Sunday, 3 June, 2007

మన నగరాలు

రోము నగరానికి 2760 ఏళ్ళు నిండాయని సంవత్సరం పాటు ఉత్సవాలు నిర్వహించారు. అవి ఇటీవలే ముగిశాయి. ఈ లెక్క చారిత్రక ఆధారాలను బట్టి కాదు-రోమన్ కావ్యాల ప్రకారం. ఈ సందర్భంగా మన నగరాల గురించి చరిత్ర ఏం చెబుతుందో విందాం:

ముందుగా ఢిల్లీ గురించి:

ఢిల్లీలో పురానా ఖిల్లా అని ఒక కోట ఉంది. (ఢిల్లీలో లెక్కలేనన్ని కోటలున్నాయి. శతాబ్దాల పాటు అనేక పాలకుల/రాజవంశీకులకు రాజధానిగా ఉంది కాబట్టి అది సహజమే! అందువల్ల ఢిల్లీని కోటల నగరం - city of forts - అని కూడా అంటారు.) ఆ పురానా ఖిల్లా సమీపంలో పేరుకు తగినట్లే కనీసం మూడువేలయేళ్ల కిందటికాలానికి చెందిన పాతరాతియుగం నాటి జనావాసాలు బయటపడ్డాయి. అలా కాక మనం మహాభారతంలోని ఇంద్రప్రస్థాన్నే నేటి ఢిల్లీ నగరంగా తీసుకుంటే ఆ నగరం క్రీ.పూ.3150 నాటిదనుకోవాలి. అంటే దాదాపు 5150 సంవత్సరాలనాటి నగరమన్నమాట. ఈ నగరం మౌర్యుల కాలం (క్రీ.పూ.౩౦౦) నుంచి దినదినప్రవర్ధమానమౌతూ వచ్చింది.

తోమార రాజవంశీకులు ఇక్కడ క్రీ.శ. 736లో లాల్ కోట్ పేరుతో నగరాన్ని నిర్మించారు. అప్పట్నుంచి ఈ నగరాన్ని లెక్కలేనన్ని సార్లు విస్తరించడం జరిగింది - ఒక్కో పాలకుడు ఒక్కోవైపు. అలాంటి విస్తరణల్లో అతి ముఖ్యమైనవి మధ్యయుగంలోని ఢిల్లీ సుల్తానులు/మొఘలు చక్రవర్తుల కాలంలో జరిగిన ఏడు భారీ విస్తరణలు. అవి ఒక్కొక్కటీ ఏకంగా ఒక్కో నగరాన్నే సృష్టించి ఢిల్లీలో కలిపేశాయి. వాటిని 7 cities of Delhi అంటారు. ఆ తర్వాత బ్రిటిష్ కాలంలో ఎడ్వర్డ్ లుటియెన్స్ అనే ఆర్కిటెక్టు కొత్త ఢిల్లీకి రూపకల్పన చేశాడు. దాని కేంద్రభాగంలో గొప్ప వాణిజ్యకేంద్రాలుగా విలసిల్లుతున్న ప్రాంతాలు: కన్నాట్ సర్కిల్, కన్నాట్ ప్లేస్. ఇక ఇండియా గేటుకెదురుగా పార్లమెంటు భవన సముదాయాన్నానుకుని రైసీనా హిల్ మీద రాచఠీవితో వెలిగే రాష్ట్రపతిభవన్ లో అబ్దుల్ కలామ్ తర్వాత కొలువుదీరబోయేది ఎవరా అని దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

కలకత్తా నగరం: కలకత్తా నగర నిర్మాతగా జాబ్ చార్నాక్ అనే ఆంగ్లేయుడి పేరును చెప్పుకున్నారు చాలా ఏళ్ళ పాటు. ఐతే కలకత్తా నగరానికి కూడా సుదీర్ఘమైన (రెండువేలయేళ్ళ పైబడిన) చరిత్ర ఉందని, జాబ్ చార్నాక్ ను కలకత్తా నగర నిర్మాతగా పేర్కొనడం తప్పని ఒక చరిత్రకారుడు కలకత్తా హైకోర్టులో కేసువేసి, సరైన ఆధారాలతో నిరూపించడంతో ఆ మేరకు చరిత్రపుస్తకాలన్నిటిలోనూ మార్పులు చెయ్యమని హైకోర్టు తీర్పునిచ్చింది.

ముంబాయిదింకో చరిత్ర: మన దేశంలో ప్రతి ఊరికీ ఒక గ్రామదేవత ఉన్నట్లే ఈ నగరానికీ ఒక దేవత ఉంది. ఆమె పేరు మహా అంబ లేక ముంబాదేవి. నగరంలోని ముంబాదేవి ఆలయంలో ఇప్పటికీ పూజలందుకుంటోంది. ఎలా పుట్టిందో తెలియని "బాంబే" అనే అపభ్రంశపు పేరును మార్చి తిరిగి ఆమె పేరుమీదుగానే ఈ నగరానికి ముంబాయి అని పేరుపెట్టారు. ఇది ఏడు దీవుల మీద నిర్మించబడిన నగరం. క్రీ.పూ. 250లో టాలెమీ దీన్ని Heptanesia లేక సప్తద్వీపనగరం అన్నాడు. ఉత్తరముంబాయిలో రాతియుగం నాటి ఆవాసాలున్నట్లు ఆధారాలున్నాయి. 1534లో దీన్ని బహదూర్ షా అనే గుజరాత్ నవాబు నుంచి ఆక్రమించుకున్న పోర్చుగీసువారు 1661లో ఈ నగరాన్ని కట్నం కింద బ్రిటిష్ రాజుకివ్వడం, ఆయన దాన్ని 1668లో ఈస్టిండియా కంపెనీకి లీజుకివ్వడం (సంవత్సరానికి 10 పౌండ్లకు!) తెలిసిన విషయాలే.

1 comment:

Anonymous said...

త్రివిక్రంగారు, మీరు మన భాగ్యనగరం గురించి చెప్పటం మరచిపొయినట్టువున్నారు.