Wednesday 13 September, 2006

ఒక అందమైన సాయంత్రం:

ఈ సాయంత్రం నాకు చాలా ఉత్సాహాన్నిచ్చింది. దానికి కారణం ఇంటర్నెట్లో తెలుగు గురించి తెలిస్తే ప్రజల్లో ఎంతటి ఆసక్తి కలుగుతుందో ప్రత్యక్షంగా తెలియడం; పుట్టపర్తివారికి జరిగిన అపచారానికి హైదరాబాదులోని సాహిత్యాభిమానులు, ప్రముఖులు ఒకేలా స్పందించడం. ఐతే మనం వాడే భాష విషయంలో పాటించవలసిన జాగ్రత్తలతో తయారు చేసిన ప్రతిజ్ఞ గురించి మాత్రం తక్షణ స్పందన తెలియలేదు. దానికి ఇంకా సమయం పడుతుంది. అసలేం జరిగిందంటే:

నిన్న ఉదయం నాకొక ఈమెయిల్ వచ్చింది. సాహిత్య, కళారంగాల్లోని ప్రముఖులకు ఈ సాయంత్రం తెలుగు విశ్వవిద్యాలయంలో జరగనున్న సన్మాన కార్యక్రమానికి రావలసిందని. పంపినవారు బహుమతిగ్రహీతల్లో ఒకరైన ప్రముఖ రచయిత 'వసుంధర '.

దాంతో నాకొక ఆలోచన వచ్చింది: పుట్టపర్తివారికి జరిగిన అపచారాన్ని నిరసిస్తూ తెలుగుబ్లాగరుల తరపున చదువరిగారు తయారుచేసిన పిటీషను గురించి, తెలుగుబ్లాగులు, తెవికీల గురించి నలుగురికీ తెలియజెప్పడానికి ఈ సమావేశాన్ని ఒక వేదికగా వాడుకుంటే ఎలా ఉంటుందని. నేనీ విషయం ప్రస్తావించిందే తడవుగా చదువరిగారు ఆఘమేఘాల మీద 300 కరపత్రాలు తీసి నాకు అందజేశారు. (పిటీషను 100 ప్రతులు, తెలుగుబ్లాగులు, తెవికీల పరిచయవాక్యాలు 100 ప్రతులు, భాష విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించిన ప్రతిజ్ఞ 100 ప్రతులు). నేను వాటినందుకుని సమావేశస్థలికి చేరుకుని వచ్చినవారందరికీ పంచడం మొదలుపెట్టాను.

"ఇంటర్నెట్లో తెలుగు..." అని వాసన తగలగానే అక్కడున్న విద్యార్థులంతా ఆసక్తిగా వివరాలడగడం ప్రారంభించారు. నేను చెబుతూండగా అటుగా వచ్చిన విలేకరి ఒకరు నా గురించి వివరాలడిగారు. నేనీ పని తెలుగుబ్లాగరుల తరపున చేస్తున్నాని తెలుపగా, ఆయన తెలుగు బ్లాగరులు తయారు చేసిన వివరాలకు, ప్రతిజ్ఞకు తనకున్న పరిచయాల ద్వారా విస్తృతప్రచారం చేయిస్తానని అడక్కుండానే ముందుకు రావడమేగాక రాష్ట్రవ్యాప్తంగా తెలుగు భాష పట్ల స్పృహ ఒక ఉద్యమ స్థాయిలో రావాలని, ఏబీకేప్రసాద్ లాంటివాళ్ళ సహకారంతో అందుకు తగిన కార్యక్రమాలు రూపొందించుకుని అమలు చేయాలని అనడమేగాక బ్లాగరుల సమావేశాలకు వస్తాననీ, పత్రికల్లో (కనీసం తమ పత్రిక ఆంధ్రప్రభలో) బ్లాగుల గురించి, ఇంటర్నెట్లో తెలుగు వ్యాప్తి గురించి మనం రాసినవి ప్రచురింపజేస్తానని అన్నారు. ప్రసారమాధ్యమాల్లో తెలుగు దీనస్థితి గురించి కూడా నా అభిప్రాయంతో ఆయన ఏకీభవించారు.

విద్యార్థులు కానివాళ్ళు పుట్టపర్తి వారికి జరిగిన అపచారానికి ఆగ్రహం వ్యక్తం చేయడమేగాక మనం చేస్తున్న పనిని అభినందించారు. విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుల ఛాంబర్లో కరపత్రాలు అందజేసి విశ్వవిద్యాలయంలోని అన్ని విభాగాలకు వాటి ప్రతులను పంపించమని అక్కడివారిని కోరాను. వారు విషయం తెలుసుకుని సంతోషించి సభకు వచ్చినవారందరికీ వెంటనే పంచెయ్యమని ప్రోత్సహించారు. త్వరలోనే కరపత్రాలన్నీ అయిపోయాయి. ఇంకో వందేసి ప్రతులు తీసుకువచ్చి ఉంటే బాగుండేదనిపించింది.

ఇక సభలో ముందుగా మాట్లాడిన వేటూరి సుందరరామమూర్తి మాట్లాడిన తీరు చూస్తే ఆయన పుట్టపర్తివారికి జరిగిన అపచారాన్ని మంత్రిగారి సమక్షంలో అందరికీ ఎత్తిచూపడానికే సభకు వచ్చినట్లు నాకు అనిపించింది. ఆయన ప్రొద్దుటూరు గురించి చెబుతూ "ఇద్దరు మహాకవుల విగ్రహాలు గల ఊరు ప్రొద్దుటూరు." అని చెప్పారు. ఆ ఇద్దరూ శివతాండవకర్త పుట్టపర్తి, శివభారతకర్త గడియారం వెంకటశేషశాస్త్రి. తర్వాత మాట్లాడిన మంత్రి రోశయ్య కూడా "ఇంతటి అపచారానికి పాల్పడినవారెవరో నాకు తెలియదు గానీ (తెలియకపోతే తెలుసుకోండి సార్! పూర్తిపేరు నంద్యాల వరదరాజుల రెడ్డి. వరుసగా నాలుగోసారి శాసనసభ్యత్వం వెలగబెడుతున్నాడు.) ఎవరు చేసినా ఇది చాలా నీచమైన పని." అని కాసేపు తిట్టి తప్పనిసరిగా దీన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్ళి, అక్కడ పుట్టపర్తివారి ఒక్క విగ్రహమే ఉండేలా చూస్తానన్నారు. తమ పిల్లల చేత మమ్మీ, డాడీ అని పిలిపించుకోవాలని ఉబలాటపడేవాళ్ళను రోశయ్య సున్నితంగా విమర్శించారు.

అది విన్న నాకు ఈ మధ్యే ఒకసారి FM రేడియోలో నేను విన్న సంభాషణ గుర్తొచ్చింది:

లంగరమ్మ (అక్కినేని నాగేశ్వరరావుతో): మీ పిల్లలు, మనవలు మిమ్మల్ని ఏమని పిలుస్తారు?
అక్కినేని: అమ్మ-నాన్న, అమ్మమ్మ-తాతయ్య.
లంగరమ్మ: ఒకవేళ ఎవరైనా మమ్మీ-డాడీ అనో, గ్రాండ్మా-గ్రాండ్పా అనో పిలిస్తే?
అక్కినేని (తీవ్రంగా): దవడ పగిలిపోతుంది.

పుట్టపర్తి సర్కిల్ లో పుట్టపర్తివారి ఒక్క విగ్రహమే ఉండేలా చూస్తానని కడప కలెక్టరు కూడా ఏబీకేప్రసాద్ తదితరులకు హామీ ఇచ్చినట్లు సభ పూర్తయ్యాక రచన సంపాదకులు శాయి ద్వారా నాకు తెలిసింది.

ఈ సమావేశానికి కారా మాస్టారు రావడం ఇంకొక విశేషం.

12 comments:

వెంకట రమణ said...

ఇదంతా చదువుతుంటే నాకు కూడా చాలా ఆనందంగా ఉంది..

Anonymous said...

భలే భలే..త్రివిక్రం, చదువరీ మీ ఇద్దరికి చాలా కృతజ్ఞతలు. ఇలాంటి మంచి వార్త విని కొండంత బలమొచ్చింది. ప్రజాస్వామ్యము మీద గౌరవము పెరిగింది

oremuna said...

ఇది చాలా మంచి వార్త

కాకపోతే


తెలుగు బ్లాగర్ల తరువాతి అడుగు జాగ్రత్తగా వేయాలి

ఇప్పటి వరకూ నాకు నేను, నీకు నేను, మనకు మన బ్లాగు అంటూ సాగిపోతుంది

జనాలలోకి వెళ్తే కొద్దిగా బాద్యత పెరుగుతుంది, సో ఇంకా జాగ్రత్తగా ఉండాలి

వీవెన్ said...

భళా! శభాష్!

Naga said...

మీరు, చదువరి లాంటి వాళ్ళు ఓ పది మంది ఉంటే పరిస్థితి పూర్తిగా మారిపోతుంది అనిపిస్తుంది.

ఇకపోతే, మీరు తయారు చేసిన కరపత్రాల సాఫ్ట్ కాపీ అందరికి అందుబాటులో ఉంచితే, ఎవరైనా వాడుకొనవచ్చును.

వర్మ said...

ఇది చాల సంతోషమైన వార్త. తెలుగు వికీ, తెలుగు బ్లాగులను మీ లాంటీ యువకులు ప్రజలలోకి తీసుకువెళ్ళవలసిన అవసరం ఎంతైనా ఉంది.ఆగష్ట్ నెలలో అధికార భాష సంఘం అధ్యక్షడు ఎ.బి.కె.ప్రసాద్ విశాఖపట్నం వచ్చారు. అప్పుడు తెలుగు వికీలో తెలుగు భాషకు జరుగుతున్న కృషిని వివరిస్తూ సుమారు 20 పేజీల తెలుగు వికీలోని వ్యాసాలను ప్రింట్ తీసి ఒక పుస్తకంగా శ్రీ ఎ.బి.కె గారికి ఇవ్వడం జరిగింది.దానిని చూసి ఆయన చాల సంతోషం వ్యక్తంచేసారు.దానికి ఆయన ప్రభుత్వ పరంగా మీకు ఏసహాయం కావలి అని అడిగినారు.అప్పుడు నేను వెంటనే ఎంచెప్పాలో తెలియక. మన రాష్ట్రం లో గల పంచాయితీల (ఊర్లు) గణాంక వివిరములతో బాటు ఆ ఊరికి సంబంధించిన వివరములను ప్రభుత్వపరంగా మాకు అందచేస్తే మేము తెలుగు వికీలో చేర్చగలము అని చెప్పాను.దానికి ఆయన సమ్మతించి నా అభ్యర్దన మేరకు జిల్లా పంచాయతీ అధికారికి ప్రభుత్వపరంగా ఉత్తర్వులు జారీచేస్తానన్నారు. అవి ఇంకా రావసిఉన్నవి. అవి వచ్చినా రాకపోయినా మనప్రయత్నాలు మనముచేస్తూనేఉండాలి.తెలుగు వికీ కి సంభందించి మీ సూచనలు సలహాలు తప్పక ఇవ్వండి.మీ కృషికి ప్రత్యేక ధన్యవాదములు .

చదువరి said...

నెట్లో తెలుగు గురించి మీరు చాలా మంచి ప్రయత్నం చేసారు. మనమే పనిగట్టుకుని వాళ్ళ వద్దకు వెళ్ళకుండా వాళ్ళే మన పని విషయంలో ఆసక్తి చూపించేలా చేసారు, అభినందనలు త్రివిక్రమ్! ఇది నెట్లో తెలుగుకు మంచి ఊపునిచ్చే చర్య!

Anonymous said...

చాలా సంతోషం. ఇన్నాళ్ళు మనం సాలె గూడు లో ఉన్నమేమో అనిపించేది. ఇప్పుడు వాస్తవం గా తెలుగు బ్లాగర్ల వల్ల ప్రయోజనం ఉందని జనాల్లో మనం స్పందన తీసుకు రావచ్చని నిరూపించారు.మీకు , చదువరి గారికి తెలుగు బ్లాగర్లంతా ఋణపడి ఉన్నారు.

Anonymous said...

చాలా సంతోషకరంగా వుందండి. మంచి పని చేసారు.

Kiran Chittella said...

చాల మంచి పని చేసారు త్రివిక్రం వసుంధర అంటే చందమామలొ కథలు రాసే ఆవిడేనా అండీ??

Anonymous said...

నాకు తెలిసీ వసుంధర అంటే ఒక దంపతుల కలం పేరు అనుకుంటా...స్వాతిలో ధారావాహికలు రాస్తారు. నిజమేనాండీ?

Anonymous said...

మీరింత మంచి పని చేసినందుకు పరమానంద భరితంగా వుంది.
ఇంతవరుకు తెలుగు భాష కు మాత్ర మే పాతర వేశారనుకుంటే ఇప్పుడు కవులకు వాళ్ళ విగ్రహాలకు కూడ కాళ్ళొచ్చి పారిపోయేలా చేస్తున్నాయి మన ప్రజా నాయకుల స్వామి..సారీ..దేవి భక్తి. గుళ్ళకూ గుళ్ళ ఆస్తులకు శఠ గోపం పెట్టడమే కాదు ఇప్పుడు విగ్రహాల వెనకాల పడ్డారు మన నాయక గ్రహాలు.
అప్పుడప్పుడూ ప్రజా ప్రతిఘటన లేక పోతే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతూనే వుంటాయి.

విహారి
http://ideenaamadi.blogspot.com