Sunday 22 October, 2006

కడప జిల్లా-మౌలిక సదుపాయాలు

రాష్ట్రంలో విమనయాన సౌకర్యాల అభివృద్ధి ఆవశ్యకతను నొక్కిచెప్పిన తెలుగు జాతీయవాది బ్లాగులో కడప, పుట్టపర్తి విమానాశ్రయాల ప్రస్తావనే లేదు. ఇక ఆంధ్రప్రగతి బ్లాగులోనేమో కడపలో ఏర్పాటు కానున్నది "క్రొత్త" విమానాశ్రయమని ఉంది. కానీ వాస్తవమేమిటంటే రాష్ట్రంలో దొనకొండ విమానాశ్రయం తర్వాత నిర్మించబడిన రెండో అతి ప్రాచీన విమానాశ్రయం కడపలో ఉండేది. దురదృష్టవశాత్తూ అది తెలుగువాడైన పి.వి.నరసింహారావు హయాంలోనే మూతపడింది. ఇప్పుడు దక్కన్ ఎయిర్‌లైన్స్ సహకారంతో అదే విమానాశ్రయాన్ని తెరిపించే ప్రయత్నాలు జరుగుతున్నాయే తప్ప అక్కడ ఏర్పాటు కానున్నది క్రొత్త విమానాశ్రయం కాదు.

విమానాలతో పోల్చుకుంటే ఆర్థికంగాను, భౌగోళికంగాను ఎక్కువమందికి అందుబాటులో ఉండేవి; ప్రయాణీకులను, భారీ వస్తుసామగ్రిని చౌకగా తరలించడానికి ఉపయోగపడేవి రైలు మార్గాలే. అభివృద్ధికి జీవనాడులు రైలు మార్గాలు. రాష్ట్రంలో మొట్టమొదట రైల్వే సౌకర్యం కల్పించబడిన జిల్లాకేంద్రం కడప. అది నాటికీ, నేటికీ దేశంలోని అతిప్రధానమైన రైల్వే మార్గాల్లో ఒకటైన ముంబై-చెన్నై మార్గంలో ఉండడమే దానికి కారణం. రైల్వే కోడూరు, రైల్వే కొండాపురం లాంటి పేర్లు గల ఊర్లు కడప జిల్లాలోనే ఆ మార్గం లోనే ఉన్నాయి. ఐతే అంత ముఖ్యమైన మార్గం కూడా నాటికీ, నేటికీ ఎదుగూబొదుగూ లేకుండా అలాగే ఉంది. ఇప్పటికీ ఒక ఎక్స్‌ప్రెస్ రైలు వస్తోందంటే ఆ మార్గంలో తిరిగే రైళ్ళన్నిటినీ ఎక్కడివక్కడ ఆపేసి దారి వదలాల్సిందే. ఇప్పటికీ ఆ మార్గంలో పొగబండ్లే తప్ప ఎలెక్ట్రిక్ రైళ్ళు నడవలేవు. ఆ ఒక్క మార్గం తప్ప జిల్లాలో మరో రైలుమార్గమే లేదు. బంగారు-వెండి నగలు, వస్త్రవ్యాపారంలో రెండో బొంబాయిగా ప్రసిద్ధిపొందిన ప్రొదుటూరుకు రైల్వే సౌకర్యం లేదు. ఎర్రగుంట్ల-నంద్యాల మార్గం నిర్మించాలనే శతాబ్దం నాటి ప్రతిపాదనలు ఇప్పుడిప్పుడే కార్యరూపం దాలుస్తున్నాయి.

(వీటన్నిటికీ మూలకారణం ఇక్కడి ప్రజాప్రతినిధుల అలవిమాలిన అలసత్వమే. వాళ్ళకు స్వప్రయోజనాలే తప్ప అభివృద్ధి పట్టలేదు. ఒక్కొక్కరూ నాలుగేసి సార్లు పార్లమెంటు సభ్యులుగా ఉండి, రైల్వే బడ్జెట్లో ప్రతిసారీ కడపజిల్లాలోని రైల్వే ప్రాజెక్టులకు కేటాయించబడిన నిధులు వేరే రాష్ట్రాలకు తరలిపోతుంటే మౌనప్రేక్షకుల్లా చూస్తూండిపోయారే తప్ప ఏనాడూ పార్లమెంటులోగానీ, ఇతర వేదికలపైగానీ నోరెత్తిన పాపానపోలేదు. వారిలో ఒకరు పార్లమెంటులో రైల్వే స్టాండింగ్ కమిటీ సభ్యులు కూడా!)

ఇంకో శుభపరిణామం(తెలుగువీరుడు ప్రస్తావించనిది) ఏమిటంటే రాష్ట్రంలో తొలిసారిగా ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో ఒక రైల్వేలైను నిర్మాణానికి నాంది పలికారు. 588 కోట్ల అంచనా వ్యయంతో కృష్ణపట్నం-ఓబులవారిపల్లె రైలు మార్గం నిర్మించడానికి రైల్ వికాస్ నిగం లిమిటెడ్, రాష్ట్రప్రభుత్వం, కృష్ణపట్నం పోర్టు కంపెనీ, ఎన్.ఎం.డీ.సీ. ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ లైనుతో కృష్ణపట్నం నుంచి ముంబై వరకు నేరుగా రైళ్ళు నడుస్తాయి. హోస్పేట్-బళ్ళారి ప్రాంత ఖనిజాలు కృష్ణపట్నం రేవుకు, ముడి ఇనుము చెన్నై రేవుకు నేరుగా చేరడానికి అవకాశముంటుంది.


అన్నట్లు నవంబర్ 14 నాటికల్లా కడప జిల్లాలో ఒక్క బాలకార్మికుడు కూడా ఉండరట. ఆ ఘనత సాధించిన మొట్టమొదటి జిల్లా ఇదే కాబోతోంది. అందుకోసం జిల్లాలో అధికారుల లెక్కల ప్రకారమే ఉన్న ఐదువేల పైచిలుకు బాలకార్మికులను ఈలోపల "హాంఫట్" చెయ్యడానికి అధికారులు ఎన్ని తిప్పలు పడాలో మరి :(

2 comments:

Anonymous said...

కడప విమానాశ్రయం గురించి ప్రస్తావించకపోవడం తప్పే.కడపకి చెయ్యాల్సింది కూడా ఇంకా చాలా మిగిలిపోయింది.కాని కర్నూలుతో పోలిస్తే అది ఇప్పుడు చాలా మేలు.అందుకనే కర్నూలు విషయం ప్రత్యేకంగా ప్రస్తావించాను.ఆంధ్రదేశానికి ఒకప్పటి రాజధాని, రాయలసీమ నగరాలన్నింటిలోకి పెద్దదీ అయిన కర్నూలికి తగిన న్యాయం జరగట్లేదనేదే నా బాధ.విద్యాకేంద్రమైన కర్నూలికి ఒక విశ్వవిద్యాలయం అవసరం.ఒక మంచి విమానాశ్రయం కూడా అవసరం.పైగా హైదరాబాదు నగరంతో ఏ ఇతర నగరానికీ లేనంత అనుబంధం కర్నూలికి ఉందంటే అతిశయోక్తి కాదనుకుంటాను. రాయలసీమ సోదరులు కర్నూలు అభివృద్ధికి సహరించాలని కోరుకుంటున్నాను.

Anonymous said...

ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. మీరన్నది నిజమే. సమాజంలో 99 శాతం ఉన్న సామాన్యుల కోసం రైలు బస్సు సౌకర్యాల ఇతోధిక విస్తరణపై దృష్టి పెట్టాల్సిందే.కాని ఆ 99 మందిని పోషించే శక్తి గల ఒక్క శాతం మంది అవసరాలని నిర్లక్ష్యం చెయ్యడమంటే నూటికి నూరు శాతం సమాజాన్నే నిర్లక్ష్యం చెయ్యడం క్రిందికి వస్తుంది.రవాణా సాధనాల్లో దేని పరిమిత ప్రాధాన్యం దానికుంది.దేని మార్కెట్ దానికుంటుంది. దేని ఉద్యోగావకాశాల విస్తృతి దానికుంటుంది. జిల్లా కేంద్రాల్లో స్థానిక విమానాశ్రయాల నిర్మాణాన్ని మనం డిమాండ్ చేస్తున్నామంటే ఉన్న రైలు మార్గాల్ని పెరికెయ్యమని కాదు. బస్సులు రద్దు చెయ్యమనీ కాదు.లేదా వాటి ప్రస్తుత బడ్జెట్లలో కోత విధించమనీ కాదు. మనవాళ్ళు చైనాని చూసైనా నేర్చుకోవాలి. 2010 నాటికి కొత్తగా 184 విమానాశ్రయాలు నిర్మించాలని చైనా లక్ష్యంగా పెట్టుకుంది. ఇంతా చేసి చైనాలో దేశీ ధనికులెవరూ లేరు. మన దగ్గర అసలు అలాంటి ప్రణాళికలే శూన్యం.దేశాన్ని ఆధునీకరించాలని చెబితే ఇక్కడ అందరూ అమాంతంగా గాంధేయవాదులూ సోషలిస్టులూ అయిపోయి విరుచుకుపడతారు. కంప్యూటర్లు ప్రవేశపెడతామని రాజీవ్‌గాంధి అన్నప్పుడు దేశమంతా రచ్చ రభస అయింది కొన్నిరోజులు. మనంతట మనం మార్పుని ఆహ్వానించడం అరుదు. ఆ మార్పుని ఎవరో మన నెత్తిన బలవంతంగా రుద్దితేనే మనం దాన్ని అంగీకరిస్తాం. ఇది మన జాతి మనస్తత్వం.