకు ఇష్టం లేకుండానా అనేది) చట్టం కూడా గుర్తించదు. దారుణమైన విషయం ఏమిటంటే భర్తకు తన భార్య మీద ఉన్న ఈ "హక్కులు" భార్యకు తన భర్త మీద లేవు.) ఒక్కో మతం వారికి ఒక్కో న్యాయం ఉన్న విషయం తెలిసిందే! నిదానంగా ఆలోచిస్తే ఈ జెస్సికాలాల్ కేసులోనైనా ఆమె ఒక మోడల్ కాబట్టి మీడియా అంత హడావుడి చేసింది కానీ ఆమె ఒక దిక్కులేని పక్షి అయి ఉన్నట్లైతే న్యాయం జరిగేదా అని కూడా అనిపిస్తుంది.