Wednesday, 31 May 2006

భక్తి

భక్తి అనేది మనం చెడ్డ పనులు చెయ్యకుండా మనలో పాపభీతి కలగడానికి, ఎంతటి విపత్కర పరిస్థితుల్లోనైనా దేవుడి మీద భారం వేసి ధైర్యంగా నిలవడానికి తోడ్పడితే బాగుంటుంది. అవసరంలో ఉన్నవారిని యథాశక్తి ఆదుకొమ్మని ప్రేరేపిస్తే మరీ బాగుంటుంది.

అలా కాకుండా అది వెర్రి తలలు వేస్తే అసలుకే మోసం వస్తుంది. గొప్ప భక్తుల కథలుగా చాలా కాలంగా ప్రచారంలో ఉన్న ఈ కథల్ని చదివితే నవ్వాలో ఏడవాలో అర్థం కాదు:

1. గుణనిధి కథ: ఈ గుణనిధి అనేవాడు అనేవాడొక దుర్గుణాల నిధి. జీవితమంతా జూదం, దోపిడీలు, వ్యభిచారం తదితర పాపకార్యాలన్నీ చేసి ఒక రాత్రి పొద్దుపోయాక ఒకరిని హత్య చేసి పారిపోతూ ఒక శివాలయంలో దాక్కుంటాడు. ఆ రోజు శివరాత్రట. ఏ క్షణానైనా రక్షక భటులు వస్తారేమోననే భయంతో ఆ రాత్రంతా మేలుకునే ఉంటాడు. ఆరిపోబోతున్న దీపం వత్తిని వెలుతురు కోసం ఎగదోస్తాడు. తర్వాత తనకు తెలియకుండానే అతడు చేసిన పనుల వల్ల శివలింగానికి అభిషేకమో ఇంకొకటో జరుగుతుంది. ఏతావాతా అతడు ఆ ఒక్క రాత్రి తనకు తెలియకుండానే చేసిన పనుల (జాగారము, దీపారాధన, మొ.) వల్ల బోలెడంత పుణ్యం వచ్చి అతడు నేరుగా కైలాసానికే వెళ్ళిపోతాడు.

2. ఇంకొకడి పేరు అజామిళుడని గుర్తు. వాడు కూడా జీవితమంతా పాపాలే చేసి చివరి క్షణాల్లో తన కొడుకును "నారాయణా!" అని పిలుస్తాడు. ఆ పిలుపు విని విష్ణుభటులు వచ్చి వాణ్ణి వైకుంఠానికి తీసుకుపోతారు!

చేసిన తప్పులు తెలుసుకుని పశ్చాత్తాప పడి మంచి మార్గంలోకి మళ్ళితే ప్రయోజనముంటుంది గానీ ఇలా తమ ప్రమేయం లేకుండా జరిగిన పనుల ఫలితాన్ని వాళ్ళకు ఆపాదించి అదే గొప్ప భక్తిగా ప్రచారం చేసేవాళ్ళ గురించి ఏమనుకోవాలో అర్థం కాదు. "చిత్తశుద్ధి లేని శివపూజలేల?" అన్నా వినిపించుకునే వారెవరు?

ఇంకోవైపు ఈ మధ్య కాలంలో భక్తి అనేది పెద్ద ఫాషనైపోయింది. తెలిసి తెలిసీ తాము చేసే తప్పుడు పనులు, తొక్కే అడ్డదారులు ఎక్కువవుతున్న కొద్దీ వ్రతాలు, పూజలు కూడా ఎక్కువవుతాయి. వాటిలో ఏ ఒక్కటైనా ఫలించి తామూ గుణనిధిలాగో, అజామిళుడిలాగో ముక్తిని పొందుదామనే "దురాశ" కూడా ఏ మూలో ఉంటుంది. అందుకే చాలా మందికి దేవుడి మీద కంటే తమ భక్తిని "ప్రదర్శించడం" మీదే శ్రద్ధ ఎక్కువ. పబ్లిసిటీకి వీళ్ళు దాసులు. వ్రతాలు, ఉపవాసాలు ఎక్కువగా చేసేవాళ్ళు (అందరూ కాదు లెండి!), ఉపవాసం పేరు చెప్పి అన్నం ఒక్కటీ మానేసి ఇతర పదార్థాలతో కడుపు నిండా భోంచేసేవాళ్ళు ఈ కోవకు చెందిన వాళ్ళే.

భక్తి పేరుతో మూగజీవుల ప్రాణాలు తీస్తే సంతోషించే దేవతలు మనకి ఉన్నందుకు మనం నిజంగా సిగ్గు పడాలి. ఎందుకంటే సృష్టిలోని సకల చరాచర జీవుల్లో దైవత్వాన్ని చూడగలం మనం. ప్రతి చెట్టు-పుట్టను, రాయి-రప్పను పూజిస్తాం. చేపలు, పందులు సైతం భగవదవతారాలు (దశావతారాల్లో). ఎద్దు, ఎలుక తదితరాలు మన దేవుళ్ళ వాహనాలు. జీవహింస మహాపాపమని వల్లిస్తాం. కానీ అదే దేవుని పేరు చెప్పి ఆ జంతువులనే పాశవికంగా హతమారుస్తాం.

మానవసేవే మాధవసేవని వల్లిస్తాం. అవసరంలో ఉన్న వాళ్ళను ఆదుకోవడం గురించి ఆలోచించం. ఇవన్నీ చూస్తూ కూడా పలకవేమని దేవుణ్ణి అడిగితే వింటూ కూడా ఆయన పలకడు. ఐనా పలకవలసింది దేవుడు కాదండీ మనుషుల్లోని ఇంగితజ్ఞానం మేల్కొనాలి. ఒకసారి పలికితే ఏమవుతుందో ఆయనకు తెలుసు. కొంపదీసి ఆ దేవుడే గనక ఎవరికైనా పలికితే ఈ భక్తులు ఆయన్ని బతకనిస్తారా? సృష్టినే తలక్రిందులు చేసే తమ విపరీతమైన కోరికలతో ఆయనకు పిచ్చెక్కేలా చేయరూ? అందుకే దేవుడెప్పటికీ అలా passive గా ఉండడమే మంచిది.

(పూజలు, వ్రతాలు ఇళ్ళలోనే కాదు గుళ్ళలో కూడా కొందరు పూజారుల వల్ల ఎంత హాస్యాస్పదంగా తయారవుతున్నాయో నా మరో బ్లాగులో చదవండి.)

భక్తిని గురించి ఈ పోస్టులు కూడా చూడండి:

1. భక్తి
2. భక్తి బేసిక్స్

Saturday, 27 May 2006

టీవీ-2(కాలక్షేపం కాలవలు)

వీటిలో వచ్చే కార్యక్రమాలు మళ్ళీ రెండు రకాలు:
సినిమాలు/సినిమాల క్లిప్పింగులు చూపుతూ చెప్పే కబుర్లు: ఇవి దాదాపుగా ప్రమాదరహితమైనవి (లేదా సినిమాల వల్ల ఎంత ప్రమాదమో వీటి వల్ల కూడా అంతే. నచ్చిన వాళ్ళు చూస్తారు నచ్చని వాళ్ళు లేదు). ఇవి కొన్ని కొత్త సినిమాలను చూడమని అదే పనిగా పోరుతాయి. చూసి తలబొప్పి కట్టించుకోవడమూ, చూడక బతికిపోవడమూ మన నిరోధక శక్తి మీద ఆధారపడి ఉంటుంది.

సీరియళ్ళు: అత్యంత ప్రమాదకరమైనవి. ఈ సీరియళ్ళను చూస్తే మతులు పోతాయి...ఉన్నవాళ్ళకు. వీటిలో వశీకరణ లాంటి శక్తి ఏదో ఉంది. ఈ సీరియళ్ళలో ఎక్కువ భాగం కుటుంబ కలహాల చుట్టూనే తిరుగుతాయి. వాటిలో ప్రధాన పాత్రధారులు వాస్తవ ప్రపంచంలో మనమెక్కడా చూడని లేడీ విలన్లు. వాళ్ళను చూస్తే మన గుండెలు అవిసిపోతాయి. వాళ్ల మాటలు గానీ, హావభావాలు గానీ, వాళ్లు చేసే పనులు గానీ, పన్నే కుట్రలు గానీ చూస్తే మనసు పాడవుతుంది. మన ఖర్మ గాలి భోంచేస్తున్నప్పుడు గానీ వాళ్ళను చూడడం సంభవిస్తే తిండి సహించదు. బలవంతాన తినబోతే వాంతవుతుంది. చిన్న పిల్లలు ప్రతి రోజూ ఈ సీరియల్స్ చూస్తూ పెరుగుతున్నట్లైతే ఆడవారి గురించీ, కుటుంబం గురించీ వాళ్లలో ఎలాంటి అభిప్రాయాలు కలుగుతాయో తలచుకుంటేనే భయమేస్తుంది. ఎందుకంటే ఈ సీరియల్స్ లో కుటుంబసభ్యులే ఒకర్నొకరు చంపుకోవడానికి, ఎదుటి వర్గం(?)లోని వాళ్ళ సుఖసంతోషాలను, వ్యాపారాలను నాశనంచేయడానికి అదే పనిగా కుట్రలు పన్నుతూ రాక్షసానందాన్ని పొందుతూ ఉంటారు. (మిత్రులారా! నాదొక విన్నపం: దయచేసి మీ పిల్లల్ని ఇలాంటి టీవీ సీరియళ్ళకు దూరంగా ఉంచండి. ప్రతిరోజూ కనీసం ఒక గంట సేపైనా టీవీ కట్టేసి, పనులన్నీ పక్కన పెట్టి వాళ్ళతో - పూర్తిగా వాళ్ళతోనే - గడపండి. వాళ్ళు చెప్పే కబుర్లు, కంప్లెయింట్లు వినండి. వాళ్ళకు కథలు చెప్పండి. వాళ్ళ చేత మంచిపుస్తకాలు చదివించండి. చదివి వినిపించండి. వాళ్ళతో కలిసి ఆడండి. పాడండి.)

ఇక ఈ సీరియళ్ళ టేకింగ్ లోని లోపాలు, నటీనటుల నటనా చాతుర్యం(!) చాలా హాస్యాస్పదంగా ఉంటాయి. ఇక జీడిపాకంలాగ సా.....................................గుతూ ఇవి చేసే 'ఆగడం' ఉండనే ఉంది.

ఇవే కాకుండా ఇంకో రకం సీరియళ్ళు కూడా ఉన్నాయి. అవే పౌరాణిక సీరియళ్ళు. గతంలో దూరదర్శన్ లో హిందీ రామాయణం వస్తున్న రోజుల్లో ఆ సీరియల్ చూడడం కోసం పెళ్ళి ఎగ్గొట్టి (ఎవరిదో కాదు...సొంత పెళ్ళే) టీవీ ముందు కూర్చున్న పెళ్ళికొడుకులున్నారు. తర్వాత మహాభారతం కూడా ప్రేక్షకులను అలాగే ఆకర్షించింది. పౌరాణికాలకు తోడు బాలసాహిత్యం కూడా టీవీ ద్వారా జనబాహుళ్యంలోకి రావడం శుభపరిణామం.

వీటికి తోడు ఇప్పుడు కొత్తగా వచ్చిన వెర్రి: రకరకాల బహుమతుల ఆశ చూపే ప్రోగ్రాములు. వీటిలో అడిగే ప్రశ్నలు, వాటికి జనాలిచ్చే సమాధానాలెలా ఉంటాయో ఈ మధ్యే రాశాను.

టీవీ-1 (వార్తాప్రవాహాలు)

తెలుగు టీవీ ఛానెళ్ళు ప్రధానంగా రెండు రకాలు: కాలక్షేపం కాలవలు (Entertainment Channels), వార్తాప్రవాహాలు (News Channels). ముందుగా నిరంతర వార్తాప్రవాహాల సంగతి చూద్దాం. తెలుగు వార్తాఛానెళ్ళు తెలుగు వాళ్ళకోసమే ఉద్దేశించినవి కాబట్టి వీటి పరిధి తక్కువ. ఆంధ్రదేశంలో అంత తరచుగా ఏం కొంపలు మునిగిపోతుంటాయి చెప్పండి ప్రతిరోజూ నిమిష నిమిషానికీ - వినడానికి మనకైనా, చెప్పడానికి వాళ్లకైనా? అందుకే ప్రతి అరగంటకూ చెప్పిన వార్తలే మళ్ళీ మళ్ళీ చెప్తూంటారు - ఒక్కోసారి రోజుల తరబడి. ఇక వాళ్ళు చెప్పే వార్తలు ఎలాంటివో ఒక ఉదాహరణ చూడండి: (ఇది అప్పట్లోనే రాయడానికి డ్రాఫ్టు రాసి పెట్టుకున్నా పోస్టు చెయ్యడానికి ఎందుకో బద్ధకించాను.)

రాష్ట్రంలో పరిపాలన సాగించేది మంత్రివర్గమే అయినా పరిపాలన గవర్నరు పేరు మీదే సాగుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి తరచుగా (మొక్కుబడిగానైనా) గవర్నరును కలిసి రాష్ట్రంలో పరిపాలన పేరిట అసలేం జరుగుతోందో వివరించాల్సి ఉంటుంది. ఇది రాజ్యాంగంలోనే స్పష్టంగా ఉంది. రాజ్యాంగంలో అసలేముందో తెలియనివాడు జర్నలిస్టుగా పనిచేయడానికి అనర్హుడు. కానీ క్రితం సారి ముఖ్యమంత్రి అలా 'మర్యాదపూర్వకంగా' గవర్నరును కలవడానికి వెళ్ళినప్పుడు లోపల వాళ్ళేం మాట్లాడుకుంటున్నారోనని బయట ఈ పనీ పాటా లేని జర్నలిస్టులు పెద్ద ఎత్తున ఊహాగానాలు చేశారు. వాళ్ళకు తోచిందొక్కటే: "మంత్రివర్గ విస్తరణ"! ముఖ్య మంత్రి రాజ్ భవన్ నుంచి బయటకు వచ్చిన వెంటనే చెప్పేశాడు కూడా - అలాంటి ఉద్దేశమేదీ లేదని. అయినా మన ఘనత వహించిన వార్తా ఛానెళ్ళలో రెండ్రోజుల పాటు ‌దాదాపు మూడు నిమిషాల సేపు ఒక "వార్త" ప్రసారమైది. దాని సారాంశం ఇదీ: ముఖ్యమంత్రి గవర్నరును కలిసింది మంత్రివర్గ విస్తరణ కోసమేనని మేం కథలల్లాం. అవి కేవలం కట్టుకథలేనని ముఖ్యమంత్రి తేల్చేశారు. (ఐనా ఈ కట్టు కథను "వార్తగా" మేమెందుకు ప్రసారం చేస్తున్నామంటారా? ఇలాంటి కథలల్లకపోతే ముప్ఫై నిమిషాల సేపు చెప్పడానికి వార్తలేముంటాయి? వె వ్వె వ్వె :P)
ఇంకా మన వార్తాఛానెళ్ళ అవలక్షణాల్లో కొన్ని:

అశ్లీలమైన క్లిప్పింగుల్ని సభ్యత మరచి రోజంతా చూపించడం (ముఖ్యంగా టీవీ9, మాటీవీ న్యూస్).
(ఈ మధ్య తగ్గించినట్లున్నారు. లేక నేను వార్తలు చూడడం మానేశాను కాబట్టి నాకు కనిపించడం లేదా?)

బీభత్సంగా, జుగుప్సాకరంగా కనిపించే శవాలను, ఇతర దారుణ దృశ్యాలను పదే పదే చూపించడం.

కేవలం అవలక్షణాలనే చెప్పి మంచి లక్షణాలను చెప్పకపోవడం మంచి పద్ధతి కాదు. వీటిలో మంచి మంచి చర్చాకార్యక్రమాలు ప్రసారమవుతూ ఉంటాయి. ప్రేక్షకులు తమ ప్రాపంచిక అవగాహనను పెంచుకోవడానికి ఈ ఛానెళ్ళలో వచ్చే కొన్ని కార్యక్రమాలు తోడ్పడుతూ ఉంటాయి.

Tuesday, 23 May 2006

భాషాంతక కార్యక్రమాలు

భాషాంతక ఛానెళ్ళలో తెలుగు కార్యక్రమాలు

(మీరు సుజనరంజని వెబ్ పత్రికలోగానీ, రచన మాస పత్రికలో గానీ అమెరికాలక్షేపం చదివేవాళ్ళయితే మీరు ఈ పోస్టు చదవనవసరం లేదు. ఈ పోస్టు అందులోనుంచి ఎత్తిరాసిందే. -3vkrm)

రాసిన వారు: వంగూరి చిట్టెన్ రాజు

ఈ మధ్య కొత్తగా వస్తున్న ఒక తెలుగు టీవీ గేం షో నాలుగైదు సార్లు చూశాను. మీరందరూ ఊహించినట్టుగానే ఈ (అంటే ఈనాడు కాదు - సదరు అని మాత్రమే అర్థం -3vkrm) టీవీ షో కూడా నాలుగైదు అమెరికన్ టీవీ షోలను మ్యూజిక్ తో సహా అనుకరిస్తూ వాటిని కలగాపులగం చేసి రంగరించిన "ఒరిజినల్" తెలుగు టీవీ ఆట...

మొదటి సారి ఈ షో చూసినప్పుడు టైటిల్స్ లో "రాడిక్కాస్ కాస్ట్యూములు, విగ్గు, నగలు, వగలు సప్లయిడ్ బై హాలీవుడ్ టైలర్స్ ఆఫ్ అంబాజీపేట" అని ఆవిడ ఫేషన్ కన్సల్టెంట్ వారి పేరు చూసి, ఈ షో నిర్వహించే ఆవిడ పేరు రాడిక్క అని కనిపెట్టేశాను. ఇటువంటి పేరు ఎక్కడా వినక బహుశా ఏ ఇండొనేషియా నుంచో లేక ఇథియోపియా నుంచోఆవిడను దిగుమతి చేసుకుని, చీరా, నగలూ, తెలుగు వగలూ పెట్టారేమో అనుకున్నాను. అంతే కాదు, పోటీ మధ్యలో "మీ బార్యా బరతలలోఎవరు లక్కీ పెర్సను?" అనో, "మీ పెల్లి అయి ఎన్నాలయినది?" అనో 'స్వచ్ఛమైన తెలుగు ఉచ్ఛారణ' క్షమించాలి...స్వచ్‌మనియన తెలుగు ఉత్‌చారణ తో మట్లాడడం కూడా ఆవిడ ఇంపోర్టెడ్ సరుకేమో అనే నా అనుమానానికి దోహదం చేసింది. మరొక సారి సదరు రాడిక్క గారు "బీ టీము వారు ఎరవై (అవును అక్షరాలా ఎరవై) గ్రాముల బంగారం గెలుసుకున్నారు." అనగానే నా అనుమానం పటాపంచలైపోయింది. ఎటొచ్చీ బీ టీము వారు 'గెలుసుకున్నది' అరవై గ్రాములా లేక ఇరవై గ్రాములా నాకు తెలియలేదు. ఎరవయ్యో అంకె గురించి మా లెక్కల మాస్టారు నాకెప్పుడూ చెప్పలేదు.

ఇక రాడిక్క గారు అడిగిన ప్రశ్న ఒకటి:
"ఆంధ్ర రాష్ట్ర అవతరణకి ప్రాణత్యాగం చేసిన వారు ఎవరు?"
ఎ)మహాత్మా గాంధీ
బి)ఇందిరా గాంధీ
సి)రాజీవ్ గాంధీ
డి)పొట్టి శ్రీరాములు

ఇంత క్లిష్టమైన ప్రశ్నకు 'ఏ' టీములో పదేళ్ళ అబ్బాయి తీవ్రంగా ఆలోచించి "నాకు మొన్ననే మా స్కూలులో ఈ విషయం చెప్పారు. ఆన్సరు రాజీవ్ గాంధీ." అని చాలా విజయగర్వంతో సమాధానం చెప్పాడు.

"నో, రాజీవ్ గంఢీ, ఈజ్ నాట్ థ రైట్ ఆన్సర్" అని రాడిక్క గారు అంగ్రేజీలో అరిచి, "నౌ, ద ప్రశ్న గోస్ టు 'బీ' టీం" అని అటు వేపు తన భారీ తలకాయ తిప్పారు, పూర్తిగా శరీరం తిప్పలేక. సదరు బీ టీములో తల పండిపోయి, గడ్డాలు, మీసాలు వెలిసిపోయి, మాజీ సినీ నటుడు బాబూమోహన్ వేలు విడిచిన మేనత్త పోలికలో ఉన్న ఆయన అంతకంటే విజయగర్వంతో వికటాట్టహాసం చేసి, "ఓస్, ఇంతేనా? నాకు తెలుసు. మనకోసం రాజీవ్ కంటే ముందు ప్రాణత్యాగం చేసింది ఇందిరమ్మ, గరీబీ హటావో" అంటూ ఆవేశపడ్డాడు.

ఇలాంటి మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలూ, వాటికి రెండు మూడు తరాల తెలుగువారి సమాధానాలూ విని, ఆనందం పట్టలేక వెంటనే టీవీ కట్టేసి,...నా గురించి సాహిత్యప్రియులు నిఝంగా ఏమనుకుంటున్నారో అని ఒక చిన్న ప్రయత్నం చేద్దామనిపించి ఒక మల్టిపుల్ చాయిస్ ప్రశ్న వేద్దామనుకుంటుండగా మా ఆవిడ బంగారం షో కోసం టీవీ ఆన్ చేసింది.

రాడిక్క గారి కట్టుకున్న చీర, వేసుకున్న నగలు చూస్తూ "అబ్బ, ఎంత బావుందో, ఆ రాధిక ఒంటి మీద కనీసం పది లక్షల రూపాయలైనా ఉంటాయి అన్నీ కలిపి..." అంది మా శ్రీమతి.

"రాధిక ఎవరూ, ఆ యాంకర్ పేరు రాడిక్క కదా?" అన్నాను.

"రాడిక్క ఏమిటి, రాడిక్కా గీడిక్కానూ - మన చిన్నప్పుడు సినిమాలలో హీరోయిన్ వేషాలు వేసేది రాధిక అనీ, అరవమ్మాయి అనుకుంటా" - సమాధానం చెప్తూ నా మొహం చూసి, "ఏం, మొహం అలా ఉంది?"-

జీవిత చరిత్రలు

నాకు బాగా నచ్చిన జీవిత చరిత్రలు:

సత్యశోధన - మహాత్మా గాంధీ
Wings of Fire - అబ్దుల్ కలామ్
హంపీ నుంచి హరప్పా దాకా - తిరుమల రామచంద్ర

Saturday, 20 May 2006

"రిజర్వేషనులు"

రిజర్వేషన్ల గురించి నేను ఇంతకు మునుపే నా మరొక బ్లాగులో వ్రాశాను. అది ఇక్కడ చూడండి.

ఈ వారాంతపు విషయంగా రిజర్వేషన్లను సూచించినది చావా కిరణ్.

Friday, 19 May 2006

వామనావతారం

వామనావతారాన్నే త్రివిక్రమావతారమని కూడా అంటారు. ఈ అవతారం నిజానికి మనిషి ఈ భూమి మీద అవతరించినప్పటి నుంచి సాధించిన ప్రగతిని మన కళ్ళ ముందుంచుతుంది. మొదట్లో వామనుడు బలి చక్రవర్తిని మూడడుగుల నేల అడిగేటప్పుడు కూడా అమాయకమైన పిల్లవాడిగా కనిపిస్తాడు. మనిషి కూడా ఈ భూమ్మీద అవతరించినప్పుడు అనేకానేక ఇతర జంతువులతో పోలిస్తే బలహీనుడు, అర్భకుడు. అయితే సామాజిక జీవనం మొదలయ్యాక గడచిన మూడు వేల సంవత్సరాల కాలంలో అతడు సాధించిన ప్రగతి ఊహించడానిక్కూడా సాధ్యం కానంత వేగంగా కన్నుమూసి తెరిచేంతలో జరిగినట్లుగా జరిగిపోయింది. మనిషి భూతలాన్నంతటినీ తన స్వాధీనంలోకి తెచ్చుకోవడంతో ఆగిపోక నదీనదాలు, ఎడారులు, కొండలు, సముద్రాలతో బాటు భూగర్భాన్ని, సముద్రగర్భాన్ని శోధించి సాధించి ఊరుకోక ఆకాశంలోకి చూపు సారించి అంతరిక్షాన్ని కూడ అందుకున్నాడు. ఈ ప్రగతి అంతా గడచిన శతాబ్దంలోనే కదా సాధిచింది? సృష్టి ఆరంభమైన తర్వాత గడచిన యుగాలతో పోల్చి చూసుకుంటే అంతా రెప్పపాటులో జరిగిపోయినట్లుగా లేదూ? త్రివిక్రమావతారంలో వర్ణించింది కూడా సరిగ్గా అదే. అప్పటివరకూ అమాయకంగా కనిపించిన వామనుడు చూస్తూండగానే "ఇంతింతై వటుడింతయై మరియు దానింతై..." భూమిని, ఆకాశాన్ని, అంతరాళాన్ని ఆక్రమించేస్తాడు!

అంతే కాదు! ఈ వామనావతార ఘట్టంలో గజేంద్ర మోక్షం లో వలెనే రసగుళికల్లాంటి పద్యాలున్నాయి. మచ్చుకు కొన్ని రుచి చూడండి:

"వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణ విత్త మాన భంగములందు పలికి బొంకవచ్చు, నఘము రాదధిప!"
(శుక్రాచార్యుడు బలి చక్రవర్తితో)
"ఆదిన్ శ్రీసతి కొప్పుపై, తనువుపై, అంశోత్తరీయంబుపై, పాలిండ్లపై.." భావం: వచ్చినవాడు నిజంగానే విష్ణువైతే లక్ష్మిదేవి శరీరాన్ని తాకి ధన్యమైపోయిన ఆ చేతిని నా ముందు దానం కోసం చాచడం నిజంగానే జరిగితే దానం చేయబోతున్న నాది దాని మీద పైచేయి అవబోతూంటే నాకు అంతకంటే ఏం కావాలి?(బలి చక్రవర్తి శుక్రాచార్యుడితో)
"కారే రాజుల్? రాజ్యముల్ గలుగవే? వారేరీ? సిరి మూటగట్టుకొని పోవంజాలిరే?"(బలి చక్రవర్తి శుక్రాచార్యుడితో)
"ఇంతింతై వటుడింతయై మరియు దానింతై..." విశ్వరూపాన్ని ఇంకెవరూ ఇంత గొప్పగా వర్ణించలేరు అనిపించే విధంగా ఉంది ఇక్కడ త్రివిక్రమావతార వర్ణన.

కవితా సౌరభాలు

నేను మళ్ళీ మళ్ళీ చదువుకునే కవితలు:

అమృతం కురిసిన రాత్రి
మహాప్రస్థానం
ముత్యాల సరాలు
ఎంకి పాటలు
కవితా! ఓ కవితా!!
ఆధునిక మహాకావ్యాలు:
పెన్నేటిపాట
శివతాండవం

నిలిచే నవలలు ఏవి?

"నిలిచే నవలలు ఏవి? (ప్రముఖుల ప్రత్యేక నవలా విశ్లేషణలు)" అనే పేరుతో 2001లో ఒక పుస్తకం వచ్చింది:
సంపాదకుడు: జయంతి పాపారావు

అందులో కాలపరీక్షను తట్టుకుని "నిలిచే నవలలు" గా తాము భావించిన 20 నవలల గురించి 20 మంది ప్రముఖ సాహితీవేత్తల వివరణాత్మక విశ్లేషణలున్నాయి.

ఆ ఇరవై నవలలు - నవలా రచయితలు (బొద్దుగా ఉన్నవి నేను చదివిన నవలలు):

శ్రీ రంగరాయ చరిత్ర (నరహరి గోపాల కృష్ణమ చెట్టి)
మాలపల్లి (ఉన్నవ లక్ష్మినారాయణ)
మంచీ-చెడూ (శారద)
కాలాతీత వ్యక్తులు (పి.శ్రీదేవి)
మరల సేద్యానికి (శివరామ కారంత్)

బ్రతుకు భయం (ఇది బెదిరిన మనుషులు నవలకు సీక్వెల్) (కొడవటిగంటి కుటుంబరావు)
అంపశయ్య (నవీన్)
స్వీట్ హోం (రంగనాయకమ్మ)
దారిపొడుగునా (చెరబండ రాజు)
మా పల్లె (చెరబండ రాజు)

వేలాడిన మందారం (జ్వాలాముఖి)
మూడు కథల బంగారం (రావి శాస్త్రి)
మూడు కథల బంగారం - విమల (రావి శాస్త్రి)
వసంత మేఘం (పులి ఆనంద మోహన్)
ఇల్లు (రావి శాస్త్రి)

రేగడివిత్తులు (చంద్రలత)
మీ రాజ్యం మీరేలండి (స్వామి)
పంచమం (చిలుకూరి దేవపుత్ర)
కాడి (సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి)
అంటరాని వసంతం (జి. కళ్యాణ రావు)


ఇందులో లేని గొప్ప నవలలు కొన్ని (నేను చదివినవి):

చదువు
( రచయిత కొడవటిగంటి కుటుంబరావు వ్రాసిన చదువు, జీవితం, అరుణోదయం, గడ్డురోజులు లాంటి నవలల్లో సామాజిక, ఆర్థిక, రాజకీయ విశ్లేషణ ఎక్కువగా ఉండగా, బెదిరిన మనుషులు , బ్రతుకు భయం లలో మనోవిశ్లేషణ ఎక్కువగా ఉంది.) ఇక మనోవిశ్లేషణ నవలలుగా జగత్ప్రసిద్ధి పొందిన నవలలు:

అసమర్థుని జీవయాత్ర,
చివరకు మిగిలేది,
అల్పజీవి.

ఇంకొన్ని నవలలు:

అనుక్షణికం
కొల్లాయి గట్టితేనేమి?
పుణ్యభూమీ కళ్ళుతెరు!
మైదానం
స్వేచ్ఛ


ఈ మధ్య చదివిన మంచి నవల: ఈ తరం స్త్రీ (విద్యావంతులైన మధ్య తరగతి స్త్రీల - గృహిణులు, ఉద్యోగినుల - సమస్యలను చర్చించిన నవల)

యండమూరి రచనలు

తెలుగు సాహిత్య చరిత్రలో యండమూరిదో విశిష్ట స్థానం.
ఆయన రచనల్లో నేను చదివిన వాటి గురించి నా అభిప్రాయం:

ది బెస్ట్ ఆఫ్ యండమూరి వీరేంద్రనాథ్: ఒకటి రెండు కథలు అస్పష్టంగా, అర్థం కాకుండా ఉన్నాయి. అర్థమైనవన్నీ చాలా బాగున్నాయి. కొన్ని కథలు అద్భుతంగా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ తప్పక చదవవలసిన పుస్తకం.

వెన్నెల్లో ఆడపిల్ల: రొమాంటిక్ థ్రిల్లర్
ఆనందోబ్రహ్మ: "సరళ ‌లలితమైన పదాల సన్నజాజి పందిరి"
అంతర్ముఖం: గొప్ప రచన
డబ్బు టు ది పవర్ ఆఫ్ డబ్బు: గెలవడానికి కావలసింది పట్టుదల, తెలివితేటలేనని చెప్పే చక్కటి పుస్తకం
డబ్బు మైనస్ డబ్బు: చెత్త నవల
కాసనోవా: చక్కటి శిల్పంతో వ్రాసిన మంచి థ్రిల్లర్
తులసీదళం & తులసి: ఈ నవలలను సరిగ్గా అర్థం చేసుకోని వాళ్ళు, పాఠకుల తెలివితేటలను తక్కువగా అంచనా వేసినవాళ్ళు అనవసరంగా వివాదం సృష్టిచారు.
ప్రియురాలు పిలిచె: "ప్రేమకు థర్డ్ డైమెన్షన్"
ప్రేమ: "మృదుమధుర మంజుల నవలానాదం"
ధ్యేయం: ఇలాంటి నవలలే అవసరం
చీకట్లో సూర్యుడు: అంతా బాగానే ఉంది గానీ ఫ్యూచరాలజీలో పాస్టాలజీ కి సంబంధించిన బాల్యవివాహాలను మిక్స్ చేయడమే పంటికిందరాయిలా తగులుతూ ఉంటుంది. చిన్న వయసులో గర్భం వస్తే పుట్టేది అష్టావక్రలే గానీ డిజైనర్ బేబీలు కాదు.
అతడు ఆమె ప్రియుడు: వికృతీకరించిన 'ఏకవీర'
వెన్నెల్లో గోదావరి: మంచి నవల
యుగాంతం: నేను చదివిన మొట్టమొదటి సైన్స్ బేస్డ్ ఫిక్షన్. చక్కటి మనో విశ్లేషణ.

Monday, 15 May 2006

పుస్తకాల బ్లాగు

నేను చూసిన ఇంగ్లీషు పుస్తకాల బ్లాగు ఒకటి: Book-O-Holics
ఇలాంటి బ్లాగు తెలుగులో ఎవరైనా వ్రాస్తున్నారేమో నాకు తెలియదు. మీకు తెలిస్తే చెప్పండి. తెలుగులో ఇలాంటి బ్లాగుల అవసరం చాలా ఉంది.

పుస్తకాల పురుగు

వీవెన్ పుస్తకాల పురుగును నా మీదకు ఉసిగొలిపాడు. ఈ పురుగు చేత నేను ఇంకో ఇద్దరిని కుట్టించాలట. సరే, ఈ పురుగును నేను భలే బుడుగు, నవీన్ నంబూరి ల మీదకు వదులుతున్నాను. ఇక నేను ఇటీవల చదివిన పుస్తకం 'అంపశయ్య '. ఈ పుస్తకం ఎంత ప్రసిద్ధమంటే ఈ పేరు రచయితకే ఇంటి పేరుగా మారిపోయింది. ఇది వెయ్యేళ్ల తెలుగు సాహిత్య చరిత్ర లో (1000 నుంచి 1999 మధ్య కాలంలో) వచ్చిన వంద గొప్ప గ్రంధాల్లో ఒకటని అంటారు.

తెలుగు సాహిత్యంలో చైతన్య స్రవంతి అంత విరివిగా వాడుకలోకి రాలేదు. అటువంటి చైతన్య స్రవంతిని సమర్థవంతంగా వాడుకున్న నవలల్లో ఇదొకటి. అయితే నవల మొదట్లోనే ఈ చైతన్య స్రవంతిలో మనకు వినిపించే కొన్ని మాటలు అసభ్యంగా అనిపిస్తాయి. అలాంటి మాటలు, సన్నివేశాలు తర్వాత కూడా అక్కడక్కడా ఎదురవుతూనే ఉంటాయి. అలాంటి వాటిని వదిలేస్తే ఇది నిజంగా ఒక అద్భుతమైన నవల. ఈ నవల గొప్పదనమంతా ఈ నవల ముగింపులోనే ఉంది. వాస్తవిక నవలల్లో ఇలాంటి విప్లవాత్మకమైన ముగింపు అదీ అత్యంత సహజంగా అనిపించేలా తీసుకురావడం అనితర సాధ్యమేమో!

మొదట్లో భయస్థుడు, ప్రతి విషయంలో ఊగిసలాడే మనస్తత్వం గల రవి నవల చివరలో ఇలా అనుకుంటాడు: "తన మీద దెబ్బ పడడం, తను కూడా శత్రువు మీద దెబ్బ వేయడం తనలోని ఆత్మ స్థైర్యాన్ని పెంచుతున్నది....తను నమ్మిన భావం కోసం, తను నమ్మిన ఆదర్శం కోసం, తన స్వాతంత్ర్య పరిరక్షణ కోసం తను ముందు ముందు ఇట్లాంటి దెబ్బలెన్నైనా తినడానికి వెనుకాడడు.ఇవ్వాళ్టి సంఘటన తనను అందుకు పూర్తిగా సిద్ధం చేసింది."

ఈ పరివర్తనను తీసుకురావడానికి రచయిత చైతన్య స్రవంతి ని చక్కగా వాడుకున్నారు. ఈ నవల చదివితే పిరికి వాళ్లలో సైతం ఇలాంటి కదలిక ఏర్పడి తీరుతుంది.

Saturday, 13 May 2006

దశావతారాలు-1

కపిల మహర్షి, నరనారాయణులు, కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వరుడు - వీళ్ళు కూడా విష్ణు అవతారాలే కదా?మరి దశావతారాల్లో వీళ్ళు లేకపోవడమేమిటి?

దశావతారాల ఉద్దేశ్యం కేవలం ముఖ్యమైన అవతారాలను ఏకరువు పెట్టడమే కాదు: సృష్టి పరిణామ క్రమాన్నీ, సామాజిక పరిణామక్రమాన్నీ వివరించడమే దశావతారాల ముఖ్య ఉద్దేశ్యం. అవును, దశావతారాల్లోనే సృష్టి పరిణామ క్రమమంతా ఇమిడి ఉంది:

నీరు లేనిదే ప్రాణి పుట్టుక సాధ్యం కాదు. ఎందుకంటే ప్రాణం జలం అంటే నీటిలోనే పుట్టింది. అందుకే ఇప్పుడు కూడా శాస్త్రవేత్తలు సుదూర గ్రహాల్లో జీవ సంచారం ఉందో లేదో తెలుసుకోవడానికి ముందుగా అక్కడ నీళ్ళు ఉన్నాయో లేవోననే చూస్తారు. ఆ నీటిలో మన కంటికి కనిపించనంత సూక్ష్మమైన ఏక కణ రూపం లోనే ప్రాణుల పుట్టుక మొదలైందని సైన్స్ చెబుతోంది. ఒకసారి ప్రాణి అంటూ ఏర్పడ్డాక తర్వాత తర్వాత మరింత సంక్లిష్టమైన, బహుకణజీవులు త్వరత్వరగా ఏర్పడ్డాయి.

దశావతారాల్లో మొదటిదైన మత్స్యావతారంలో సరిగ్గా ఇలాగే ఉంది. మనువు సముద్రంలో స్నానం చేసి, సూర్యనమస్కారం చే స్తూ, ఆర్ఘ్యం వదలడానికి దోసిట్లోకి నీళ్ళు తీసుకుంటే అందులోకి అత్యంత సూక్ష్మమైన చేప వస్తుంది. దాన్ని తిరిగి సముద్రంలోకి వదలబోతే అది మనువును వేడుకుంటుంది: "సముద్రంలో ఉండే పెద్ద చేపలు తనను బతకనివ్వవనీ, తనను కాపాడమనీ." ఆయన దాని మీద జాలి పడి తన కమండలంలోనే ఉంచుకుంటే అది ఆయన ఆశ్రమం చేరే లోపల కమండలం పట్టనంత పెద్దదైపోతుంది. అక్కణ్ణుంచి తీసి తొట్టిలో వదిల్తే కొద్ది సేపట్లోనే ఆ చేప మరింత పెద్దదై తొట్టి కూడా పట్టదు. అక్కణ్ణుంచి ఒక చిన్న కొలనులోకీ, ఆ తర్వాత ఒక చెరువులోకీ మార్చవలసి వస్తుంది. చివరికి దాన్ని మళ్ళీ సముద్రంలోనే వదిలేస్తాడు.

దశావతారాల్లో రెండవది ఉభయచరమైన తాబేలు (కూర్మావతారం). సముద్రంలో పుట్టిన జీవుల్లో కొన్ని మెల్ల మెల్లగా భూమ్మీదకు వ్యాపించడానికి చేసిన ప్రయత్నంలోని ఒక ముఖ్యమైన దశ. ఉభయచరజీవులకు తాబేలు ప్రతినిధి.

ఇక మూడవది పూర్తిగా నేల మీద జీవించడానికి అలవాటు పడ్డ నాలుగు కాళ్ల జంతువు: వరాహం

మనిషి పుట్టింది కోతి నుంచి - అంటే ఒక జంతువు నుంచి. దీన్ని సూచించేదే సగం జంతువు-సగం మనిషి లక్షణాలు గల నరసింహావతారం. ఇది దశావతారాల్లో నాలుగవది.

తర్వాతి (5వ) అవతారమే పూర్తి స్థాయి మనిషి లక్షణాలు గల మొట్టమొదటి అవతారం. అదే వామనావతారం.
ఇక ఇక్కడ నుంచి మిగిలిన ఐదు అవతారాలూ సామాజిక పరిణామ క్రమాన్ని సూచిస్తాయి.
(అది ఇంకొక పోస్టులో.)

గమ్మత్తైన పేరు

మన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖలో సంప్రదాయ వైద్యవిధానాలన్నిటికీ కలిపి ఒక విభాగముంది. దాని పేరు (ఆయుష్) చాలా చమత్కారంగా కుదిరింది.

స్పెల్లింగు: AYUSH

A = ఆయుర్వేద (Ayurveda)
Y = యోగ (Yoga)
U = యునానీ (Unani)
S = సిద్ధ వైద్య (Siddha vaidya)
H = హోమియోపతి (Homoeopathy)

ఇది గుర్తొచ్చినప్పుడల్లా గమ్మత్తుగా అనిపిస్తుంటుంది.

Saturday, 6 May 2006

రాయలసీమ ఫాక్షనిజం-1

తిమ్మిని బమ్మిని చేయడంలో మీడియాను మించిన వాళ్ళెవరూ లేరు. అందునా తెలుగులో సినిమా అనేది అన్నిటికంటే బలమైన మీడియాగా అవతరించింది. గత పది, పదహైదేళ్ళుగా రాయలసీమ ఫాక్షనిజాన్ని సినిమాల్లో వికృతంగా చూపుతున్న తీరు చూసి రాయలసీమ వాసులకు ఆవేదన కలుగుతోంది. రాయల సీమలో జీవితమెలా ఉంటుందో తెలియని, రాయలసీమ ఫాక్షనిజం స్వరూప స్వభావాలు ఎలా ఉంటాయో తెలియని కొందరు సినిమా రచయితలు పైత్యం ప్రకోపించి, రాయలసీమలో ఉండేది కూడా మనుషులేననే సంగతి విస్మరించి మానవత్వానికే మచ్చ తెచ్చే సన్నివేశాలను సృష్టించి దానిని రాయలసీమ ఫాక్షనిజానికి ఆపాదించడం హేయం, ఘోరం. ఈ సందర్భంలో రాయలసీమ నడిబొడ్డైన కడప గడ్డ మీద రెండు ఫాక్షన్ వర్గాల మధ్య జరిగిన ఒక యథార్థ సంఘటనను మీ ముందుంచుతున్నాను:

కొంత కాలం క్రిందట ఒకాయనకు ఒక ప్రమాదంలో తీవ్ర గాయాలై ఆసుపత్రిలో ప్రాణాపాయంలో ఉన్నాడు. ఆయనకు వెంటనే అత్యవసరంగా రక్తం ఎక్కించాల్సి వచ్చింది. ఆయన కుటుంబసభ్యుల్లో గానీ, ఆయన వెంట ఉన్నవాళ్ళలో గానీ ఎవరి రక్తమూ ఆయనకు సరిపోయే గ్రూపు కాదు. బ్లడ్ బాంకు లో కూడా ఆ గ్రూపు రక్తం లేదు. వాళ్ళు అందుబాటులో ఉన్న వాళ్ళందరినీ ఫలానా గ్రూపు రక్తం అత్యవసరంగా కావాలని, రక్తదాతలెవరైనా ఉంటే తెలుపమని కోరారు.

ఇంతలో ఆ ఆసుపత్రికే వచ్చిన ఇంకొకాయన ఈ విషయం తెలుసుకుని, తన గ్రూపు సరిపోతుందని తెలిపి, రక్తదానం చేయడానికి ముందుకు వచ్చాడు. ఎవరో ఒకాయన రక్తదానం చేయడానికి ముందుకు వచ్చాడని తెలిసి మొదటాయన బంధువులు సంతోషించారు. రక్తం అవసరమైనదెవరికో రక్తం ఇస్తున్నాయనకు తెలియదు, రక్తం ఇస్తున్నదెవరో అవతలి వాళ్లకుతెలియదు. గండం గట్టెక్కాక, రక్తదానం చేసి ప్రాణం కాపాడినాయనకు కృతజ్ఞతలు తెలుపడానికి వెళ్ళిన వాళ్ళు అవాక్కయారు!

రక్తదాత, గ్రహీత ఫాక్షన్ గొడవల్లో ప్రధాన ప్రత్యర్థులు!
ఇక్కడ ఇంద్ర సినిమా లో ఒక సన్నివేశాన్ని గుర్తుకు తెచ్చుకోండి:

ఆ సినిమాలో విలన్ కొడుకు ప్రాణాలను హీరో కాపాడితే, ఆ విలన్ తన కొడుకును తనే చంపేస్తాడు తన శతృవు దయ వల్ల దక్కినదేదీ తన కక్కరలేదని. కానీ నిజజీవితంలో ఏం జరిగింది? వీళ్ళు తమ పగను పక్కనపెట్టి కృతజ్ఞతలు చెప్పుకోవడమూ, ఆయన కూడా పాత విషయాలు పక్కనపెట్టి స్నేహంగా మాట్లాడడమూ, తర్వాత రెండు వర్గాల వారూ పగను పాతిపెట్టి కలిసిపోవడమూ జరిగాయి.

(ఇటీవల కడప జిల్లాలో ఫాక్షనిస్టుల లెక్కల గురించి ఏర్పడిన గందరగోళం, తర్వాత ఈనాడు లో వచ్చిన శ్రీధర్ కార్టూను చూసి ఇదంతా గుర్తొచ్చి వ్రాయాలనిపించింది. ఆధారం: 'కడపోత్సవాలు' సావనీర్లు)