నిజం చెప్పాలంటే మా ఊరినుంచి హై. కంటే బెంగలే దగ్గర. కానీ రాష్ట్రం దాటి రావాలంటే ముందుగా భాష గురించే నాకు బెంగ. ఎందుకంటే మనకు ఆంధ్రాంగ్లములు దక్క ఇతరేతర భాషలు రావు. MCA చదువుతున్నప్పుడు స్నేహితుల బలవంతమ్మీద జీవితంలో మొదటిసారి హిందీ సినిమా చూడడానికి వెళ్తూ వెళ్తూ దారిలో విశాలాంధ్రలో హిందీ డిక్షనరీ కొనుక్కుని మరీ వెళ్ళాను. ఇప్పుడూ అలాగే బెంగుళూరుకు రాకముందే ముందుజాగ్రత్తగా విశాలాంధ్రలో National Integration Series వారి 30 రోజుల్లో కన్నడం కొనిపెట్టుకున్నాను. (దాన్నింత వరకు తెరిచి చూడలేదనుకోండి, అది వేరే విషయం.) గుడ్డిలో మెల్ల ఏమిటంటే చిన్నప్పుడే నాకు 'ఉ', 'హ', 'క' తో సహా కన్నడం చదవడం వచ్చు. అందుకే ఇక్కడి (బెంగళూరు)కొచ్చాక కనిపించిన ప్రతి కన్నడ బోర్డునూ ఉత్సాహంగా చదివిపారేస్తున్నాను - అర్థమైనా, కాకపోయినా.
మొదటి అనుభవం: షేవింగు సెట్టుకు 'కత్తెర'
అసలు బెంగళూరుతో నా అనుబంధం పదినెల్ల కిందటే మొదలైంది. వారాంతాల్లో బెంగళూరుకు రావడానికి నా అలవాటుకొద్దీ ఒక చిన్న బ్యాగులో నా బ్రష్షూ పేస్టూ, షేవింగ్ సెట్టూ, సెల్ ఫోన్ ఛార్జరూ, దార్లో చదూకోడానికి రెండు మూడు పుస్తకాలు వేసుకుని బయలుదేరితే హైదరాబాదు విమానాశ్రయంలోని భద్రతాసిబ్బంది నన్ను, నా మీసకట్టును చూడగానే తెగముచ్చటపడిపోయి, "మీ మీసకట్టు చూడముచ్చటగా ఉంది, మీరు ఏ కత్తెరతో షేప్ చేసుకుంటారో చూపించండి" అని, నేనెంత మొహమాటపడుతున్నా పట్టించుకోక నా బ్యాగునంతా వెదికి మరీ నా కత్తెరను సావనీరుగా తీసేసుకునేవాళ్ళు. అలా వాళ్ల దగ్గర నావి ఐదారు కత్తెరలు (ఉండి)పోయాయి. ఐనా నేనొచ్చినప్పుడల్లా కొత్త కత్తెరను తీసుకోవడం అస్సలు మర్చిపోరు. ఒకసారి ఎందుకనో గుర్తులేదుగానీ నా బ్యాగునిండా చీమ దూరడానికి కూడా సందు లేకుండా ఏవేవో వస్తువులు కుక్కుకుని బయలుదేరాను. (ఎందుకేమిటిలెండి, మా ఆవిడకు జన్మదిన కానుక(లు) తీసుకెళ్తున్నాను) అప్పుడైతే వాళ్లకు కత్తెర వెంటనే దొరకలేదని చిన్నబుచ్చుకున్నారు కూడా. 'లేదయ్యా, నా దగ్గర అసలు కత్తెర లేనేలేదు, పోయినసారి మీరు తీసేసుకున్న తర్వాత నేను మళ్ళీ కొనలేదు, ఒకవేళ కొన్నా వెంట తెచ్చుకోలేదు, కావాలంటే నా షేవింగ్ సెట్టు చూడండీ' అని షేవింగ్ కిట్టు తెరిచి చూపించినా వాళ్ళు నిరాశపడలేదు. నా బ్యాగునంతా రెండుసార్లు వెదికాక నేను బ్లేడుతోనే షేప్ అనుకుంటానేమో అని అనుమానించి బ్లేడ్లు తీసేసుకున్నారు. మళ్ళీ నా బ్యాగును వెనక్కి X-రే స్కానింగుకు పంపి "కహా హై, కహా హై" అని అక్కడి గార్డును కంగారుపెడితే అతను "Centre మే హై" అని చెప్పేవరకూ వాళ్ళు శాంతించలేదు. వాళ్ల వాలకం చూస్తే కత్తెర కోసం గిఫ్టు పాకెట్లు కూడా విప్పి చూపమంటారేమోననిపించింది. అసలా బ్యాగులో కత్తెర ఉన్నట్లు అప్పటివరకూ నేను చూసుకోనేలేదు. చూసుకున్నట్లైతే వాళ్లనంతగా ఇబ్బందిపెట్టి ఉండను. ;) అలా ఆ ట్రిప్పులో కత్తెరతోబాటు బ్లేడ్లు కూడా పోగొట్టుకున్నాను. (భద్రతాకారణాల వల్ల ఇలా ప్రయాణీకుల నుంచి స్వాధీనం చేసుకున్న "ఆయుధాల"ను బేగంపేటలో ప్రదర్శనకు పెట్టమని ఏలినవారిని కోరాలి). బెంగుళూరు వెళ్ళబోతే ప్రయాణంలోనే ఇలాంటి అనుభవాలౌతున్నాయే, బెంగుళూరు వెళ్ళాక పూర్తిగా క్షవరమైపోతానేమో అని కూడా అనిపించినా 'అబ్బే, మా ఆవిడ చాలా మంచిది. అలాంటి పనులేవీ చెయ్యదు' అని నాకు నేనే ధైర్యం చెప్పుకునేవాడిని. మొత్తానికి అలా నేను బెంగళూరు వచ్చిపడ్డానన్నమాట. ఇక బెంగళూరులో నా అనుభవాలు కాస్కోండి:
బాగిలు
మొదటిరోజు ఇంటినుంచి ఆఫీసుకు వెళ్లడానికి సిటీబస్టాపుకెళ్ళాను. 'హై.లోలాగ ఇక్కడ షేరింగ్ ఆటోలు ఎందుకు లేవా' అని చింతిస్తూ, బస్సు రాగానే ఎక్కడానికి వీలుగా కుడివైపు నిలబడ్డాను. ఇంతలో బస్సు రానేవచ్చింది. కానీ ఆ బస్సుకు వెనకవైపు అసలు డోరే లేదు. ముందుపక్క ఒకే ఒక డోరు మాత్రమే తెరచి ఉంది. ఇదెక్కడి వింత? అనుకుంటూ బస్సెక్కి చూస్తే ఒకచేత్తో స్టీరింగు తిప్పుతూ ఇంకో చేత్తో టికెట్లిస్తున్న డ్రైవరు కనబడ్డాడు. అది చూసి అదిరిపడ్డాను. సిటీ బస్సుల్లో వన్ మాన్ సర్వీసులా? బెంగళూరుకు రాకముందు ఇలాంటిదొకటి ఉందని, అది మనదేశంలోనే విజయవంతంగా అమలౌతోందని ఎవరైనా చెప్పినా నమ్మేవాణ్ణి కాదు. ఎవరూ చెప్పలేదు కాబట్టి బతికిపోయారు. బస్సెక్కిన కాసేపటికి రోడ్ల మీద వెస్టిబ్యూల్ బస్సులు కూడా తిరుగుతూ కనబడ్డాయి. ఇక్కడ విజయవంతంగా నడుస్తున్న ఈ జంటవాహనగళు హైదరాబాదులో మూణ్ణాళ్ళ ముచ్చటగా ఎందుకు మూలనబడ్డాయో నాకు అర్థం కాలేదు.
బస్సు ఎక్కబోతూ డోరు దగ్గర కన్నడంలో స్వయంచాలిత బాగిలు అని చూసి 'బాగిలు అంటే ఏమిటబ్బా?' అని ఆలోచించాను. అప్పుడేమీ తట్టలేదుగానీ 30 రోజుల్లో కన్నడం కూడా చదవనసరం లేకుండానే త్వరలోనే అదేమిటో అనుభవపూర్వకంగా బోధపడింది. కాసేపు ఓపిగ్గా ఈ టపా చదివితే మీకు కూడా తెలిసిపోతుంది. (అసలు నా బ్లాగు చదవడమే ఓ ఎడ్యుకేషన్. అందుకే రోజూ వచ్చి నా బ్లాగు చదివేస్తూ ఉండండి. మీ విజ్ఞానాన్ని పెంచుకోండి.)
హైదరాబాదులో ఐతే సిటీ బస్సులు బస్టాపులో ఆగడం, ఆగకపోవడం దైవాధీనం. అది డ్రైవరు మూడును బట్టి ఉంటుంది. బస్టాపులోని దీనజనాల మీద దయ కలిగిందా ఆగుతుంది, లేదంటే ఎక్కడో వెళ్ళి ఆగుతుంది. మనం అక్కడిదాకా పరిగెత్తిపోయేలోపే "Catch me if you can" అంటూ కదిలి బుర్రున వెళ్ళిపోతుంది. ఐతే ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర మాత్రం నమ్మకంగా ఆగుతుంది. అందుకే బస్సెక్కాలన్నా, దిగాలన్నా జనాలు బస్టాపుల కంటే ఎక్కువగా ట్రాఫిక్ సిగ్నళ్ళనే నమ్ముకుంటారు. ఈ ట్రెండు చూసి ఆర్టీసీ వాళ్లు ముచ్చటపడి అమీర్ పేట మైత్రీవనం గేటు ముందైతే ఏకంగా సిగ్నల్ దగ్గరే బస్టాపు ఏర్పాటుచేశారు.
ఒక అచ్చమైన హైదరాబాదీలాగ అదే అలవాటుతో నేనూ బెంగళూరులో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గరే బస్సు దిగడం మొదలుపెట్టాను. నాలుగురోజులు బాగానే గడిచింది. ఐదో రోజు, అనగా ఒక శుక్రవారం నాడు, శుక్రుడు వక్రదృష్టితో చూశాడేమో నన్ను, బస్సు డ్రైవరు బస్సు దిగడానికి వస్తున్న నన్ను చూసి ముఖం మాడ్చుకుని ముందుకు వంగాడు. అతడలా వంగాడో లేదో అప్పుడే అలీబాబా అన్నకు గుహద్వారం ముసుకుపోయినట్లు నా కళ్లముందే బస్సుడోరు ముసుకుపోయింది. అసలే మన హై.లో సిటీ బస్సులకు డోర్లుండడం, ఉన్నా అవి మూసుకుపోవడం ఏ జన్మానా ఊహించలేం కదా? అందుకే 'ఈ డోరేమిట్రా ఇలా చేసిందీ' అని నిర్ఘాంతపోయాను. "డోరా డోరా తెరుచుకోవే" అని నాకొచ్చిన మంత్రాలన్నీ పఠించాను, లాభం లేకపోయింది. బస్సు డ్రైవరేమో నా మొర ఆలకించకుండా ఎటో చూస్తున్నాడు. ఈలోగా సిగ్నలు మారి బస్సు కదిలిపోయింది. ఆ కదలడం కదలడం ఒక కిలోమీటరు దాకా ఎక్కడా ఆగలేదు! దార్లో ఎక్కడా అంగుళం కూడా అడ్డం రాని బెంగళూరు ట్రాఫిక్ మీద మండమంటే మరి నాకు మండదా?
అలా ఎక్కడో దిగవలసిన నన్ను ఇంకెక్కడో వదిలి వెళ్ళిపోతున్న బస్సు వైపు "బలివాడ కాంతారావు నవలలా" చూసేసరికి ఆ బస్సు వెనుక రాసి ఉన్న రెండులైన్ల ముషాయిరా కనబడింది:
నడువె అంతరవిరళి
అఫవాతక్కి అవసరవే కారణ
మొదట అదేమిటో అర్థం కాలేదు. కాసేపటికి తేరుకుని నాకు అర్థమైనంతవరకు ఆ రెండు లైన్లకు స్వీయానువాదం
"నడువరా అంతదూరమూ, అవసరమే అందుకు కారణము" (నడువరా కి నడువే అని లింగమార్పిడి చేశారన్నమాట!) అని పాడేసుకుంటూ వెనుదిరిగి సాగిపోతున్నాను. ఒక్కో బస్సూ నన్ను దాటుకుని వెళ్తున్నప్పుడల్లా స్వయంచాలిత బాగిలు అని కళ్లముందు కనబడుతూనే ఉంది. ముషాయిరా అనువాదం కనిపెట్టిన ఉత్సాహంలో ఉన్నా కదా? అదే ఊపులోనైతే వీజీగా తడుతుందని స్వయంచాలిత బాగిలును కూడా స్వీయానువాదం చేయడానికి ప్రయత్నించాను. స్వయంచాలిత అంటే ఆటోమాటిక్. మరి బాగిలంటే ఏమయ్యుంటుంది? అని ఊహించబోతే ఎంతకీ తట్టలేదు. కుంచంతో నిలువుగా కొలవడానికి వీల్లేనప్పుడు తిరగేసి కొలవమన్నారు కదా? అందుకని ఇలా కాదని అసలు ఆ బస్సుల్లో కదిలేవీ, హైదరాబాదు బస్సుల్లో కదలనివీ ఏమున్నాయాని ఆలోచించేసరికి మిష్టరీ ఇట్టే విచ్చిపోయింది. (చూశారా? అసలైన Education అంటే ఇదేగానీ జావాలు, డాట్ నెట్లూ కాదని మీకెవరు చెప్తారు?) ఇంతకూ బాగిలు అంటే ఏమిటనుకున్నారు? అవే... ముదనష్టపు డోర్లు!! వాకిలిని కన్నడంలో బాగిలు అంటారన్నమాట. ఆహా! గొప్ప డిస్కవరీ. (నిండా కష్టాల్లో ఉన్నప్పుడే మనకలా బ్రెయిన్ వేవులొస్తుంటాయిలెండి) ఈ లెక్కన కన్నడం నేర్చుకోవడం చాల వీజీనే. అర్థం కానిచోటల్లా తెలుగు పదాలతో రైమింగు కుదిరేటట్లు చూసుకుంటే సరి.
మనం దారిలో కనిపించిన బోర్డులన్నీ చదివేసుకుంటూ, అనువాదాలు చేసేసుకుంటూ ఇదే వేగంతో పురోగమిస్తే పది నిమిషాల్లో ఆఫీసు చేరుకోవచ్చు, ఆపైన పదిరోజుల్లో కన్నడంలో పండితులమైపోవచ్చు. 10 రోజుల్లో కన్నడం పుస్తకం సొంతంగా ముద్రించుకోవడం మంచిదా లేక ఆ అవకాశం విశాలాంధ్ర వాళ్ళకిద్దామా అని తీవ్రంగా ఆలోచిస్తూ ఆఫీసు చేరుకున్నాను.
హా!
హాఫీసు నుంచి తిరిగొచ్చేటప్పుడు పాలు, పూలు తీసుకురమ్మని చెప్పి పంపింది మా ఆవిడ. పాలను హాలు, పూలను హువ్వ అంటారని కూడా చెప్పింది. దాంతో మన చురుకైన బుర్రకు అంతా అర్థమైపోయింది. బెంగాలీలు 'వ' ను 'బ' అని పలికినట్లే కన్నడిగులు 'ప' ను 'హ' అంటారన్నమాట. ఆహా! మన కన్నడం క్షణక్షణాభివృద్ధి చెందడానికి ఇంటా బయటా ఇంత గొప్ప ప్రోత్సాహం లభిస్తూంటే పుస్తకం సొంతంగానే ప్రచురించుకోవచ్చు. కన్నడంలో కథలు కూడా రాసేసి అర్జెంటుగా ఒకటో రెండో జ్ఞానపీఠాలు కూడా గెలిచేసుకోవచ్చు. భారతదేశం వోల్మొత్తంలో జ్ఞానపీఠమెక్కడానికి దగ్గర దారి కన్నడ సాహిత్యమేకదా? అసలే గిరీష్ కర్నాడ్ కు ఆ పురస్కారం వచ్చాక మూడేళ్ల కాలపరిమితి దాటిపోయి కూడా చాలా కాలమైంది.
ఇంతకూ మా ఆవిడ హాలు, హూలు తెమ్మందేగానీ హళ్ళు తెమ్మని చెప్పలేదు (అదేనండీ పళ్ళు, ఇలాంటి పదాలు వీజీగా క్యాచ్ చెయ్యాలంటే చిట్కాల కోసం నేను రాయబోయే 10 రోజుల్లో కన్నడం పుస్తకం ముందుగానే పది కాపీలు రిజర్వు చేసుకోండి). కానీ కొన్ని పనులు చెప్పకుండా చేస్తే మనకే లాభం. (Education లో మూడో పాఠం) ఏ హళ్లు తీసుకెళ్ళాలి? సీజన్ కాబట్టి మామిడి హళ్ళు బెటర్.
మడివాళ లో దిగడానికి సిద్ధంగా డోరు దగ్గర చేరి బయటకు చూస్తున్న నాకు సెయింట్ జాన్స్ ఆస్పత్రి పక్కన ఆనందాశ్చర్యాలు కలిగించే బోర్డు ఒకటి కనబడింది. ఆ రోడ్డు పేరు "మహాయోగి వేమన రస్తె" అట! అదే హై.లోనైతే పెద్ద సెంటర్లకు కోఠీ, అబిడ్స్, లక్డీకాపూల్, కూకట్ పల్లి, మెహదీపట్నం, దిల్ సుఖ్ నగర్,.. అనీ; చిన్నసెంటర్లకు టప్పా చబుత్ర లాంటి విడ్డూరమైన పేర్లేవో ఉంటాయి. రోడ్లకు అన్నీ ఇంగ్లీషు పేర్లో, లేకపోతే నవాబుల పేర్లో ఉంటాయిగానీ తెలుగువాళ్ల పేర్లు కనబడవు. నిజం చెప్తున్నా, వీటిల్లో ఒక్కదానికి కూడా నాకు అర్థం తెలీదు. అలాంటిది ఇక్కడ ఒక రోడ్డుకు యోగి వేమన పేరు పెట్టారని చాలా సంతోషించాను. ఎంతైనా కన్నడిగులు చానా మంచోళ్ళు.
ఆ ఆనందంలోనే మామిడిపళ్ల బండి దగ్గరకెళ్ళి కొన్ని పళ్ళు ఏరుకున్నాను. తక్కెడ తీసి ఎన్ని కావాలని కాబోలు అడిగాడు పళ్లమ్మేవాడు. "హది" అన్నాను. అప్పుడు వాడు వేసిన వెర్రిమొహం మసకచీకటిలో కూడా స్పష్టంగా కనబడింది. దాంతో 'ఓ! మనమెక్కడో తప్పులో కాలేశాం' అనుకుని 'టెన్' అన్నాను, వాడింకా అలాగే చూస్తున్నాడు. 'దస్' అన్నాను. అది కూడా వాడికి అర్థమైనట్లు లేదు. ఇలా కాదని అచ్చతెలుగులో 'పది' అన్నాను. ఆ మాటతో వాడిలో చలనం వచ్చింది. 'హమ్మయ్య! వీడికి తెలుగొచ్చన్నమాట!!' అనే ఆనందంలో జరిగిందంతా మర్చిపోయి హళ్ళు తీసుకుని ఇంటికొచ్చేశాను.
మామిడి హళ్ళ ... క్షమించాలి, పళ్ళ అనుభవంతో నా కన్నడ పరిజ్ఞానం మీద నాకే రవంత అనుమానం కలిగింది. దాంతో 10 రోజుల్లో కన్నడం పుస్తకం రాసే ఆలోచన ప్రస్తుతానికి పక్కన పెట్టాను. ఐతే ఇటీవల నన్ను కన్నడంలో ఎవరేది అడిగినా సమాధానం కన్నడంలోనే చాలా జోరుగా, ఇంకా చాలా కాన్ఫిడెంటుగా చెప్పేస్తున్నాను. అదేమిటో గానీ అందరికీ ఆ సమాధానం అర్థమౌతోంది కూడా. అడిగినవాళ్ళెవరూ నాకేసి వెర్రిగా గానీ, విచిత్రంగా గానీ చూడకపోవడమే దానికి నిదర్శనం. "National Integration Series" వారి 30 రోజుల్లో కన్నడం పుస్తకం చదవకుండానే నాకు కన్నడం వచ్చేసిందా? బెంగుళూరులో నేను భాష గురించి బెంగ లేకుండా బతికెయ్యగలనా? మీరే చెప్పాలి.
ఇంతకూ అసలు విషయం నేను మీకు చెప్పనేలేదు కదూ? కన్నడంలో నేను చాలా జోరుగా, ఇంకా చాలా కాన్ఫిడెంటుగా వాడుతున్న ఏకైక పదం "గొత్తిల్ల"!
(ಗೊತ್ತಿಲ್ಲ = తెలీదు)