Saturday 22 April, 2006

నాలుగు బై మూడు

చిన్నప్పట్నుంచి, రామాయణంలో నాకు సరిగా అర్థం కానిదొకటుంది. దశరథుడి పట్టమహిషి కౌసల్య, ముద్దుల భార్య కైకేయి కాగా ఇలాంటి ప్రత్యేక హోదాలేమీ లేని మామూలు రాణి సుమిత్ర. దశరథుడు పుత్రకామేష్టి యాగం చేసినపుడు అగ్నిదేవుడిచ్చిన పాయసాన్ని లెక్కప్రకారమైతే మూడు భాగాలే చేయాలి - ఉన్నది ముగ్గురు రాణులే కాబట్టి. కానీ దశరథుడు ఆ పాయసాన్ని రాణుల మధ్య పంచిన తీరు చూస్తే ఎవరికైనా నవ్వు వస్తుంది. అంతే కాదు, దశరథుడు పూర్తిగా ముసలివాడైపోయాడనీ, అందుకే ఆ పంచడం కూడా అంతా అవకతవకగా చేశాడనీ కూడా అనిపిస్తుంది. ఆ వ్యవహారం ఎంత గందరగోళంగా జరిగిందో చూడండి:

ఉన్నది ముగ్గురు రాణులైతే, పాయసాన్ని ముందుగా రెండు భాగాలు చేశాడు. సరే, బాగానే ఉంది, ఒక భాగాన్ని కౌసల్యకిస్తాడు పట్టపు రాణి కాబట్టి. ఇదీ బాగానే ఉంది.
మిగిలిన సగాన్ని ఏం చేశాడయ్యా అంటే మళ్ళీ రెండు భాగాలు చేశాడు. ఆ రెండు భాగాల్ని సుమిత్రకూ, కైకేయికీ ఇవ్వాలా? ఊహూ, ఒక సగాన్ని అలాగే ఉంచి ఇంకో సగాన్ని వారిలో ఒకరికి ఇచ్చాడు. ఆ ఒక్కరూ ఎవరూ? లెక్క ప్రకారమైతే కైకేయి కావాలి - ముద్దుల భార్య కాబట్టి. కానీ ఆమెకివ్వలేదు - సుమిత్రకిచ్చాడు. ఎందుకనేది నాకు ఈ నాటికీ అర్థం కాలేదు. పోనీ ఆ మిగిలిన సగాన్నైనా కైకేయికివ్వొచ్చు కదా? ఊహూ... దాన్ని మళ్ళీ సగం చేశాడు. చేసి, సుమిత్రకూ, కైకేయికీ ఇచ్చాడు. సుమిత్రకు ఇంతకు ముందే ఇచ్చిన మాట మరిచి పోయాడా లేక కౌసల్యకే మళ్ళీ ఇవ్వబోయి సుమిత్రకిచ్చాడా? ఇది నా ఊహకు అందడం లేదు. ఇది ఇంకోలా జరిగి ఉంటుందా అని సరదాగా ఆలోచిస్తే నాకిలా అనిపించింది:

దశరథుడు పాయసం మొత్తాన్ని రెండే భాగాలు చేసి కౌసల్యకు, కైకేయికి ఇచ్చి చేతులు దులుపుకున్నాడు. అయితే సుమిత్రకు ఇవ్వకుండా తామే తినడానికి మనసొప్పక వాళ్ళిద్దరూ తమ భాగంలో నుంచి కొంత భాగాన్ని సుమిత్రకిచ్చారు. అలా ఆమె రెండు భాగాలు పొందడం వల్ల ఇద్దరు పిల్లలు పుట్టారు.

అయితే, ఈ రహస్యం వాల్మీకి మహర్షికి తెలియలేదు. ఏం జరిగిఉంటుందా అని అలోచించి, సవతులు అంత సఖ్యంగా ఉంటారని అనుకోక పోవడం వల్ల ఆయనకు తోచిన విధంగా కథ అల్లి మనకు చెప్పి ఉంటాడు.

2 comments:

Anonymous said...

నేను చదివిన కథల్లో మీరు చెప్పిన పద్దతిలోనె పంపకం జరుగుతుంది.
కౌసల్య మరియు కైకేయిలకు చెరి సగం ఇస్తాడు. వాళ్ళిద్దరూ చెరి సగం సుమిత్రకు ఇస్తారు.
మీరు చెప్పిన మొదటి పంపకం పద్దతి ఇక్కడే మొదటి సారి చూసాను!

-- స్పందన

Anonymous said...

ఆశ్చర్యం! వాల్మీకి రామాయణంలోనూ, వాల్మీకి రామాయణాన్ని అనుసరించి వ్రాసిన అనేక రామాయణాల్లోనూ నేను చెప్పినట్లే ఉంది. ఉదాహరణకు తెలుగులో బహుళ వ్యాప్తి పొందిన ఉషశ్రీ రామాయణంలోనూ, ప్రస్తుతం చందమామలో సీరియల్ గా వస్తున్న రామాయణం లోనూ అలాగే ఉంది. మీరు ఏయే రామాయణాలు చదివారు?