Monday 25 June, 2007

కవితలు రాయడమే నేరమా?

ఈ రాజకీయనాయకుల వాచాలతకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. మొన్న శరద్ పవార్, లాలూ ప్రసాద్ యాదవ్, నిన్న ఎ.బి.బర్ధన్.

“The President said he was deeply wounded by the attack on him after he decided to accept our offer to contest. He has been deeply hurt by the statement of those in high positions. The kind of boorish and churlish language that has been used amounts to denigration of the high post of President and does not befit the high positions held by those [Union Ministers] who have used such language.”

వాళ్ళ అతివాగుడుకు రాష్ట్రపతి నొచ్చుకున్నారని తెలిసీ - ఆయన పోటీ చెయ్యబోనని తేల్చి చెప్పిన తర్వాత కూడా - "రాష్ట్రపతి పని కవితలు రాయడం కాదు" అంటూ ఇంకా ఏమేమో వాగుతున్నాడొకాయన. కవితలు రాయడమే కలామ్ గారు చేసిన తప్పన్నట్లు మాట్లాడుతున్నాడీ సిగ్గులేని పెద్ద మనిషి. ఉన్నతపదవుల్లో ఉన్నవారి గురించి ఇంత హేళనగా, దురుసుగా మాట్లాడ్డమేనా ఈ రాజకీయనాయకుల సంస్కారం? వీరిదే మరో అమృతవాక్కు: రాజకీయానుభవం లేనివాళ్ళు రాష్ట్రపతిగా ఉండతగరట! రాజకీయులే నేరం చేసినా....క్షమించాలి, ఈ పుణ్యభూమిలో రాజకీయులేం చేసినా, ఏం వాగినా అది నేరం కాదుకదా? స్వార్థప్రయోజనాల కోసం, మూర్ఖపు పట్టుదలలు నిలుపుకోవడం కోసం ప్రజాభీష్టానికి, ప్రజాశ్రేయస్సుకు వ్యతిరేకంగా పనిచెయ్యడం రాజకీయులకే కదా సాధ్యం?

అసలు రాష్ట్రపతి చేయవలసిన పనేమిటి? రాజకీయులు తీసుకునే నిర్ణయాల్లో దేశప్రజలకు ఏది మేలు చేస్తుందో, ఏది రాజ్యాంగస్ఫూర్తికి అనుగుణంగా ఉందో, ఏది విఘాతం కలిగిస్తుందో తెలుసుకోవడానికి రాజకీయానుభవం అవసరమా? కలామ్ గారిని వీళ్ళు కేవలం కవితలు రాసేవాడిగానే చూస్తున్నారంటే వీళ్ళ గురించి ఏమనుకోవాలి? లేక...కవితలు రాయడాన్ని వీళ్ళు అనర్హతగా భావిస్తున్నారనుకోవాలా? అసలు ప్రజాస్వామ్యదేశంలో ప్రజల మనోభావాలను తుంగలో తొక్కిన ఈ రాజకీయ నాయకులు ఇలా ఈ దేశపు ప్రథమ పౌరుడు, సర్వసైన్యాధ్యక్షుడిపై ఇలా అవాకులు, చెవాకులు పేలుతున్నా వీళ్ళను అదుపు చేసేవాళ్ళే లేరా? తాము విమర్శిస్తున్నది సాక్షాత్తూ ఈ దేశాధ్యక్షుణ్ణే అనే స్పృహ వీరికేమాత్రమైనా ఉందా? ఈ దేశంలో ఇంకా గౌరవాన్ని నిలుపుకున్న పదవి రాష్ట్రపతి పదవొక్కటే. రాజకీయులు ప్రస్తుతం దాని గౌరవాన్నీ దిగజార్చే పనిలో ఉన్నారు.
అసలు ఈ రాష్ట్రపతి, ఉపరాష్ట్రతి పదవులకు సంబంధించి ఏది సంప్రదాయం, ఏది కాదు అనేవిషయం గురించి కూడా అధికారంలో ఉన్నవాళ్ళు తమ వాదనకు ఏది అనుకూలంగా ఉంటే దానికి "సంప్రదాయం" అని పేరు పెట్టి అడ్డగోలుగా వాదించేస్తున్నారు.

స్వాతంత్ర్యమొచ్చిన నాటి నుంచి తొలి పాతికేళ్ల కాలంలో రాజకీయనాయకులెవరూ రాష్ట్రపతులు కాలేదు. ఇప్పుడేమో రాజకీయనాయకులకు తప్ప ఇతరులకు ఆ అర్హత లేదంటున్నారు. ఈ కొత్త 'సంప్రదాయం' ఎక్కణ్ణించి వచ్చింది?

ఒకే వ్యక్తి రాష్ట్రపతిగా రెండుసార్లు ఉండకూడదంటున్నవాళ్ళు ఆమేరకు రాజ్యాంగసవరణ ఇన్నేళ్ళూ ఎందుకు చెయ్యలేదు? అవున్లే, 'సంప్రదాయం' అని పేరు పెడితే, అవసరమొచ్చినప్పుడు తమకు నచ్చిన విధంగా వాడుకోవచ్చు, అవసరం లేనప్పుడు "ఈ ఒక్కసారికీ" అని మినహాయించుకోవచ్చు, లేదా "అబ్బే, అదసలు సంప్రదాయమే కాదు! ఒకవేళ సంప్రదాయమే ఐనా పాటించనక్ఖర్లేదు" అని చేతులు దులుపుకోవచ్చు. రాజ్యాంగసవరణ చేస్తే ఆ అవకాశముండదు కదా?

5 comments:

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం said...

ఇదంతా మామూలే ! "ఎవరికి తెలియదులే కాంగ్రెసు సంగతి...." కాంగ్రెస్ అధికారంలో ఉంటే అంతకుముందెవరూ ఎఱుగని సంకుచితాలన్నీ లేవనెత్తబడుతూ ఉంటాయి. కుళ్ళుబుద్ధులన్నీ కుష్టుపుళ్ళ మాదిరి రసీ చీమూ కారుతూ బయటపడతాయి. ఇప్పుడు కాంగ్రెస్‌కు కావాల్సింది బాధ్యతాయుతుడైన హుందాతనం గల రాష్ట్రపతి కాదు, చెప్పింది చెప్పినట్లు విని నోరుమూసుకు పడుండే రాష్ట్రపత్ని. DMK మంత్రులు తప్ప కేంద్ర క్యాబినెట్‌లో మిగతా పోర్ట్‌ఫోలియోలన్నింటికీ అలాంటివాళ్ళనే ఏరి కోరి తీసుకున్నారంటేనే తెలియడం లేదా ? ఆ చచ్చు ఘటాల్లో మన తెలుగుమంత్రులు కూడా ఉన్నారు.

తన 45 సంవత్సరాల సుదీర్ఘ సైంటిఫిక్ వ్యాసంగం (career) లో శ్రీ కలాం కవితలు రాయడం మినహా ఇంకేమీ చెయ్యలేదా ? అంతేలే పాపం ! వాళ్ళలాగా సంపాదించుకున్నాడా, ఏమన్నానా ? వాళ్ళలాగా మైనారిటీ, కులం, బడుగువర్గం లాంటి పాచిభాష మాట్లాడాడా ? ఎందుకు పనికొస్తాడాయన ?

Naga said...

పనికిమాలిన నాయ-కుళ్ళు..

Anonymous said...

కలాం కవితలు రాసినందుకు ఇంత ఆర్భాటమా! ఒకానొక ముఖ్యమంత్రి సినిమాల్లో నటించాడు,
మరొక కేంద్ర మంత్రి సినిమాలు నిర్మించాడు, మరొక మంత్రి నటించాడేమోకూడాను. వీళ్లనేం
చెయ్యాలి? అవును, నాయ-కుళ్లు వీళ్లు.

చదువరి said...

బురదలో దొర్లే పందికి సెంటు వాసన రుచించదండి. తమమధ్య ఎలాంటివాడు ఉండాలో రాజకీయులు చెప్పకనే చెప్పేసారు.

ఇక, ఈ కమ్యూనిస్టులు ఎంత పిడివాదులంటే.. మనం చెప్పేది ఏదైనా సరే ఖండించాల్సిందే అని తీర్మానించుకున్నారనుకోండి.. బ్రహ్మరుద్రులడ్డొచ్చినా ఖండించి తీరతారు. ఉదహరణకు "నీ పేరు బర్దన్" అని సదరు 'చిన్నాయన'తో చెప్పినా, కానే కాదని వాదించెయ్యగలడు.

Ray Lightning said...

ఇది ఒక వ్యక్తికి సంబంధించిన సమస్య కాదు, సిద్ధాంతాలకు సంబంధించిన సమస్య.ఉన్నత పదవులను రాజకీయవేత్తలను కాదని విద్యావంతులని ఎంపిక చెయ్యడాన్ని శాస్త్రీయ పరిభాషలో మెరిటోక్రసీ అంటారు. అటువంటిది మన దేశంలో అవసరమా కాదా, అన్న దాని మీద చర్చ జరగాలి.

నా బ్లాగులో ఆచార్య మండలి ఏర్పాటు గురించి, ప్రెసిడెంటు పదవికి ఇటువంటి ఆచార్య మండలిలో పనిచేసిన అనుభవం ఉన్నవారిని ఎన్నుకోవడం గురించి మాట్లాడాను. చూసి మీ కామెంట్లు రాయండి.